ఏపీ శాసనసభలో ప్రతిపక్షంగా ఉన్న టీడీపీ సభ్యులు అల్లరి చేసిన తీరు వారు ఎంత అధమస్థాయికి పతనమైంది తెలియచేస్తోంది. పలువురు టీడీపీ ఎమ్మెల్యేలు సభకు రాలేదు. ప్రతిపక్ష నేత చంద్రబాబు నాయుడే తన భార్యను ఏదో అన్నారని లేని సాకును చూపి సభకు రావడం మానుకున్నారు. పోనీ తనతో పాటే మిగిలినవారిని కూడా బహిష్కరింపచేశారా అంటే ఆ పని చేయలేదు. వారిని అసెంబ్లీలోకి పంపి అల్లరి చేయించారు.
టీడీపీ ఎమ్మెల్యేలు వచ్చేది కొద్ది మందే అయినా, గొడవ చేయడానికి మాత్రం సిగ్గుపడలేదు. ఎవరు ప్రతిపక్షంలో ఉన్నా సభలో నిరసనలు చెబుతుంటారు. అది తెలిసిన విషయమే. దానికి కొన్ని హద్దులు ఉంటాయి. కానీ, టీడీపీ ఎమ్మెల్యేలు మాత్రం సభలో అరాచకంగా ప్రవర్తించడం ద్వారా వారికి మద్దతు ఇచ్చే ఈనాడు, ఆంధ్రజ్యోతి వంటి మీడియాల్లో ప్రముఖంగా వార్తలు వస్తాయన్న భావనతో రెచ్చిపోయి వ్యవహరించారు.
శాసనసభ ఎన్నికల ముందు చివరి సెషన్‌గా జరిగిన సమావేశాలలో ప్రచారం కోసం వారు చేసిన హడావుడి తెలిసిపోయింది. ఏదో ఒక కారణం చెబుతూ స్పీకర్ తమ్మినేని సీతారాం పొడియంలోకి దూసుకురావడం, ఆ తర్వాత కాగితాలు చించడం, వాటిని స్పీకర్‌పైకి విసరడం, ఆయన ముఖానికి ప్లకార్డులు అడ్డుపెట్టి, నినాదాలు చేయడం వంటి అల్లరి చేష్టలతో ప్రజల దృష్టిని ఆకర్షించాలని యత్నించారు.
చంద్రబాబు బావమరిది నందమూరి బాలకృష్ణ యథా ప్రకారం తన పిచ్చి పనులతో సభలో ఏ మాత్రం హుందాగా లేకుండా వ్యవహరించారు. గతసారి మాదిరే ఈ సెషన్‌లో కూడా ఆయన విజిల్స్ తీసుకువచ్చి ఈలలు వేయడం చూసి అసహ్యించుకునే పరిస్థితి తెచ్చుకున్నారు. సినిమాకు, అసెంబ్లీకి తేడా లేకుండా వ్యవహరించారు. ఆయన అంటే మానసికంగా అంత స్థిరత్వం లేని మనిషి కనుక అలా చేశారులే అనుకుంటే కాస్త పద్దతిగా ఉంటారనుకునే సీనియర్ ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ రావు వంటివారు కూడా అదే బాటలో నడిచారు.
తాచెడ్డ కోతి వనమెల్ల చెరచిందన్న సామెతను తలపిస్తూ టీడీపీ ఎమ్మెల్యేలు ఒకరిని చూసి మరొకరు అల్లరి చేశారు. దీనికి ఎస్సీ ఎమ్మెల్యే వీరాంజనేయులును ముందు పెట్టారు. తద్వారా ఏదైనా చర్య తీసుకుంటే ఎస్సీ ఎమ్మెల్యేని సభ నుంచి బయటకు పంపుతారా? అన్న ప్రచారం చేయడమే వారి లక్ష్యం అని తెలుస్తూనే ఉంది. గవర్నర్ స్పీచ్ జరిగిన రోజు నుంచీ ఇదే తంతు. దీనికంతటికి డైరెక్షన్ చంద్రబాబుదే అని వేరే చెప్పనవసరం లేదు. అందులోనూ టిక్కెట్లు మళ్లీ కావాలంటే ఏదో ఒక అల్లరి చేసి చంద్రబాబు దృష్టిలో పడాలని కూడా కొంతమంది ప్రయత్నిస్తారు.
వీరి ప్రవర్తనను ఈసారి స్పీకర్ తమ్మినేని సీతారాం చాలా ఒపికగా భరించి, కొంత సమయం ఇచ్చి ఆ తర్వాత సస్పెండ్ చేసి బయటకు పంపించారు. గతంలో వైఎస్సార్‌సీపీ ప్రతిపక్షంగా ఉన్నప్పుడు నిరసనలు చేయలేదా అని ఎవరైనా ప్రశ్నించవచ్చు. కానీ, వారు మరీ ఇంత మితిమీరి ప్రవర్తించలేదని స్పష్టంగా చెప్పవచ్చు. అప్పట్లో ప్రతిపక్ష నేతగా ఉన్న వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డిని అధికార పక్షం నానా మాటలన్నా ఆయన భరించారు. అప్పట్లో ముఖ్యమంత్రిగా ఉన్న చంద్రబాబు టీడీపీ ఎమ్మెల్యేలు జగన్‌ను దూషిస్తుంటే నవ్వుతూ ఎంజాయ్ చేసేవారు.
అదే వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్యేలు ఏదైనా నిరసనకు దిగి పోడియం వైపు వెళితే ఇంకేముంది విలువలు పాటించలేదని విమర్శించేవారు. చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ఉంటే ప్రతిపక్షం విలువలు పాటించాలి. నిరసనలు చెప్పకూడదు. సభ గురించి ఆయన క్లాస్ తీసుకుంటారు. అదే తాను ప్రతిపక్షంలో ఉంటే టీడీపీ సభ్యులను రెచ్చగొడతారు. ఇది గత మూడు దశాబ్దాలుగా చంద్రబాబుకు ఉన్న అలవాటే. ఒక విషయం జ్ఞప్తి చేసుకోవాలి. టీడీపీ వ్యవస్థాపకుడు ఎన్టీ రామారావును ముఖ్యమంత్రి సీటు నుంచి లాగేసి, తాను ఆ సీటులోకి ఎక్కిన తర్వాత చంద్రబాబు సుద్దులు చెప్పడం ఆరంభించారు.
ఈనాడు అధినేత రామోజీతో కలిసి తన ఇమేజీ పెంచుకోవడం కోసం రకరకాల వ్యూహాలు అనుసరించారు. శాసనసభలో వ్యవహరించాల్సిన పద్దతులు, పాటించవలసిన విలువలు అంటూ ప్రత్యేక సదస్సులు పెట్టారు. దానికి రామోజీ కూడా ఒక స్పీకర్‌గా వచ్చినట్లు గుర్తు. అప్పట్లో యనమల రామకృష్ణుడు స్పీకర్‌గా ఉండేవారు. ఆయన ఆనాటి కాంగ్రెస్ ప్రతిపక్షాన్ని కట్టడి చేయడానికి కొన్ని కొత్త నిబంధనలు తెచ్చారు. దాని ప్రకారం అనుమతి లేకుండా స్పీకర్ పోడియం వద్దకు వచ్చిన ఎమ్మెల్యేలు ఆటోమాటిక్‌గా సస్పెండ్ అవుతారంటూ ఒక ఎర్రగీతను పెట్టారు.
గవర్నర్ స్పీచ్ జరుగుతుంటే ప్రసంగ పుస్తకం విసిరేసిన కాంగ్రెస్ ఎమ్మెల్యేపై చర్య తీసుకోవడానికి ప్రత్యేకంగా ఎథిక్స్ కమిటీని సృష్టించారు. ఇలా ప్రతిపక్షంపై పలు ఆంక్షలు పెట్టిన తెలుగుదేశం పార్టీ తాను విపక్షంలోకి రాగానే మొత్తం రివర్స్ అయింది. ప్రతి నిత్యం ఏదో ఒక వివాదం పెట్టుకుని సభలో రచ్చ చేయడానికి యత్నించేది. కొన్నిసార్లు గొడవలు చేస్తూ సభలోనే ఉండిపోవడానికి యత్నించేది.
ఒకసారి అయితే శాసనసభ కారిడార్‌లోనే చంద్రబాబుతో సహా టీడీపీ ఎమ్మెల్యేలంతా రాత్రి అంతా ఉండడానికి ప్లాన్ చేస్తే పోలీసులు వచ్చి వారిని టీడీపీ ఆఫీస్‌కు తరలించారు. గత ప్రభుత్వ హయాంలో కోడెల శివప్రసాద్ స్పీకర్‌గా ఉన్నారు. ఆయన మాట ఎవరైనా విపక్ష సభ్యుడు వినకపోతే ఆగ్రహం వ్యక్తం చేసేవారు. దానిని ఈనాడు పత్రిక పెద్ద అక్షరాలతో అచ్చేసేది. అదేదో వైఎస్సార్‌సీపీ చేయకూడనిది చేసినట్లు ప్రచారం చేసేది.
చిత్రం ఏమిటంటే ప్రస్తుత సభలో తెలుగుదేశం పార్టీ నానా అరాచకాలకు పాల్పడుతున్నా, దానిని సమర్ధించే రీతిలో ఈనాడు రామోజీరావు కథనాలు ఇస్తున్నారు. టీడీపీ చేసిన అల్లరిని తప్పు అని రాయయకుండా, దద్దరిల్లిన సభ అని ఈనాడు హెడింగ్ పెట్టి ప్రజలను మోసం చేసే యత్నం చేసింది. అది శాసనసభ సమావేశాలను తమ రాజకీయ ప్రయోజనాల కోసం దుర్వినియోగం చేయడమే అవుతుంది. నిజమే.. శాసనసభలో తమ వాదనలు వినిపించడం ద్వారా రాజకీయంగా ప్రజల ఆదరణ పొందడానికి కృషి చేయవచ్చు. అంతవరకుతప్పు లేదు. కానీ, అల్లర్లు చేయడం ద్వారానే ప్రజలను ఆకర్షించవచ్చనే పాత ఆలోచనలతోనే టీడీపీ రాజకీయం చేసింది.
గత టర్మ్‌లో 23 మంది వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్యేలను చంద్రబాబు కొనుగోలు చేసి టీడీపీలో చేర్చుకున్నారు. వారిలో నలుగురిని మంత్రులుగా చేశారు. ఇందుకు నిరసనగా జగన్ మొత్తం సభనే బహిష్కరించారు. తనతో పాటు మిగిలిన వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్యేలందరిని బయటకు తీసుకువెళ్లారు. అప్పుడు ఇదే టీడీపీ.. వైఎస్సార్‌సీపీని తప్పుపడుతూ విమర్శలు చేసేది. ప్రజాధనం జీతాలుగా తీసుకుంటూ సభకు రారా అని ప్రశ్నించేది. ఇప్పుడు అదే చంద్రబాబు నాయుడు ప్రభుత్వం ఇచ్చే జీతం ,సదుపాయాలు పొందుతూ సభకు రాలేదు. పోనీ తనకు ఇష్టం లేకపోతే పదవికి రాజీనామా చేయవచ్చు.
కానీ అన్నిటిలోను డబుల్ గేమ్ ఆడడం చంద్రబాబుకు అలవాటే. 1989-94 మధ్య కూడా టీడీపీ ప్రతిపక్షంలో ఉండేది. తనను అన్యాయంగా సస్పెండ్ చేశారని అప్పటి ప్రతిపక్ష నేత ఎన్టీ రామారావు రెండేళ్లపాటు సభకు రాలేదు. ఆ సమయంలో చంద్రబాబు సభలో నానా రచ్చ చేస్తుండేవారు. పలుమార్లు ఆనాటి మంత్రి రోశయ్య సభలో చంద్రబాబును ఉద్దేశించి తీవ్ర వ్యాఖ్యలు చేస్తుండేవారు. కోట్ల విజయభాస్కరరెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఆయనపై పెద్ద అవినీతి ఆరోపణ చేశారు. తన చాంబర్‌లో ఉండి అది విన్న కోట్ల వెంటనే సభలోకి వచ్చి చంద్రబాబుపై మండిపడ్డారు.
ఇంకో ఉదాహరణ కూడా చెప్పాలి. వైఎస్ రాజశేఖరరెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఎల్లంపల్లి ప్రాజెక్టులో టెండర్‌లో అధిక రేటు వేశారంటూ ఈనాడు ఒక కథనం రాసింది. దాని ఆధారంగా టీడీపీ, ఇతర విపక్షాలు కలిసి చర్చను కోరాయి. అందుకు వైఎస్ ప్రభుత్వం అంగీకరించింది. అయితే సంబంధిత నోటీసులో ఒక అంకెను మార్చి రాసినట్లు అధికారపక్షం గుర్తించింది.
దానిని అప్పటి ఛీఫ్ విప్ కిరణ్ కుమార్ రెడ్డి ప్రస్తావించితే, చంద్రబాబు తాను కావాలనే అలా మార్చానని చెప్పారు. దాంతో అధికారపక్షం చంద్రబాబుపై విరుచుకుపడింది. అప్పుడు ఆయన పూర్తి ఆత్మరక్షణలో పడ్డారు. ఈ ఉదాహరణలన్నిటిని ఎందుకు ప్రస్తావించవలసి వస్తుందంటే టీడీపీపై చంద్రబాబు నీడ పడినప్పటి నుంచి, ముఖ్యంగా చంద్రబాబు చేతికి టీడీపీ పగ్గాలు వచ్చినప్పటి నుంచి ద్వంద్వ ప్రమాణాలు పాటించడం ఆనవాయితీ అయింది. ఇప్పుడు కూడా అదే మోస్తరుగా చంద్రబాబు దిక్కుమాలిన రాజకీయాలు చేస్తుంటే, దానిని ఖండించవలసిన రామోజీరావు వంటివారు నిస్సిగ్గుగా సమర్ధిస్తున్నారు.
కొమ్మినేని శ్రీనివాసరావు, సీనియర్ పాత్రికేయులు.
Comments
Please login to add a commentAdd a comment