tower clock
-
Ananthapur: టవర్‌క్లాక్ బ్రిడ్జిపై రాకపోకలు షురూ
అనంతపురం క్రైం: జిల్లా కేంద్రం అనంతపురానికి మణిహారమైన టవర్‌క్లాక్ బ్రిడ్జిపై సోమవారం రాకపోకలు మొదలయ్యాయి. వైఎస్ జగన్మోహన్రెడ్డి ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసి నాలుగేళ్లు పూర్తయిన సందర్భంగా ఎమ్మెల్యే అనంత వెంకటరామిరెడ్డి ఆధ్వర్యంలో వేలాదిమందితో నిర్వహించిన బైక్ ర్యాలీతో బ్రిడ్జిపై రాకపోకలు ప్రారంభమయ్యాయి. బళ్లారి బైపాస్‌లోని ఎంజీ పెట్రోల్ బంక్ నుంచి బ్రిడ్జి మీదుగా టవర్‌క్లాక్, సప్తగిరి సర్కిల్, ఐరన్‌బ్రిడ్జ్, గాంధీ బజార్, శ్రీకంఠం సర్కిల్, రైల్వే ఫీడర్ రోడ్డు, ఆర్ట్స్ కళాశాల వరకు ఉల్లాసంగా.. ఉత్సాహంగా ర్యాలీ సాగింది. ఎమ్మెల్యే ‘అనంత’ పార్టీ జెండా పట్టుకుని ప్రజలకు అభివాదం చేస్తూ ముందుకుసాగారు. ఆర్ట్స్ కళాశాల వద్ద ఎమ్మెల్యే అనంతను పార్టీ కార్యకర్తలు భుజాలపైకి ఎత్తుకుని ఊరేగించారు. జై జగన్.. జై అనంత అంటూ నినదించారు. నూతన బ్రిడ్జిని తిలకించేందుకు వేలాదిమంది ప్రజలు తరలిరావడంతో టవర్‌క్లాక్ – పీటీసీ వరకు పండుగ వాతావరణం కనిపించింది. ‘అనంత’లో రూ.650 కోట్ల అభివృద్ధి కోవిడ్‌తో ఏడాదిన్నర కాలం గడిచిపోయినా...మిగతా రెండున్నరేళ్లలో అనంతపురం అర్బన్ నియోజకవర్గంలో రూ.650 కోట్లతో రోడ్లు, డ్రెయినేజీలు తదితర అభివృద్ధి పనులు చేశామని ఎమ్మెల్యే అనంత వెంకటరామిరెడ్డి అన్నారు. టీడీపీ హయాంలో ఆర్అండ్బీ పరిధిలోకి తీసుకొచ్చిన ఫ్లై ఓవర్‌ను ఎన్‌హెచ్ పరిధిలోకి తీసుకొచ్చి అభివృద్ధి చేసి.. ట్రాఫిక్ కష్టాలు తీర్చాలని ఎంపీ తలారి రంగయ్యతో కలిసి సీఎం దృష్టికి తీసుకుపోయామన్నారు. ఇందుకు ఆయన సానుకూలంగా స్పందించి అర్బన్ లింక్ ప్రాజెక్ట్ కింద రోడ్ల విస్తరణతో పాటు టవర్‌క్లాక్ బ్రిడ్జిని కూల్చి.. దాని స్థానంలో కొత్తగా నాలుగు వరసలతో బ్రిడ్జి నిర్మించేందుకు కేంద్రం దృష్టికి తీసుకెళ్లి మంజూరు చేయించారన్నారు. ప్రస్తుతం సప్తగిరి సర్కిల్, శాంతి థియేటర్ వద్ద పనులు, బ్రిడ్జ్ కింద అండర్ పాస్ పనులను మరో మూడు నెలల్లో పూర్తి చేస్తామన్నారు.రూ.311.93 కోట్లతో నిర్మించిన టవర్‌క్లాక్ బ్రిడ్జ్, ఫోర్‌వేను సీఎం జగన్, కేంద్ర మంత్రులు త్వరలో అధికారికంగా ప్రారంభిస్తారన్నారు. అంతవరకు ఇలాగే ఉంటే ట్రాఫిక్‌తో ప్రజలు మరింత ఇబ్బంది పడతారని భావించి ముందస్తుగా బ్రిడ్జిపై రాకపోకలు మొదలయ్యేలా చర్యలు తీసుకున్నామన్నారు. 16 నెలల్లోనే బ్రిడ్జ్ నిర్మాణం పూర్తి చేశారని, ఎస్ఆర్సీ, ఎన్‌హెచ్, ఆర్అండ్బీ, నగరపాలక, రెవెన్యూ, పోలీసు అధికారులు, ప్రజాప్రతినిధులు సహకారంతోనే ఇది సాధ్యమైందన్నారు. -
అనంతపురంలో టవర్‌క్లాక్ బ్రిడ్జి రెడీ
అనంతపురం క్రైం: జిల్లా కేంద్రం అనంతపురంలో అత్యంత కీలకమైన టవర్‌క్లాక్ ఫ్లైఓవర్ బ్రిడ్జి సిద్ధమైంది. సీఎంగా వైఎస్ జగన్ బాధ్యతలు చేపట్టి నాలుగేళ్లు పూర్తవుతున్న సందర్భంగా అనంతపురం ఎమ్మెల్యే అనంత వెంకటరామిరెడ్డి ఆధ్వర్యంలో సోమవారం చేపట్టే బైక్ ర్యాలీతో బ్రిడ్జిపై రాకపోకలు ప్రారంభం కానున్నాయి. సాయంత్రం బ్రిడ్జిపై ప్రత్యేక లైటింగ్‌ను కూడా ప్రారంభించనున్నారు. ఈ కార్యక్రమానికి ఎమ్మెల్యేతో పాటు కలెక్టర్ గౌతమి, ఎస్పీ శ్రీనివాసరావు తదితరులు హాజరుకానున్నారు. అండర్ పాస్, ఇతర పనులు పూర్తయ్యాక సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి, కేంద్ర మంత్రితో అధికారికంగా ఈ చారిత్రక బ్రిడ్జిని ప్రారంభించనున్నారు. ఇదిలా ఉండగా ఆదివారం రాత్రి ఎమ్మెల్యే అనంత బ్రిడ్జిని పరిశీలించారు. నేషనల్ హైవేగా మార్పు చేసి... అనంతపురం టవర్‌క్లాక్ – పీటీసీ రైల్వే ఓవర్ బ్రిడ్జిని 1965లో నిర్మించారు. ఐదు దశాబ్దాల తర్వాత బ్రిడ్జి అక్కడక్కడా దెబ్బతినడం, వాహనాలకు అనుగుణంగా రోడ్డు లేకపోవడంతో ట్రాఫిక్ సమస్యలు తలెత్తాయి. నేషనల్ హైవేస్ పరిధిలో ఉన్న ఈ బ్రిడ్జిని 2015లో అప్పటి టీడీపీ ప్రభుత్వం స్వార్థ ప్రయోజనాల కోసం ఆర్అండ్బీ పరిధిలోకి తీసుకొచ్చింది. దీంతో అభివృద్ధికి ప్రతిబంధకంగా మారింది. వైఎస్సార్సీపీ అధికారంలోకి వచ్చాక ఎమ్మెల్యే అనంత వెంకటరామిరెడ్డి పెరుగుతున్న నగర జనాభాకు అనుగుణంగా టవర్‌క్లాక్ బ్రిడ్జిని విస్తరించి, ట్రాఫిక్ సమస్యను పరిష్కరించాలని భావించారు. ఈ విషయాన్ని సీఎం జగన్ దృష్టికి తీసుకెళ్లారు. దీంతో బ్రిడ్జిని 2020 నవంబరులో నేషనల్ హైవేస్ పరిధిలోకి తీసుకొచ్చారు. 2021 మే 3న బళ్లారి బైపాస్ వద్ద జాతీయ రహదారి– 44ను కలుపుతూ నగర శివారు పంగల్ రోడ్డు వద్దనున్న చైన్నె హైవేకి అనుసంధానిస్తూ కేంద్రం రూ.311.93 కోట్లతో అర్బన్ ప్రాజెక్ట్ చేపట్టేలా చర్యలు తీసుకుంది. టవర్‌క్లాక్ బ్రిడ్జి సహా 9.2 కిలోమీటర్ల పొడవున రోడ్డు పనులు చేయాలని నిర్ణయించింది. ఇందులో భాగంగా 720 మీటర్ల(దాదాపు 1.44 కి.మీ) పొడవున రెండు వైపులా (ఫోర్వే) బ్రిడ్జి ఏర్పాటు చేస్తున్నారు. ప్రస్తుతం బ్రిడ్జి పనులు పూర్తయ్యాయి. 2021 అక్టోబర్ 25న మొదలైన పనులు ఈ ఏడాది అక్టోబర్ 24కు పూర్తి కావాలి. అయితే 5 నెలలు ముందే కాంట్రాక్ట్ సంస్థ బ్రిడ్జి నిర్మాణాన్ని పూర్తి చేసింది. సీఎం చిత్తశుద్ధితోనే బ్రిడ్జి ఏర్పాటు ఒక నాయకునికి చిత్తశుద్ధి ఉంటే ఎంతటి అభివృద్ధి అయినా సాధ్యమని ఈ పనులతో నిరూపితమైంది. సీఎం జగన్మోహన్ రెడ్డి చిత్తశుద్ధితోనే బ్రిడ్జి, ఫోర్ వే ఏర్పాటు సాధ్యమయ్యాయి. రాష్ట్రంలోనే ఎక్కడా లేని విధంగా రికార్డు సమయం(15 నెలలు)లో, ప్రజల పూర్తి సహకారంతో బ్రిడ్జి పనులు పూర్తయ్యా యి. సీఎం ప్రత్యేక చొరవతో ఇప్పటికే నగరంలో రూ.650 కోట్ల తో అభివృద్ధి పనులు జరుగుతున్నాయి. రానున్న ఏడాదిలోనూ సాధ్యమైనంత అభివృద్ధి చేసి చూపుతాం. – అనంత వెంకటరామిరెడ్డి, ఎమ్మెల్యే -
వైరల్: ఆమె అదృష్టం బాగుంది.. త్రుటిలో తప్పిన ప్రాణాపాయం
అనంతపురం క్రైం: అదృష్టం బాగుండి ఓ యువతి ప్రాణాలతో బయటపడింది. అనంతపురంలోని క్లాక్‌టవర్ వద్ద చోటు చేసుకున్న ఈ ఘటన సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతోంది. వివరాలు.. నగరంలోని మారుతీనగర్‌కు చెందిన నాగలక్ష్మి... ఐర్లాండ్‌లో సాఫ్ట్వేర్ ఇంజినీర్‌గా పనిచేస్తున్నారు. అనారోగ్యంతో బాధపడుతున్న తండ్రిని చూసేందుకు నెల కిందట అనంతపురానికి వచ్చింది. ఈ క్రమంలోనే సోమవారం ఉదయం టవర్‌క్లాక్ సమీపంలోని దుకాణంలో మందులు కొనుగోలు చేసి, సోదరి దివ్యాంజలితో కలిసి స్కూటీపై మారుతీనగర్‌కు వెళ్లేందుకు రాంగ్‌రూట్‌లోకి ప్రవేశించారు. ట్రాఫిక్ సిగ్నల్ వెలగడంతో అప్పటి వరకూ ఆగి ఉన్న ఆర్టీసీ బస్సును డ్రైవర్ ముందుకు పోనిచ్చాడు. బస్సును గమనించని నాగలక్ష్మి తన స్కూటీని ఆపకుండా అలాగే ముందుకు వెళ్లనివ్వడంతో బస్సు బంపర్ తగిలి కిందకు పడ్డారు. బస్సు డ్రైవర్ బ్రేక్ వేసేలోపు ముందు చక్రం స్కూటీ పైకి వెళ్లింది. ఘటనలో నాగలక్ష్మి కాలు విరిగింది. వెనుక కూర్చొన్న దివ్యాంజలికి ఎలాంటి గాయాలు కాలేదు. స్థానిక ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న క్షతగాత్రురాలు పోలీసులతో మాట్లాడుతూ.. కేవలం తన అజాగ్రత్త కారణంగానే ప్రమాదం చోటు చేసుకుందని, దీనిపై ఎలాంటి కేసు అవసరం లేదంటూ పోలీసులకు విన్నవించారు. ఇదే విషయాన్ని ట్రాఫిక్ పోలీసులు ధ్రువీకరించారు. -
చల్లారని ప్రజాగ్రహం
అనంతపురం జిల్లాపరిషత్తు, న్యూస్‌లైన్ : రాష్ట్ర విభజన నిర్ణయాన్ని జిల్లా ప్రజలు జీర్ణించుకోలేకపోతున్నారు. ఈ పాపానికి ఒడిగట్టిన యూపీఏ ప్రభుత్వం, కాంగ్రెస్ అధిష్టానంపై మండిపడుతున్నారు. విభజన నిర్ణయాన్ని ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేస్తూ రాజీలేని పోరాటాన్ని కొనసాగిస్తున్నారు. 82వ రోజైన ఆదివారం కూడా ‘సమైక్య’ పోరును హోరెత్తించారు. జిల్లా వ్యాప్తంగా పెద్దఎత్తున నిరసన కార్యక్రమాలు చేపట్టారు. అనంతపురం నగరంలో ఎమ్మార్పీఎస్ ఆధ్వర్యంలో మాదిగలు సింహగర్జన చేశారు. స్థానిక టవర్‌క్లాక్ వద్దనున్న అమరజీవి పొట్టి శ్రీరాములు విగ్రహం ఎదుట చేపట్టిన ఈ కార్యక్రమానికి మాదిగలతో పాటు కుల,మతాలకు అతీతంగా సమైక్యవాదులు పెద్దఎత్తున తరలివచ్చారు. ఎస్కేయూలో విద్యార్థి జేఏసీ ఆధ్వర్యంలో రిలేదీక్షలు కొనసాగుతున్నాయి. ధర్మవరంలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో రిలేదీక్షలు చేపట్టారు. బత్తలపల్లిలో సమైక్యవాదులు ర్యాలీ చేశారు. గుంతకల్లులో వైఎస్సార్సీపీ నాయకుల రిలేదీక్షలు 64వ రోజుకు చేరాయి. పామిడిలో సమైక్యవాదులు మౌనదీక్ష చేశారు. టీసీ హైస్కూల్ విద్యార్థులు ర్యాలీ నిర్వహించారు. ఉద్యమం 82వ రోజుకు చేరిన సందర్భంగా ఆ సంఖ్య ఆకారంలో కూర్చొని.. నిరసన తెలిపారు. హిందూపురంలో విశాలాంధ్ర పరిరక్షణ సమితి, ఎస్డీఎస్ కళాశాల ఆధ్వర్యంలో వేర్వేరుగా ర్యాలీలు నిర్వహించారు. సమైక్యాంధ్ర కోసం ఉద్యోగానికి రాజీనామా చేసిన మెప్మా అధికారి రాయల్ విజయభాస్కర్ పట్టణంలోని అంబేద్కర్ సర్కిల్లో నిరశన దీక్ష ప్రారంభించారు. పార్టీలు, వర్గాలకు అతీతంగా ఆయనకు సంఘీభావం ప్రకటించారు. రాయదుర్గంలో రాజకీయ జేఏసీ నేతలు, సమైక్యవాదుల రిలేదీక్షలు కొనసాగాయి. రాజకీయ జేఏసీ దీక్షా శిబిరంలో ఎమ్మెల్యే కాపు రామచంద్రారెడ్డి మాట్లాడుతూ.. సీఎం కిరణ్ వైఖరిపై మండిపడ్డారు. సమైక్యాంధ్రకు తూట్లు పొడిచేలా వ్యవహరిస్తున్న సీఎం కిరణ్ తియ్యటి విషం లాంటివాడని అభివర్ణించారు. అలాగే పట్టణంలో సమైక్యవాదులు రాస్తారోకో నిర్వహించారు. కణేకల్లులో విద్యార్థి జేఏసీ ఆధ్వర్యంలో మోకాళ్లపై కూర్చొని నిరసన తెలిపారు. తాడిపత్రి మండలం చుక్కలూరులో గ్రామస్తులు వంటా వార్పు నిర్వహించారు. తాడిపత్రిలో ఇంజనీరింగ్ కళాశాల విద్యార్థులు రిలేదీక్షలు కొనసాగించారు. పెనుకొండ, శింగనమల, రాప్తాడు, కళ్యాణదుర్గం, ఉరవకొండ, కదిరి నియోజకవర్గాల పరిధిలో ‘సమైక్య’ నిరసనలు కొనసాగాయి. -
బై బై గణేశా..
అనంతపురం కల్చరల్, న్యూస్‌లైన్ : నగరంలో ఐదు రోజుల పాటు భక్తుల నుంచి విశేష పూజలందుకున్న విఘ్ననాయకుడు శుక్రవారం గంగమ్మ ఒడికి చేరుకున్నాడు. గణేష్ నిమజ్జనోత్సవం సందర్భంగా నగరంలోని పలు కూడళ్ల వద్ద మధ్యాహ్నం నుంచే కోలాహలం మొదలైంది. నగరంలో వాడవాడలా కొలువుదీరిన వందలాది గణేష్ విగ్రహాలు డప్పులు, మేళ తాళాలు, గానా భజంత్రీలు, బాణాసంచా పేలుళ్ల నడుమ సప్తగిరి సర్కిల్ మీదుగా కెనాల్ వైపు త రలివెళ్లాయి. టవర్ క్లాక్ నుంచి సప్తగిరి సర్కిల్ వరకు బారులు తీరిన భక్తులు గణనాథునికి నీరాజనాలర్పించారు. ముఖ్యంగా యువకులు, చిన్నారులు కేరింతలు కొడుతూ నిమజ్జనోత్సవంలో పాల్గొన్నారు. ‘గణేష్ మహరాజ్‌కీ జై’, ‘గణపతి బొప్పా మోరియా’ నినాదాలను మార్మోగిస్తూ లంబోదరునికి ఘనంగా వీడ్కోలు పలికారు. ‘అనంత కళావాహిని’ సాంస్కృతికోత్సవాల కోసం జిల్లా నలుమూలల నుంచినగరానికొచ్చిన కళాకారులు నిమజ్జనోత్సవంలో ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. సంస్థ వ్యవస్థాపకులు వరం వెంకటేశ్వర్లు, రమేష్ ఆధ్వర్యంలో కళాకారులు ఒంటెలు, గుర్రాలు ముందు నడుస్తుండగా కోలాటం, చెక్కభజన, మరగాళ్లు, కీలుగుర్రాలు వంటి కళారూపాలను ప్రదర్శించారు. హెచ్చెల్సీ, గుత్తి రోడ్డు వద్ద అర్ధరాత్రి వరకు భారీ క్రేన్ల సాయంతో వినాయక విగ్రహాలను నిమజ్జనం చేశారు. కమలానగర్, రెవెన్యూకాలనీ, కోవూరునగర్ తదితర ప్రాంతాల్లో వినాయకుని వద్ద ప్రసాదంగా ఉంచిన లడ్డూలను వేలం వేశారు. అంతకు ముందు సప్తగిరి సర్కిల్ సమీపంలోని వినాయక్ చౌక్ వద్ద ముగింపు సభ నిర్వహించారు. శాంతి భద్రతలకు విఘాతం కలగకుండా పోలీసులు పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేశారు. కాగా.. ఉరవకొండ రంగావీధిలో కాణిపాక వరసిద్ధ్ది వినాయుక ఉత్సవ సమితి వారు ఏర్పాటు చేసిన గణేష్ విగ్రహం వద్ద ఉంచిన లడ్డును రైస్ మిల్ యుజవూని శ్రీధర్ వేలం పాటలో రూ. 45,116లకు దక్కించుకున్నాడు. -
జిల్లాలో ఉధృతమవుతోన్న సమైక్య ఆందోళన
సాక్షి, అనంతపురం : జిల్లా నలుమూలలా విభజనాగ్ని సెగలు విరజిమ్ముతూనే ఉంది. ఎన్ని అడ్డంకులెదురైనా, పోలీసులు ఉక్కుపాదం మోపినా ఉద్యమకారులలో ఇసుమంతైనా ధైర్యం సడలలేదు. అణచివేత యత్నాలను తిప్పికొట్టి జిల్లా వ్యాప్తంగా ప్రజలు సింహాలై గర్జిస్తున్నారు. సమైక్యవాదుల వైఖరి పాలకులకు ముచ్చెమటలు పట్టిస్తోంది. సమైక్యాంధ్ర ఉద్యమం 23వ రోజు గురువారం ఉధృతంగా సాగింది. అనంతపురంలోని వేణుగోపాల్‌నగర్‌కు చెందిన వందలాది మంది ప్రజలు వంద మీటర్ల జాతీయ జెండాతో ప్రదర్శన నిర్వహించారు. టవర్‌క్లాక్ వద్ద మానవహారంగా ఏర్పడి సమైక్య గళాన్ని వినిపించారు. ఎన్జీవోల ఆధ్వర్యంలో నగరంలో బైక్ ర్యాలీ నిర్వహించారు. కలెక్టరేట్ మహిళా ఉద్యోగులు, ఉపాధ్యాయ జాక్టో, స్వర్ణకారుల సంఘం, ప్రయివేటు పాఠశాలల యాజమాన్యం ఆధ్వర్యంలో నిరసనలు కొనసాగించారు. న్యాయవాదులు 48 గంటల దీక్ష చేపట్టారు. జెడ్పీ ఉద్యోగులు జోలె పట్టి భిక్షాటన చేశారు. టవర్‌క్లాక్ సర్కిల్లో ఆర్యవైశ్య సంఘం ఆధ్వర్యంలో హైదరాబాద్ వెళ్లేవారికి ఐదు నిమిషాల్లో పాస్‌పోర్టు, వీసా అంటూ ప్రత్యేక శిబిరం ఏర్పాటు చేసి నిరసన తెలిపారు. ఉపాధ్యాయులు ముసుగులు వేసుకుని.. మోకాళ్లతో నడిచారు. న్యాయశాఖ ఉద్యోగులు నగరంలో ర్యాలీ నిర్వహించారు. విద్యార్థి సంఘాల నాయకులు నగరంలోని పొట్టిశ్రీరాములు విగ్రహం వద్ద మెడకు ఉరితాళ్లు బిగించుకుని నిరసన తెలిపారు. పశుసంవర్ధక, ట్రాన్స్‌కో ఉద్యోగులు నగరంలో ర్యాలీ చేశారు. ఆర్ట్స్‌కళాశాల అధ్యాపకులు, జాక్టో, ఎస్సీ, ఎస్టీ, బీసీ సంఘాలు, జాతీయ రహదారులు, ఆస్పత్రి ఉద్యోగులు, సీఐటీయూ, వాణిజ్య పన్నులశాఖ, పంచాయతీరాజ్, విద్యుత్, మునిసిపల్ , నీటిపారుదల ఉద్యోగుల రిలేదీక్షలు కొనసాగాయి. ఈ దీక్షా శిబిరాల్లో సాంస్కృతిక కార్యక్రమాల ద్వారా ప్రజలకు సమైక్యాంధ్రపై అవగాహన కల్పించారు. ఎస్కేయూలో ఆరని సమైక్య సెగ ఎస్కేయూలో విద్యార్థులు చేపట్టిన రిలే దీక్షలు 23వ రోజుకు చేరాయి. విద్యార్థి, బోధన, బోధనేతర జేఏసీ ఆధ్వర్యంలో యూనివర్సిటీ ప్రాంగణంలో ర్యాలీ నిర్వహించి.. జాతీయరహదారిపై రాస్తారోకో చేశారు. అనంతరం రాష్ట్ర విభజనను వ్యతిరేకిస్తూ యూపీఏ ప్రభుత్వానికి పిండప్రదానం చేశారు. వాడవాడలా నిరసనలు.. ధర్మవరంలో మెకానిక్, విద్యుత్ కార్మిక సంఘాలు, ఆర్టీసీ ఉద్యోగులు, రెవెన్యూ, ప్రజాసంఘాలతో పాటు వైఎస్సార్సీపీ, ఐక్య ఉపాధ్యాయ సంఘం ఆధ్వర్యంలో చేపట్టిన రిలే దీక్షలు కొనసాగుతున్నాయి. బత్తలపల్లి, తాడిమర్రి, ముదిగుబ్బ మండలాల్లో వైఎస్సార్సీపీ కార్యకర్తలు, సమైక్య వాదులు రిలేదీక్షలు కొనసాగిస్తున్నారు. గుంతకల్లులో సమైక్యాంధ్ర ఆందోళనలు కొనసాగాయి. గుత్తిలో న్యాయవాదులు విధులు బహిష్కరించి ర్యాలీ చేశారు. మోకాళ్లపై నడిచి ఉపాధ్యాయులు నిరసన తెలిపారు. హిందూపురంలో ఆర్యవైశ్య సంఘం వారు భారీ ప్రదర్శన నిర్వహించారు. ఎన్జీవోలు, ఉపాధ్యాయులు, వివిధ ప్రజా సంఘాల కార్యకర్తలు పట్టణంలో ర్యాలీ నిర్వహించారు. చిలమత్తూరు, లేపాక్షిలలో ఉపాధ్యాయ జేఏసీ, విద్యార్థులు ర్యాలీ నిర్వహించారు. కదిరిలో జేఏసీ ఆధ్వర్యంలో సమైక్యాంధ్రకు మద్దతుగా రిలే నిరాహార దీక్షలు కొనసాగాయి. కదిరి డివిజన్ పరిధిలోని ప్రభుత్వ పాఠశాలల పీఈటీలు దీక్ష చేపట్టారు. ప్రభుత్వ బాలుర, బాలికల జూనియర్ కళాశాలల అధ్యాపకులు, సిబ్బందితో పాటు ఆర్య వైశ్యులు, ఫ్రూట్ మర్చంట్, మటన్ వ్యాపారులు, కుమ్మరవాండ్లపల్లి గ్రామస్తులు పట్టణంలో ర్యాలీలు నిర్వహించి సమైక్యవాదం విన్పించారు. ప్రభుత్వ ఉపాధ్యాయులు చీపుర్లు చేతబట్టి పుర వీధులు శుభ్రపరిచి నిరసనను తెలియజేశారు. కళ్యాణదుర్గంలో వైఎస్సార్సీపీ నాయకుల రిలేదీక్షలు కొనసాగుతున్నాయి. న్యాయవాదులు విధులు బహిష్కరించి ర్యాలీ చేశారు. అనంతరం సోనియాగాంధీ, కేసీఆర్ దిష్టిబొమ్మలు దహనం చేశారు. కుందుర్పిలో సమైక్యాంధ్రకు మద్దతుగా వేలాది మంది గ్రామస్తులు ర్యాలీ నిర్వహించారు. మడకశిరలో హిజ్రాలు రోడ్లపై నృత్యాలు చేస్తూ.. నిరసన తెలిపారు. ఉపాధ్యాయులు ర్యాలీ చేశారు. అమరాపురంలో సమైక్యవాదులు మానవహారం నిర్వహించారు. రైతులు ఎద్దుల బండ్లతో ర్యాలీ చేశారు. ఓడీసీ, నల్లమాడ, బుక్కపట్నం, కొత్తచెరువులలో సమైక్య నిరసనలు మిన్నంటాయి. పెనుకొండలో ముస్లింలు భారీ ర్యాలీ నిర్వహించారు. అనంతరం రోడ్డుపై ప్రార్థనలు చేశారు. ఉపాధ్యాయుల రిలే దీక్షలు కొనసాగుతున్నాయి. రొద్దం, పరిగి మండలాల్లో సమైక్య ఉద్యమాలు ఎగిసిపడ్డాయి. రాయదుర్గంలో వైద్యసిబ్బంది, విద్యార్థులు, పట్టణ ప్రజలు స్వచ్ఛందంగా ముందుకు వచ్చి రిలేదీక్షలు చేపట్టారు. కణేకల్లులో ఎన్జీవోలు, రాప్తాడులో ఉద్యోగులు ర్యాలీ నిర్వహించారు. శింగనమలలో వైఎస్సార్సీపీ కార్యకర్తల రిలేదీక్షలు కొనసాగుతున్నాయి. ఆటోయూనియన్ ఆధ్వర్యంలో ఆటోలతో భారీ ర్యాలీ నిర్వహించారు. పుట్లూరులో జేఏసీ ఆద్వర్యంలో రిలే దీక్షలు చేపట్టారు. నార్పలలో కురబసంఘం ఆధ్వర్యంలో చేపట్టిన రిలే దీక్షలు కొనసాగాయి. తాడిపత్రిలో ట్రాన్స్‌కో ఉద్యోగులు మోకాళ్లపై నడిచి నిరసన తెలిపారు. జేఏసీ ఆధ్వర్యంలో రోడ్డుపై మానవహారంగా ఏర్పడి.. యోగాసనాలు చేశారు. ప్రైవేటు పాఠశాలల విద్యార్థులు పట్టణంలో భారీ ర్యాలీ నిర్వహించారు. మునిసిపల్ ఉద్యోగుల రిలే దీక్షలు కొనసాగుతున్నాయి. విద్యార్థులు రోడ్డుపైనే చదువుకుంటూ నిరసన తెలిపారు. యాడికిలో వికలాంగులు ర్యాలీ నిర్వహించారు. పెద్దవడుగూరులో జేఏసీ ఆధ్వర్యంలో బైక్ ర్యాలీ చేశారు. ఉరవకొండలో స్వర్ణకారులు రోడ్డుపై స్నానాలు చేశారు. టైలర్ యూనియన్ ఆధ్వర్యంలో ర్యాలీ నిర్వహించారు. బలిజ సంఘం ఆధ్వర్యంలో భారీ ర్యాలీ చేశారు. బెలుగుప్ప, విడపనకల్లు, వజ్రకరూరులో ఉద్యోగులు, సమైక్య వాదులు ర్యాలీ నిర్వహించారు. -
జన గర్జన
సాక్షి, అనంతపురం : సమైక్యవాదులు సమరోత్సాహంతో ఉద్యమిస్తున్నారు. రాష్ట్ర విభజన ఆపేదాకా విశ్రమించబోమంటూ శపథం చేస్తున్నారు. 22వ రోజైన బుధవారం కూడా జిల్లా వ్యాప్తంగా ఉద్యమం ఉధృతంగా కొనసాగింది. ప్రజలు, వివిధ జేఏసీల నాయకులు, ఎన్జీఓలతో పాటు వైఎస్సార్సీపీ నాయకులు చురుగ్గా పొల్గొన్నారు. అనంతపురం నగరంలో జేఏసీ, ఎన్జీఓల ఆధ్వర్యంలో పెద్దఎత్తున ప్రదర్శన నిర్వహించారు. శ్రీకంఠం సర్కిల్లో అరగంట పాటు మానవహారం నిర్మించారు. సీమాంధ్రకు చెందిన మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎంపీలు వెంటనే రాజీనామా చేసి.. ఉద్యమంలో పాల్గొనాలని డిమాండ్ చేశారు. నగరానికి చెందిన యువకులు బైక్ ర్యాలీ నిర్వహించారు. కేసీఆర్ దిష్టిబొమ్మతో స్థానిక సప్తగిరి సర్కిల్లో బైక్‌లతో రౌండ్లు కొడుతూ.. జై సమైక్యాంధ్ర అంటూ నినదించారు. డ్వామా ఉద్యోగులు ప్రదర్శన చేశారు. అనంతరం సప్తగిరి సర్కిల్ నుంచి టవర్‌క్లాక్ వరకు రోడ్డుపై సహపంక్తి భోజనాలు చేసి నిరసన తెలిపారు. వ్యవసాయ, అనుబంధ శాఖల ఉద్యోగులు వేలాది మంది రైతులతో ర్యాలీ చేశారు. చిన్న ట్రాక్టర్లతో ర్యాలీ చేయడంతో నగరమంతా హారన్లతో మార్మోగింది. ట్రాన్స్‌కో ఉద్యోగులు ర్యాలీ చేశారు. జాక్టో, ఎస్సీ, ఎస్టీ, బీసీ సంఘాల నాయకులు, ప్రభుత్వ ఆస్పత్రి, వాణిజ్య పన్నులశాఖ, పంచాయతీరాజ్, మున్సిపల్ , నీటిపారుదల ఉద్యోగుల రిలే దీక్షలు కొనసాగుతున్నాయి. దీక్షలు చేస్తున్న ఉద్యోగులకు ఎమ్మెల్యే గురునాథరెడ్డి సంఘీభావం తెలిపారు. అనంతరం ఆయన నగరంలో వాహనాలకు సమైక్యాంధ్ర స్టిక్కర్లు అతికించారు. నగరానికి చెందిన వేలాది మంది మహిళలు, వృద్ధులు కూడా ర్యాలీ నిర్వహించారు. ‘హైదరాబాద్ వెళ్లేవారికి ఎటువంటి గుర్తింపు కార్డులు లేకుండా ఐదు నిమిషాల్లో పాస్‌పోర్టు, వీసా జారీ చేస్తామం’టూ సమైక్యవాదులు స్థానిక టవర్‌క్లాక్ సర్కిల్లో కట్టిన బ్యానర్ ఆకట్టుకుంది. ఎస్కేయూ విద్యార్థులు, బోధన, బోధనేతర సిబ్బంది వర్సిటీ ప్రాంగణంలో ర్యాలీ నిర్వహించారు. అనంతరం వర్సిటీ ఎదురుగా ఉన్న జాతీయ రహదారిపై బైఠాయించారు. వైఎస్సార్సీపీ నాయకుడు నాగభూషణ్‌రెడ్డి, ఇటుకలపల్లి సర్పంచ్ పెద్దిరెడ్డి ఆధ్వర్యంలో ఎద్దుల బండ్లతో వర్సిటీ వరకు ర్యాలీ నిర్వహించారు. వర్సిటీ సమీపంలోని మారుతీనగర్ కాలనీ మహిళలు ర్యాలీగా వచ్చి.. వర్సిటీ ఎదుట సోనియా దిష్టిబొమ్మను చెప్పుతో కొడుతూ దహనం చేశారు. సేతు, పాంచజన్య, రాధాస్కూల్ ఆఫ్ లర్నింగ్ పాఠశాలల విద్యార్థులు వర్సిటీ వరకు ర్యాలీ నిర్వహించారు. అక్కడ రోడ్డుపై బైఠాయించి మధ్యాహ్న భోజనం చేశారు. ధర్మవరంలో వైఎస్సార్సీపీ, ఐక్య ఉపాధ్యాయ సంఘం, రెవెన్యూ ఉద్యోగుల రిలే దీక్షలు కొనసాగుతున్నాయి. ఈ దీక్షలకు పలు ప్రైవేటు పాఠశాలల యాజమాన్యాలు మద్దతు తెలిపాయి. గుంతకల్లులో సమైక్యవాదులు జాతీయరహదారిని దిగ్బంధించారు. వైఎస్సార్సీపీ రిలే దీక్షలు కొనసాగుతున్నాయి. గుత్తిలో ఉపాధ్యాయులు క్యాట్ వాక్ చేస్తూ నిరసన తెలిపారు. పామిడిలో సమైక్యవాదులు, హిందూపురంలో సమైక్యాంధ్ర జేఏసీ, జాక్టో రిలే దీక్షలు కొనసాగుతున్నాయి. చిలమత్తూరు, లేపాక్షి మండలాల్లో రెడ్డిసేవా సంఘం ఆధ్వర్యంలో భారీ ప్రదర్శనలు చేశారు. కదిరిలో మహిళా టీచర్లు రోడ్డుపై ముగ్గులు వేసి నిరసన తెలిపారు. పట్టణంలోని వైఎస్సార్ కాలనీకి చెందిన వేలాది మంది మహిళలు భారీ ర్యాలీ చేశారు. కటారుపల్లి రైతులు, విద్యార్థి జేఏసీ నాయకులు రిలే దీక్షలు చేపట్టారు. కళ్యాణదుర్గంలో స్ఫూర్తి ఫౌండేషన్ ఆధ్వర్యంలో రక్తదానం చేశారు. జేఏసీ నాయకులు, సమైక్యవాదులు భారీ ప్రదర్శన నిర్వహించి కేసీఆర్, సోనియా దిష్టిబొమ్మలను దహనం చేశారు. మడకశిరలో వక్కలిగులు ఎడ్లబండ్ల ప్రదర్శన, రోడ్డుపై వంటా వార్పు చేపట్టారు. వెటర్నరీ సిబ్బంది, వెటర్నరీ పాలిటెక్నిక్ విద్యార్థులు పట్టణంలో ర్యాలీ నిర్వహించారు. గుడిబండలో సమైక్యవాదుల ఆందోళనలు మిన్నంటా యి. అమరాపురంలో ఉపాధ్యాయులు, వీఆర్వోలు, వీఆర్ఏలు రిలే దీక్షలు చేపట్టారు. ఓడీసీ, బుక్కపట్నం, కొత్తచెరువు మండలాల్లో సమైక్య నిరసనలు కొనసాగాయి. పెనుకొండలో సమైక్యవాదులు భారీ ప్రదర్శన నిర్వహించారు. రాయదుర్గంలో సై మెక్య రాష్ట్ర పరిరక్షణ వేదిక, న్యాయవాదులు, కురిహినశెట్టి సమాజ జనుల ఆధ్వర్యంలో వినూత్న నిరసన తెలిపారు. ఉపాధ్యాయ సంఘాల రిలే దీక్షలు కొనసాగుతున్నాయి. కణేకల్లులో ఇద్దరు సమైక్యవాదులు ఆమరణ దీక్ష చేపట్టారు. సీకేపల్లిలో జాతీయ రహదారిపై వంటా వార్పు చేపట్టారు. ఆత్మకూరులో ఐకేపీ ఉద్యోగులు, రామగిరిలో విద్యార్థులు, శింగనమలలో పెయింటర్లు, నార్పలలో జేఏసీ ఆధ్వర్యంలో ర్యాలీలు నిర్వహించారు. తాడిపత్రిలో ప్రైవేటు పాఠశాలల యాజమాన్యాలు, విద్యార్థులు, జేఏసీ ఆధ్వర్యంలో ర్యాలీ, మానవహారం నిర్వహించారు. మునిసిపల్ ఉద్యోగులు మోకాళ్లపై నడిచి నిరసన తెలిపారు. ఆర్టీసీ, ట్రాన్స్‌కో ఉద్యోగులు ర్యాలీ నిర్వహించి.. రోడ్డుపై యోగాసనాలు వేశారు. యాడికిలో జేఏసీ నాయకులు నల్లరిబ్బన్లు కట్టుకుని నిరసన తెలిపారు. పెద్దవడుగూరులో జేఏసీ రిలేదీక్షలకు వైఎస్సార్సీపీ నాయకులు సంఘీభావం తెలిపారు. ఉరవకొండలో ప్రదర్శన నిర్వహించారు. విడపనకల్లులో వైఎస్సార్సీపీ ఆధ్వర్యంలో రాస్తారోకో, విద్యార్థి జేఏసీ ఆధ్వర్యంలో ర్యాలీ నిర్వహించారు.