అనంతపురం క్రైం: జిల్లా కేంద్రం అనంతపురంలో అత్యంత కీలకమైన టవర్‌క్లాక్ ఫ్లైఓవర్ బ్రిడ్జి సిద్ధమైంది. సీఎంగా వైఎస్ జగన్ బాధ్యతలు చేపట్టి నాలుగేళ్లు పూర్తవుతున్న సందర్భంగా అనంతపురం ఎమ్మెల్యే అనంత వెంకటరామిరెడ్డి ఆధ్వర్యంలో సోమవారం చేపట్టే బైక్ ర్యాలీతో బ్రిడ్జిపై రాకపోకలు ప్రారంభం కానున్నాయి. సాయంత్రం బ్రిడ్జిపై ప్రత్యేక లైటింగ్‌ను కూడా ప్రారంభించనున్నారు. ఈ కార్యక్రమానికి ఎమ్మెల్యేతో పాటు కలెక్టర్ గౌతమి, ఎస్పీ శ్రీనివాసరావు తదితరులు హాజరుకానున్నారు. అండర్ పాస్, ఇతర పనులు పూర్తయ్యాక సీఎం వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి, కేంద్ర మంత్రితో అధికారికంగా ఈ చారిత్రక బ్రిడ్జిని ప్రారంభించనున్నారు. ఇదిలా ఉండగా ఆదివారం రాత్రి ఎమ్మెల్యే అనంత బ్రిడ్జిని పరిశీలించారు.
నేషనల్ హైవేగా మార్పు చేసి...
అనంతపురం టవర్‌క్లాక్ – పీటీసీ రైల్వే ఓవర్ బ్రిడ్జిని 1965లో నిర్మించారు. ఐదు దశాబ్దాల తర్వాత బ్రిడ్జి అక్కడక్కడా దెబ్బతినడం, వాహనాలకు అనుగుణంగా రోడ్డు లేకపోవడంతో ట్రాఫిక్ సమస్యలు తలెత్తాయి. నేషనల్ హైవేస్ పరిధిలో ఉన్న ఈ బ్రిడ్జిని 2015లో అప్పటి టీడీపీ ప్రభుత్వం స్వార్థ ప్రయోజనాల కోసం ఆర్‌అండ్‌బీ పరిధిలోకి తీసుకొచ్చింది. దీంతో అభివృద్ధికి ప్రతిబంధకంగా మారింది. వైఎస్సార్‌సీపీ అధికారంలోకి వచ్చాక ఎమ్మెల్యే అనంత వెంకటరామిరెడ్డి పెరుగుతున్న నగర జనాభాకు అనుగుణంగా టవర్‌క్లాక్ బ్రిడ్జిని విస్తరించి, ట్రాఫిక్ సమస్యను పరిష్కరించాలని భావించారు.
ఈ విషయాన్ని సీఎం జగన్ దృష్టికి తీసుకెళ్లారు. దీంతో బ్రిడ్జిని 2020 నవంబరులో నేషనల్ హైవేస్ పరిధిలోకి తీసుకొచ్చారు. 2021 మే 3న బళ్లారి బైపాస్ వద్ద జాతీయ రహదారి– 44ను కలుపుతూ నగర శివారు పంగల్ రోడ్డు వద్దనున్న చైన్నె హైవేకి అనుసంధానిస్తూ కేంద్రం రూ.311.93 కోట్లతో అర్బన్ ప్రాజెక్ట్ చేపట్టేలా చర్యలు తీసుకుంది. టవర్‌క్లాక్ బ్రిడ్జి సహా 9.2 కిలోమీటర్ల పొడవున రోడ్డు పనులు చేయాలని నిర్ణయించింది. ఇందులో భాగంగా 720 మీటర్ల(దాదాపు 1.44 కి.మీ) పొడవున రెండు వైపులా (ఫోర్‌వే) బ్రిడ్జి ఏర్పాటు చేస్తున్నారు. ప్రస్తుతం బ్రిడ్జి పనులు పూర్తయ్యాయి. 2021 అక్టోబర్ 25న మొదలైన పనులు ఈ ఏడాది అక్టోబర్ 24కు పూర్తి కావాలి. అయితే 5 నెలలు ముందే కాంట్రాక్ట్ సంస్థ బ్రిడ్జి నిర్మాణాన్ని పూర్తి చేసింది.
సీఎం చిత్తశుద్ధితోనే బ్రిడ్జి ఏర్పాటు
ఒక నాయకునికి చిత్తశుద్ధి ఉంటే ఎంతటి అభివృద్ధి అయినా సాధ్యమని ఈ పనులతో నిరూపితమైంది. సీఎం జగన్‌మోహన్ రెడ్డి చిత్తశుద్ధితోనే బ్రిడ్జి, ఫోర్ వే ఏర్పాటు సాధ్యమయ్యాయి. రాష్ట్రంలోనే ఎక్కడా లేని విధంగా రికార్డు సమయం(15 నెలలు)లో, ప్రజల పూర్తి సహకారంతో బ్రిడ్జి పనులు పూర్తయ్యా యి. సీఎం ప్రత్యేక చొరవతో ఇప్పటికే నగరంలో రూ.650 కోట్ల తో అభివృద్ధి పనులు జరుగుతున్నాయి. రానున్న ఏడాదిలోనూ సాధ్యమైనంత అభివృద్ధి చేసి చూపుతాం.
– అనంత వెంకటరామిరెడ్డి, ఎమ్మెల్యే
Comments
Please login to add a commentAdd a comment