బాధితున్ని పరామర్శిస్తున్న సాయిప్రతాప్‌రెడ్డి
తాడిపత్రి టౌన్: ఎన్నికల వేళ అధికార కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు, సానుభూతిపరులను ఆర్థికంగా దెబ్బ తీసేందుకు టీడీపీ నాయకులు కుట్రలు పన్నారు. పెద్దపప్పూరు మండలం చీమలవాగుపల్లిలో వైఎస్సార్‌సీపీ నాయకుడి కందిపంటకు నిప్పు పెట్టిన ఘటన మరవకనే సోమవారం తాడిపత్రి మండలం పులిప్రొద్దుటూరులో పార్టీ సానుభూతిపరుడి గడ్డి వామికి నిప్పు పెట్టారు.
బాధితుడు తెలిపిన మేరకు వివరాలు... పులిప్రొద్దుటూరుకు చెందిన ఎర్రచాగంటి రమణారెడ్డి స్థానిక టీడీపీ నాయకుడు చంద్రశేఖర్‌రెడ్డి ఇంటి సమీపంలో పశువుల మేత కోసం గడ్డి వామి ఏర్పాటు చేసుకున్నాడు. అయితే రమణారెడ్డి వైఎస్సార్‌సీపీ నాయకులు వెంట తిరగడం జీర్ణించుకోలేని చంద్రశేఖర్‌రెడ్డి ఎలాగైనా రమణారెడ్డిని దెబ్బ తీయాలని పథకం వేశాడు. ఈ క్రమంలోనే గడ్డివామిని తగులబెట్టాలని నిర్ణయించుకున్న ఆయన అందుకు సిద్ధమై సోమవారం తన ఇంటి పక్కన ఉన్న చెత్తకు నిప్పు పెట్టాడు.
విషయం తెలుసుకున్న రమణారెడ్డి అక్కడకు చేరుకుని నిప్పు ఆర్పాలని, లేకుంటే గడ్డి వామి కాలుతుందని ప్రాధేయపడినా వినకుండా ‘నిప్పు పెట్టేదే.. చేతనైంది చేసుకో’ అంటూ చంద్రశేఖర్‌రెడ్డితో పాటు ఆయన కుటుంబసభ్యులూ దౌర్జన్యానికి దిగారు. కళ్లముందే గడ్డివామి తగులబడుతుంటే ఏమీ చేయలేని అసహాయ స్థితిలో రమణారెడ్డి ఉండిపోయాడు. చంద్రశేఖరరెడ్డి దౌర్జన్యాన్ని సహించలేని గ్రామస్తులు వెంటనే సమాచారం అందించడంతో అగ్నిమాపక సిబ్బంది అక్కడకు చేరుకుని మంటలు అదుపు చేసింది.
ఈలోపు గడ్డి వామి పూర్తిగా కాలిపోయి, దాదాపు రూ.50 వేల నష్టం వాటిల్లింది. ఘటనపై పోలీసులకు ఫిర్యాదు చేసినట్లు బాధితుడు తెలిపాడు. కాగా, విషయం తెలుసుకున్న ఎమ్మెల్యే తనయుడు కేతిరెడ్డి సాయిప్రతాప్‌రెడ్డి గ్రామానికి చేరుకుని బాధిత రైతును పరామర్శించారు. కార్యక్రమంలో వైఎస్సార్‌సీపీ నాయకులు పల్లె నాగేశ్వరెడ్డి, ఓబులరెడ్డి, బాబా, విజయ్‌కాంత్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment