సాక్షి, అనంతపురం : జిల్లా నలుమూలలా విభజనాగ్ని సెగలు విరజిమ్ముతూనే ఉంది. ఎన్ని అడ్డంకులెదురైనా, పోలీసులు ఉక్కుపాదం మోపినా ఉద్యమకారులలో ఇసుమంతైనా ధైర్యం సడలలేదు. అణచివేత యత్నాలను తిప్పికొట్టి జిల్లా వ్యాప్తంగా ప్రజలు సింహాలై గర్జిస్తున్నారు. సమైక్యవాదుల వైఖరి పాలకులకు ముచ్చెమటలు పట్టిస్తోంది. సమైక్యాంధ్ర ఉద్యమం 23వ రోజు గురువారం ఉధృతంగా సాగింది.
అనంతపురంలోని వేణుగోపాల్‌నగర్‌కు చెందిన వందలాది మంది ప్రజలు వంద మీటర్ల జాతీయ జెండాతో ప్రదర్శన నిర్వహించారు. టవర్‌క్లాక్ వద్ద మానవహారంగా ఏర్పడి సమైక్య గళాన్ని వినిపించారు. ఎన్జీవోల ఆధ్వర్యంలో నగరంలో బైక్ ర్యాలీ నిర్వహించారు. కలెక్టరేట్ మహిళా ఉద్యోగులు, ఉపాధ్యాయ జాక్టో, స్వర్ణకారుల సంఘం, ప్రయివేటు పాఠశాలల యాజమాన్యం ఆధ్వర్యంలో నిరసనలు కొనసాగించారు. న్యాయవాదులు 48 గంటల దీక్ష చేపట్టారు.
జెడ్పీ ఉద్యోగులు జోలె పట్టి భిక్షాటన చేశారు. టవర్‌క్లాక్ సర్కిల్‌లో ఆర్యవైశ్య సంఘం ఆధ్వర్యంలో హైదరాబాద్ వెళ్లేవారికి ఐదు నిమిషాల్లో పాస్‌పోర్టు, వీసా అంటూ ప్రత్యేక శిబిరం ఏర్పాటు చేసి నిరసన తెలిపారు. ఉపాధ్యాయులు ముసుగులు వేసుకుని.. మోకాళ్లతో నడిచారు. న్యాయశాఖ ఉద్యోగులు నగరంలో ర్యాలీ నిర్వహించారు. విద్యార్థి సంఘాల నాయకులు నగరంలోని పొట్టిశ్రీరాములు విగ్రహం వద్ద మెడకు ఉరితాళ్లు బిగించుకుని నిరసన తెలిపారు. పశుసంవర్ధక, ట్రాన్స్‌కో ఉద్యోగులు నగరంలో ర్యాలీ చేశారు. ఆర్ట్స్‌కళాశాల అధ్యాపకులు, జాక్టో, ఎస్సీ, ఎస్టీ, బీసీ సంఘాలు, జాతీయ రహదారులు, ఆస్పత్రి ఉద్యోగులు, సీఐటీయూ, వాణిజ్య పన్నులశాఖ, పంచాయతీరాజ్, విద్యుత్, మునిసిపల్ , నీటిపారుదల ఉద్యోగుల రిలేదీక్షలు కొనసాగాయి. ఈ దీక్షా శిబిరాల్లో సాంస్కృతిక కార్యక్రమాల ద్వారా ప్రజలకు సమైక్యాంధ్రపై అవగాహన కల్పించారు.
ఎస్కేయూలో ఆరని సమైక్య సెగ
ఎస్కేయూలో విద్యార్థులు చేపట్టిన రిలే దీక్షలు 23వ రోజుకు చేరాయి. విద్యార్థి, బోధన, బోధనేతర జేఏసీ ఆధ్వర్యంలో యూనివర్సిటీ ప్రాంగణంలో ర్యాలీ నిర్వహించి.. జాతీయరహదారిపై రాస్తారోకో చేశారు. అనంతరం రాష్ట్ర విభజనను వ్యతిరేకిస్తూ యూపీఏ ప్రభుత్వానికి పిండప్రదానం చేశారు.
వాడవాడలా నిరసనలు..
ధర్మవరంలో మెకానిక్, విద్యుత్ కార్మిక సంఘాలు, ఆర్టీసీ ఉద్యోగులు, రెవెన్యూ, ప్రజాసంఘాలతో పాటు వైఎస్సార్‌సీపీ, ఐక్య ఉపాధ్యాయ సంఘం ఆధ్వర్యంలో చేపట్టిన రిలే దీక్షలు కొనసాగుతున్నాయి. బత్తలపల్లి, తాడిమర్రి, ముదిగుబ్బ మండలాల్లో వైఎస్సార్‌సీపీ కార్యకర్తలు, సమైక్య వాదులు రిలేదీక్షలు కొనసాగిస్తున్నారు. గుంతకల్లులో సమైక్యాంధ్ర ఆందోళనలు కొనసాగాయి. గుత్తిలో న్యాయవాదులు విధులు బహిష్కరించి ర్యాలీ చేశారు. మోకాళ్లపై నడిచి ఉపాధ్యాయులు నిరసన తెలిపారు.
హిందూపురంలో ఆర్యవైశ్య సంఘం వారు భారీ ప్రదర్శన నిర్వహించారు. ఎన్జీవోలు, ఉపాధ్యాయులు, వివిధ ప్రజా సంఘాల కార్యకర్తలు పట్టణంలో ర్యాలీ నిర్వహించారు. చిలమత్తూరు, లేపాక్షిలలో ఉపాధ్యాయ జేఏసీ, విద్యార్థులు ర్యాలీ నిర్వహించారు. కదిరిలో జేఏసీ ఆధ్వర్యంలో సమైక్యాంధ్రకు మద్దతుగా రిలే నిరాహార దీక్షలు కొనసాగాయి. కదిరి డివిజన్ పరిధిలోని ప్రభుత్వ పాఠశాలల పీఈటీలు దీక్ష చేపట్టారు. ప్రభుత్వ బాలుర, బాలికల జూనియర్ కళాశాలల అధ్యాపకులు, సిబ్బందితో పాటు ఆర్య వైశ్యులు, ఫ్రూట్ మర్చంట్, మటన్ వ్యాపారులు, కుమ్మరవాండ్లపల్లి గ్రామస్తులు పట్టణంలో ర్యాలీలు నిర్వహించి సమైక్యవాదం విన్పించారు.
ప్రభుత్వ ఉపాధ్యాయులు చీపుర్లు చేతబట్టి పుర వీధులు శుభ్రపరిచి నిరసనను తెలియజేశారు. కళ్యాణదుర్గంలో వైఎస్సార్‌సీపీ నాయకుల రిలేదీక్షలు కొనసాగుతున్నాయి. న్యాయవాదులు విధులు బహిష్కరించి ర్యాలీ చేశారు. అనంతరం సోనియాగాంధీ, కేసీఆర్ దిష్టిబొమ్మలు దహనం చేశారు. కుందుర్పిలో సమైక్యాంధ్రకు మద్దతుగా వేలాది మంది గ్రామస్తులు ర్యాలీ నిర్వహించారు. మడకశిరలో హిజ్రాలు రోడ్లపై నృత్యాలు చేస్తూ.. నిరసన తెలిపారు. ఉపాధ్యాయులు ర్యాలీ చేశారు. అమరాపురంలో సమైక్యవాదులు మానవహారం నిర్వహించారు. రైతులు ఎద్దుల బండ్లతో ర్యాలీ చేశారు. ఓడీసీ, నల్లమాడ, బుక్కపట్నం, కొత్తచెరువులలో సమైక్య నిరసనలు మిన్నంటాయి. పెనుకొండలో ముస్లింలు భారీ ర్యాలీ నిర్వహించారు.
అనంతరం రోడ్డుపై ప్రార్థనలు చేశారు. ఉపాధ్యాయుల రిలే దీక్షలు కొనసాగుతున్నాయి. రొద్దం, పరిగి మండలాల్లో సమైక్య ఉద్యమాలు ఎగిసిపడ్డాయి. రాయదుర్గంలో వైద్యసిబ్బంది, విద్యార్థులు, పట్టణ ప్రజలు స్వచ్ఛందంగా ముందుకు వచ్చి రిలేదీక్షలు చేపట్టారు. కణేకల్లులో ఎన్జీవోలు, రాప్తాడులో ఉద్యోగులు ర్యాలీ నిర్వహించారు. శింగనమలలో వైఎస్సార్‌సీపీ కార్యకర్తల రిలేదీక్షలు కొనసాగుతున్నాయి. ఆటోయూనియన్ ఆధ్వర్యంలో ఆటోలతో భారీ ర్యాలీ నిర్వహించారు. పుట్లూరులో జేఏసీ ఆద్వర్యంలో రిలే దీక్షలు చేపట్టారు. నార్పలలో కురబసంఘం ఆధ్వర్యంలో చేపట్టిన రిలే దీక్షలు కొనసాగాయి. తాడిపత్రిలో ట్రాన్స్‌కో ఉద్యోగులు మోకాళ్లపై నడిచి నిరసన తెలిపారు.
జేఏసీ ఆధ్వర్యంలో రోడ్డుపై మానవహారంగా ఏర్పడి.. యోగాసనాలు చేశారు. ప్రైవేటు పాఠశాలల విద్యార్థులు పట్టణంలో భారీ ర్యాలీ నిర్వహించారు. మునిసిపల్ ఉద్యోగుల రిలే దీక్షలు కొనసాగుతున్నాయి. విద్యార్థులు రోడ్డుపైనే చదువుకుంటూ నిరసన తెలిపారు. యాడికిలో వికలాంగులు ర్యాలీ నిర్వహించారు. పెద్దవడుగూరులో జేఏసీ ఆధ్వర్యంలో బైక్ ర్యాలీ చేశారు. ఉరవకొండలో స్వర్ణకారులు రోడ్డుపై స్నానాలు చేశారు. టైలర్ యూనియన్ ఆధ్వర్యంలో ర్యాలీ నిర్వహించారు. బలిజ సంఘం ఆధ్వర్యంలో భారీ ర్యాలీ చేశారు. బెలుగుప్ప, విడపనకల్లు, వజ్రకరూరులో ఉద్యోగులు, సమైక్య వాదులు ర్యాలీ నిర్వహించారు.
జిల్లాలో ఉధృతమవుతోన్న సమైక్య ఆందోళన
Published Fri, Aug 23 2013 5:03 AM | Last Updated on Fri, Sep 1 2017 10:01 PM
Advertisement
Advertisement