సాక్షి ప్రతినిధి, అనంతపురం: ‘‘నవ్విపోదురు గాక.. మాకేటి సిగ్గు’’ అన్నట్లుంది టీడీపీ నేతల తీరు. మునిగిపోయిన టీడీపీ నావను ఎలాగైనా దారిలో పెట్టాలనే ఉద్దేశంతో నీచ రాజకీయాలకు తెర లేపుతున్నారు. జనం ఏమనుకుంటే ఏంటి.. అన్నట్లుగా దిగజారుడు రాజకీయాలు చేస్తున్నారు. ఎక్కడ ఏ చిన్న విషయం జరిగినా అధికార పార్టీకి అంటగడుతూ.. చివరికి అవన్నీ అవాస్తవాలని తేలాక నవ్వులపాలవుతున్నారు. గత కొన్ని రోజులుగా జిల్లాలో జరిగిన కొన్ని ఘటనలను పరిశీలిస్తే ఈ విషయం స్పష్టంగా తెలుస్తుంది.
వైఎస్సార్ సీపీ అధికారంలోకి వచ్చాక ‘సంక్షేమం’ వెల్లివిరిసింది. గతంలో ఎన్నడూ లేని విధంగా అభివృద్ధి పనులు పెద్ద ఎత్తున జరిగాయి. జరుగుతున్నాయి. ఇంటి వద్దకే పథకాలు అందుతుండడంతో ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఎస్సీ,ఎస్టీ, బీసీ, మైనార్టీలకు రాజకీయంగానూ పెద్దపీట వేయడంతో ఆయా వర్గాల్లో ఆనందం నెలకొంది. కొన్ని రోజులుగా అధికార పార్టీ నిర్వహిస్తున్న సాధికార బస్సు యాత్రలకు బ్రహ్మరథం పడుతున్నారు.
ఓర్వలేని టీడీపీ..
సీఎం వైఎస్ జగన్‌కు ప్రజల నుంచి వస్తున్న ఆదరణ చూసి ప్రతిపక్ష పార్టీల నేతలు రగిలిపోతున్నారు. ‘మీ బిడ్డ మంచి చేస్తేనే మళ్లీ ఆశీర్వదించండి’ అంటూ ప్రజలను నమ్ముకుని ముఖ్యమంత్రి ముందుకు సాగుతుంటే.. టీడీపీ నాయకులు మాత్రం బురదను నమ్ముకుని నీచ రాజకీయాలు చేస్తున్నారు. ప్రభుత్వంపైనా, పథకాలపైనా, అధికార పార్టీ నాయకులపైనా ఏదో రకంగా బట్టకాల్చి మీద వేసిన చందంగా ప్రవర్తిస్తున్నారు. తమకు వత్తాసు పలికే ఎల్లో మీడియాలో దిగజారి అచ్చేసుకుంటున్నారు. ప్రజల్లో మరింతగా చులకనమవుతున్నారు. భార్యాభర్తలు గొడవ పడినా, అన్నదమ్ముల మధ్య వివాదం నెలకొన్నా వైఎస్సార్ సీపీ నాయకులే కారణమంటూ ప్రజలకే వెగటు పుట్టిస్తున్నారు.
ఏమైందయ్యా మీకు..?
టీడీపీ నేతలు జేసీ ప్రభాకరరెడ్డి, కాలవ శ్రీనివాసులు, పరిటాల సునీత, పయ్యావుల కేశవ్ ఇప్పటికే ప్రజల్లో చులకనైపోయారు. పార్టీలో గ్రూపు రాజకీయాలు, చంద్రబాబు స్కాములు, జైలు పాలు కావడం వంటి పరిణామాలతో జిల్లాలో పార్టీ పరిస్థితి మరింతగా దిగజారి పోయింది. ఇక.. ప్రభుత్వ పరంగా అన్ని వర్గాలకు సంక్షేమ పథకాలు అందుతుండడంతో వారిని ప్రజలు పట్టించుకోవడం లేదు. దీంతో ఎలాగైనా ప్రజల దృష్టి మరల్చాలనే దురుద్దేశంతో పచ్చ మీడియా తోడుగా విష ప్రచారం చేస్తున్నారు.
దొంగే దొంగ అన్నట్లుగా..
• ఉరవకొండ నియోజకవర్గంలో వేలల్లో దొంగ ఓట్లు నమోదైనట్టు ఇటీవల తేలింది. ఇవన్నీ తెలుగుదేశం పార్టీ హయాంలో నమోదైనవే. కానీ అధికార పార్టీపై పయ్యావుల కేశవ్ ఆరోపణలు చేసి అభాసుపాలయ్యారు.
• రాయదుర్గం నియోజకవర్గంలో శనగల వ్యాపారి ఐపీ పెడితే దాన్ని మాజీ ఎమ్మెల్యే గురునాథ్ రెడ్డి కుటుంబానికి కాలవ శ్రీనివాసులు అంటగట్టారు.దీన్ని గురునాథ్ రెడ్డి సోదరుడు తీవ్రంగా ఖండించారు. ఉషశ్రీచరణ్ మంత్రి అయ్యాక తొలిసారి కళ్యాణదుర్గం వచ్చిన సందర్భంలో.. ఓ బాలింతకు దారి ఇవ్వక శిశువు మృతిచెందా రని కాలువ రాద్ధాంతం చేశారు. సీసీ ఫుటేజీల్లో చూస్తే ఎక్కడా అడ్డుకున్న దాఖలాలే లేవు. పార్టీ జిల్లా అధ్యక్షుడిగా ఉండి దిగజారి ప్రవర్తించిన కాలవను ఆ పార్టీ కార్యకర్తలే విమర్శించారు.
• విడపనకల్లులో ఉపాధ్యాయుడు మల్లేష్ ఆర్థిక కారణాలతో ఆత్మహత్యాయత్నం చేస్తే మాజీ మంత్రి పరిటాల సునీత రాద్ధాంతం చేశారు. తమను రాజకీయాలకు వాడుకోవద్దు అంటూ బాధిత కుటుంబం కాళ్లా వేళ్లా పడినా పరామర్శల పేరుతో పత్రికలకెక్కారు.
• తాడిపత్రికి చెందిన జేసీ ప్రభాకర్ రెడ్డి నోటికి అడ్డూ అదుపూ లేకుండా పోయిందన్న విమర్శలున్నాయి. సీఐ సస్పెండ్ అయినా అధికార పార్టీనే అంటారు. అభివృద్ధి పనులు అడ్డుకోవడం, కళాశాల ప్రహరీ కట్టొద్దంటూ అడ్డుకోవడం ఒకటా రెండా.. జిల్లాలో తీవ్ర వివాదాలకు జేసీ కేంద్ర బిందువుగా ఉన్నారు. ఇప్పటికే బస్సుల కొనుగోలులో ఈడీ కేసులను ఎదుర్కొంటున్న ఆయన తాను పవిత్రుడినని.. మిగతా అందరూ అవినీతి పరులని బురద జల్లుతుంటడం గమనార్హం.
ఇవి చదవండి: పేద పిల్లల భవిష్యత్తుపై దెబ్బ కొట్టే రాతలు సహించం
Comments
Please login to add a commentAdd a comment