బీసీలను వంచించింది పరిటాల కుటుంబమే..! | - | Sakshi
Sakshi News home page

బీసీలను వంచించింది పరిటాల కుటుంబమే..!

Published Tue, Feb 6 2024 12:10 AM | Last Updated on Tue, Feb 6 2024 12:17 PM

- - Sakshi

ఆత్మకూరు: కుట్రలు.. కుతంత్రాలే అజెండాగా ఆది నుంచి పరిటాల కుటుంబం మనుగడ సాగిస్తోందని, బీసీలను వంచించింది కూడా వారేనని ఆత్మకూరు మండల వైఎస్సార్‌సీపీ నాయకులు మండిపడ్డారు. ప్రజాదరణను చూసి ఓర్వలేక ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాష్‌రెడ్డిపై విమర్శలు చేస్తే సహించబోమని హెచ్చరించారు.

ఆత్మకూరు మండల పరిషత్‌ కార్యాలయంలోని ఎంపీపీ చాంబర్‌లో సోమవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మండల వైఎస్సార్‌సీపీ నాయకులు మాట్లాడారు. దోచుకొని, దాచుకోవడం తప్ప పరిటాల కుటుంబానికి ఏమీ తెలియదన్నారు. ఎన్నికలు సమీపిస్తున్న ప్రస్తుత తరుణంలో గ్రామాల్లో కక్షలు ప్రేరేపించి రాజకీయ లబ్ధి పొందేందుకు జయహో బీసీ పేరుతో సభల నిర్వహణకు సిద్ధమవుతున్నారని విమర్శించారు.

తోపుదుర్తి కుటుంబం బీసీల పక్షపాతి
పాతికేళ్లు అధికారంలో ఉండి బీసీల పేరు చెప్పుకొని ప్రజలను నిలువునా దోచుకున్న నీచ చరిత్ర పరిటాల కుటుంబానిదని మండిపడ్డారు. గత ప్రభుత్వంలో కనగానపల్లి ఎంపీపీ పదవిని బీసీలను కాదని దౌర్జన్యంగా తన సామాజిక వర్గానికి చెందిన వ్యక్తికి కట్టబెట్టడం, ఓబులేష్‌ అనే వ్యక్తిపై విచక్షణా రహితంగా దాడి చేయడం నిజం కాదా అని ప్రశ్నించారు.

గతంలో బీసీలైన పార్థసారథి, కాలవ శ్రీనివాసులుకు ఎమ్మెల్యే టికెట్‌ ఇవ్వడానికి నిరాకరించిన విషయాన్ని గుర్తు చేశారు. వైఎస్సార్‌సీపీ ప్రభుత్వంలో బీసీలకు ఎంతో ప్రాధాన్యత చేకూరిందన్నారు. నియోజకవర్గంలో బీసీలకు అన్ని విధాలుగా అండగా ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాష్‌రెడ్డి నిలిచి, తాను బీసీల పక్షపాతినని నిరూపించుకున్నారన్నారు.

మండలంలో ఎంపీపీ, జెడ్పీటీసీ జనరల్‌కు వచ్చినా బీసీలకు పదవులు ఇచ్చిన ఘనత ఒక్క ప్రకాష్‌రెడ్డికే దక్కుతుందన్నారు. నియోజకవర్గంలో పరిటాల రవి హయాంలో రక్తం ఏరులై పారితే... తోపుదుర్తి హయాంలో శాంతి కుసుమాలు విరబూసాయన్నారు.

ఏ ముఖం పెట్టుకుని వస్తున్నారు?
అధికారంలో ఉన్నప్పుడు రూ.వేల కోట్ల ప్రజాధనాన్ని అడ్డగోలుగా దోచుకున్న పరిటాల కుటుంబ సభ్యులు నేడు ప్రజల్లోకి ఏ ముఖం పెట్టుకొని వస్తున్నారని ప్రశ్నించారు. తోపుదుర్తి ప్రకాష్‌రెడ్డి ఎమ్మెల్యే అయిన తరువాత పేరూరు డ్యాంకు నీరు తీసుకొచ్చారని, ఉచిత బోర్లు వేయించి నియోజకవర్గాన్ని సస్యశ్యామలం చేశారన్నారు.

ప్రకాష్‌రెడ్డికి ప్రజల్లో వస్తున్న ఆదరణ చూసి ఓర్వలేక పరిటాల సునీత ఆరోపణలు చేస్తున్నారని మండిపడ్డారు. రుణమాఫీ చేయలేకపోతున్నామంటూ ఆనాడు అసెంబ్లీలో మంత్రిగా ఉన్న సునీత చెప్పింది వాస్తవం కాదా అని ప్రశ్నించారు. ప్రజలకు చేసిన ఒక్క మంచి పని ఏమిటో కూడా చెప్పుకోలేని దుస్థితిలో పరిటాల కుటుంబం ఉందని విమర్శించారు.

సునీత కుటుంబానికి వేల కోట్లు ఎలా వచ్చాయి?
రాజకీయాల్లోకొచ్చాక పరిటాల కుటుంబానికి వేల కోట్ల ఆస్తులు ఎలా వచ్చాయని వైఎస్సార్‌సీపీ నాయకులు ప్రశ్నించారు. పెనుకొండలో రూ.40 లక్షల బాడుగ వచ్చే భవనం, అనంతపురంలోని శాంతి థియేటర్‌ వద్ద పెద్ద బిల్డింగ్‌ నిర్మాణం, సూర్యనగర్‌లో నెలకు రూ.35 లక్షలు బాడుగలు వచ్చే బిల్డింగ్‌, నెలకు రూ.కోట్లు ఆదాయం సమకూరే బెంగళూరులోని పబ్బులు, కియా దగ్గర భూములు, పాలసముద్రం దగ్గర 70 ఎకరాలు, పాలచెర్ల వద్ద వంద ఎకరాలు, ముక్తాపురం దగ్గర 40 ఎకరాలు, నర్సంపల్లి వద్ద 70 ఎకరాలు, కురుగుంట వద్ద రూ.కోట్ల విలువ చేసే 11 ఎకరాలు, చిన్నంపల్లి వద్ద 40 ఎకరాలు, ఆకుతోటపల్లి, ఆజాద్‌ నగర్‌లో ఎకరా స్థలంలో ఇళ్లు, బెంగళూర్‌లో గెస్ట్‌ హౌస్‌ ఇవన్నీ తన బినామీ పేర్లతో లేవని చెప్ప ధైర్యం సునీతకు లేదన్నారు.

వీటన్నింటికీ తమ వద్ద ఆధారాలు ఉన్నాయన్నారు. ప్రకాష్‌రెడ్డిపై ఆధారాలు లేని విమర్శలు చేయడం సరికాదన్నారు. ఎమ్మెల్యే ప్రకాష్‌రెడ్డి తనకు సొంత ఇల్లు లేకపోయినా మహిళా పాడిరైతుల అభ్యున్నతికి రూ.20 కోట్లతో డెయిరీ ఏర్పాటు చేయించారన్నారు. ఆలయాలకు విరాళాలు, అభాగ్యులను ఆదుకోవడం ఇవన్నీ ప్రకాష్‌రెడ్డి నిస్వార్థంతో చేసినవన్నారు. అభివృద్ధి చేస్తాడన్న నమ్మకంతోనే రాప్తాడు ప్రజలు 25 వేల మెజార్టీతో గెలిపించారన్నారు. వచ్చే ఎన్నికల్లోనూ వైఎస్సార్‌సీపీని ప్రజలు అత్యధిక మెజార్టీతో గెలిపిస్తారన్నారు.

సమావేశంలో ఎంపీపీ హేమలత, బీసీసెల్‌ నియోజకవర్గ అధ్యక్షుడు బాలపోతన్న, కన్వీనర్‌ పూజారి లక్ష్మీనరసింహులు, తోపుదుర్తి ఎంపీటీసీ పోతులయ్య, వైఎస్సార్‌సీపీ జిల్లా కార్యదర్శి వెంకట్రాముడు, వైస్‌ ఎంపీపీ విజయ్‌కుమార్‌ నాయక్‌, రంగంపేట సర్పంచ్‌ ఉజ్జినప్ప, బీసీ, ఎస్సీ,ఎస్టీ నాయకులు నరసింహులు, నాగరాజు, భాస్కర్‌, రాము నాయక్‌, సనప నరసింహులు, వెంకటేష్‌, శ్రీరామ్‌, టైలర్‌ వెంకటేష్‌, మురళి, వెంకటేష్‌, ఓబయ్య, రామాంజనేయులు, ఆంజనేయులు, బాబయ్య, గోవర్ధన్‌, పోతన్న పాల్గొన్నారు.

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement