Samai kyandhra
-
వానలోనూ ‘ఒక్కటే’ నినాదం
సాక్షి నెట్వర్క్ :ఎడతెరిపిలేకుండా వర్షం పడుతున్నప్పటికీ సమైక్యాంధ్ర కోసం సీమంధ్రులు తమ నినాదాన్ని మాత్రం పక్కకు పెట్టలేదు. గురువారం 86వ రోజూ తమ ఉద్యమాన్ని కొనసాగించారు. తుపానుతో తాము ఏం కోల్పోయిన దానికంటే రాష్ర్టం విడిపోతేనే ఎక్కువ బాధ కలుగుతుందని వారు పేర్కొంటున్నారు. ఏపీఎన్జీవోలు ఇచ్చిన పిలుపుమేరకు విశాఖ కలెక్టరేట్ వద్ద సమైక్యవాదులు మధ్యాహ్న భోజన విరామసమయంలో నిరసన వ్యక్తం చేశారు. భీమిలిలో జేఏసీ ఆధ్వర్యంలో ఉపాధ్యాయ, ఉద్యోగ సంఘాల సభ్యులు తహశీల్దార్ కార్యాలయాన్ని ముట్టడించారు. ఏలూరులోని కలెక్టరేట్ వద్ద రెవెన్యూ, జెడ్పీ, వివిధ శాఖల ఉద్యోగుల ప్రదర్శన నిర్వహించారు. రైతులు 50 ట్రాక్టర్లతో దువ్వ గ్రామం నుంచి ర్యాలీగా తణుకు చేరుకుని మానవహారం ఏర్పాటు చేశారు. విజయనగరం జిల్లా పార్వతీపురంలో అయ్యప్ప మాలధారులు సమైక్యాంధ్రకు మద్దతుగా నినాదాలు చేస్తూ పూజలు నిర్వహించారు. అనంతపురం జిల్లా నల్లమాడలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకులు అర్ధనగ్న ప్రదర్శన చేశారు. ఎస్కేయూ విద్యార్థులు జాతీయ రహదారిపై 86 ఆకారంలో కూర్చొని ఆందోళన చేశారు. అనంతపురంలో జాక్టో ఆధ్వర్యంలో ఉపాధ్యాయులు, తనకల్లు, కనగానపల్లి, ఉరవకొండలో విద్యార్థులు ర్యాలీలు చేశారు. తలకిందులుగా తపస్సుచేసయినా రాష్ట్రాన్ని కాపాడుకుంటామంటూ నాగాయలంకలో గురువారం జేఏసీ, లయన్స్‌క్లబ్ ఆధ్వర్యంలో వినూత్న నిరసన తెలిపారు. పలువురు తలకిందులుగా నిలబడి జైసమైక్యాంధ్ర, తెలంగాణ వద్దు-సమైక్యాంధ్ర ముద్దంటూ నినాదాలు చేశారు. విజయవాడలో ఇరిగేషన్ కార్యాలయం వద్ద ఎన్జీవోలు, ఇరిగేషన్ ఉద్యోగులు భోజనవిరామ సమయంలో ధర్నా చేశారు. ఉపాధ్యాయుల జేఏసీ ఆధ్వర్యంలో పామర్రు హైస్కూల్ విరామ సమయంలో పాఠశాల ముందు నుంచి ఉపాధ్యాయులు ధర్నా చేశారు. సమైక్యాంధ్రకు మద్దతుగా మైలవరంలోని పలు ప్రభుత్వ పాఠశాలల్లో ఉపాధ్యాయులు మధ్యాహ్న భోజన విరామ సమయంలో నిరసన కార్యక్రమాన్ని చేపట్టారు. నెల్లూరులో జెడ్పీ ఉద్యోగులు నల్ల బ్యాడ్జీలు ధరించి నిరసన తెలిపారు. ఎన్జీఓ జేఏసీ ఆధ్వర్యంలో కలెక్టరేట్ ఎదుట ధర్నా నిర్వహించారు. వెంకటగిరిలో రాత్రి 7 గంటల ప్రాంతంలో జేఏసీ నేతలు గొడుగులతో ర్యాలీ నిర్వహించారు. -
నిత్య నూతనమై..
ఏలూరు, న్యూస్‌లైన్ : సమైక్యాంధ్ర పరిరక్షణ ఉద్యమం జిల్లాలో నిత్యనూతనమై ఉవ్వెత్తున సాగుతూనే ఉంది. ‘జై సమైక్యాంధ్ర’ అంటూ అన్నివర్గాల ప్రజలు అలుపెరుగని పోరాటం చేస్తున్నారు. 52వ రోజైన శుక్రవారం కూడా వినూత్న నిరసనలతో విభజన నిర్ణయూనికి వ్యతిరేకంగా గర్జించారు. జిల్లా అంతటా బీఎస్ఎన్ఎల్, ఎల్ఐసీ, ఇన్‌కం టాక్స్, టెలిక ం, జాతీయ బ్యాంకులను ఎన్జీవోలు ముట్టడించి కార్యకలాపాలనుస్తంభింపచేశారు. బ్యాంకుల్లో రూ.250 కోట్ల మేర ఆర్థిక లావాదేవీలు స్తంభించారుు. ఏలూరు ఫైర్‌స్టేషన్ సెంటర్లో నాయీ బ్రాహ్మణులు దీక్షలు చేశారు. దెందులూరు నుంచి రైతులు జాతీయ రహదారిపైకి చేరుకుని రాస్తారోకో నిర్వహించారు. రెండున్నర గంటలపాటు వాహనాల రాకపోకలను అడ్డుకున్నారు. వంటావార్పు చేసి అన్నసమారాధన నిర్వహించారు. కొవ్వూరులో రాష్ట్ర విభజన ప్రకటనను వ్యతిరేకిస్తూ మాదిగల ఆధ్వర్యంలో దండోరా కార్యక్రమం నిర్వహించారు. మంద కృష్ణకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. తాళ్లపూడిలో మండల జేఏసీ ఆధ్వర్యంలో మత్స్యకారులు, ఎన్జీవోలు గోదావరిలో పడవల యాత్ర నిర్వహించారు. భీమవరం ప్రకాశం చౌక్‌లో సమైక్యవాదులు, ఉపాధ్యాయుల జాతీయ రహదారిని దిగ్బం ధించి నిరసన తెలిపారు. ఉండి సెంటర్లో మహిళలు రోకళ్లు, రోళ్లతో పిండి దంచి వినూత్న నిరసన తెలిపారు. పాలకొల్లు గాంధీబొమ్మల సెంటర్లో ఉద్యోగ జేఏసీ ఆధ్వర్యంలో రిలే దీక్షలు కొనసాగుతున్నాయి. పోడూరు మండలం జిన్నూరులో ఉపాధ్యాయులు మానహారం చేపట్టారు. తణుకులో జేఏసీ ఆధ్వర్యంలో బంద్ నిర్వహించారు. ఉపాధ్యారుునులు బతుకమ్మ పండగ నిర్వహించగా, ఆర్టీసీ ఉద్యోగులు దుస్తులకు బదులు ఆకులను ధరించి ర్యాలీ చేశారు. తాడేపల్లిగూడెం పోలీస్ ఐలండ్ సెంటర్లోని కాలువలో విద్యార్థి జేఏసీ ఆధ్యర్యంలో మూడు గంటలపాటు జలదీక్ష చేపట్టారు. ఉంగుటూరులో ఎ.గోకవరం పంచాయతీ పాలకవర్గ సభ్యులు, రెవెన్యూ ఉద్యోగులు తహసిల్దార్ కార్యాలయం వద్ద రిలే దీక్ష చేపట్టారు. జంగారెడ్డిగూడెంలో ఉద్యోగులు మోకాళ్లపై నడిచారు. నరసాపురం నియోజకవర్గ గౌడ సేవా సంఘం సభ్యులు కుటుంబాలతో కలిసి భారీ ర్యాలీ నిర్వహించారు. దర్గా సెంటర్ నుంచి ప్రకాశం రోడ్డు మీదుగా ర్యాలీ సాగింది. నరసాపురం సమైక్య జేఏసీ ఆధ్వర్యంలో ఖాళీ బిందెలు, పచ్చగడ్డి దుబ్బులతో మహిళలు ప్రదర్శన జరిపారు. నరసాపురం బార్ అసోసియేషన్‌కు చెందిన 45 మంది న్యాయవాదులు తాము ప్రాతినిధ్యం వహిస్తున్న రాజకీయ పార్టీలకు రాజీనామా చేశారు. కేంద్ర మం త్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు కూడా రాజీనామాలు చేసి ఉద్యమంలోకి రావాలని డిమాండ్ చేశారు. టి.నరసాపురం మండలం మక్కినవారిగూడెంలో ఉపాధ్యాయులు 24 గంటల పల్లె మేలుకొలుపు దీక్ష చేపట్టారు. విజయవాడ సదస్సుకు ఎన్జీవోలు విజయవాడ స్వరాజ్య మైదానంలో శుక్రవారం సాయంత్రం నిర్వహించిన ‘సేవ్ ఆంధ్రప్రదేశ్’ సదస్సుకు జిల్లానుంచి ఎన్జీవోలు పెద్దఎత్తున తరలివెళ్లారు. ఏలూరు, పాలకొల్లు, భీమవరం, నరసాపురం, నిడదవోలు, కొవ్వూరు, తణుకు, తాడేపల్లిగూడెం పట్టణాలతోపాటు మండల ప్రధాన కేంద్రాల నుంచి 50 వాహనాల్లో విజయవాడ పయనమయ్యూరు. వైసీపీ మండల కన్వీనర్ల ఆమరణ దీక్ష గోపాలపురంలో గోపాలపురం, ద్వారకాతిరుమల, దేవరపల్లి మండలాల వైసీపీ కన్వీనర్లు గెడా జగదీష్, ముల్లంగి శ్రీనివాసరెడ్డి, బుసన బోయిన సత్యనారాయణ శుక్రవారం ఆమరణ నిరాహార దీక్ష చేపట్టారు. తాడేపల్లిగూడెం నియోజకవర్గ పార్టీ సమన్వయకర్త తోట గోపి చేపట్టిన పాదయూత్ర మూడో రోజుకు చేరింది. పోలీస్ ఐలండ్ సెంటర్లో పార్టీ ఆధ్వర్యంలో చేపట్టిన రిలే దీక్షలు కొనసాగుతున్నారుు. వీరవాసరంలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో చేపట్టిన రిలే దీక్షలు 32వ రోజుకు చేరుకున్నాయి. నరసాపురంలో నిర్వహిస్తున్న రిలే దీక్షలు 30వ రోజకు చేరాయి. హైదరాబాద్‌లో వైఎస్సార్ సీపీ ప్రజాప్రతినిధుల అక్రమ అరెస్ట్‌కు నిరసనగా చింతలపూడిలో పార్టీ నాయకులు, కార్యకర్తలు రాస్తారోకో నిర్వహించారు. -
కాంగ్రెస్ ఒంటరి పోరాటం
సాక్షి, తిరుపతి:సమైక్య ఉద్యమంలో కాంగ్రెస్ ఒంటరి పోరాటం చేస్తోంది. జిల్లాలో చిత్తూరు మినహా మిగిలిన ప్రాంతాల్లో కాంగ్రెస్ పార్టీ సమైక్య ఉద్యమంలో ఇతర సంఘాలు, యూనియన్లతో కలిసి పనిచేసే పరిస్థితులు లేవు. చిత్తూరులో ఎమ్మెల్యే సీకే.బాబు ఆధ్వర్యంలో సంఘాలు కలిసి పనిచేస్తున్నాయి. ఇతర నియోజకవర్గాల్లో విభజన ప్రకటన మీ పార్టీ వల్లే వచ్చిందని అంటే ఏం స మాధానం చెప్పాలో తెలియక ఎమ్మెల్యేలు, నియోజకవర్గ ఇన్‌చార్జ్‌లు సంకటస్థితిలో ఉన్నారు. డీసీసీ అధ్యక్షుడు అమాస రాజశేఖర్‌రెడ్డి కూడా శిబిరాల వద్దకు వెళ్లి ఆందోళన చేస్తున్న వారికి మద్దతుగా మాట్లాడి రావడం మినహా సొంతంగా ఆందోళన కా ర్యక్రమాలు నిర్వహించడం లేదు. జిల్లాలో సమైక్య ఉద్యమం ప్రారంభమై 50 రోజులు దాటినా కాంగ్రెస్ అంటరాని పార్టీలాగా మారింది. ఏ ఉద్యమ శిబిరం వద్దకూ కాంగ్రెస్ నాయకులను ప్రజలు రానివ్వడం లేదు. తిరుపతి నియోజకవర్గంలో మాజీ ఎమ్మెల్యే వెంకటరమణ తన అనుచరులను కొందరిని వెంటేసుకుని టౌన్‌బ్యాంక్ అధ్యక్షుడు పులుగోరు మురళి ఆధ్వర్యంలో రెం డు రోజులుగా కేంద్ర ప్రభుత్వ కార్యాలయాలను మూయిస్తూ హడావుడి చేస్తున్నారు. సొంతంగా టెంట్ వేసి దీక్ష శిబిరం నిర్వహించేందుకు జనం రాకపోవడంతో నగరంలో ఇప్పటికే వెలసిన దీక్షా శిబిరాల వద్దకు వెళ్లి కాలక్షేపం చేస్తున్నారు. వైఎస్ఆర్ సీపీ తొలి రోజు నుంచి నగరంలో ప్రత్యేకంగా శిబిరం ఏర్పాటు చేసి రోజూ ఆందోళనలు సాగిస్తోంది. చంద్రగిరి నియోజకవర్గానికి ప్రాతినిథ్యం వహిస్తున్న మంత్రి గల్లా అరుణకుమారి ప్రారంభం లో ఆర్భాటంగా తిరుపతిలో అమరరాజా ఫ్యాక్టరీ ఉద్యోగులతో ర్యాలీ చేయించి, ఆ తర్వాత చేతులేత్తేశారు. ఇప్పటివరకు జిల్లా ఉద్యమాల్లో ఎక్కడా ఆమె ప్రత్యక్షంగా పాల్గొనలేదు. నియోజకవర్గంలో ప్రజలు, ప్రజాసంఘాలు స్వచ్ఛందంగా ఉద్యమాలు నడుపుకుంటున్నారు. పీలేరు నియోజకవర్గంలో సీఎం తమ్ముడు గా నీ, కాంగ్రెస్ పార్టీ నాయకులు గానీ ఉద్యమాలు నిర్వహించే ప రిస్థితి లేదు. మదనపల్లెలో ఎమ్మెల్యే షాజహాన్ బాషా మొదట్లో హడావుడి చేసినా ప్రజల చీత్కారంతో పక్కకు తప్పుకున్నారు. కుప్పం నియోజకవర్గంలోనూ కాంగ్రెస్ నాయకులు సొంతంగా ఉద్యమం చేయలేని పరిస్థితి నెలకొంది. పుంగనూరు నియోజకవర్గంలో కాంగ్రెస్‌కు ఇద్దరు ఇన్‌చార్జ్‌లు కావడం, వారు ఎప్పుడు వస్తారో ఎప్పుడు వెళ్తారో తెలియని స్థితి ఉండడంతో పార్టీ కార్యకర్తలు ఉద్యమం చేయడం లేదు. పలమనేరు నియోజకవర్గంలో ఎమ్మెల్సీ రెడ్డెప్పరెడ్డి హడావుడి చేయాలని చూసినా ప్రజల మద్దతు లేకపోవడంతో కొద్దికాలానికే కాంగ్రెస్ శిబిరం చల్లబడింది. నగరి నియోజకవర్గంలోనూ ఇదే పరిస్థితి. మాజీ మం త్రి చెంగారెడ్డి, అయన అనుచరులు ప్రత్యక్ష ఉద్యమాల్లో ఎక్కడా తిరగడం లేదు. పుత్తూరులోనూ ఇతర పార్టీలు చేసినంత జో రుగా కాంగ్రెస్ నాయకులు ప్రజల్లోకి వెళ్లలేకపోతున్నారు. సత్యవేడు నియోజకవర్గంలో కాంగ్రెస్ ఇన్చార్జి ఊసేలేదు. ఇక్కడ నాయకులు ఎవరికి వారు తమకెందుకులే అనుకుంటున్నారు. ఎమ్మెల్సీ జయచంద్రనాయుడు ఉన్నా ఆయన ఏనాడు ఉద్యమాల కోసం రోడ్డెక్కలేదు. తంబళ్లపల్లె నియోజకవర్గంలోనూ ఇదే పరిస్థితి. -
పదిరోజుల్లో సానుకూల నిర్ణయం వస్తుంది
పర్చూరు, న్యూస్‌లైన్: సమైక్యాంధ్ర విషయంలో కేంద్ర ప్రభుత్వం నుంచి మరో పదిరోజుల్లో సానుకూల నిర్ణయం వస్తుందని ఆశిస్తున్నట్లు ఏపీ సెక్రటేరియట్ ఎంప్లాయీస్ యూనియన్ అధ్యక్షుడు ఉప్పుటూరి మురళీకృష్ణ తెలిపారు. శనివారం ప్రకాశం జిల్లా పర్చూరు వచ్చిన ఆయన విలేకరులతో మాట్లాడారు. ఇప్పటికే కేంద్ర మంత్రులతో పాటు ప్రతిపక్ష నేతలైన సుష్మా స్వరాజ్, ఎల్కే అద్వానీ, టీడీపీ ఎంపీలతో సీమాంధ్ర ఎంప్లాయీస్ ప్రతినిధి బృందం చర్చలు జరిపిందన్నారు. కేంద్రంపై మరింత ఒత్తిడి పెంచేందుకు 300 మంది సెక్రటేరియట్ ఉద్యోగులతో న్యూఢిల్లీలోని జంతర్‌మంతర్ వద్ద ధర్నా నిర్వహిస్తామన్నారు. బీజేపీ చిన్నరాష్ట్రాలకు అనుకూలంగా ఉన్నప్పటికీ సీమాంధ్ర అభివృద్ధికి స్పష్టమైన హామీ కోరతామని ఆ పార్టీ జాతీయ నేత వెంకయ్యనాయుడు చెప్పారన్నారు. ఆమోదయోగ్యమైన ప్రకటన వెలువడేవరకు ఉద్యమాన్ని కొనసాగిస్తామన్నారు. -
కర్నూలులో భారీ బహిరంగ సభ
కర్నూలు(విద్య)/ కల్లూరు రూరల్, న్యూస్‌లైన్: రాష్ట్ర విభజన నిర్ణయంపై మహిళాలోకం కన్నెర్ర జేసింది. సమైక్యాంధ్ర కోసం రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళన చేస్తున్నా కేంద్రం దిగిరాకపోవడంతో వారి కడుపు మండింది. యూపీఏ చైర్పర్సన్ సోనియాగాంధీ కళ్లు తెరిపించాలంటే మహిళలే సమర నినాదం చేయాలని నిర్ణయించుకున్నారు. ఈ మేరకు జిల్లా విద్యాసంస్థల జేఏసీ సహకారంతో కొండారెడ్డి బురుజు సాక్షిగా తెలుగుతల్లి విగ్రహం వద్ద గురువారం మహిళా గర్జన పేరుతో భారీ సభను ఏర్పాటు చేశారు. మహిళా జేఏసీ ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ కార్యక్రమానికి నగరంలోని పలు విద్యాసంస్థల అధ్యాపకులు, విద్యార్థినులతోపాటు ప్రభుత్వ, ప్రైవేటు సంస్థల ఉద్యోగినులు, సాధారణ మహిళలు వేల సంఖ్యలో హాజరయ్యారు. తెలుగుతల్లి విగ్రహానికి పూలమాలలతో అలంకరించి రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచాలని వారు కోరుకున్నారు. సమాఖ్య అధ్యక్షురాలు శౌరీలురెడ్డి అధ్యక్షతన నిర్వహించిన ఈ కార్యక్రమంలో రాష్ట్ర విభజన అంశంపై తమదైన శైలిలో పలువురు మహిళలలు ప్రసంగించారు. శ్రీ కృష్ణ కమిటీ ఇచ్చిన నివేదికను సమాధి చేసి కేంద్రం రాష్ట్ర విభజనకు బరి తెగించిందని పంచాయతీరాజ్ శాఖ ఉద్యోగిణి అనురాధ మండిపడ్డారు. శ్రీ కృష్ణ కమిటీ నివేదికను పక్కన పెట్టి ఇప్పుడు ఆంటోని కమిటీ అంటూ కొత్త పల్లవి పాడుతోందని విమర్శించారు. మన హక్కులను కాపాడుకునేందుకే ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినట్లు వాసవి మహిళా ప్రిన్సిపాల్ పార్వతీదేవి చెప్పారు. రాజకీయ నిరుద్యోగుల కారణంగానే రాష్ట్ర విభజనకు బీజం పడిందని రిటైర్డ్ డిప్యూటీ కలెక్టర్ సాయికుమారి మండిపడ్డారు. ఆకట్టుకున్న సత్యవాణి ప్రసంగం: భారతీయ సంస్కృతి, సాంప్రదాయాలను మేళవిస్తూ, మహాభారతం, మహాభాగవతంలోని అంశాలను నేటి పరిస్థితులకు అనుగుణంగా పోలుస్తూ భారతీయ సంస్కృతి పరిరక్షణ వేదిక అధ్యక్షురాలు సత్యవాణి చేసిన ప్రసంగం ఆద్యంతం ఆకట్టుకుంది. భాషాప్రయుక్త రాష్ట్ర తొలిరాజధాని అయిన కర్నూలులోని కొండారెడ్డి బురుజు వద్ద తనను ప్రసంగించాలని కోరడంతో ఆనందబాష్పాలు రాల్చానని చెప్పారు. ఈ ప్రాంతానికి చెందిన జి. పుల్లారెడ్డి తనను మానస పుత్రికగా అభిమానించేవారని గుర్తు చేసుకున్నారు. ఈరోజు ఇంతమంది మహిళలు ఉద్యమానికి నడుం బిగించారంటే సీమాంధ్ర ప్రాంతానికి జరిగిన అన్యాయమే కారణమన్నారు. స్త్రీ అంటే సకార, తకార, రకారాలతో కూడిన ఆదిశక్తి అని, ఆమె ఉగ్రరూపం దాలిస్తే తట్టుకునే శక్తి ఎవ్వరికీ ఉండదని హెచ్చరించారు. అంతకుముందు మున్సిపల్ హైస్కూలు వద్ద నుంచి భారీ ర్యాలీ నిర్వహించారు. కార్యక్రమంలో జేఏసీ కార్యదర్శి స్వర్ణలత(మాంటిస్సోరి), ఉపాధ్యక్షురాలు జి.ఆర్.రజనీపాల్(ఎస్టీబీసీ), అనురాధ (పంచాయతీరాజ్), మాధవీలత (శ్రీలక్ష్మి), పార్వతీ (వాసవీ), న్యాయవాది నాగలక్ష్మిదేవి, కె.చెన్నయ్య, కట్టమంచి రామలింగారెడ్డి, జి.పుల్లయ్యలతో పాటు వివిధ కళాశాలల విద్యార్థినులు, అధ్యాపకురాళ్లు, ఉద్యోగినులు, మహిళాసంఘాలు, ప్రజాసంఘాల నాయకురాళ్లు పాల్గొన్నారు. -
అలుపెరగని పోరు
సమైక్యాంధ్ర పరిరక్షణ కోసం జిల్లాలో అలుపెరగని పోరు కొనసాగుతోంది. ఒకపక్క హైదరాబాదులో ఏపీ ఎన్జీవోల సభ విజయవంతమవగా, దానికి మద్దతుగా జిల్లాలో ఆందోళనలు ఉధృతంగా సాగాయి. హోమాలు, మానవహారాలు, ధర్నాలు, వినూత్న నిరసనలు చేపట్టారు. సమైక్యాంధ్ర పరిరక్షణే తమ లక్ష్యమంటూ నినాదాలతో హోరెత్తించారు. జిల్లాలో చేపట్టిన రిలేదీక్షలు శనివారం కూడా కొనసాగాయి. అన్ని వర్గాల ప్రజలూ ఆందోళనలో భాగస్వాములయ్యారు. సాక్షి , విజయవాడ : ఏపీ ఎన్జీవోలు రాజధానిలో నిర్వహించిన సేవ్ ఆంధ్రప్రదేశ్ సభకు మద్దతుగా జిల్లావ్యాప్తంగా ప్రదర్శనలు, ధర్నాలు, రిలే దీక్షలు జరిగాయి. సభ విజయవంతం కావాలంటూ విజయవాడ దుర్గగుడిలో శాంతి హోమం నిర్వహించారు. దుర్గగుడి అర్చకులు దుర్గఘాట్‌లో ప్రదర్శన నిర్వహించి, యాగం చేశారు. శాంతియుతంగా సభ కోసం వెళ్తున్న ఉద్యోగులపై పలుచోట్ల రాళ్లతో దాడి, బస్సుల టైర్లలో గాలి తీయడం, చెప్పులు విసరడం, నల్లజెండాలతో నిరసన వంటి అనాగరిక చర్యలను జిల్లాలోని సమైక్యవాదులు ముక్తకంఠంతో ఖండించారు. సమైక్యంగా ఉంచాలని గణేష్ పూజలు.. తెలుగుజాతి అంతా సమైక్యంగా ఉండాలని, ప్రజలంతా ప్రాంతీయ భేదాలు లేకుండా అన్నదమ్ముల్లా కలిసిమెలిసి సుఖసంతోషాలతో జీవించాలని ఆకాంక్షిస్తూ మచిలీపట్నంలో శివగంగకు చెందిన స్వాతి హైస్కూల్ విద్యార్థులు వినాయకుడిని పూజించారు. జేఏసీ ఆధ్వర్యంలో స్థానిక కోనేరుసెంటరులో ఏర్పాటుచేసిన దీక్షలో హైనీ ప్రాథమిక, ఉన్నత పాఠశాల ఉపాధ్యాయులు, సిబ్బంది, గుండుపాలెం కాంప్లెక్స్ పాఠశాలలోని ఉపాధ్యాయులు, గూడూరు మండల పాఠశాలల ఉపాధ్యాయులు పాల్గొన్నారు. నూజివీడులో జేఏసీ ఆధ్వర్యంలో మాజీ సైనికోద్యోగులు రిలేదీక్ష చేపట్టారు. హైకోర్టులో సీమాంధ్ర న్యాయవాదులపై దాడికి నిరసనగా పెద్ద గాంధీబొమ్మ సెంటర్లో లాయర్లు ధర్నా చేశారు. నూజివీడులో వైఎస్సార్సీపీ నాయకుల రిలేదీక్షలు 12వ రోజుకు చేరాయి. మైలవరంలో ఐకేపీ ఆధ్వర్యంలో డ్వాక్రా మహిళలు ర్యాలీ జరిపారు. అనంతరం మైలవరం తెలుగుతల్లి సెంటర్లో మానవ హార ం ఏర్పాటుచేసి, కబడ్డీ ఆడి నిరసన వ్యక్తం చేశారు. కైకలూరు తాలూకా సెంటర్లో ఎన్జీవో దీక్షలకు మద్దతుగా విద్యార్థులు రోడ్డుపై ముగ్గులు వేశారు. కలిదిండిలో జేఏసీ నాయకులు చంద్రబాబు దిష్టిబొమ్మను దహనం చేశారు. ముదినేపల్లి మండలం వడాలి విద్యార్థులు రోడ్డుపై వంటావార్పూ జరిపారు. పామర్రు శ్రీఅరుణోదయ డీఎస్ఆర్ పబ్లిక్ స్కూల్ విద్యార్థులు మానవహారంగా ఏర్పడి ట్రాఫిక్‌ను స్తంభింపజేశారు. గన్నవరంలో శ్రీశ్రీనివాస కళాశాల విద్యార్థులతో కలిసి జేఏసీ నాయకులు జాతీయ రహదారిపై మానవహారం నిర్మించారు. సుమారు 200 అడుగుల జాతీయ పతాకంతో విద్యార్థులు జరిపిన ఈ ప్రదర్శన ప్రధాన ఆకర్షణగా నిలిచింది. చల్లపల్లిలో జేఏసీ నాయకులు రాష్ట్ర విభజనకు వ్యతిరేకంగా వినూత్న నిరసన చేశారు. చెవిలో పూలు, నోటిలో అరటిపండ్లతో నిరసన తెలిపారు. రాష్ట్ర విభజన ఒకరికి భోజనంగా, మరొకరికి చెవిలో పూలలా ఉందని విమర్శించారు. నాగాయలంకలో రైతు, విద్యార్థి, మహిళా గర్జన సభ నిర్వహించారు. కేంద్రానికి మంచి బుద్ధి ప్రసాదించాలని.. కేంద్ర ప్రభుత్వానికి మంచి బుద్ధి ప్రసాదించి రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచాలని కోరుతూ మోపిదేవి శ్రీసుబ్రహ్మణ్యేశ్వరస్వామివారి దేవస్థానం ఎదుట వైఎస్సార్ సీపీ నాయకులు ఒంటికాలితో నిరసన తెలిపారు. అవనిగడ్డలో లారీ యజమానులు లారీలతో ర్యాలీ నిర్వహించి, పులిగడ్డ వద్ద జాతీయ రహదారిపై రాస్తారోకో చేశారు. పామర్రు మండలం ఉరుటూరులో పంచాయతీ పాలకవర్గ సభ్యులు, గ్రామస్తులు రిలేదీక్షల్లో పాల్గొన్నారు. జేఏసీ నేతృత్వంలో ఉయ్యూరులో రిలే దీక్షల్లో కేసీపీ ఉద్యోగులు పాల్గొన్నారు. శ్రీశ్రీనివాసా విద్యాసంస్థల విద్యార్థులు విభజన నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ ప్రధాన సెంటరులో మానవహారం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో వైఎస్సార్ సీపీ పెనమలూరు నియోజకవర్గ సమన్వయకర్త తాతినేని పద్మావతి పాల్గొన్నారు. మండల ఉపాధ్యాయులు పోరంకిలో బందరు రోడ్డుపై ధర్నా చేశారు. మండలంలోని దాదాపు 150 మంది ఉపాధ్యాయులు పెనమలూరు నుంచి పోరంకి వద్దకు ర్యాలీగా వచ్చారు. అనంతరం వారు పోరంకిలో బందరు రోడ్డుపై ధర్నా చేశారు. పెడనలో వీవీఆర్ ఆధ్వర్యంలో సమైక్యాంధ్రకు మద్దతుగా రిలే దీక్ష జరిగింది. వీరంకిలాకులో చేపట్టిన రిలే దీక్షలు 13 రోజుకు చేరాయి. చాట్రాయి మండలం చనుబండలో ఐకాస ఆధ్వర్యంలో మోకాళ్లపై నిలుచుని నిరసన తెలిపారు. జోరున వర్షం కురుస్తున్నా లెక్కచేయక ముఖానికి నల్లరిబ్బన్లు కట్టుకుని ఆందోళన చేశారు. వైఎస్సార్సీపీ ఆధ్వర్యంలో నూజివీడు పట్టణంలోని జంక్షన్ రోడ్డులో నిర్వహిస్తున్న రిలేదీక్షలు శనివారం నాటికి 12వ రోజుకు చేరాయి. ఈ దీక్షలను యువజన విభాగం నాయకులైన పిళ్లా చరణ్, సందీప్ ప్రారంభించారు. నందిగామ బార్ అసోసియేషన్ ఆధ్వర్యంలో న్యాయవాదులు పట్టణంలో ర్యాలీ నిర్వహించారు. గాంధీ సెంటర్లో కార్లను తుడిచి నిరసన తెలిపారు. గాంధీ సెంటర్లోని పొట్టి శ్రీరాములు విగ్రహానికి ఉపాధ్యాయ నాయకులు క్షీరాభిషేకం చేశారు. స్థానిక ఎన్టీటీపీఎస్ మెయిన్ గేట్ ఎదుట విద్యుత్ ఉద్యోగులు నిర్వహిస్తున్న రిలే దీక్షలు ఆరో రోజుకు చేరాయి. -
జీతాల్లేవ్.. జీవనమెలా?
సాక్షి, మచిలీపట్నం : సమైక్యాంధ్ర కోసం సమరశంఖం పూరించిన ఉద్యోగులకు ఆగస్టు మాసం పెను సంక్షోభాన్ని తెచ్చిపెట్టింది. ఉద్యమ బాట పట్టిన ఉద్యోగులకు ఒక నెల జీతాలు ఆగిపోయాయి. ‘జీతాలు లేక జీవితాలు గడిపేది ఎలా’ అంటూ ఆవేదన వ్యక్తం చేస్తూనే ఉద్యమ స్ఫూర్తిని కొనసాగిస్తున్నారు. ‘పస్తులైనా ఉంటాం.. ఉద్యమాన్ని వీడేది లేదు’ అని మొక్కవోని ధైర్యంతో చెబుతున్నారు. జిల్లాలోని ఖజానా (ట్రెజరీ) శాఖకు చెందిన 18 సబ్ ట్రెజరీల్లోని 175 మంది ఉద్యోగులు గత నెల 12వ తేదీ అర్ధరాత్రి నుంచి సమ్మెబాట పట్టిన సంగతి తెలిసిందే. అదేరోజు నుంచి జిల్లాలోని విజయవాడ నగరంతో పాటు అన్ని ప్రాంతాలకు చెందిన 135 ప్రభుత్వ శాఖల ఉద్యోగులు సైతం సమ్మెబాట పట్టారు. ట్రెజరీల్లో స్తంభించిన కార్యకలాపాలు.. మచిలీపట్నంలోని ట్రెజరీ ప్రధాన కార్యాలయంతో పాటు జిల్లాలోని 18 సబ్‌ట్రెజరీ కార్యాలయాల్లో కార్యకలాపాలు పూర్తిగా స్తంభించాయి. ఉద్యోగుల వేతనాల బిల్లులు, పంచాయతీ, మున్సిపాలిటీలతో పాటు జిల్లాలోని పలు అభివృద్ధి పనులకు అవసరమైన బిల్లుల చెల్లింపునకు ట్రెజరీ శాఖ ఆమోద ముద్ర తప్పనిసరి కావడం ఇబ్బందికరంగా మారింది. జిల్లాలోని అత్యవసర, అభివృద్ధి పనులకు బిల్లుల చెల్లింపు జాప్యం చేసినా అంత ఒత్తిడి లేదు. అత్యవసర పనులు, బిల్లుల మాట ఎలా ఉన్నా ఉద్యోగుల జీతాల బిల్లులు సైతం మంజూరు కాలేదు. ఈసారి ట్రెజరీ ఉద్యోగులు సైతం సమ్మెబాట పట్టడంతో జిల్లాలోని ప్రభుత్వ ఉద్యోగ, ఉపాధ్యాయులకు దాదాపు రూ.85 కోట్ల మేర జీతాల బిల్లులు నిలిచిపోయాయి. ఫలితంగా వేలాది మంది ఉద్యోగ కుటుంబాల వారు తీవ్ర ఇబ్బందులు పడాల్సి వస్తోంది. నెలాఖరున వచ్చే జీతంపై ఆశపెట్టుకుని.. కారు, ఇల్లు, విద్య, వ్యక్తిగత రుణాలు చెల్లించుకునేలా అప్పులు చేస్తారు. వాటిని వాయిదా సమయానికి చెల్లించకపోతే వడ్డీ భారం పెరిగే ప్రమాదం ఉంది. ఇది చాలదన్నట్టు ఇంటి అద్దెలు, నెలవారీ పచారీ, ఇతర ఖర్చులు తప్పవు. ఆగస్టు జీతాలు రాకపోవడంతో ఉద్యోగులు సైతం అప్పులపాలుకాక తప్పని దుస్థితి నెలకొంది. జిల్లాలోని పోలీసులు మాత్రం తెలంగాణ ప్రాంతానికి చెందిన ఖమ్మం జిల్లాలో జీతాల బిల్లులు చేయించుకోవడం చర్చనీయాంశమైంది. -
రగులుతున్న పోరు
సాక్షి, విజయవాడ : సమైక్య ఆందోళనలు రోజురోజుకీ ఉధృత రూపం దాలుస్తున్నాయి. ఈ నెల ఏడున హైదరాబాద్‌లో జరిగే సమైక్య గర్జనను విజయవంతం చేసేందుకు ఏపీ ఎన్జీవోలు నడుం కట్టారు. దీనిలో భాగంగా ఉద్యమాన్ని ఉధృతం చేయాలని ఉద్యోగ సంఘాలు నిర్ణయించాయి. ఏపీ ఎన్జీవోలు రామవరప్పాడు రింగ్‌లో మానవహారం నిర్వహించారు. జగ్జీవన్‌రామ్ విగ్రహం వద్ద తమ నిరసన వ్యక్తంచేశారు. సుమారు 45 నిమిషాల పాటు సాగిన ఈ నిరసన కార్యక్రమంతో భారీగా ట్రాఫిక్ నిలిపోయింది. పాలిటెక్నిక్ లెక్చరర్ల జేఏసీ ఆధ్వర్యంలో ఐదు నుంచి పూర్తి స్థాయిలో సమ్మెలోకి వెళ్లాలని నిర్ణయించారు. జిల్లా కేంద్ర సహకార బ్యాంకు, సహకార శాఖ ఆధ్వర్యంలో మచిలీపట్నంలో వేలాది మంది ర్యాలీ నిర్వహించారు. లక్ష్మీటాకీసు సెంటరు నుంచి ప్రారంభమైన ఈ ర్యాలీ కోనేరుసెంటరుకు చేరుకుంది. ఈ ర్యాలీని కేడీసీసీ బ్యాంకు చైర్మన్ పిన్నమనేని వెంకటేశ్వరరావు ప్రారంభించారు. జగ్గయ్యపేట, పెనుగంచిప్రోలు మండలాలలో జేఏసీ ఆధ్వర్యంలో చేపట్టిన రిలే దీక్షలు కొనసాగుతున్నాయి. జేఏసీ ఆధ్వర్యంలో భిక్షాటన కార్యక్రమం నిర్వహించి దున్నపోతుకు వినతిపత్రం సమర్పించారు. వైఎస్సార్ సీపీ జిల్లా కన్వీనర్ సామినేని ఉదయభాను టీ అమ్ముతూ నిరసన వ్యక్తం చేశారు. మైలవరంలోని విజయవాడ బస్టాప్ వద్ద ఎన్జీఓ, ఆర్టీసీ, ఉపాధ్యాయ జేఏసీ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న రిలే దీక్షలు నాలుగో రోజుకు చేరాయి. జి.కొండూరులో ఉపాధ్యాయ జేఏసీ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న రిలే దీక్షలో వికలాంగులు కూర్చుని సంఘీభావం తెలిపారు. ఉపాధ్యాయులు నోటికి నల్లరిబ్బన్లు కట్టుకుని నిరసన ప్రదర్శన నిర్వహించారు. వీటీపీఎస్ సిబ్బంది పెన్‌డౌన్.. వీటీపీఎస్ వద్ద కార్మికులు, సిబ్బంది పెన్‌డౌన్ కార్యక్రమం నిర్వహించి నిరసన తెలియజేశారు. తిరువూరులో ఆర్టీసీ కార్మికులు, పశుసంవర్థకశాఖ ఉద్యోగులు, కోర్టు ఉద్యోగులు, ఎన్జీవో జేఏసీల ఆధ్వర్యంలో కేంద్ర ప్రభుత్వ మొండివైఖరిని నిరసిస్తూ కార్యక్రమాలు చేపట్టారు. రోడ్డుపై అల్పాహారం వండి పంపిణీ చేశారు. కైకలూరు వైఎస్సార్ సీపీ కార్యాలయం వద్ద సమన్వయకర్త దూలం నాగేశ్వరరావు ఆధ్వర్యంలో సాగుతున్న రిలే దీక్షలు 27వ రోజుకు చేరాయి. తాలూకా సెంటర్ వద్ద ఉన్నత పాఠశాల ఉపాధ్యాయులు రిలే దీక్షలు చేపట్టారు. వీరి ఆధ్వర్యంలో వంటావార్పు జరిగింది. ఉపాధ్యాయులు రోడ్డు మీద పాఠాలు చెప్పారు. ముదినేపల్లిలో జేఏసీ ఆధ్వర్యంలో ఉపాధ్యాయులు 36 గంటలు రిలే దీక్షలు చేపట్టారు. వీరికి 1500 మంది విద్యార్థులు మద్దతు తెలుపుతూ సహస్ర గళ ఘోష చేపట్టారు. చిగురుకోటలో దళితపేట గ్రామస్తులు సమైక్యాంధ్రకు మద్దతుగా రోడ్డుపై ధర్నా చేపట్టారు. కైకలూరు వైఎస్సార్ సీపీ కార్యాలయం వద్ద సమన్వయకర్త దూలం నాగేశ్వరరావు ఆధ్వర్యంలో సాగుతున్న రిలే దీక్షలు 27వ రోజుకు చేరాయి. గుడివాడలో 72 గంటల బంద్ ప్రారంభం.. గుడివాడలో జేఏసీ 72 గంటల బంద్‌కు పిలుపునివ్వటంతో వ్యాపార సంస్థలు, కార్యాలయాలను మూసివేశారు. స్థానిక నెహ్రూ చౌక్ సెంటర్లో జేఏసీ ఆధ్వర్యంలో దీక్షలు కొనసాగుతున్నాయి. స్థానిక బస్టాండ్ వద్ద ఆర్టీసీ జేఏసీ ఆధ్వర్యంలో నాయకుడు దారం ఏడుకొండలు ఆమరణ నిరాహార దీక్షకు దిగారు. ఆయనకు మద్దతుగా ఆర్టీసీ కార్మికులు సుమారు 50 మంది రిలే దీక్షలో పాల్గొన్నారు. ఐఎంఏ ఆధ్వర్యంలో వినూత్నంగా నిరసన తెలుపుతూ దీక్షాధారులకు బీ-కాంప్లెక్సు టాబ్లెట్లు పంపిణీ చేశారు. గుడ్లవల్లేరులో జేఏసీ ఆధ్వర్యంలో ఉద్యోగులు రిలేదీక్షలు చేశారు. పాలిటెక్నిక్ కాలేజీ సిబ్బంది పంచాయతీ మంచినీటి చెరువు వద్ద ఉన్న బాపూజీ మందిరంలో రిలేదీక్షలకు కూర్చున్నారు. పామర్రులో జరుగుతున్న రిలేదీక్షలలో వృద్ధులు పాల్గొన్నారు. పామర్రు హైస్కూల్ విద్యార్థులు, గవర్నమెంట్ కాలేజీ విద్యార్థులు నాలుగురోడ్ల కూడలిలో మానవహారం ఏర్పాటుచేసి ట్రాఫిక్ స్తంభింపచేశారు. విజయవాడలో నేడు వైద్యగర్జన.. మరోవైపు వైద్యులు విజయవాడలో వైద్య గర్జన నిర్వహించనున్నారు. మంగళవారం వైద్యసేవలు నిలిపివేయాలని నిర్ణయించారు. మున్సిపల్, దుర్గగుడి ఉద్యోగుల దీక్షలు కొనసాగాయి. విద్యార్థి జేఏసీ ఆధ్వర్యంలో దున్నపోతు మీద వాన పడుతున్నట్లుగా నిరసన చేపట్టారు. -
విశ్వరూపం
సాక్షి, అనంతపురం : సమైక్యాంధ్ర పరిరక్షణ కోసం ప్రతి ఊరూ ఉద్యమ పథంలో సాగుతోంది. ప్రతి వాడలోనూ సమైక్య నినాదం మార్మోగుతూనే ఉంది. 32వ రోజైన శనివారం కూడా జిల్లాలో ఉద్యమం ఉధృతంగా కొనసాగింది. అనంతపురం నగరంలో పత్రికా రవాణా వాహనాలతో భారీ ప్రదర్శన నిర్వహించారు. తహశీల్దార్ కార్యాలయం ఎదుట రిలే దీక్షలు కొనసాగుతున్నాయి. ఇక్కడే వంటా వార్పు చేపట్టారు. రెవెన్యూ ఉద్యోగుల రిలే దీక్షలకు జిల్లా గెజిటెడ్ అధికారుల సంఘం అధ్యక్షుడు హేమసాగర్, కార్యదర్శి తిమ్మప్ప తదితరులు సంఘీభావం తెలిపారు. ఇదే శిబిరంలో కవులు, అటవీశాఖ ఉద్యోగులు, ప్రభుత్వ డ్రైవర్లు రిలే దీక్షలు చేపట్టారు. టవర్‌క్లాక్ సర్కిల్లో సమైక్యాంధ్ర పరిరక్షణ సమితి ఆధ్వర్యంలో కోగటం విజయభాస్కర్‌రెడ్డి చేపట్టిన ఆమరణ దీక్ష రెండో రోజూ కొనసాగింది. మెడికల్ జేఏసీ నాయకుల దీక్షలకు ఎన్జీఓ సంఘం జిల్లా అధ్యక్షుడు దేవరాజు సంఘీభావం తెలిపారు. జేఎన్టీయూలో ఉద్యోగులు చేపట్టిన రిలే దీక్షలు పదకొండో రోజూ కొనసాగాయి. పంచాయతీరాజ్ ఉద్యోగులు, న్యాయవాదులు, ముస్లిం యువకులు నగరంలో బైక్ ర్యాలీ నిర్వహించారు. టీచర్లు చెవిలో పూలు పెట్టుకుని ‘సోనియమ్మా... నీ భరతం పడతాం’ అంటూ భజన చేసుకుంటూ అర్ధనగ్న ప్రదర్శన చేశారు. రిటైర్డ్ పోలీసు అధికారులు, ఉద్యోగుల ఆధ్వర్యంలో ర్యాలీ నిర్వహించారు. మంత్రులు ఎక్కడ దాక్కున్నారంటూ పశుసంవర్ధకశాఖ ఉద్యోగులు డాగ్‌స్క్వాడ్, టార్చిలైట్లతో వెతికి, నిరసన తెలిపారు. ఎస్కేయూలో విద్యార్థుల రిలే దీక్షలు 31వ రోజుకు చేరుకున్నాయి. ఈ దీక్షలకు ధర్మవరం పట్టణానికి చెందిన న్యాయవాదులు మద్దతు తెలిపారు. ఎస్కేయూ మహిళా ఉద్యోగులు జాతీయ రహదారిపై ముగ్గులు వేసి నిరసన తెలిపారు. ధర్మవరంలో జేఏసీ రిలేదీక్షలు కొనసాగుతున్నాయి. ప్రజాసంఘాల ఆధ్వర్యంలో పెద్దఎత్తున ప్రదర్శన నిర్వహించారు. బత్తలపల్లిలో జేఏసీ, ముదిగుబ్బలో టీచర్ల రిలే దీక్షలు కొనసాగుతున్నాయి. ముదిగుబ్బలో పాత్రికేయులు రిలే దీక్షలు చేపట్టారు. గుంతకల్లులో విద్యుత్ ఉద్యోగులు సామూహిక నిరాహార దీక్షలకు దిగారు. న్యాయవాదులు, ప్రభుత్వ ఉద్యోగుల జేఏసీ, వైఎస్సార్సీపీ, టీడీపీ, కాంగ్రెస్ ఆధ్వర్యంలో రిలే దీక్షలు కొనసాగుతున్నాయి. గుత్తిలో ముస్లింలు భారీ ప్రదర్శన నిర్వహించి, రోడ్డుపై ప్రార్థన చేశారు. హిందూపురంలో ప్రైవేటు విద్యాసంస్థల ఆధ్వర్యంలో చిన్నారులు, విద్యార్థులు జాతీయ నాయకుల వేషధారణలో ప్రదర్శన చేశారు. మంత్రులు, ఎంపీలకు పదవులే ముఖ్యమని విమర్శిస్తూ ఉపాధ్యాయులు కుర్చీలతో ప్రదర్శన చేపట్టారు. విశాలాంధ్ర పరిరక్షణ సమితి, ఎన్జీఓలు ,విద్యుత్ జేఏసీ ఆధ్వర్యంలో ర్యాలీలు చేశారు. చిలమత్తూరులో పంచాయతీ కార్మికులు రిలేదీక్షలు చేపట్టారు. లేపాక్షిలో సమైక్యవాదులు ర్యాలీ చేశారు. కదిరిలోని అంబేద్కర్ కూడలిలో జెడ్పీహెచ్ఎస్ ఉపాధ్యాయులు రిలే దీక్షలు చేపట్టారు. తలుపులలో ఉపాధ్యాయులు రోడ్లు శుభ్రం చేస్తూ నిరసన తెలిపారు. ఎన్పీకుంటలో సమైక్యవాదులు కొవ్వొత్తుల ప్రద ర్శన నిర్వహించారు. కళ్యాణదుర్గం, పుట్టపర్తి, పుట్లూరులో జేఏసీ నాయకులు, మడకశిరలో వైద్య,ఆరోగ్యశాఖ ఉద్యోగులు, పెనుకొండలో చేనేతలు, గోరంట్లలో ట్రాన్స్‌కో ఉద్యోగులు, గార్లదిన్నెలో రిక్షావాలాలు, నార్పలలో సమైక్యవాదులు ర్యాలీలు నిర్వహించారు. అమరాపురంలో తోపుడుబండ్ల వ్యాపారులు ర్యాలీ చేశారు. ఉపాధ్యాయులు చెవిలో పూలుపెట్టుకుని నిరసన ప్రదర్శన నిర్వహించారు. బుక్కపట్నంలో వాల్మీకి సంఘం ఆధ్వర్యంలో భారీ ర్యాలీ, రోడ్డుపై వంటా వార్పు చేపట్టారు. ఓడీచెరువులో ఉపాధ్యాయులు మోకాళ్లపై నడిచి నిరసన తెలిపారు. అమడగూరులో రిలే దీక్షలు చేపట్టారు. రాయదుర్గంలో జాక్టో ఆధ్వర్యంలో పార్టీ కార్యాలయాలను ముట్టడించారు. కాంగ్రెస్, టీడీపీ ప్రజాప్రతినిధులు దొంగ రాజీనామాలు చేశారంటూ చెవిలో పూలుపెట్టుకుని నిరసన తెలిపారు. మధ్యాహ్న భోజన ఏజెన్సీ నిర్వాహకులు, విద్యార్థి జేఏసీ, అరబిక్ కళాశాల, ప్రైవేటు బస్సుల కండక్టర్లు ఆధ్వర్యంలో రిలేదీక్షలు చేపట్టారు. విద్యుత్ ఉద్యోగులు సైకిళ్లపై ర్యాలీ నిర్వహించారు. కణేకల్లులో నలుగురు వైఎస్సార్సీపీ కార్యకర్తలు రిలే దీక్షలు చేపట్టారు. ఎన్జీఓలు గంజి పంపిణీ చేసి నిరసన తెలిపారు. 48 గంటల నిరాహార దీక్ష చేపట్టిన డిగ్రీ విద్యార్థి రాజేష్‌కు మాజీ ఎమ్మెల్యే పాటిల్ వేణుగోపాల్‌రెడ్డి నిమ్మరసం ఇచ్చి విరమింపజేశారు. ఆత్మకూరులో రైతులు ఎడ్లబండ్ల ర్యాలీ నిర్వహించారు. సీకేపల్లెలో మాదిగలు దండోరా కార్యక్రమం నిర్వహించారు. శింగనమలలో రిలేదీక్షలు కొనసాగుతున్నాయి. తాడిపత్రి మునిసిపల్ కార్యాలయం ఎదుట జేఏసీ రిలేదీక్షలు కొనసాగుతున్నాయి. పెద్దపప్పూరులోని ఆలయాల్లో పూజలు, మసీదుల్లో ప్రార్థనలు చేశారు. ఉరవకొండలో సమైక్యవాదులు ప్రదర్శనలతో హోరెత్తించారు. -
వైఎస్సార్ సీపీ నేతల దీక్ష భగ్నం
చోడవరం, న్యూస్‌లైన్: సమైక్యాంధ్ర ఉద్యమంలో భాగంగా వైఎస్సార్ సీపీ అధ్యక్షుడు వై.ఎస్.జగన్ మోహన్‌రెడ్డి దీక్షకు మద్దతుగా ఆ పార్టీ నాయకు లు చేస్తున్న నిరవధిక దీక్షను పోలీసులు భగ్నం చేశారు. దీక్ష చేస్తున్న ఆ పార్టీ నియోజకవర్గ ఎన్నికల పరిశీలకుడు పి.వి.ఎస్. ఎన్.రాజు తో పాటు మాజీ ఎంపీటీసీ సభ్యుడు ఎం.ముత్యాలనాయుడు, రోలుగుం ట మాజీ వైస్ ఎంపీపీ యర్రంశెట్టి శ్రీనివాసరావు చేపట్టిన దీక్ష శుక్రవారం నాలుగో రోజుకు చేరుకుంది. మధ్యాహ్నం ఒంటి గంట సమయంలో స్థానిక ప్రభుత్వ ఆస్పత్రి వైద్యాధికారి డాక్టర్ శ్రీనివాసరావు వీరికి వైద్య పరీక్షలు నిర్వహించారు. బీపీ, సుగర్ లెవెల్స్ బాగా తగ్గిపోవడంతో పరిస్థితి ఆందోళనకరంగా ఉందని వెంటనే వైద్యం అందించాలని చెప్పా రు. దీంతో సీఐ ఎ.విశ్వేశ్వరరావు, ఎస్ఐ శ్రీనివాసరావుల ఆధ్వర్యంలో భారీ సంఖ్యలో పోలీసు బలగాలు ఒక్కసారిగా దీక్షా శిబిరాన్ని చుట్టుము ట్టాయి. ఆరోగ్య సమస్య ఉత్పన్నమైనందున వెంటనే దీక్ష నిలిపివేయాలని దీక్షల్లో పాల్గొన్న వారిని సీఐ కోరారు. వారు నిరాకరించడంతో వైఎస్సార్ సీపీ శ్రేణుల నిరసనల మధ్య బలవంతంగా 108 అంబులెన్స్‌లో ఆస్పత్రికి తరలించారు. పోలీసు అధికారులు వారికి బలవంతంగా వైద్యం చేయించి, నిమ్మరసం తాగించి దీక్షను విరమింపజేశారు.యలమంచిలి నియోజకవర్గ వైఎస్సార్ సీపీ సమన్వయకర్త ప్రగడ నాగేశ్వరరావు అక్కడకు చేరుకుని వారి ఆరోగ్య పరిస్థితిని సమీక్షించారు. బార్ అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి, న్యాయవాది కాండ్రేగుల డేవిడ్, చిమ్మినాయుడు తదితరులు వారిని పరామర్శించారు. తెలిపారు. -
అలుపెరుగని పోరు
జిల్లాలో సమైక్యాంధ్ర ఉద్యమం అలుపెరుగకుండా కొనసాగుతూనే ఉంది. ఉద్యమం ప్రారంభమై నెల రోజులు గడచినా అందరిలోనూ అదే ఆత్మ విశ్వాసం, దృఢసంకల్పం తొణికిసలాడుతోంది.సమైక్యాంధ్ర ప్రకటన వెలువడే వరకూ ఎన్ని కష్టాలు ఎదురైనా వెనకడుగు వేసేది లేదంటూ ముక్తకంఠంతో నినదిస్తున్నారు. సాక్షి, కడప : సమైక్యాంధ్ర ఉద్యమం రోజురోజుకు కొత్త పుంతలు తొక్కుతోంది. ఈ ఉద్యమం ప్రారంభమై 30 రోజులు అయినప్పటికీ కడప బిడ్డలు మొక్కవోని పట్టుదల, అకుంఠిత దీక్షతో ఉద్యమాన్ని నడిపిస్తున్నారు. జిల్లాలో ఎక్కడికక్కడ ప్రదర్శనలు, ర్యాలీలు, మానవహారాలు, ఆందోళనలతో నిరసనలతో హోరెత్తిస్తున్నారు. సమ్మెతో ప్రభుత్వ కార్యాలయాలు దాదాపు మూతపడ్డాయి. ఆర్టీసీ బస్సులన్నీ డిపోలకే పరిమితమయ్యాయి. ఉద్యోగులకు జీతాలు రావని తెలిసినా... సామాన్యునికి ఎన్ని కష్టాలు ఎదురైనా ఎవరూ బాధపడటం లేదు. కేంద్ర ప్రభుత్వం నిర్ణయం వెనక్కి తీసుకునే వరకు పోరు ఆగదని ముక్తకంఠంతో హెచ్చరిస్తున్నారు. కడపలో వైఎస్సార్ సీపీ నేతలు దుగ్గాయపల్లె మల్లికార్జునరెడ్డి, భూపేష్‌రెడ్డి, అఫ్జల్ఖాన్, కిశోర్‌కుమార్‌లు చేపట్టిన ఆమరణ నిరాహార దీక్ష గురువారంతో 4వ రోజు పూర్తయింది. వీరి దీక్షలకు జిల్లా నలుమూలలనుంచి పెద్ద ఎత్తున ప్రజలు తరలి వచ్చి సంఘీభావం తెలిపారు. ఉపాధ్యాయులు, ఉద్యోగులు వినూత్నరీతిలో తెల్లపంచెలు, ధోవతి, కండువాలతో, మహిళా ఉపాధ్యాయులు ఎరుపు రంగు చీరెలతో జెడ్పీ కార్యాలయం నుంచి కలెక్టరేట్ వరకు భారీ ర్యాలీని నిర్వహించారు. స్టాంపు రైటర్లు, వెండర్లు నగరంలో భారీ ర్యాలీని నిర్వహించారు. సుండుపల్లె, గాలివీడు, వీరబల్లిలకు చెందిన రెవెన్యూ ఉద్యోగులు, సిబ్బంది స్టేట్ గెస్ట్‌హౌస్ నుంచి కలెక్టరేట్ వరకు భారీ ర్యాలీని నిర్వహించారు. టీడీపీ నాయకులు అమీర్‌బాబు, రెడ్యం వెంకట సుబ్బారెడ్డి, సురేష్‌నాయుడు దీక్షలు కొనసాగుతున్నాయి. జమ్మలమడుగులో తోపుడుబండ్ల వ్యాపారులు పట్టణంలో భారీ ర్యాలీని నిర్వహించి వంటా వార్పు చేపట్టారు. ఆర్టీపీపీలో విద్యుత్ కార్మికులను పోలీసులు అరెస్టు చేయడాన్ని నిరసిస్తూ రెండు వేల మందికి పైగా కలమల్ల పోలీసుస్టేషన్‌ను ముట్టడించారు. ప్రొద్దుటూరులో ఎన్జీఓలు అర్ధనగ్న ప్రదర్శన చేపట్టి పుట్టపర్తి సర్కిల్లో మానవహారంగా ఏర్పడ్డారు. తెలుగుభాషా పండితులు రిలే దీక్షల్లో కూర్చొన్నారు. వ్యాయామ ఉపాధ్యాయులు రోడ్లపైనే క్రీడలు ఆడుతూ నిరసన తెలియజేశారు. భగత్‌సింగ్, విద్యాధరి పాఠశాలల విద్యార్థులు ర్యాలీ నిర్వహించారు. రైల్వేకోడూరులో అర్ధ లక్ష జన గళ గర్జన పేరుతో ఉద్యోగ, ఉపాధ్యాయ జేఏసీతోపాటు విద్యార్థులు, అన్ని వర్గాల ప్రజలు చేపట్టిన నిరసన ప్రదర్శనతో రైల్వేకోడూరు అట్టుడికింది. టోల్గేట్ సెంటర్ నుంచి బస్టాండు వరకు ర్యాలీని నిర్వహించారు. రాయచోటి పట్టణంలో సుమో యజమానులు, డ్రైవర్లు వాహనాలతో భారీ ర్యాలీని నిర్వహించారు. ఆర్టీసీ కార్మికులు విన్నూతంగా దున్నపోతులపై కేసీఆర్, సోనియా, దిగ్విజయ్‌సింగ్ పేర్లను రాసి పట్టణంలో ఊరేగించారు. ఉర్దూ ఉపాధ్యాయ, విద్యార్థులు ర్యాలీని చేపట్టారు. వీరు రిలే దీక్షలలో పాల్గొనడంతోపాటు విభజన నాటకం, కవి సమ్మెళనం వంటి సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించారు. న్యాయవాదుల రిలే దీక్షలు కొనసాగాయి. సంబేపల్లెలో మహిళలు కలశాలతో భారీ ర్యాలీని నిర్వహించారు. లక్కిరెడ్డిపల్లెలో క్రైస్తవ సోదరులు చర్చిలలో ప్రార్థనలు నిర్వహించారు. మైదుకూరులో పూర్వపు విద్యార్థులు, జిమ్‌సెంటర్ విద్యార్థులు, ఆర్టీసీ కార్మికులు భారీ ర్యాలీని నిర్వహించి మానవహారంగా ఏర్పడ్డారు. శ్రీకృష్ణ దేవరాయులు, పొట్టి శ్రీరాములు విగ్రహాలకు పాలాభిషేకం చేశారు. రాజంపేటలో రెవెన్యూ ఉద్యోగులు ఆర్డీఓ కార్యాలయం నుంచి తాళ్లపాక అన్నమాచార్య మందిరం వరకు భారీ ర్యాలీతో పాదయాత్ర చేపట్టారు. న్యాయవాదులు మోకాళ్లపై నడిచి నిరసన తెలియజేశారు. వీరబల్లిలో రజకులు రోడ్లపైనే ఇస్త్రీ చేసి నిరసన తెలిపారు. సుండుపల్లెలో నడిరోడ్డుపై వంటా వార్పు చేసి సమైక్య నినాదాలు చేశారు. సిద్దవటంలో రోడ్లపైనే 1500 మంది విద్యార్థులకు విద్యను బోధించారు. బద్వేలులో పలు సంఘాల ఆధ్వర్యంలో పట్టణంలో భారీ ర్యాలీని నిర్వహించారు. వంటా వార్పు చేపట్టారు. రోడ్డుపైనే మార్చ్ఫాస్ట్, ఆటలపోటీలు నిర్వహించారు. వార్డెన్ల రిలే దీక్షలు కొనసాగాయి. కాశినాయన మండలంలో స్థానిక తహశీల్దార్, ఎంపీడీఓతోపాటు ప్రజలు పెద్ద ఎత్తున ర్యాలీతోపాటు రాస్తారోకో నిర్వహించి వంటా వార్పు చేపట్టారు. పోరుమామిళ్లలో విద్యార్థులు భారీ ర్యాలీ నిర్వహించి మానవహారంగా ఏర్పడ్డారు. పులివెందులలో ఉద్యోగ, ఉపాధ్యాయ జేఏసీ ఆధ్వర్యంలో పట్టణంలో భారీ ర్యాలీని నిర్వహించారు. నల్లదుస్తులతో నిరసన తెలిపారు. విచిత్ర వేషధారణలతో ఆందోళనలు చేపట్టారు. కమలాపురంలో ఉపాధ్యాయుల రిలే దీక్షలు కొనసాగాయి. -
బాలచెన్నయ్య దీక్ష భగ్నం
గూడూరు, న్యూస్‌లైన్: సమైక్యాంధ్రకు మద్దతుగా వైస్సార్సీపీ అధినేత వైఎస్ జగన్ జైల్లో చేపట్టిన ఆమరణ దీక్షకు మద్దతుగా గూడూరులో జాతీయరహదారిపై పొటుపాళెం క్రాస్‌రోడ్డు వద్ద ఆ పార్టీ నియోజకవర్గ సమన్వయకర్త డాక్టర్ చెంతాటి బాలచెన్నయ్య, నాయకుడు శ్రీకిరెడ్డి భాస్కర్‌రెడ్డి నాలుగు రోజులు గా చేపట్టిన ఆమరణదీక్షను పోలీసులు గురువారం భగ్నం చేశారు. వైద్యులు వచ్చి వారిని పరీక్షించి పల్స్, సుగర్ స్థాయి పడిపోయినట్టు ధ్రువీకరించారు. రూరల్ సీఐ వేమారెడ్డి, ఎస్ఐలు నాగేశ్వరరావు, దశరథరామారావు, మారుతీకృష్ణ తమ సిబ్బందితో దీక్షా శిబిరం వద్దకు అంబులెన్స్‌ను తీసుకొచ్చారు. ఒక్కసారిగా బాలచెన్నయ్య, భాస్కర్‌రెడ్డిని అంబులెన్స్‌లోకి ఎక్కించారు. వైఎస్సార్సీపీ నాయకులు, కార్యకర్తలు అడ్డుకున్నారు. పోలీసులు వారిని బలవంతంగా నెట్టి గూడూరు ఏరియా ఆస్పత్రికి తరలించారు. పోలీసుల వైఖరిని నిరసిస్తూ వైఎస్సార్సీపీ నాయకులు, కార్యకర్తలు రాస్తారోకో నిర్వహించారు. జాతీయ రహదారిపై ట్రాఫిక్ నిలిచిపోయింది. బాలచెన్నయ్య, భాస్కర్‌రెడ్డికి బలవంతంగా చికిత్స అందించారు. అనంతరం వారిని నెల్లూరుకు తరలించారు. అంతకు ముందు బాలచెన్నయ్యకు వైఎస్సార్సీపీ నేత నేదురుమల్లి పద్మనాభరెడ్డి, దొరవారి సత్రం పీఏసీఎస్ అధ్యక్షుడు బాలచంద్రారెడ్డి సంఘీభావం తెలిపారు. -
మంత్రి రఘువీరా కనిపించడం లేదని ఫిర్యాదు
రాయదుర్గం,న్యూస్‌లైన్: సమైక్యాంధ్ర ఉద్యమం ఉవ్వెత్తున ఎగిసి పడుతున్నప్పటి నుంచి మంత్రి ఎన్.రఘువీరారెడ్డి కనిపించడం లేదని, ఆయన అచూకీ తెలపాలని ఉపాధ్యాయ జేఏసీ కన్వీనర్ రామాంజనేయులు, వెంకట్రామిరెడ్డి, తదితరులు బుధవారం పట్టణ ఎస్ఐ రాఘవరెడ్డికి ఫిర్యాదు చేశారు. సమైక్యాంధ్ర ఉద్యమాన్ని ముందుండి నడిపించాల్సిన మంత్రి, గత నెల 31 నుంచి కనిపించలేదని, దీంతో జిల్లా ప్రజలు తీవ్ర ఆందోళన చెందుతున్నారని పేర్కొన్నారు. దయ చేసి మంత్రి గారి ఆచూకీ కనుక్కోవాలని వారు ఎస్ఐను కోరారు. -
కలవరం...కలకలం...!
సాక్షి ప్రతినిధి, కడప: సమైక్యాంధ్ర ఉద్యమం ఉగ్రరూపం దాల్చడంతో అధికార కాంగ్రెస్, ప్రతిపక్ష తెలుగుదేశం నేతల్లో వణుకు పుడుతోంది. ప్రత్యేక తెలంగాణకు టీడీపీ అధినేత చంద్రబాబు లేఖ ఇవ్వడం... ఆ వెనువెంటనే యూపీఏ భాగస్వామ్య పక్షాలతో కాంగ్రెస్ అధిష్టానం చర్చించి రాష్ట్ర విభజనపై ప్రకటన చేయడాన్ని ప్రజానీకం జీర్ణించుకోలేక పోతున్నారు. ఆ రెండు పార్టీల నాయకులు పదవులకు, పార్టీలకు రాజీనామా చే శాకే ఉద్యమంలోకి రావాలనే డిమాండ్ ఊపందుకుంటోంది. స్పందించాల్సిన సమయంలో స్పందించకుండా నిమ్మకునీరెత్తినట్లు ఉండిపోయి...మొసలి కన్నీరు కారుస్తుండటంపై ఆగ్రహోదగ్రులవుతున్నారు. ఆ ఫలితమే మంత్రి అహ్మదుల్లా, 20సూత్రాల అమలు కమిటీ చెర్మైన్ తులసిరెడ్డిలపై ప్రత్యక్షదాడులుగా పలువురు వర్ణిస్తున్నారు. రాజకీయ నాటకాలపై ఆగ్రహం : సమైక్యవాదుల నిరసనల నుంచి తప్పించుకునేందుకు కాంగ్రెస్, టీడీపీ ప్రజాప్రతినిధులు రాజకీయ నాటకాలకు తెరలేపారు. కాంగ్రెస్ ఎమ్మెల్యేలలో జమ్మలమడుగు ఎమ్మెల్యే ఆదినారాయణరెడ్డి మినహా కమలాపురం ఎమ్మెల్యే వీరశివారెడ్డి, బద్వేలు ఎమ్మెల్యే కమలమ్మ, రాష్ట్ర విభజన అనంతరమే రాజీనామాల ప్రకటన చేశారు. అది కూడా ఉద్యమకారుల ఒత్తిడి ఫలితమేనని పలువురు పేర్కొంటున్నారు. మంత్రులు అహ్మదుల్లా, సి.రామచంద్రయ్య స్వగృహాలను పలుమార్లు ముట్టడించినా వారి నుంచి ఆశించిన మేర స్పందన లభించలేదని చెప్పవచ్చు. ఎమ్మెల్సీ బత్యాలను రాజీనామా చేయలేదని నిలదీసిన నేరానికి ప్రత్యక్ష దాడులకు సైతం ఎగబడ్డారు. కాంగ్రెస్ నేతల పరిస్థితి ఇలా ఉంటే టీడీపీ ఎమ్మెల్యే, ఎమ్మెల్సీ, ఎంపీ సైతం రాజీనామా నాటకానికే ప్రాధాన్యతనిచ్చారు. ఎమ్మెల్యే లింగారెడ్డిని ఉద్యమకారులు కాళ్లు పట్టుకొని అభ్యర్థించినా అధినేత చంద్రబాబును కాదని రాజీనామా చేసేందుకు వెనుకంజ వేశారు. ప్రస్తుతం వీరంతా రాజీనామా చేసినట్లు ప్రకటించినా వారి రాజీనామా లేఖలు ఇప్పటికీ స్పీకర్ కార్యాలయానికి చేరలేదని అక్కడి యంత్రాంగం స్పష్టం చేస్తోంది. ఈ పరిణామాన్ని ఉద్యమకారులు జీర్ణించుకోలేకపోతున్నారు. సమైక్యవాదుల ఒత్తిడి నుంచి తప్పించుకునేందుకు రాజీనామా నాటకానికి ప్రాధాన్యత ఇచ్చినట్లుగా పలువురు పేర్కొంటున్నారు. ఈ ప్రాంతానికి తీవ్రమైన అన్యాయం జరుగుతున్నా సకాలంలో స్పందించాల్సిన అధికార కాంగ్రెస్, ప్రతిపక్ష తెలుగుదేశం నేతలు దాగుడు మూతలు ఆడుతుండటాన్ని ప్రజానీకం జీర్ణించుకోలేకపోతున్నారు. తత్ఫలితంగా మంత్రి అహ్మదుల్లా, 20 సూత్రాల అమలు కమిటీ ఛెర్మైన్ తులసిరెడ్డిలపై చెప్పులు విసిరిన ఘటనలు ఉత్పన్నమయ్యాయని పరిశీలకులు అభిప్రాయపడుతున్నారు. జన నేత జగన్‌కు సంఘీభావం : రాష్ట్ర విభజనకు కాంగ్రెస్, టీడీపీలు కుట్రపన్నడాన్ని పసిగట్టిన వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యేలు ప్రజాభిప్రాయం మేరకు శాసనసభ సభ్యత్వాలకు స్పీకర్ ఫార్మాట్లో రాజీనామాలు చేశారు. వైఎస్ఆర్సీపీ గౌరవాధ్యక్షురాలు వైఎస్ విజయమ్మ, అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్రెడ్డి సైతం వారి పదవులకు రాజీనామా చేశారు. అనంతరం కాంగ్రెస్ అధిష్టానం తీరుకు నిరసనగా సమైక్యాంధ్ర డిమాండ్‌తో వైఎస్ విజయమ్మ ఆమరణ దీక్ష చేపట్టారు. ఆ దీక్షను పోలీసులు భగ్నం చేసిన అనంతరం కడప ఎంపీ, వైఎస్ఆర్సీపీ రాష్ట్ర అధ్యక్షుడు వైఎస్జగన్మోహన్రెడ్డి జైలులో ఉన్నా తెలుగు ప్రజల కోసం నిరవధిక నిరాహారదీక్ష చేపట్టారు. ప్రజా సంక్షేమమే తన అజెండాగా వైఎస్ జగన్మోహన్రెడ్డి దీక్ష చేపట్టినట్లు జనం ప్రశంసలు కురిపిస్తున్నారు. పార్టీలకతీతంగా రాజకీయ నేతలు, ఉద్యోగ, ఉపాధ్యాయ, కార్మిక, కర్షక, విద్యార్థి, ప్రజా సంఘాలు జగన్ దీక్షకు సంఘీభావం ప్రకటిస్తున్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో చిత్తశుద్ధి లోపించిన రాజకీయ నేతలకు ఉద్యమకారుల నుంచి ప్రతిఘటన తప్పడం లేదు. ప్రాంతం కోసం, ప్రజానీకం కోసం కాంగ్రెస్, టీడీపీలకు నాయకులు రాజీనామాలు చేయాలనే డిమాండ్ ఉధృతమవుతోంది. పరిస్థితి మరింత ఉద్రిక్తతలకు దారి తీయక ముందే ప్రజానీకమా...పార్టీలా అనే విషయాన్ని ఆ రెండు పార్టీల నాయకులు తేల్చుకోవాలని పలువురు డిమాండ్ చేస్తుండటం విశేషం. -
తులసిరెడ్డీ గో బ్యాక్
ప్రొద్దుటూరు కల్చరల్, న్యూస్‌లైన్: రాజీనామాను ఆమోదించుకుని సమైక్యాంధ్ర ఉద్యమంలో పాల్గొనాలని రాష్ట్ర 20 సూత్రాల అమలు కమిటీ చైర్మన్ తులసిరెడ్డిని జేఏసీ నాయకులు నిలదీశారు. వైఎస్సార్ జిల్లా ప్రొద్దుటూరు పట్టణంలోని పుట్టపర్తి సర్కిల్లో జేఏసీ ఆధ్వర్యంలో బుధవారం రాత్రి సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా తులసిరెడ్డి తన వాహనంలో ఆ ప్రాంతానికి చేరుకున్నారు. తులసిరెడ్డి సమైక్యవాదుల వద్దకు వచ్చి మాట్లాడేందుకు ప్రయత్నించారు. ఈ సందర్భంలో పదవులకు రాజీనామాలు చేయడం కాదని రాజీనామాలు ఆమోదించుకుని వచ్చి మాట్లాడాలని ప్రొద్దుటూరు జేఏసీ గౌరవాధ్యక్షుడు వంకదారి వీరభద్రయ్య, మాజీ కౌన్సిలర్ గరిశపాటి లక్ష్మిదేవిలు ప్రశ్నించారు. దీనికి తులసిరెడ్డి సమాధానం చెప్పేందుకు ప్రయత్నించగా వేదిక వద్ద ఉన్న ప్రజలు జై సమైక్యాంధ్ర అంటూ నినాదాలతో హోరెత్తించారు. ఈ సందర్భంలో తులసిరెడ్డి ప్రైవేటు విద్యా సంస్థల జేఏసీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన వేదికపైకి వచ్చి మాట్లాడేందుకు ప్రయత్నించగా అక్కడ కూడా ఆయనకు మాట్లాడేందుకు అవకాశం లభించలేదు. తాను సమైక్యవాదినేనని మొదటగా తన పదవికి రాజీనామా చేసింది తానేనని ఈ సందర్భంగా విలేకరులకు తెలిపారు. సమైక్యాంధ్రకే తాను కట్టుబడి ఉన్నానని చెప్పారు. ఇంతలో గుర్తు తెలియని వ్యక్తులు ఆయనపైకి చెప్పులు విసిరిరారు. దీంతో అక్కడ గందరగోళ పరిస్థితి ఏర్పడింది. తులసిరెడ్డి సెక్యూరిటీ ఆయనను కారులోకి ఎక్కించే ప్రయత్నం చేశారు. తులసిరెడ్డి కారుపైకి ఎక్కి ఆగ్రహం వ్యక్తం చేస్తూ తొడగొట్టి మీసం తిప్పుతూ సవాల్ విసిరారు. కాగా, తులసిరెడ్డిపై చెప్పులు విసిరిన సంఘటనను ఖండిస్తున్నట్లు ఎమ్మెల్సీ బచ్చల పుల్లయ్య, జేఏసీ గౌరవాధ్యక్షుడు వంకదారి వీరభద్రయ్య తెలిపారు. -
తిరుపతి , చిత్తూరు , సర్వం బంద్
సాక్షి, తిరుపతి: జిల్లాలోని తిరుపతి, చిత్తూరు నగరాలను బుధవారం సమైక్యవాదులు దిగ్బంధించారు. ద్విచక్ర వాహనాలు మినహా మరే వాహనాన్ని తిరగనివ్వలేదు. తిరుపతి శ్రీదేవి కాంప్లెక్స్‌లోని ఎల్ఐసీ కార్యాలయం అద్దాలను ధ్వంసం చేశారు. సమైక్యవాదుల పిలుపుమేరకు రెండు నగరాల్లో అన్నిరకాల దుకాణాలు, కార్యాలయాలు, విద్యాసంస్థలు స్వచ్ఛందంగా మూసివేసి సమైక్యాంధ్రకు మద్దతు ప్రకటించారు. చిత్తూరులో వినూత్న తరహాలో నిరసనలు తెలిపారు. పశుసంవర్ధక శాఖ ఆధ్వర్యంలో గాంధీ విగ్రహం చుట్టూ పాడి ఆవులతో నిరసన తెలిపారు. స్వచ్ఛంద బంద్ తిరుపతిలో స్వచ్ఛంద సంస్థలు, అన్ని ఉద్యోగ సంఘా ల ఐక్యకార్యాచరణ కమిటీ సభ్యులు నగరమంతా పర్యటిస్తూ సమైక్యాంధ్రకు మద్దతుగా బంద్‌కు సహకరించాలని ప్రజలను కోరారు. చిత్తూరులోనూ వివిధ జేఏసీల ఆధ్వర్యంలో విడివిడిగా వినూత్న తరహాలో ర్యాలీ నిర్వహించారు. తమిళనాడు, కర్ణాటక నుంచి వచ్చే వాహనాలను అడ్డుకున్నారు. విద్యార్థులు అతిపెద్ద జాతీయజెండాతో నగరంలో భారీ ప్రదర్శన చేశారు. తెలుగుతల్లి విగ్రహం చుట్టూ నిలబడి వందన సమర్పణ చేశారు. తిరుపతి కార్పొరేషన్ ఉద్యోగులు కేఎల్ వర్మ ఆధ్వర్యంలో కార్యాలయం ఎదుట నిరసన తెలియజేశారు. తిరుపతి కూరగాయల మార్కెట్ సంఘం అధ్యక్షుడు ముత్తూజ ఆధ్వర్యంలో కూరగాయలతో ప్రదర్శన చేశారు. తోపుడుబండ్ల వ్యాపారులు నగరంలో పలు వీధుల్లో భారీ ర్యాలీ చేశారు. విద్యార్థులు శ్రీకృష్ణుడు, గోపికల వేషధారణలో భారీ ర్యాలీగా కార్పొరేషన్ కార్యాలయానికి చేరుకుని కోలాటాలు వేసి నిరసన తెలిపారు. టౌన్‌బ్యాంకు పాలకవర్గం, ఉద్యోగులు సంయుక్తంగా రహదారిని దిగ్బంధించి కళాకారులతో ప్రదర్శన నిర్వహించారు. తిరుపతి పట్టణాభివృద్ధి సంస్థ ఉద్యోగులు నగరంలో భారీ బైక్‌ర్యాలీ నిర్వహించి నిరసన తెలిపారు. ఎంఆర్‌పల్లి కూడలిలో ఉట్టి కొట్టి నిరసన తెలిపారు. చిత్తూరులో సమైక్య గర్జన... చిత్తూరులో మత్స్యశాఖ ఆధ్వర్యంలో రోడ్డుపై వలలు విసిరి చేపలు పడుతున్నట్లుగా నిరసన తెలిపారు. సాంఘిక సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో ర్యాలీ నిర్వహించి రోడ్డుపై కబడ్డీ, చమ్మాచక్క ఆటలు ఆడారు. గాంధీ విగ్రహం వద్ద రక్తదాన శిబిరం ఏర్పాటు చేశారు. వ్యవసాయశాఖ మార్కెట్ యార్డు, ట్రాక్టర్ యజమానులు భారీ ర్యాలీలు నిర్వహించారు. ఉపాధ్యాయులు రోడ్లు శుభ్రం చేస్తూ నిరసన తెలిపారు. న్యాయవాదులు, కోర్టు సిబ్బంది పసుపు చీరలు కట్టుకుని రిలే నిరాహారదీక్ష చేశారు. జేఏసీ దీక్షా శిబిరంలో ఎమ్మెల్యే సీకేబాబు నిరసన తెలిపారు. శ్రీకాళహస్తిలో కదంతొక్కిన రైతులు శ్రీకాళహస్తిలో వందలాది మంది రైతులు అరటి చెట్లు, చెరుకు గడలు, వరి కంకులను చేతబట్టుకుని భారీ ర్యాలీ నిర్వహించారు. అనంతరం భిక్షాలగోపురం వద్ద మానవహారం చేపట్టారు. స్కిట్ కళాశాల సిబ్బంది రోడ్డుపై ఆటపాటలతో నిరసన తెలిపారు. చంద్రగిరి మండలం ఐతేపల్ల్లె వద్ద పొలిటికల్, సమైక్యాంధ్ర జేఏసీ ఆధ్వర్యంలో రోడ్డుపై గానాబజానా నిర్వహించారు. మదనపల్లెలో సాప్స్ నాయకుడు ఉత్తన్న ఆమరణ నిరాహారదీక్షకు పూనుకున్నారు. ఆర్టీసీ ఉద్యోగ, కార్మికులు బస్సులతో ర్యాలీ చేపట్టారు. పీలేరులో ఐసీడీఎస్ సిబ్బంది సుమారు 700 మంది మహిళలతో భారీ ర్యాలీ నిర్వహించారు. జీవీ శ్రీనాథరెడ్డి 48 గంటల దీక్ష కొనసాగింది. పుత్తూరులో ఉద్యోగ, ఉపాధ్యాయ, ఆర్టీసీ ఆధ్వర్యంలో రిలేదీక్షలు చేశారు. నగరిలో న్యాయవాదుల వంటావార్పు, ఉద్యోగ, ఉపాధ్యాయులు రిలేదీక్షలు చేశారు. పలమనేరులో చిత్తూరు ఎంపీ శివప్రసాద్ ర్యాలీ నిర్వహించారు. తంబళ్లపల్ల్లె నియోజకవర్గ పరిధిలోని అన్ని మండలాల్లో రిలేదీక్షలు కొనసాగాయి. పెనుమూరులో విద్యార్థులు ర్యాలీ నిర్వహించారు. ఎస్సార్‌పురం, కార్వేటినగరం, వెదురుకుప్పంలో విద్యార్థులు ర్యాలీలు, మానవహారాలు చేశారు. సత్యవేడులో సమైక్యవాదులు ఒక్కరోజు రిలే దీక్ష చేశారు. -
నలిగిపోతున్న నాయకులు
సాక్షి, మచిలీపట్నం : అధినాయకత్వానికి చెప్పుకోలేక.. సమైక్యానికి జైకొట్టలేక.. అటుఇటు కాని హృదయంతోటి కాంగ్రెస్, తెలుగుదేశం పార్టీల నేతలు నలిగిపోతున్నారు. విభజన చిచ్చుకు ఆ రెండు పార్టీలే ప్రధాన కారణమని జనం విశ్వసిస్తున్నారు. ఈ రెండు పార్టీల నేతలు ప్రాంతాలవారీగా విడిపోయి మాట్లాడడం, అధిష్ఠానాలు విభజన నిర్ణయానికి రావడంతో జిల్లాలో టీడీపీ, కాంగ్రెస్ నేతలను జనం పట్టించుకోవడంలేదు. సీడబ్ల్యూసీ విజభన నిర్ణయం ప్రకటించిన తర్వాత కాంగ్రెస్ వారు స్తబ్దుగా ఉండిపోవడం, టీడీపీ అధినేత చంద్రబాబు కొత్త రాజధానికోసం రూ.ఐదు లక్షల కోట్లు కావాలని ప్రకటించడం జనానికి తీవ్ర ఆగ్రహం కలిగించింది. ఇప్పుడు సమైక్యాంధ్ర ఆందోళనల్లో పాల్గొంటున్నా ఆ పార్టీల నేతల చిత్తశుద్ధిని జనం శంకిస్తున్నారు. విభజన నిర్ణయానికి వ్యతిరేకంగా జనం స్వచ్ఛందంగా బజారుల్లోకి వచ్చారు. ఈ దశలో వైఎస్సార్సీపీ సమైక్య సమర శంఖారావం పూరించింది. నిబద్ధత, చిత్తశుద్ధితో ఆందోళనలు, రాజీనామాలతోపాటు సమన్యాయం చేస్తారా లేక రాష్ట్రాన్ని యథాతథంగా ఉంచుతారా అంటూ వైఎస్ విజయమ్మ ఆమరణ దీక్ష చేపట్టారు. దాన్ని పోలీసులు, పాలకులు పాశవికంగా భగ్నంచేసిన వెంటనే చంచల్‌గూడ జైల్లోనే వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆమరణ దీక్ష చేపట్టారు. ఆ దీక్షకు సీమాంధ్ర దన్నుగా నిలిచింది. ఉద్యమం జనప్రభంజనమైంది. నియోజకవర్గాలవారీగా నిరసనలు, మానవహారాలు, రాస్తారోకోలు, ఆమరణ, రిలే దీక్షలు చేపడుతూ వైఎస్సార్సీపీ శ్రేణులు అధినేత జగన్ బాటలో సమరోత్సాహంతో కదులుతున్నాయి. నాన్ పొలిటికల్ జేఏసీ, ఉద్యోగ, ఉపాధ్యాయ సంఘాలు నిర్వహిస్తున్న ఉద్యమాల్లో కూడా వైఎస్సార్ సీపీ శ్రేణులు పాల్గొంటున్నాయి. ఆ సంఘాలు కూడా వైఎస్సార్సీపీ శ్రేణులు నిర్వహిస్తున్న ఆందోళనకు మద్దతుగా నిలుస్తున్నాయి. దీంతో సమైక్యాంధ్ర ఉద్యమం మొత్తంగా వైఎస్సార్సీపీ నిర్వహిస్తున్న పోరాటంగా మారిపోయింది. దీంతో కాంగ్రెస్ ప్రజాప్రతినిధులు ఏమి చేయాలో పాలుపోక గందరగోళానికి గురవుతుంటే, తెలుగుదేశం పార్టీ నేతలు తమ అధినేత వైఖరిని విమర్శించలేక, ప్రజల్లోకి వెళ్లి ఉద్యమాన్ని కొనసాగించలేక తలలు పట్టుకుంటున్నారు. మరోవైపు వైఎస్సార్సీపీ ఉద్యమ ప్రభంజనాన్ని ఎలా తట్టుకోవాలి.. తమ ఉనికి ఎలా నిలబెట్టుకోవాలి అనేది అర్థంగాక సతమతమవుతున్నారు. సమైక్య దీక్షాశిబిరాల వద్దకు సంఘీభావం తెలిపి ఫోటోలు తీయించుకుంటూ తాము కూడా ఉద్యమానికి మద్దతుగా నిలుస్తున్నామని చెప్పుకోవడానికి ఆ రెండు పార్టీల నేతలు పరిమితమవుతున్నారు. అంతేకాదు, వైఎస్సార్సీపీ ప్రభంజనాన్ని అడ్డుకోవడానికి కుట్రలు, కుయుక్తులతో దిగజారుడు రాజకీయాలకు పాల్పడుతున్నాయి. పెనమలూరు, మైలవరంలో పోటీ దీక్షలు.. సమైక్యవాదాన్ని బలంగా వినిపించడంలో విఫలమైన కాంగ్రెస్, టీడీపీలు.. వైఎస్సార్ సీపీ ప్రభంజనాన్ని అడ్డుకునేందుకు మాత్రం సర్వశక్తులు ఒడ్డుతున్నాయి. పెనమలూరు నియోజకవర్గంలోని ఉయ్యూరులో సుమారు 25 రోజులుగా నాన్ పొలిటికల్ జేఏసీ ఉద్యమంలో వైఎస్సార్ సీపీ పాలుపంచుకుంటోంది. వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆమరణ దీక్షకు మదతుగా పెనమలూరు నియోజకవర్గ ఆ పార్టీ సమన్వయకర్త పడమట సురేష్‌బాబు నేతృత్వంలో మంగళవారం నుంచి రిలే నిరాహారదీక్షలు చేపట్టారు. ఆ పార్టీకి ప్రజాదరణ వస్తుందన్న కంగారుతో ఉయ్యూరులోని అదే ప్రాంతంలో కాంగ్రెస్ ఒకటి, టీడీపీ రెండు రిలే నిరాహార దీక్షాశిబిరాలను బుధవారం హడావుడిగా ప్రారంభించాయి. రాజకీయాల కారణంగా సమైక్య ఉద్యమం దెబ్బతినకూడదని, నాన్ పొలిటికల్ జేఏసీ నాయకత్వంలోనే తాము కూడా పోరాటం చేస్తామని సురేష్‌బాబు ప్రకటించారు. ఆయన బుధవారం తన శిబిరాన్ని తొలగించి జేఏసీ టెంట్లోనే రిలే దీక్షలను కొనసాగించారు. కాంగ్రెస్, టీడీపీ మాత్రం తమ టెంట్లను అలాగే ఉంచి రిలే దీక్షలను కొనసాగించడం తీవ్ర విమర్శలకు గురైంది. పోరంకిలోనూ టీడీపీ పోటీ దీక్షలను కొనసాగించడంతో విమర్శలపాలవుతోంది. టీడీపీ జిల్లా అధ్యక్షుడు దేవినేని ఉమా ఎమ్మెల్యేగా నేతృత్వం వహిస్తున్న మైలవరం నియోజకవర్గంలో వైఎస్సార్సీపీ నాయకులు, తాజా మాజీ ఎమ్మెల్యే జోగి రమేష్, మాజీ ఎమ్మెల్యే జ్యేష్ఠ రమేష్‌బాబు తనయుడు శ్రీనాథ్‌లు గత నాలుగు రోజులుగా నిర్వహిస్తున్న ఆమరణ దీక్షకు ప్రజల నుంచి విశేష ఆదరణ లభిస్తోంది. దీంతో కంగారు పడిన ఉమా బలవంతంగా టీడీపీకి చెందిన ఇద్దరితో పోటీగా ఆమరణదీక్షను నిర్వహిస్తున్నారు. వచ్చే నెల రెండో తేదీ నుంచి జిల్లాలో సమైక్య యాత్ర చేస్తానని ఉమా ప్రకటించారు. ఇంతకుమించి సమైక్యాంధ్ర ఉద్యమంలో టీడీపీ పెద్దగా పాలుపంచుకున్నది లేకపోగా, కాంగ్రెస్ పూర్తిగా అంటీముట్టనట్టుగానే వ్యవహరిస్తోంది. -
కలవరం.. కలకలం
సాక్షి ప్రతినిధి, అనంతపురం : సమైక్యాంధ్ర ఉద్యమం మహోగ్రరూపం దాల్చడం అధికార కాంగ్రెస్, విపక్ష టీడీపీ నేతల వెన్నులో వణుకు పుట్టిస్తోంది. ప్రత్యేక తెలంగాణకు మద్దతుగా టీడీపీ అధినేత చంద్రబాబు కేంద్ర ప్రభుత్వానికి లేఖ ఇవ్వడం.. ఆ వెంటనే యూపీఏ పక్షాలు, కాంగ్రెస్ అధిష్టానం రాష్ట్ర విభజన ప్రకటన చేయడాన్ని ప్రజలు జీర్ణించుకోలేకపోతున్నారు. రాష్ట్ర విభజనకు కారణమైన కాంగ్రెస్, టీడీపీలపై జనం మండిపడుతున్నారు. కాంగ్రెస్, టీడీపీ ప్రజాప్రతినిధులను ఎక్కడికక్కడ అడ్డుకుంటోన్న సమైక్యవాదులు.. పదవులకు రాజీనామాలు చేసి, వాటిని ఆమోదించుకున్న తర్వాతే ఉద్యమంలోకి రావాలని అల్టిమేటం జారీ చేస్తున్నారు. ఈ నేపథ్యంలో జైల్లో ఉన్నా ప్రజాభిప్రాయానికి కట్టుబడి సమైక్యాంధ్ర నినాదంతో నిరవధిక నిరాహార దీక్ష చేపట్టిన వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్రెడ్డికి జనం ఉవ్వెత్తున సంఘీభావం ప్రకటిస్తున్నారు. ఇది కాంగ్రెస్, టీడీపీ శ్రేణుల్లో కలకలం రేపుతోంది. ఇరు పక్షాల నేతలను కలవరానికి గురిచేస్తోంది. రాష్ట్ర విభజనపై యూపీఏ పక్షాలు, కాంగ్రెస్ అధిష్టానం నిర్ణయం తీసుకోగానే అనంతపురంలో సమైక్యాంధ్ర ఉద్యమ కెరటం ఎగిసింది. సీమాంధ్రలో సమైక్యాంధ్ర ఉద్యమానికి ‘అనంత’ చుక్కానిలా నిలుస్తోంది. రాష్ట్ర విభజన నిర్ణయాన్ని కేంద్ర ప్రభుత్వం వెనక్కు తీసుకునే వరకూ ఎత్తిన పిడికిలి దించేది లేదని.. మడమ తిప్పకుండా ఉద్యమపథాన కదంతొక్కుతామని ‘అనంత’ ప్రజానీకం స్పష్టీకరిస్తోంది. అందుకు తార్కాణమే 28 రోజులుగా జిల్లా నలుమూలల ప్రతిధ్వనిస్తోన్న సమైక్యగర్జన. ఉద్యోగ, కార్మిక, విద్యార్థి, కర్షక, ప్రజాసంఘాలు, ప్రజలు స్వచ్ఛందంగా ఉద్యమంలో కదంతొక్కుతున్నారు. సమైక్యాంధ్ర ఉద్యమంలో నినదిస్తున్న ప్రజలు కాంగ్రెస్, టీడీపీ ప్రజాప్రతినిధులను ఎక్కడికక్కడ నిలదీస్తున్నారు. రాజీనామాల డ్రామాలు.. సమైక్యావాదుల నిరసనలను తప్పించుకునేందుకు కాంగ్రెస్, టీడీపీ ప్రజాప్రతినిధులు రాజీనామా డ్రామాలకు తెరతీశారు. టీడీపీ ఎమ్మెల్యేలు పయ్యావుల కేశవ్, పరిటాల సునీత, అబ్దుల్ఘనీ, కందికుంట వెంకటప్రసాద్, పల్లె రఘునాథరెడ్డి, బీకే పార్థసారధి శాసనసభ్యత్వాలకు రాజీనామా చేసినట్లు ప్రకటించారు. కానీ.. వారి రాజీనామా లేఖలు ఇప్పటికీ తమకు చేరలేదని స్పీకర్ కార్యాలయవర్గాలు స్పష్టీకరిస్తోండటం గమనార్హం. కాంగ్రెస్ ప్రజాప్రతినిధులదీ అదే తీరు. కాంగ్రెస్ ఎమ్మెల్యేలు కొట్రికే మధుసూదన్‌గుప్తా, జేసీ దివాకర్‌రెడ్డి, కె.సుధాకర్ శాసనసభ్యత్వాలకు రాజీనామా చేసినట్లు ప్రకటించారు. కానీ.. వారి రాజీనామా లేఖలు కూడా ఇప్పటిదాకా స్పీకర్ కార్యాలయానికి చేరలేదు. కేవలం సమైక్యవాదుల నిరసనల నుంచి తప్పించుకోవడానికి కాంగ్రెస్, టీడీపీ ప్రజాప్రతినిధులు రాజీనామాల డ్రామాలు ఆడినట్లు స్పష్టమవుతోంది. వీటిని పసిగట్టిన సమైక్యవాదులు చేసిన రాజీనామాలను ఆమోదించుకున్న తర్వాతనే ఉద్యమంలోకి రావాలని అల్టిమేటం జారీ చేస్తున్నారు. మంగళవారం కళ్యాణదుర్గంలో టీడీపీ ఎమ్మెల్యే పయ్యావుల కేశవ్‌కు సమైక్యవాదులు ఇదే రీతిలో నిరసన వ్యక్తం చేశారు. బీకే పార్థసారధి, పల్లె రఘునాథరెడ్డి, అబ్దుల్ఘనీ తదితరులకు కూడా ఇదే తరహాలో సమైక్యవాదులు స్పష్టం చేసిన విషయం విదితమే. ప్రజల నుంచి తీవ్రమైన ప్రతిఘటన ఎదుర్కోవాల్సి వస్తోండటాన్ని కాంగ్రెస్, టీడీపీ ప్రజాప్రతినిధులు జీర్ణించుకోలేకపోతున్నారు. కాంగ్రెస్ ఎమ్మెల్యేలు జేసీ దివాకర్‌రెడ్డి, కొట్రికే మధుసూదన్‌గుప్తా, ఎమ్మెల్సీ గుండుమల తిప్పేస్వామి రాయల తెలంగాణం చేస్తోండటంపై జనం మండిపడుతున్నారు. ఇది పసిగట్టిన టీడీపీ ఎమ్మెల్యే పయ్యావుల కేశవ్ బహిరంగంగా రాయల తెలంగాణ డిమాండ్‌ను చేయడానికి సాహసించడం లేదు. కానీ.. అంతర్గతంగా రాయల తెలంగాణను సమర్థిస్తోండటాన్ని పసిగట్టిన ప్రజలు ఆయనపై మండిపడుతున్నారు. జననేత జగన్‌కు సంఘీభావం.. రాష్ట్ర విభజనకు కాంగ్రెస్, టీడీపీలు కుట్రపన్నడాన్ని పసిగట్టన వైస్సార్సీపీ ఎమ్మెల్యేలు ప్రజాభిప్రాయం మేరకు శాసనసభ్యత్వాలకు రాజీనామా చేశారు. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ గౌరవాధ్యక్షురాలు వైఎస్ విజయమ్మ, అధినేత వైఎస్ జగన్మోహన్రెడ్డి శాసనసభ, లోక్‌సభ సభ్యత్వాలకు రాజీనామా చేశారు. కాంగ్రెస్ అధిష్టానం తీరుకు నిరసనగా.. సమైక్యాంధ్ర డిమాండ్‌తో వైఎస్ విజయమ్మ గుంటూరులో ఆమరణ దీక్ష చేపట్టారు. ఆ దీక్షను ఏడు రోజుల తర్వాత పోలీసులు భగ్నం చేశారు. ఆ వెంటనే వైఎస్సార్సీపీ అధినేత వైఎస్ జగన్మోహన్రెడ్డి జైల్లో ఉన్నా తెలుగు ప్రజలంతా కలిసి ఉండాలన్న లక్ష్యంతో నిరవధిక నిరాహార దీక్ష చేపట్టారు. జైల్లో ఉన్నా ప్రజాసంక్షేమమే పరమావధిగా జగన్ దీక్ష చేపట్టడంపై జనం ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. పార్టీలకు అతీతంగా రాజకీయ నేతలు, ఉద్యోగ, ఉపాధ్యాయ, కార్మిక, కర్షక, విద్యార్థి, ప్రజా సంఘాలు జగన్ దీక్షకు సంఘీభావం తెలుపుతున్నాయి. ఇది కాంగ్రెస్, టీడీపీ నేతలను ఆందోళనకు గురిచేస్తోంది. ధర్మవరం ఎమ్మెల్యే కేతిరెడ్డి వెంటకరామిరెడ్డి కాంగ్రెస్ పార్టీని వీడి.. జగన్‌కు జైకొట్టి వైఎస్సార్సీపీలో చేరడమే అందుకు తార్కాణం. -
మడమ తిప్పేది లేదు
ఒంగోలు టౌన్, న్యూస్‌లైన్: ర్యాలీలు..వంటా వార్పులు..రాస్తారోకోలు..రిలే దీక్షలు..అర్ధనగ్న ప్రదర్శనలు ఇలా ప్రతి ఒక్కరూ తమదైన శైలిలో సమైక్యాంధ్ర ఉద్యమాన్ని ఉధృతం చేస్తున్నారు. రాష్ట్ర విభజన నిర్ణయాన్ని వెనక్కి తీసుకునే వరకూ మడమ తిప్పబోమని, వెనక్కి తగ్గేది లేదని స్పష్టం చేస్తున్నారు. సోమవారం డ్వాక్రా మహిళలు, విద్యుత్ ఉద్యోగులు, లాయర్లు, విద్యార్థులు నగరంలో భారీ ప్రదర్శనలు నిర్వహించారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఇప్పటికైనా ప్రజాభీష్టాన్ని అర్థం చేసుకోవాలని, లేకుంటే తగిన గుణపాఠం చెబుతామని హెచ్చరించారు. డ్వాక్రా గ్రూపు మహిళల భారీ ప్రదర్శన సమైక్యాంధ్రకు మద్దతుగా నగర పాలక సంస్థ ఆధ్వర్యంలో డ్వాక్రా గ్రూపుల మహిళలు నగరంలో కదంతొక్కారు. సుమారు 1500 మంది మహిళలు, నగరపాలక సంస్థ సిబ్బంది నగరంలో భారీ ప్రదర్శన నిర్వహించారు. స్థానిక కార్పొరేషన్ కార్యాలయం నుంచి పొట్టి శ్రీరాములు విగ్రహం మీదుగా చర్చి సెంటర్ వరకు ప్రదర్శన సాగింది. అనంతరం చర్చి సెంటర్లో మానవహారం నిర్వహించి, చెమ్మచెక్క ఆట ఆడి వినూత్న రీతిలో నిరసన తెలిపారు. ఇప్పటికైనా కేంద్ర మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు రాజీనామాలు చేసి ఉద్యమంలోకి రావాలని డిమాండ్ చేశారు. విద్యుత్ ఉద్యోగుల జేఏసీ ఆధ్వర్యంలో వంటా-వార్పు విద్యుత్ ఉద్యోగులు స్థానిక ఎస్ఈ కార్యాలయం ఎదుట వంటా-వార్పు నిర్వహించారు. తొలుత ఎస్ఈ కార్యాలయం నుంచి కలెక్టరేట్ వరకు భారీ ర్యాలీ నిర్వహించి అక్కడ మానవహారం ఏర్పాటు చేశారు. అనంతరం కలెక్టరేట్ ఎదుట దీక్షలు చేస్తున్న ఉద్యోగులకు సంఘీభావం తెలిపారు. రాష్ట్రం విడిపోతే జల విద్యుత్ ప్రాజెక్టులకు నీటి కొరత ఏర్పడి రాష్ట్రం అంధకారంగా మారుతుందని ఇంజినీర్లు ఆందోళన వ్యక్తం చేశారు. కార్యక్రమంలో డీఈలు కే వెంకటేశ్వర్లు, టీ శ్రీనివాసరావు, జేఏసీ రాష్ట్ర కో-కన్వీనర్ ఎం హరిబాబు, జిల్లా చైర్మన్ జయాకరరావు, కన్వీనర్ టీ సాంబశివరావు, పిచ్చయ్య, మోహనరావు, సురేష్, తదితరులు పాల్గొన్నారు. కొనసాగుతున్న ఉద్యోగుల దీక్షలు స్థానిక కలెక్టరేట్ వద్ద ఉద్యోగుల సామూహిక రిలే దీక్షలు కొనసాగుతున్నాయి. దీక్షలో స్టేట్ ఆడిట్స్, ట్రెజరరీ, గ్రంథాలయ సంస్థ ఉద్యోగులు కూర్చొన్నారు. వీరికి జిల్లా అధికారుల సంఘం, ఎన్జీఓలు సంఘీభావం తెలిపారు. డీఆర్డీఏ పీడీ పద్మజ మాట్లాడుతూ అందరూ కలిసి హైదరాబాద్‌ను అభివృద్ధి చేశామని, ఇప్పుడు వెళ్లిపొమ్మంటే సీమాంధ్రుల పరిస్థితేమిటని ప్రశ్నించారు. ఇది కేవలం ఉద్యోగుల కోసం జరుగుతున్న ఉద్యమం కాదన్నారు. ప్రతి ఒక్కరూ ఉద్యమంలో భాగస్వాములవ్వాలని ఆమె కోరారు. కార్యక్రమంలో డీఆర్వో రాధాకృష్ణమూర్తి, ఎస్సీ కార్పొరేషన్ ఈడీ రాజు, ఎన్జీఓ నాయకులు అబ్దుల్‌బషీర్, రాజ్యలక్ష్మి, తదితరులు పాల్గొన్నారు. ఇక్రా ఓరియంటల్ చిన్నారుల ప్రదర్శన నగరంలోని ఇక్రా ఓరియంట్ స్కూల్ చిన్నారులు స్థానిక చర్చి సెంటర్లో ఆందోళన నిర్వహించారు. సోనియాగాంధీ వేషధారణలో ఉన్న చిన్నారి, కేసీఆర్ వేషధారణలో ఉన్న మరో చిన్నారికి సూట్‌కేసులో ప్యాకేజీలు అందించే దృశ్యాన్ని ప్రదర్శించారు. కేవలం రాజకీయ స్వార్థంతోనే రాష్ట్రాన్ని ముక్కలు చేస్తున్నారని మండిపడ్డారు. విద్యార్థి జేఏసీ వినూత్న నిరసన స్థానిక డీఆర్ఆర్ఎం మున్సిపల్ హైస్కూల్ గ్రౌండ్లో విద్యార్థి జేఏసీ నాయకులు క్రికెట్ ఆడి వినూత్న నిరసనకు దిగారు. బ్యాట్‌ను సమైక్యాంధ్రగా, బంతిని కేసీఆర్‌గా పోల్చి క్రికెట్ ఆడారు. నిరసన కార్యక్రమాన్ని ఎన్జీఓ నాయకులు అబ్దుల్‌బషీర్, బండి శ్రీనివాసరావు ప్రారంభించారు. హైదరాబాద్‌లో సీమాంధ్ర ఉద్యోగులపై తెలంగాణ ఉద్యోగుల దాడిని వారు తీవ్రంగా ఖండించారు. ఉద్యోగులకు ప్రజాప్రతినిధులు అండగా నిలవాలని వారు విజ్ఞప్తి చేశారు. కార్యక్రమంలో విద్యార్థి జేఏసీ, ఎన్జీఓ నాయకులు రాజ్యలక్ష్మి, క్రిష్ణారెడ్డి, స్వాములు, శరత్, అశోక్, మహేష్, తదితరులు పాల్గొన్నారు. -
సమైక్య ఉద్యమంలో రాజకీయ కోవర్టులు
సాక్షి ప్రతినిధి, అనంతపురం : సమైక్యాంధ్ర ఉద్యమంతో రాజకీయ మనుగడ ప్రశ్నార్థకమైందని ఆందోళన చెందుతోన్న కాంగ్రెస్, టీడీపీ ప్రజాప్రతినిధులు ఏకంగా ఆ మహోద్యమాన్ని నీరుగార్చేందుకు పూనుకున్నారు. ఓ వైపు ఉద్యమంలో పాల్గొంటూనే మరో వైపు కోవర్టుల అవతారం ఎత్తారు. సమైక్య ఉద్యమంలో చురుగ్గా పాల్గొంటున్న ఏపీ ఎన్జీవోలు, ఉపాధ్యాయ జేఏసీ, ఉద్యోగ, కార్మిక, కర్షక, ప్రజా సంఘాల నేతలను గుర్తించి.. ఆ సమాచారాన్ని పోలీసు ఉన్నతాధికారులకు చేరవేస్తున్నారు. ఆ నేతలను అదుపులోకి తీసుకుంటున్న పోలీసులు తమదైన శైలిలో రహస్యంగా కౌన్సెలింగ్ ఇస్తూ.. భయోత్పాతం సృష్టిస్తున్నారు. ఉద్యమంలో క్రియాశీలకంగా పాల్గొంటున్న నేతలను భయోత్పాతానికి గురిచేయడం ద్వారా మహోద్యమాన్ని నీరుగార్చాలన్న వారి ఎత్తుగడపై సర్వత్రా విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ఈ రెండు పార్టీలకూ తెలంగాణపై స్పష్టమైన వైఖరిని ప్రకటించిన మరో పార్టీ నేతలు కూడా తోడవడంపై సమైక్యవాదులు మండిపడుతున్నారు. రాష్ట్ర విభజనపై కాంగ్రెస్ అధిష్టానం, యూపీఏ పక్షాలు జూలై 30న ఆమోదముద్ర వేసిన తర్వాత జిల్లాలో సమైక్యాంధ్ర ఉద్యమం ఉవ్వెత్తున ఎగిసింది. టీడీపీ అధినేత చంద్రబాబు ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం ఏర్పాటుకు మద్దతుగా లేఖ ఇవ్వడం.. దాన్ని పరిగణనలోకి తీసుకునే కాంగ్రెస్ అధిష్టానం రాష్ట్ర విభజనపై ప్రకటన చేయడంతో ఆ రెండు పార్టీలపై సమైక్యవాదులు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. కాంగ్రెస్, టీడీపీలకు చెందిన ప్రజాప్రతినిధులను జిల్లాలో ఎక్కడికక్కడ సమైక్యవాదులు అడ్డుకోవడమే అందుకు తార్కాణం. సమైక్యాంధ్ర ఉద్యమం నానాటికీ బలోపేతమవుతుండటం కాంగ్రెస్, టీడీపీ నేతల వెన్నులో వణుకు పుట్టిస్తోంది. ఇది రాజకీయ మనుగడనే ప్రశ్నార్థకం చేస్తుందన్న కేంద్ర నిఘా వర్గాల నివేదిక కాంగ్రెస్, టీడీపీ నేతల కంటికి కునుకు లేకుండా చేస్తోంది. సమైక్యాంధ్ర ఉద్యమాన్ని నీరుగార్చితే కొంతైనా ప్రయోజనం ఉంటుందని ఇరు పక్షాల నేతలు భావిస్తున్నారు. ఇదే అభిప్రాయంతో ఉన్న కాంగ్రెస్ అధిష్టానం సమైక్యాంధ్ర ఉద్యమాన్ని అణచివేయాలని పోలీసు ఉన్నతాధికారులపై తీవ్ర స్థాయిలో ఒత్తిడి తెస్తోంది. ఆ ఒత్తిళ్ల వల్లే పోలీసు ఉన్నతాధికారులు సమైక్యవాదులపై ఉక్కుపాదం మోపుతున్నారు. ఎన్నడూలేని రీతిలో ఉద్యమకారులను బైండోవర్ చేస్తున్నారు. అక్రమ కేసులు బనాయిస్తున్నారు. బైండోవర్లు, అక్రమ కేసులతో ఉద్యమకారులను భయోత్పాతానికి గురి చేస్తున్నారు. ఈ క్రమంలోనే కాంగ్రెస్, టీడీపీలకు చెందిన కొందరు ప్రజాప్రతినిధులు, కీలక నేతలు సమైక్యాంధ్ర ఉద్యమంలో క్రియాశీలకంగా వ్యవహరించే ఏపీ ఎన్జీవోలు, ఉద్యోగ, ఉపాధ్యాయ, కార్మిక, కర్షక, ప్రజా సంఘాల నేతల గురించి పోలీసులకు ఉప్పందిస్తున్నారు. తద్వారా పోలీసులకు కోవర్టులుగా మారిపోయారు. ఉద్యమం చుట్టూ కుట్రలు.. అనంతపురంలో సమైక్యాంధ్రకు మద్దతుగా గత మంగళవారం లక్ష మంది విద్యార్థులతో భారీ ర్యాలీ నిర్వహించాలని ప్రైవేటు పాఠశాలల యాజమాన్యాల సంఘం నిర్ణయించింది. ఇది పసిగట్టిన టీడీపీకి చెందిన ఓ ప్రజాప్రతినిధి, తెలంగాణపై స్పష్టమైన వైఖరిని ప్రకటించిన ఓ పార్టీకి చెందిన కీలక నేత పోలీసులకు సమాచారాన్ని చేరవేశారు. ప్రైవేటు పాఠశాలల యాజమాన్యంలో కీలకంగా వ్యవహరిస్తోన్న ఎనిమిది మంది నేతల పేర్లను ఆ ఇద్దరు నేతలు పోలీసు ఉన్నతాధికారులకు చేర వేశారు. ర్యాలీ నిర్వహించడానికి సరిగ్గా 12 గంటల ముందు ఆ ఎనిమిది మంది నేతలనూ పోలీసులు అరెస్టు చేశారు. తద్వారా ప్రైవేటు పాఠశాలల యాజమాన్యాలను భయోత్పాతానికి గురిచేయాలని భావించారు. కానీ.. ఆ తాటాకు చప్పుళ్లకు ప్రైవేటు పాఠశాలల యాజమాన్యాలు బెదరలేదు. అనుకున్నట్లుగానే అనంతపురంలో భారీ ఎత్తున విద్యార్థులతో ర్యాలీ నిర్వహించారు. ఉపాధ్యాయ జేఏసీ నేతృత్వంలో 21 రోజులుగా అనంతపురంలో ఆర్డీవో కార్యాలయం ఎదుట రిలే నిరాహార దీక్షలు చేస్తున్నారు. ఈ జేఏసీలో కీలకంగా వ్యవహరిస్తోన్న ఇద్దరు నేతల పేర్లనూ కాంగ్రెస్ పార్టీకి చెందిన ఓ ప్రజాప్రతినిధి పోలీసు ఉన్నతాధికారులకు చేరవేశారు. ఇద్దరు నేతలను పోలీసు ఉన్నతాధికారి ఒకరు తీవ్ర స్థాయిలో బెదిరించినట్లు ఉపాధ్యాయ వర్గాలు వెల్లడించాయి. ఏపీ ఎన్జీవో నేతలను కూడా ఇదే స్థాయిలో పోలీసు ఉన్నతాధికారులు బెదిరిస్తున్నారు. సమైక్యాంధ్ర ఉద్యమానికి చుక్కానిలా నిలుస్తోన్న శ్రీకృష్ణదేవరాయ విశ్వవిద్యాలయం విద్యార్థి జేఏసీ నేతలపై కాంగ్రెస్, టీడీపీ నేతలు కన్నేశారు. విద్యార్థి జేఏసీలో కీలకంగా వ్యవహరిస్తోన్న నేతలకు కౌన్సెలింగ్ ఇవ్వాలని పోలీసు ఉన్నతాధికారులపై కాంగ్రెస్, టీడీపీ ప్రజా ప్రతినిధులు తీవ్ర స్థాయిలో ఒత్తిడి తెస్తున్నట్లు పోలీసు వర్గాలే వెల్లడిస్తున్నాయి. బైండోవర్లు.. అక్రమ కేసులు.. ఉద్యమంలోగానీ.. ఎన్నికల సమయంలోగానీ ఓ ప్రజాప్రతినిధిపై పోలీసులు బైండోవర్ కేసు నమోదు చేసిన దాఖలాలు లేవు. కానీ.. సమైక్యాంధ్ర ఉద్యమాన్ని ఉక్కు పాదంతో అణచి వేయాలనే మంత్రి రఘువీరారెడ్డి ఒత్తిడి మేరకు అనంతపురం ఎమ్మెల్యే బి.గురునాథరెడ్డిపై పోలీసులు బైండోవర్ కేసు నమోదు చేయడం సంచలనం రేపింది. ఎమ్మెల్యే బి.గురునాథరెడ్డి సహా 21 మంది వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నేతలపై బైండోవర్ కేసులు నమోదు చేయడం ఉద్యమాన్ని నీరుగార్చే కుట్రలో భాగమేననే విమర్శలు బలంగా వ్యక్తమవుతున్నాయి. ఇటీవల నూతనంగా వచ్చిన ర్యాపిడ్ యాక్షన్ ఫోర్స్ బలగాలతో అనంతపురంలో భారీ ఎత్తున కవాతు చేయించి.. ఉద్యమకారులను భయోత్పాతానికి గురి చేసేందుకు పోలీసు ఉన్నతాధికారులు యత్నించారు. శాంతియుతంగా ఉద్యమం సాగుతోన్న క్రమంలో కవాతు నిర్వహించాల్సిన అవసరం ఏమొచ్చిందని ప్రశ్నించిన పాపానికి కాంగ్రెస్ నేత కోగటం విజయభాస్కర్‌రెడ్డి, ప్రజా సంఘాల జేఏసీ నేత బి.నాగరాజులపై పోలీసులు కేసు నమోదు చేసి, అరెస్టు చేయడం గమనార్హం. ఈ అరెస్టుల వెనుక కాంగ్రెస్, టీడీపీలకు చెందిన ఇద్దరు ప్రజాప్రతినిధుల హస్తం ఉందనే అభిప్రాయం బలంగా వ్యక్తమవుతోంది. -
జిల్లాలో ఉధృతమవుతోన్న సమైక్య ఆందోళన
సాక్షి, అనంతపురం : జిల్లా నలుమూలలా విభజనాగ్ని సెగలు విరజిమ్ముతూనే ఉంది. ఎన్ని అడ్డంకులెదురైనా, పోలీసులు ఉక్కుపాదం మోపినా ఉద్యమకారులలో ఇసుమంతైనా ధైర్యం సడలలేదు. అణచివేత యత్నాలను తిప్పికొట్టి జిల్లా వ్యాప్తంగా ప్రజలు సింహాలై గర్జిస్తున్నారు. సమైక్యవాదుల వైఖరి పాలకులకు ముచ్చెమటలు పట్టిస్తోంది. సమైక్యాంధ్ర ఉద్యమం 23వ రోజు గురువారం ఉధృతంగా సాగింది. అనంతపురంలోని వేణుగోపాల్‌నగర్‌కు చెందిన వందలాది మంది ప్రజలు వంద మీటర్ల జాతీయ జెండాతో ప్రదర్శన నిర్వహించారు. టవర్‌క్లాక్ వద్ద మానవహారంగా ఏర్పడి సమైక్య గళాన్ని వినిపించారు. ఎన్జీవోల ఆధ్వర్యంలో నగరంలో బైక్ ర్యాలీ నిర్వహించారు. కలెక్టరేట్ మహిళా ఉద్యోగులు, ఉపాధ్యాయ జాక్టో, స్వర్ణకారుల సంఘం, ప్రయివేటు పాఠశాలల యాజమాన్యం ఆధ్వర్యంలో నిరసనలు కొనసాగించారు. న్యాయవాదులు 48 గంటల దీక్ష చేపట్టారు. జెడ్పీ ఉద్యోగులు జోలె పట్టి భిక్షాటన చేశారు. టవర్‌క్లాక్ సర్కిల్లో ఆర్యవైశ్య సంఘం ఆధ్వర్యంలో హైదరాబాద్ వెళ్లేవారికి ఐదు నిమిషాల్లో పాస్‌పోర్టు, వీసా అంటూ ప్రత్యేక శిబిరం ఏర్పాటు చేసి నిరసన తెలిపారు. ఉపాధ్యాయులు ముసుగులు వేసుకుని.. మోకాళ్లతో నడిచారు. న్యాయశాఖ ఉద్యోగులు నగరంలో ర్యాలీ నిర్వహించారు. విద్యార్థి సంఘాల నాయకులు నగరంలోని పొట్టిశ్రీరాములు విగ్రహం వద్ద మెడకు ఉరితాళ్లు బిగించుకుని నిరసన తెలిపారు. పశుసంవర్ధక, ట్రాన్స్‌కో ఉద్యోగులు నగరంలో ర్యాలీ చేశారు. ఆర్ట్స్‌కళాశాల అధ్యాపకులు, జాక్టో, ఎస్సీ, ఎస్టీ, బీసీ సంఘాలు, జాతీయ రహదారులు, ఆస్పత్రి ఉద్యోగులు, సీఐటీయూ, వాణిజ్య పన్నులశాఖ, పంచాయతీరాజ్, విద్యుత్, మునిసిపల్ , నీటిపారుదల ఉద్యోగుల రిలేదీక్షలు కొనసాగాయి. ఈ దీక్షా శిబిరాల్లో సాంస్కృతిక కార్యక్రమాల ద్వారా ప్రజలకు సమైక్యాంధ్రపై అవగాహన కల్పించారు. ఎస్కేయూలో ఆరని సమైక్య సెగ ఎస్కేయూలో విద్యార్థులు చేపట్టిన రిలే దీక్షలు 23వ రోజుకు చేరాయి. విద్యార్థి, బోధన, బోధనేతర జేఏసీ ఆధ్వర్యంలో యూనివర్సిటీ ప్రాంగణంలో ర్యాలీ నిర్వహించి.. జాతీయరహదారిపై రాస్తారోకో చేశారు. అనంతరం రాష్ట్ర విభజనను వ్యతిరేకిస్తూ యూపీఏ ప్రభుత్వానికి పిండప్రదానం చేశారు. వాడవాడలా నిరసనలు.. ధర్మవరంలో మెకానిక్, విద్యుత్ కార్మిక సంఘాలు, ఆర్టీసీ ఉద్యోగులు, రెవెన్యూ, ప్రజాసంఘాలతో పాటు వైఎస్సార్సీపీ, ఐక్య ఉపాధ్యాయ సంఘం ఆధ్వర్యంలో చేపట్టిన రిలే దీక్షలు కొనసాగుతున్నాయి. బత్తలపల్లి, తాడిమర్రి, ముదిగుబ్బ మండలాల్లో వైఎస్సార్సీపీ కార్యకర్తలు, సమైక్య వాదులు రిలేదీక్షలు కొనసాగిస్తున్నారు. గుంతకల్లులో సమైక్యాంధ్ర ఆందోళనలు కొనసాగాయి. గుత్తిలో న్యాయవాదులు విధులు బహిష్కరించి ర్యాలీ చేశారు. మోకాళ్లపై నడిచి ఉపాధ్యాయులు నిరసన తెలిపారు. హిందూపురంలో ఆర్యవైశ్య సంఘం వారు భారీ ప్రదర్శన నిర్వహించారు. ఎన్జీవోలు, ఉపాధ్యాయులు, వివిధ ప్రజా సంఘాల కార్యకర్తలు పట్టణంలో ర్యాలీ నిర్వహించారు. చిలమత్తూరు, లేపాక్షిలలో ఉపాధ్యాయ జేఏసీ, విద్యార్థులు ర్యాలీ నిర్వహించారు. కదిరిలో జేఏసీ ఆధ్వర్యంలో సమైక్యాంధ్రకు మద్దతుగా రిలే నిరాహార దీక్షలు కొనసాగాయి. కదిరి డివిజన్ పరిధిలోని ప్రభుత్వ పాఠశాలల పీఈటీలు దీక్ష చేపట్టారు. ప్రభుత్వ బాలుర, బాలికల జూనియర్ కళాశాలల అధ్యాపకులు, సిబ్బందితో పాటు ఆర్య వైశ్యులు, ఫ్రూట్ మర్చంట్, మటన్ వ్యాపారులు, కుమ్మరవాండ్లపల్లి గ్రామస్తులు పట్టణంలో ర్యాలీలు నిర్వహించి సమైక్యవాదం విన్పించారు. ప్రభుత్వ ఉపాధ్యాయులు చీపుర్లు చేతబట్టి పుర వీధులు శుభ్రపరిచి నిరసనను తెలియజేశారు. కళ్యాణదుర్గంలో వైఎస్సార్సీపీ నాయకుల రిలేదీక్షలు కొనసాగుతున్నాయి. న్యాయవాదులు విధులు బహిష్కరించి ర్యాలీ చేశారు. అనంతరం సోనియాగాంధీ, కేసీఆర్ దిష్టిబొమ్మలు దహనం చేశారు. కుందుర్పిలో సమైక్యాంధ్రకు మద్దతుగా వేలాది మంది గ్రామస్తులు ర్యాలీ నిర్వహించారు. మడకశిరలో హిజ్రాలు రోడ్లపై నృత్యాలు చేస్తూ.. నిరసన తెలిపారు. ఉపాధ్యాయులు ర్యాలీ చేశారు. అమరాపురంలో సమైక్యవాదులు మానవహారం నిర్వహించారు. రైతులు ఎద్దుల బండ్లతో ర్యాలీ చేశారు. ఓడీసీ, నల్లమాడ, బుక్కపట్నం, కొత్తచెరువులలో సమైక్య నిరసనలు మిన్నంటాయి. పెనుకొండలో ముస్లింలు భారీ ర్యాలీ నిర్వహించారు. అనంతరం రోడ్డుపై ప్రార్థనలు చేశారు. ఉపాధ్యాయుల రిలే దీక్షలు కొనసాగుతున్నాయి. రొద్దం, పరిగి మండలాల్లో సమైక్య ఉద్యమాలు ఎగిసిపడ్డాయి. రాయదుర్గంలో వైద్యసిబ్బంది, విద్యార్థులు, పట్టణ ప్రజలు స్వచ్ఛందంగా ముందుకు వచ్చి రిలేదీక్షలు చేపట్టారు. కణేకల్లులో ఎన్జీవోలు, రాప్తాడులో ఉద్యోగులు ర్యాలీ నిర్వహించారు. శింగనమలలో వైఎస్సార్సీపీ కార్యకర్తల రిలేదీక్షలు కొనసాగుతున్నాయి. ఆటోయూనియన్ ఆధ్వర్యంలో ఆటోలతో భారీ ర్యాలీ నిర్వహించారు. పుట్లూరులో జేఏసీ ఆద్వర్యంలో రిలే దీక్షలు చేపట్టారు. నార్పలలో కురబసంఘం ఆధ్వర్యంలో చేపట్టిన రిలే దీక్షలు కొనసాగాయి. తాడిపత్రిలో ట్రాన్స్‌కో ఉద్యోగులు మోకాళ్లపై నడిచి నిరసన తెలిపారు. జేఏసీ ఆధ్వర్యంలో రోడ్డుపై మానవహారంగా ఏర్పడి.. యోగాసనాలు చేశారు. ప్రైవేటు పాఠశాలల విద్యార్థులు పట్టణంలో భారీ ర్యాలీ నిర్వహించారు. మునిసిపల్ ఉద్యోగుల రిలే దీక్షలు కొనసాగుతున్నాయి. విద్యార్థులు రోడ్డుపైనే చదువుకుంటూ నిరసన తెలిపారు. యాడికిలో వికలాంగులు ర్యాలీ నిర్వహించారు. పెద్దవడుగూరులో జేఏసీ ఆధ్వర్యంలో బైక్ ర్యాలీ చేశారు. ఉరవకొండలో స్వర్ణకారులు రోడ్డుపై స్నానాలు చేశారు. టైలర్ యూనియన్ ఆధ్వర్యంలో ర్యాలీ నిర్వహించారు. బలిజ సంఘం ఆధ్వర్యంలో భారీ ర్యాలీ చేశారు. బెలుగుప్ప, విడపనకల్లు, వజ్రకరూరులో ఉద్యోగులు, సమైక్య వాదులు ర్యాలీ నిర్వహించారు. -
ప్రభుత్వ ఆదాయానికి ‘చెక్’పోస్ట్
సూళ్లూరుపేట, న్యూస్‌లైన్: ఆంధ్రా-తమిళనాడు సరిహద్దులో శ్రీపొట్టిశ్రీరాములు నెల్లూరు జిల్లా తడ మండలం భీములవారిపాళెం ఉమ్మడి తనిఖీ కేంద్ర అధికారులు, సిబ్బంది సమైక్యాంధ్రకు మద్దతుగా సమ్మెకు దిగడంతో చెక్‌పోస్టు మూతపడింది. దీంతో ప్రభుత్వ ఆదాయానికి భారీగా గండిపడుతోంది. ఇదే అదనుగా భావించిన అక్రమార్కులు పండగ చేసుకుంటున్నారు. పన్నుల ఎగవేతదారుల గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. చెక్‌పోస్టులో రవాణా, వాణిజ్యపన్నులు, గనులు భూగర్భ, అటవీ, పశుసంవర్థక, మార్కెటింగ్, ఎక్సైజ్ అండ్ పోలీస్ అనే ఏడు శాఖలున్నాయి. వీటిలో అత్యధికంగా రవాణా, వాణిజ్యపన్ను శాఖలకు అధిక రాబడి ఉంటుంది. మిగిలిన వాటిలో వచ్చిన కాడికి దండుకోవడమే పని. తమిళనాడు, ఆంధ్రా నుంచి వాహనాల్లో అనేక రకాల వస్తువులు రవాణా అవుతుంటాయి. ఇందులో కొన్నింటికి పన్నులు చెల్లించాల్సిన వాహనాలపై కేసులు రాస్తే గూడూరు వాణిజ్యపన్నుల కార్యాలయంలో పన్నులు చెల్లిస్తారు. చెక్‌పోస్టులోని వాణిజ్యపన్నుల శాఖలో యూజర్ చార్జీల కింద ప్రతి లారీ నుంచి రూ.50 వసూలు చేస్తారు. ఈ విధంగా రోజుకు సుమారుగా రెండు వేలకు పైగా వాహనాలు రాకపోకలు సాగిస్తున్నాయి. యూజర్ చార్జీలు కింద రోజుకు రూ.10 వేల నుంచి రూ.25 వేలదాకా వస్తుంది. అదే విధంగా రవాణాశాఖ వారు వాహనాల పర్మిట్లు, అధికలోడుతో వెళ్లే వాటికి పన్నులు విధిస్తారు. ఈ విధంగా రోజుకు రూ.3 లక్షల నుంచి రూ.4 లక్షలు దాకా ప్రభుత్వ రాబడి వస్తోంది. పది రోజుల నుంచి రవాణాశాఖాధికారి, వాణిజ్యపన్నుల శాఖాధికారులు సమ్మె పాటిస్తుండడంతో చెక్‌పోస్టు నుంచి రోజుకు రూ.3 లక్షల నుంచి రూ.5 లక్షలు దాకా ప్రభుత్వాదాయానికి గండిపడుతోంది. రవాణా శాఖాధికారులు పెన్‌డౌన్ చేసి కేసులు రాయడం మానేశారు. దీంతో వాహనాలు యథేచ్ఛగా వెళుతున్నాయి. మిగిలిన శాఖల్లో ఎమర్జెన్సీ సిబ్బంది ద్వారా విధులు నిర్వహించినా ఉపయోగం లేదు. ఎందుకంటే ప్రభుత్వానికి ప్రధానంగా సరిహద్దు చెక్‌పోస్టుల నుంచే ఆదాయం వస్తుంది. గత పదిరోజులుగా తీసుకుంటే సరాసరి ఇప్పటికి రూ.50 లక్షల నుంచి రూ.75 లక్షల వరకు ప్రభుత్వాదాయానికి గండి పడిందని పలుశాఖల అధికారులు చెబుతున్నారు. అక్రమార్కులు ప్రవేశం సమైక్యాంధ్ర సమ్మెతో ప్రయివేట్ వ్యక్తులు, పోలీసులు వసూళ్లు చేస్తున్నారు. వాహనచోదకులు కూడా ఇదే అదునుగా భావించి పన్నులు చెల్లించకుండా వెళ్లిపోతున్నారు. బియ్యం, ధాన్యం, ఎలక్ట్రానిక్స్, ఎలక్ట్రికల్, కిరాణా వస్తువులు రవాణా చేసే పార్శిల్ , ఇసుక, గ్రానైట్ లారీలు ఎలాంటి పన్నులు చెల్లించకుండా దర్జాగా వెళ్లిపోతున్నాయి. -
నేడు సమైక్య గర్జన
కడప కలెక్టరేట్, న్యూస్‌లైన్: జిల్లాలోని వివిధ ప్రభుత్వ శాఖల్లో పనిచేస్తున్న మహిళా ఉద్యోగులు సమైక్యాంధ్ర ఉద్యమబాట పడుతున్నారు. బుధవారం కడప స్టేట్‌గెస్ట్‌హౌస్‌లో మహిళా ఉద్యోగులు సమావేశం ఏర్పాటు చేశారు. సమైక్యాంధ్ర పరిరక్షణకు నడుంబిగించాలని నిర్ణయించారు. గురువారం ఉదయం 9.30గంటలకు కోటిరెడ్డి సర్కిల్ నుంచి పెద్ద ఎత్తున ప్రదర్శన నిర్వహించాలని తీర్మానించారు. అలాగే మానవహారాలు, అమరజీవి పొట్టిశ్రీరాములు, మహాత్మా గాంధీ విగ్రహాల వద్ద నివాళులు అర్పించాలని నిర్ణయించారు. భవిష్యత్తులో కూడా మహిళా ఉద్యోగుల సమస్యల పరిష్కారం కోసం కృషి చేసేందుకు వీలుగా జిల్లా మహిళా ఉద్యోగుల సంఘాన్ని ఏర్పాటుచేశారు. ఈ సంఘానికి ఐసీడీఎస్ ప్రాజెక్టు డెరైక్టర్ లీలావతి అధ్యక్షురాలిగా, స్పెషల్ డిప్యూటీ కలెక్టర్ రోహిణి ఉపాధ్యక్షులుగా, డిప్యూటీ ట్రాన్స్పోర్ట్ కమిషనర్ అసోసియేట్ అధ్యక్షులుగా, ఎస్సీ కార్పొరేషన్ ఎగ్జిక్యూటీవ్ డెరైక్టర్ ప్రతిభా భారతి కార్యదర్శిగా, రిమ్స్ అసిస్టెంట్ ప్రొఫెసర్ డాక్టర్ రమాదేవి సంయుక్త కార్యదర్శిగా, స్టెప్ సీఈఓ మమత ట్రెజరర్‌గా, మరో 13 మంది కార్యనిర్వాహక సభ్యులుగా ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. -
ఇక బడి బంద్
నెల్లూరు సిటీ, న్యూస్‌లైన్: జిల్లాలోని ఎక్కువమంది ఉపాధ్యాయులు గురువారం నుంచి సమ్మెకు దిగనుండడంతో బడి బంద్ కానుంది. సమైక్యాంధ్ర ఉపాధ్యాయ పోరాట సమితి ఆధ్వర్యంలో పలు సంఘాలు సమ్మెలోకి దిగుతున్నట్టు డీఈఓ రామలింగానికి మంగళవారం సమ్మె నోటీస్ ఇచ్చారు. జిల్లాలో బలమైన సంఘాలైన యూటీఎఫ్, ఏపీటీఎఫ్, ఎస్టీయూ మాత్రమే సమ్మెకు దూరంగా ఉన్నాయి. ఆయా సంఘాల్లోని ఉపాధ్యాయుల్లో మెజార్టీ వర్గం తమ సంఘం నిర్ణయాన్ని వ్యతిరేకిస్తున్నట్టు సమాచారం. ప్రస్తుత పరిస్థితుల్లో సీమాం ధ్రుల మనోభావాలననుసరించి సంఘాలు నడుచుకోవాల్సి ఉంటుందని తమ అధిష్టానానికి తెలియచేసిన ట్టు సమాచారం. దీంతో సమ్మెలో పాల్గొంటున్న ఉపాధ్యాయులకు పరోక్ష మద్దతుగా ప్రకటించేందుకు కొందరు ఉపాధ్యాయులు సిద్ధమయ్యారు. జిల్లాలోని 3568 ప్రభుత్వ పాఠశాలల్లో 14,128 మంది ఉపాధ్యాయులు పని చేస్తున్నారు. జిల్లాలోని 14 ఉపాధ్యాయ సంఘాల్లో పలు సంఘాలు సమైక్యాంధ్ర ఉపాధ్యాయ పోరాట సమితి పేరుతో ఇప్పటికే చురుగ్గా ఉద్యమిస్తున్నాయి. అయితే ప్రధాన సంఘాలు దూరంగా ఉండడంతో సమ్మె ప్రభావం ఏ మేరకు ఉంటుందోనని అనుమానాలు రేకెత్తుతున్నాయి. -
ఉద్యోగ గర్జన
‘స్వర్ణభారతి’ జనసంద్రమైంది. ఉద్యోగుల గర్జనతో హోరెత్తింది. సమైక్యాంధ్ర కోసం ఏ త్యాగాలకైనా సిద్ధమన్న వారి నినాదాలతో విశాఖ మార్మోగింది. ఉద్యోగ, ఉపాధ్యాయ, విద్యార్థి, కార్మిక సంఘాలకు చెందిన వేలాదిమందితో ఇండోర్ స్టేడియం కిక్కిరిసిపోయింది. సమైక్య రాష్ట్ర పరిరక్షణ వేదిక ఆధ్వర్యంలో బుధవారం నిర్వహించిన సభలో ఏపీ ఎన్జీవో సంఘం అధ్యక్షుడు అశోక్‌బాబు ఉద్వేగంగా ప్రసంగించారు. హైకోర్టు శిక్ష విధించినా ఉద్యోగుల పోరాటం ఆగదన్నారు. హైదరాబాద్‌లో వచ్చే నెల 7వ తేదీన సమైక్య సభ జరిపి తీరుతామని ప్రకటించారు. రాష్ట్ర ప్రయోజనాలు కాపాడటానికి అవసరమైతే సంవత్సరంపాటైనా సమ్మె చేయడానికి ఉద్యోగులు సిద్ధంగా ఉన్నారని చెప్పారు. విశాఖ రూరల్, న్యూస్‌లైన్ : ‘పేదరికం, అమాయకత్వంతో కూడిన తెలంగాణ అనే ఒక ఆడపిల్లను కాస్త డబ్బు, సంస్కారం, గడుసుతనంతో కూడిన ఆంధ్ర పిల్లవాడికి ఇచ్చి పెళ్లి చేస్తున్నాను. ఈ పెళ్లి కలకాలం ఉండాలని కోరుకుంటున్నాను. మీకు ఇష్టం లేకపోతే విడిపోవచ్చు. కానీ విడాకులు అన్నది చివరి ప్రాధాన్యత మాత్రమే’ అని అప్పటి ప్రధాన మంత్రి జవహార్‌లాల్ నెహ్రూ నిజామాబాద్‌లో బహిరంగ సభలో వ్యాఖ్యానించినట్టు ఏపీఎన్జీఓస్ రాష్ట్ర అధ్యక్షుడు పి.అశోక్‌బాబు చె ప్పారు. బుధవారం ఉదయం సమైక్య రాష్ట్ర పరిరక్షణ వేదిక పేరుతో స్వర్ణభారతి ఇండోర్ స్టేడియంలో భారీ సభకు ఉద్యోగుల నుంచి అనూహ్య స్పందన వచ్చింది. అన్ని ఉద్యోగ సంఘాల రాష్ట్ర స్థాయి నాయకులతోపాటు వందల సంఖ్యలో ఉద్యోగులు, విద్యార్థులు పాల్గొన్నారు. సమైక్యాంధ్ర నినాదాల్లో స్టేడియం హోరెత్తిపోయింది. విద్యార్థులు చేసిన ఫ్లాష్‌మాబ్ అందరిన్నీ ఆకట్టుకుంది. ప్రజా సంఘాల నాయకులు సమైక్యాంధ్రకు మద్దతుగా, సోనియా గాంధీ, కేసీఆర్, చంద్రబాబునాయుడు, చిరంజీవి, ఇతర రాజకీయ నాయకుల వ్యవహార శైలిని పాటల రూపంలో తూర్పారబట్టారు. అశోక్‌బాబు మాట్లాడుతూ తెలంగాణ విభజనపై అప్పట్లో జరిగిన ఉద్యమాల సమయంలో జాతీయ నాయకులు చేసిన వ్యాఖ్యలను గుర్తు చేశారు. మద్రాస్ నుంచి ఆంధ్ర విడిపోవడం నుంచి తెలంగాణతో కలిపి రాష్ట్రం ఏర్పడడం, రాజధానిగా హైదరాబాద్ ఎదుగుదల వరకు అన్ని అంశాలను విశదీకరించారు. 1969లో ఒక విచిత్రమైన పరిస్థితుల్లో ముల్కీ రూల్స్‌పై తెలంగాణ ప్రజలందరూ ఉద్యమించారన్నారు. 1972లో జై ఆంధ్రా ఉద్యమంతో బయటకు వెళ్లిపోవాలని కొంత మంది ఉద్యమించిన సమయంలో.. ‘భార్యాభర్తలు కొట్టుకోకూడదు. మీకు హైదరాబాద్ అనే అబ్బాయి ఉన్నాడు. వాడి కోసమైనా కలిసి ఉండాలి’ అని దేశ అత్తగారిలాంటి అప్పటి ప్రధాని ఇందిరాగాంధీ ఇద్దరికీ సర్ది చెప్పి కాపురాన్ని నిలబెట్టిందన్నారు. ‘కట్నం ఇచ్చేటప్పుడు నీ ఆస్తి, నా ఆస్తి అని కొట్టుకొనే భార్యాభర్తలు పిల్లాడి చదువు విషయానికి వచ్చే సరికి భార్య నగలిస్తుంది, భర్త అన్ని రకాల రుణాలు తీసుకుంటాడు. ఆ రకంగా హైదరాబాద్ అనే పిల్లాడి భవిష్యత్తు కోసం అందరూ రక్తందారి పోసి పెద్ద సాఫ్ట్వేర్ ఇంజినీర్లా చేశాం’ అని చెప్పుకొచ్చారు. ఆ రోజున అత్తగారు కుటుంబం సంక్షేమం కోసం భార్యాభర్తలు కలిసుండాలని చెబితే ప్రస్తుతం తెలంగాణ మేనత్తలా సోనియాగాంధీ మాత్రం విభజించాలని చూస్తోందన్నారు. 60 ఏళ్లు సంపాదించినదంతా భార్య, పిల్లడి కోసం ధారపోస్తే.. ఎదిగిన కొడుకులాంటి హైదరాబాద్‌ను తీసుకొని భార్య(తెలంగాణ) వెళ్లిపోతే ముసలి వయసులో ఆ భర్త పరిస్థితి ఎలా ఉంటుందో అదే పరిస్థితి సీమాంధ్రకు వచ్చిందన్నారు. రాజకీయ లబ్ధి కోసమే విజయనగరానికి చెందిన కేసీఆర్ తెలంగాణ వెళ్లి అబద్దాలతో ఉద్యమాన్ని నిర్మించాడని తీవ్ర విమర్శలు చేశారు. హైదరాబాద్ లేని రాష్ట్రాన్ని ప్రజలెవరూ ఊహించుకోలేరని, సమైక్య రాష్ర్టం కోసం ప్రతి ఒక్కరూ ఉద్యమబాట పట్టాలని పిలుపునిచ్చారు. లేనిపక్షంలో భవిష్యత్తు తరాలకు తీవ్ర నష్టం జరుగుతుందన్నారు. ఏపీఎన్జీఓస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి చంద్రశేఖర్‌రెడ్డి మాట్లాడుతూ విభజన నిర్ణయాన్ని యూపీఏ వెనక్కి తీసుకొనే వరకు సమ్మె చేస్తామన్నారు. అసోసియేషన్ రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి ఎం.వి.రెడ్డి మాట్లాడుతూ రాష్ట్ర విభజన జరిగితే విద్యార్థులు, ఉద్యోగులు, నిరుద్యోగులు, రైతులు ఇలా ప్రతి ఒక్కరికీ తీవ్ర నష్టం జరుగుతుందన్నారు. అసోసియేషన్ రాష్ట్ర ఉపాధ్యక్షుడు పురుషోత్తం నాయుడు మాట్లాడుతూ రాష్ట్ర విభజనపై యూపీఏ నిర్ణయాన్ని ఉపసంహరించుకోకపోతే ఎన్నికల్లో గట్టి బుద్ది చెబుతామన్నారు. ఏపీఎస్ఆర్టీసీ ఎన్ఎంయూ నాయకుడు శ్రీనివాసరావు మాట్లాడుతూ తెలంగాణ ఉద్యమాన్ని రాజకీయ నాయకులు నడిపితే సమైకాంధ్ర కోసం విద్యార్థులు, ప్రజలు, ఉద్యోగులు ఉద్యమిస్తున్నారన్నారు. ఏపీఎస్ఆర్టీసీ ఎంప్లాయిస్ యూని యన్ నాయకుడు దామోదర్ మాట్లాడుతూ తెలంగాణ ప్రాంతంలో కాంగ్రెస్ పార్టీని కాపాడుకోడానికే రాష్ట్రాన్ని విభజిస్తున్నారని, అదే జరిగితే కాంగ్రెస్‌ను భూస్థాపితం చేస్తామన్నారు. ఉత్తరాంధ్ర జర్నలిస్టుల సమితి కన్వీనర్ వి.వి.రమణమూర్తి మాట్లాడుతూ నాయకులు లేకపోయినా సమైక్యాంధ్ర ఉద్యమం గ్రామాలకు కూడా పాకిందన్నారు. ఏ పోరాటానికైనా జర్నలిస్టులు సిద్ధంగా ఉన్నారన్నారు. నాన్‌పొలిటికల్ జేఏసీ కన్వీనర్ ప్రొఫెసర్ బాలమోహన్‌దాస్ మాట్లాడుతూ సమైక్యాంధ్రను సాధించుకోవాలంటే అందరూ కలిసికట్టుగా ఉద్యమించాలన్నారు. అనంతరం విద్యార్థి యువజన జేఏసీ నాయకుడు ఆడారి కిషోర్‌కుమార్, డాక్టర్స్ అసోసియేషన్ ప్రతినిధి డాక్టర్ ఉదయ్‌కుమార్, నాయవాదుల సంఘం నాయకుడు కర్రి ఆదిబాబు, జీవీఎంసీ గుర్తింపు యూనియన్ నాయకుడు ఆనందరావు, పెన్షనర్స్ అసోసియేషన్ జిల్లా అధ్యక్షుడు ప్రసాదరావు ప్రసంగించారు. ఈ సభకు అధ్యక్షత వహించిన ఏపీఎన్జీఓస్ జిల్లా అధ్యక్షుడు, జేఏసీ ైచైర్మన్ కె.ఈశ్వరరావు మాట్లాడుతూ జిల్లా మంత్రి బాలరాజును రాజీనామా చేసి ఉద్యమంలోకి రావాలని ఆయన ఇంటిని ముట్టడిం చినా, ఆయన మాత్రం తనపై ఎటువంటి ఒత్తిళ్లు లేవని చెబుతున్నారని మండిపడ్డారు. ఈ సమావేశంలో అసోసియేషన్ జిల్లా కార్యదర్శి టి.గోపాలకృష్ణ, అన్ని సంఘాల ఉద్యోగులు పాల్గొన్నారు.