రాప్తాడు నుంచి టీడీపీ రెబల్ అభ్యర్థి రాజేష్ నామినేషన్
సునీతకు గట్టి దెబ్బ తప్పదంటున్న రాజకీయ విశ్లేషకులు
ఎన్నికల ప్రక్రియ ఆదిలోనే పరిటాల సునీతకు ఊహించని షాక్ తగిలింది. రాప్తాడు అసెంబ్లీ స్థానం నుంచి టీడీపీ రెబల్‌గా ప్రొఫెసర్ రాజేష్ ఇండిపెండెంట్ అభ్యర్థిగా నామినేషన్ వేసి సునీతకు ఝలక్ ఇచ్చారు. నియోజకవర్గ కేంద్రం రాప్తాడులో ఏర్పాటు చేసిన ఆర్‌ఓ కార్యాలయంలో గురువారం ప్రొఫెసర్ రాజేష్ తన మొదటి సెట్ నామినేషన్ పత్రాలను ఎన్నికల అధికారులకు అందజేశారు.
సునీతకు గట్టి దెబ్బే..
కనగానపల్లి మండలం రాంపురం గ్రామానికి చెందిన ప్రొఫెసర్ రాజేష్ టీడీపీ సానుభూతిపరుడు. ఆయన తండ్రి రామన్న గతంలో పరిటాల రవికి ప్రధాన అనుచరుడిగా ఉండేవారు. కనగానపల్లి సర్పంచ్‌గానూ పనిచేశారు. ప్రస్తుతం రాజేష్ పలు రాష్ట్రాల్లో విద్యా సంస్థలు నిర్వహించుకుంటూ ప్రొఫెసర్ వృత్తిలో ఉన్నారు. రెండు సంవత్సరాలుగా రాప్తాడు నియోజకవర్గంలో తిరుగుతూ సేవా కార్యక్రమాలు చేపడుతున్నారు.
ఈ క్రమంలో టీడీపీ తరఫున రాప్తాడు అసెంబ్లీకి కానీ, హిందూపురం ఎంపీ స్థానం నుంచి కానీ పోటీ చేయాలని భావించారు. ఈ మేరకు టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్‌ను కూడా కలిసి విజ్ఞప్తి చేశారు. కానీ, ప్రజాదరణ ఉన్న వారిని పట్టించుకోకుండా డబ్బున్న అభ్యర్థుల వైపు చంద్రబాబు చూడడంతో రాజేష్‌కు భంగపాటు తప్పలేదు.
దీంతో తీవ్ర ఆవేదనకు గురైన ఆయన రాప్తాడు అసెంబ్లీ నియోజకవర్గం నుంచి ఇండిపెండెంట్ అభ్యర్థిగా పోటీకి దిగారు. ఇప్పటికే రాప్తాడులో ప్రజా బలం లేక ఇబ్బందులు పడుతున్న టీడీపీ అభ్యర్థి పరిటాల సునీతకు రాజేష్ కారణంగా గట్టి దెబ్బే తగిలే అవకాశం ఉందని చెబుతున్నారు.
ఇవి చదవండి: నామినేషన్ల మొదలైనా.. తెగని టీడీపీ సీట్ల పంచాయితీ!
Comments
Please login to add a commentAdd a comment