‘స్వర్ణభారతి’ జనసంద్రమైంది. ఉద్యోగుల గర్జనతో హోరెత్తింది. సమైక్యాంధ్ర కోసం ఏ త్యాగాలకైనా సిద్ధమన్న వారి నినాదాలతో విశాఖ మార్మోగింది. ఉద్యోగ, ఉపాధ్యాయ, విద్యార్థి, కార్మిక సంఘాలకు చెందిన వేలాదిమందితో ఇండోర్ స్టేడియం కిక్కిరిసిపోయింది. సమైక్య రాష్ట్ర పరిరక్షణ వేదిక ఆధ్వర్యంలో బుధవారం నిర్వహించిన సభలో ఏపీ ఎన్జీవో సంఘం అధ్యక్షుడు అశోక్‌బాబు ఉద్వేగంగా ప్రసంగించారు. హైకోర్టు శిక్ష విధించినా ఉద్యోగుల పోరాటం ఆగదన్నారు. హైదరాబాద్‌లో వచ్చే నెల 7వ తేదీన సమైక్య సభ జరిపి తీరుతామని ప్రకటించారు. రాష్ట్ర ప్రయోజనాలు కాపాడటానికి అవసరమైతే సంవత్సరంపాటైనా సమ్మె చేయడానికి ఉద్యోగులు సిద్ధంగా ఉన్నారని చెప్పారు.
విశాఖ రూరల్, న్యూస్‌లైన్ : ‘పేదరికం, అమాయకత్వంతో కూడిన తెలంగాణ అనే ఒక ఆడపిల్లను కాస్త డబ్బు, సంస్కారం, గడుసుతనంతో కూడిన ఆంధ్ర పిల్లవాడికి ఇచ్చి పెళ్లి చేస్తున్నాను. ఈ పెళ్లి కలకాలం ఉండాలని కోరుకుంటున్నాను. మీకు ఇష్టం లేకపోతే విడిపోవచ్చు. కానీ విడాకులు అన్నది చివరి ప్రాధాన్యత మాత్రమే’ అని అప్పటి ప్రధాన మంత్రి జవహార్‌లాల్ నెహ్రూ నిజామాబాద్‌లో బహిరంగ సభలో వ్యాఖ్యానించినట్టు ఏపీఎన్‌జీఓస్ రాష్ట్ర అధ్యక్షుడు పి.అశోక్‌బాబు చె ప్పారు.
బుధవారం ఉదయం సమైక్య రాష్ట్ర పరిరక్షణ వేదిక పేరుతో స్వర్ణభారతి ఇండోర్ స్టేడియంలో భారీ సభకు ఉద్యోగుల నుంచి అనూహ్య స్పందన వచ్చింది. అన్ని ఉద్యోగ సంఘాల రాష్ట్ర స్థాయి నాయకులతోపాటు వందల సంఖ్యలో ఉద్యోగులు, విద్యార్థులు పాల్గొన్నారు. సమైక్యాంధ్ర నినాదాల్లో స్టేడియం హోరెత్తిపోయింది. విద్యార్థులు చేసిన ఫ్లాష్‌మాబ్ అందరిన్నీ ఆకట్టుకుంది. ప్రజా సంఘాల నాయకులు సమైక్యాంధ్రకు మద్దతుగా, సోనియా గాంధీ, కేసీఆర్, చంద్రబాబునాయుడు, చిరంజీవి, ఇతర రాజకీయ నాయకుల వ్యవహార శైలిని పాటల రూపంలో తూర్పారబట్టారు. అశోక్‌బాబు మాట్లాడుతూ తెలంగాణ విభజనపై అప్పట్లో జరిగిన ఉద్యమాల సమయంలో జాతీయ నాయకులు చేసిన వ్యాఖ్యలను గుర్తు చేశారు.
మద్రాస్ నుంచి ఆంధ్ర విడిపోవడం నుంచి తెలంగాణతో కలిపి రాష్ట్రం ఏర్పడడం, రాజధానిగా హైదరాబాద్ ఎదుగుదల వరకు అన్ని అంశాలను విశదీకరించారు. 1969లో ఒక విచిత్రమైన పరిస్థితుల్లో ముల్కీ రూల్స్‌పై తెలంగాణ ప్రజలందరూ ఉద్యమించారన్నారు. 1972లో జై ఆంధ్రా ఉద్యమంతో బయటకు వెళ్లిపోవాలని కొంత మంది ఉద్యమించిన సమయంలో.. ‘భార్యాభర్తలు కొట్టుకోకూడదు. మీకు హైదరాబాద్ అనే అబ్బాయి ఉన్నాడు. వాడి కోసమైనా కలిసి ఉండాలి’ అని దేశ అత్తగారిలాంటి అప్పటి ప్రధాని ఇందిరాగాంధీ ఇద్దరికీ సర్ది చెప్పి కాపురాన్ని నిలబెట్టిందన్నారు. ‘కట్నం ఇచ్చేటప్పుడు నీ ఆస్తి, నా ఆస్తి అని కొట్టుకొనే భార్యాభర్తలు పిల్లాడి చదువు విషయానికి వచ్చే సరికి భార్య నగలిస్తుంది, భర్త అన్ని రకాల రుణాలు తీసుకుంటాడు.
ఆ రకంగా హైదరాబాద్ అనే పిల్లాడి భవిష్యత్తు కోసం అందరూ రక్తందారి పోసి పెద్ద సాఫ్ట్‌వేర్ ఇంజినీర్‌లా చేశాం’ అని చెప్పుకొచ్చారు. ఆ రోజున అత్తగారు కుటుంబం సంక్షేమం కోసం భార్యాభర్తలు కలిసుండాలని చెబితే ప్రస్తుతం తెలంగాణ మేనత్తలా సోనియాగాంధీ మాత్రం విభజించాలని చూస్తోందన్నారు. 60 ఏళ్లు సంపాదించినదంతా భార్య, పిల్లడి కోసం ధారపోస్తే.. ఎదిగిన కొడుకులాంటి హైదరాబాద్‌ను తీసుకొని భార్య(తెలంగాణ) వెళ్లిపోతే ముసలి వయసులో ఆ భర్త పరిస్థితి ఎలా ఉంటుందో అదే పరిస్థితి సీమాంధ్రకు వచ్చిందన్నారు. రాజకీయ లబ్ధి కోసమే విజయనగరానికి చెందిన కేసీఆర్ తెలంగాణ వెళ్లి అబద్దాలతో ఉద్యమాన్ని నిర్మించాడని తీవ్ర విమర్శలు చేశారు. హైదరాబాద్ లేని రాష్ట్రాన్ని ప్రజలెవరూ ఊహించుకోలేరని, సమైక్య రాష్ర్టం కోసం ప్రతి ఒక్కరూ ఉద్యమబాట పట్టాలని పిలుపునిచ్చారు.
లేనిపక్షంలో భవిష్యత్తు తరాలకు తీవ్ర నష్టం జరుగుతుందన్నారు. ఏపీఎన్‌జీఓస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి చంద్రశేఖర్‌రెడ్డి మాట్లాడుతూ విభజన నిర్ణయాన్ని యూపీఏ వెనక్కి తీసుకొనే వరకు సమ్మె చేస్తామన్నారు. అసోసియేషన్ రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి ఎం.వి.రెడ్డి మాట్లాడుతూ రాష్ట్ర విభజన జరిగితే విద్యార్థులు, ఉద్యోగులు, నిరుద్యోగులు, రైతులు ఇలా ప్రతి ఒక్కరికీ తీవ్ర నష్టం జరుగుతుందన్నారు. అసోసియేషన్ రాష్ట్ర ఉపాధ్యక్షుడు పురుషోత్తం నాయుడు మాట్లాడుతూ రాష్ట్ర విభజనపై యూపీఏ నిర్ణయాన్ని ఉపసంహరించుకోకపోతే ఎన్నికల్లో గట్టి బుద్ది చెబుతామన్నారు. ఏపీఎస్‌ఆర్టీసీ ఎన్‌ఎంయూ నాయకుడు శ్రీనివాసరావు మాట్లాడుతూ తెలంగాణ ఉద్యమాన్ని రాజకీయ నాయకులు నడిపితే సమైకాంధ్ర కోసం విద్యార్థులు, ప్రజలు, ఉద్యోగులు ఉద్యమిస్తున్నారన్నారు.
ఏపీఎస్‌ఆర్టీసీ ఎంప్లాయిస్ యూని యన్ నాయకుడు దామోదర్ మాట్లాడుతూ తెలంగాణ ప్రాంతంలో కాంగ్రెస్ పార్టీని కాపాడుకోడానికే రాష్ట్రాన్ని విభజిస్తున్నారని, అదే జరిగితే కాంగ్రెస్‌ను భూస్థాపితం చేస్తామన్నారు. ఉత్తరాంధ్ర జర్నలిస్టుల సమితి కన్వీనర్ వి.వి.రమణమూర్తి మాట్లాడుతూ నాయకులు లేకపోయినా సమైక్యాంధ్ర ఉద్యమం గ్రామాలకు కూడా పాకిందన్నారు. ఏ పోరాటానికైనా జర్నలిస్టులు సిద్ధంగా ఉన్నారన్నారు. నాన్‌పొలిటికల్ జేఏసీ కన్వీనర్ ప్రొఫెసర్ బాలమోహన్‌దాస్ మాట్లాడుతూ సమైక్యాంధ్రను సాధించుకోవాలంటే అందరూ కలిసికట్టుగా ఉద్యమించాలన్నారు.
అనంతరం విద్యార్థి యువజన జేఏసీ నాయకుడు ఆడారి కిషోర్‌కుమార్, డాక్టర్స్ అసోసియేషన్ ప్రతినిధి డాక్టర్ ఉదయ్‌కుమార్, నాయవాదుల సంఘం నాయకుడు కర్రి ఆదిబాబు, జీవీఎంసీ గుర్తింపు యూనియన్ నాయకుడు ఆనందరావు, పెన్షనర్స్ అసోసియేషన్ జిల్లా అధ్యక్షుడు ప్రసాదరావు ప్రసంగించారు. ఈ సభకు అధ్యక్షత వహించిన ఏపీఎన్‌జీఓస్ జిల్లా అధ్యక్షుడు, జేఏసీ ైచైర్మన్ కె.ఈశ్వరరావు మాట్లాడుతూ జిల్లా మంత్రి బాలరాజును రాజీనామా చేసి ఉద్యమంలోకి రావాలని ఆయన ఇంటిని ముట్టడిం చినా, ఆయన మాత్రం తనపై ఎటువంటి ఒత్తిళ్లు లేవని చెబుతున్నారని మండిపడ్డారు. ఈ సమావేశంలో అసోసియేషన్ జిల్లా కార్యదర్శి టి.గోపాలకృష్ణ, అన్ని సంఘాల ఉద్యోగులు పాల్గొన్నారు.
ఉద్యోగ గర్జన
Published Thu, Aug 22 2013 2:19 AM | Last Updated on Fri, Sep 1 2017 9:59 PM
Advertisement
Advertisement