సమైక్య ఉద్యమంలో రాజకీయ కోవర్టులు | movement growing concern over the question of political | Sakshi
Sakshi News home page

సమైక్య ఉద్యమంలో రాజకీయ కోవర్టులు

Published Fri, Aug 23 2013 5:06 AM | Last Updated on Fri, Mar 22 2019 6:18 PM

movement growing concern over the question of political

సాక్షి ప్రతినిధి, అనంతపురం : సమైక్యాంధ్ర ఉద్యమంతో రాజకీయ మనుగడ ప్రశ్నార్థకమైందని ఆందోళన చెందుతోన్న కాంగ్రెస్, టీడీపీ ప్రజాప్రతినిధులు ఏకంగా ఆ మహోద్యమాన్ని నీరుగార్చేందుకు పూనుకున్నారు. ఓ వైపు ఉద్యమంలో పాల్గొంటూనే మరో వైపు కోవర్టుల అవతారం ఎత్తారు. సమైక్య ఉద్యమంలో చురుగ్గా పాల్గొంటున్న ఏపీ ఎన్జీవోలు, ఉపాధ్యాయ జేఏసీ, ఉద్యోగ, కార్మిక, కర్షక, ప్రజా సంఘాల నేతలను గుర్తించి.. ఆ సమాచారాన్ని పోలీసు ఉన్నతాధికారులకు చేరవేస్తున్నారు.
 
 ఆ నేతలను అదుపులోకి తీసుకుంటున్న పోలీసులు తమదైన శైలిలో రహస్యంగా కౌన్సెలింగ్ ఇస్తూ.. భయోత్పాతం సృష్టిస్తున్నారు. ఉద్యమంలో క్రియాశీలకంగా పాల్గొంటున్న నేతలను భయోత్పాతానికి గురిచేయడం ద్వారా మహోద్యమాన్ని నీరుగార్చాలన్న వారి ఎత్తుగడపై సర్వత్రా విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ఈ రెండు పార్టీలకూ తెలంగాణపై స్పష్టమైన వైఖరిని ప్రకటించిన మరో పార్టీ నేతలు కూడా తోడవడంపై సమైక్యవాదులు మండిపడుతున్నారు. రాష్ట్ర విభజనపై కాంగ్రెస్ అధిష్టానం, యూపీఏ పక్షాలు జూలై 30న ఆమోదముద్ర వేసిన తర్వాత జిల్లాలో సమైక్యాంధ్ర ఉద్యమం ఉవ్వెత్తున ఎగిసింది. టీడీపీ అధినేత చంద్రబాబు ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం ఏర్పాటుకు మద్దతుగా లేఖ ఇవ్వడం.. దాన్ని పరిగణనలోకి తీసుకునే కాంగ్రెస్ అధిష్టానం రాష్ట్ర విభజనపై ప్రకటన చేయడంతో ఆ రెండు పార్టీలపై సమైక్యవాదులు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. కాంగ్రెస్, టీడీపీలకు చెందిన ప్రజాప్రతినిధులను జిల్లాలో ఎక్కడికక్కడ సమైక్యవాదులు అడ్డుకోవడమే అందుకు తార్కాణం. సమైక్యాంధ్ర ఉద్యమం నానాటికీ బలోపేతమవుతుండటం కాంగ్రెస్, టీడీపీ నేతల వెన్నులో వణుకు పుట్టిస్తోంది. ఇది రాజకీయ మనుగడనే ప్రశ్నార్థకం చేస్తుందన్న కేంద్ర నిఘా వర్గాల నివేదిక కాంగ్రెస్, టీడీపీ నేతల కంటికి కునుకు లేకుండా చేస్తోంది. సమైక్యాంధ్ర ఉద్యమాన్ని నీరుగార్చితే కొంతైనా ప్రయోజనం ఉంటుందని ఇరు పక్షాల నేతలు భావిస్తున్నారు. ఇదే అభిప్రాయంతో ఉన్న కాంగ్రెస్ అధిష్టానం సమైక్యాంధ్ర ఉద్యమాన్ని అణచివేయాలని పోలీసు ఉన్నతాధికారులపై తీవ్ర స్థాయిలో ఒత్తిడి తెస్తోంది.
 
 ఆ ఒత్తిళ్ల వల్లే పోలీసు ఉన్నతాధికారులు సమైక్యవాదులపై ఉక్కుపాదం మోపుతున్నారు. ఎన్నడూలేని రీతిలో ఉద్యమకారులను బైండోవర్ చేస్తున్నారు. అక్రమ కేసులు బనాయిస్తున్నారు. బైండోవర్లు, అక్రమ కేసులతో ఉద్యమకారులను భయోత్పాతానికి గురి చేస్తున్నారు. ఈ క్రమంలోనే కాంగ్రెస్, టీడీపీలకు చెందిన కొందరు ప్రజాప్రతినిధులు, కీలక నేతలు సమైక్యాంధ్ర ఉద్యమంలో క్రియాశీలకంగా వ్యవహరించే ఏపీ ఎన్జీవోలు, ఉద్యోగ, ఉపాధ్యాయ, కార్మిక, కర్షక, ప్రజా సంఘాల నేతల గురించి పోలీసులకు ఉప్పందిస్తున్నారు. తద్వారా పోలీసులకు కోవర్టులుగా మారిపోయారు.
 
 ఉద్యమం చుట్టూ కుట్రలు..
 అనంతపురంలో సమైక్యాంధ్రకు మద్దతుగా గత మంగళవారం లక్ష మంది విద్యార్థులతో భారీ ర్యాలీ నిర్వహించాలని ప్రైవేటు పాఠశాలల యాజమాన్యాల సంఘం నిర్ణయించింది. ఇది పసిగట్టిన టీడీపీకి చెందిన ఓ ప్రజాప్రతినిధి, తెలంగాణపై స్పష్టమైన వైఖరిని ప్రకటించిన ఓ పార్టీకి చెందిన కీలక నేత పోలీసులకు సమాచారాన్ని చేరవేశారు. ప్రైవేటు పాఠశాలల యాజమాన్యంలో కీలకంగా వ్యవహరిస్తోన్న ఎనిమిది మంది నేతల పేర్లను ఆ ఇద్దరు నేతలు పోలీసు ఉన్నతాధికారులకు చేర వేశారు. ర్యాలీ నిర్వహించడానికి సరిగ్గా 12 గంటల ముందు ఆ ఎనిమిది మంది నేతలనూ పోలీసులు అరెస్టు చేశారు. తద్వారా ప్రైవేటు పాఠశాలల యాజమాన్యాలను భయోత్పాతానికి గురిచేయాలని భావించారు. కానీ.. ఆ తాటాకు చప్పుళ్లకు ప్రైవేటు పాఠశాలల యాజమాన్యాలు బెదరలేదు. అనుకున్నట్లుగానే అనంతపురంలో భారీ ఎత్తున విద్యార్థులతో ర్యాలీ నిర్వహించారు. ఉపాధ్యాయ జేఏసీ నేతృత్వంలో 21 రోజులుగా అనంతపురంలో ఆర్డీవో కార్యాలయం ఎదుట రిలే నిరాహార దీక్షలు చేస్తున్నారు. ఈ జేఏసీలో కీలకంగా వ్యవహరిస్తోన్న ఇద్దరు నేతల పేర్లనూ కాంగ్రెస్ పార్టీకి చెందిన ఓ ప్రజాప్రతినిధి పోలీసు ఉన్నతాధికారులకు చేరవేశారు. ఇద్దరు నేతలను పోలీసు ఉన్నతాధికారి ఒకరు తీవ్ర స్థాయిలో బెదిరించినట్లు ఉపాధ్యాయ వర్గాలు వెల్లడించాయి. ఏపీ ఎన్జీవో నేతలను కూడా ఇదే స్థాయిలో పోలీసు ఉన్నతాధికారులు బెదిరిస్తున్నారు. సమైక్యాంధ్ర ఉద్యమానికి చుక్కానిలా నిలుస్తోన్న శ్రీకృష్ణదేవరాయ విశ్వవిద్యాలయం విద్యార్థి జేఏసీ నేతలపై కాంగ్రెస్, టీడీపీ నేతలు కన్నేశారు. విద్యార్థి జేఏసీలో కీలకంగా వ్యవహరిస్తోన్న నేతలకు కౌన్సెలింగ్ ఇవ్వాలని పోలీసు ఉన్నతాధికారులపై కాంగ్రెస్, టీడీపీ ప్రజా ప్రతినిధులు తీవ్ర స్థాయిలో ఒత్తిడి తెస్తున్నట్లు పోలీసు వర్గాలే వెల్లడిస్తున్నాయి.
 
 బైండోవర్లు.. అక్రమ కేసులు..
 ఉద్యమంలోగానీ.. ఎన్నికల సమయంలోగానీ ఓ ప్రజాప్రతినిధిపై పోలీసులు బైండోవర్ కేసు నమోదు చేసిన దాఖలాలు లేవు. కానీ.. సమైక్యాంధ్ర ఉద్యమాన్ని ఉక్కు పాదంతో అణచి వేయాలనే మంత్రి రఘువీరారెడ్డి ఒత్తిడి మేరకు అనంతపురం ఎమ్మెల్యే బి.గురునాథరెడ్డిపై పోలీసులు బైండోవర్ కేసు నమోదు చేయడం సంచలనం రేపింది. ఎమ్మెల్యే బి.గురునాథరెడ్డి సహా 21 మంది వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నేతలపై బైండోవర్ కేసులు నమోదు చేయడం ఉద్యమాన్ని నీరుగార్చే కుట్రలో భాగమేననే విమర్శలు బలంగా వ్యక్తమవుతున్నాయి.
 
 ఇటీవల నూతనంగా వచ్చిన ర్యాపిడ్ యాక్షన్ ఫోర్స్ బలగాలతో అనంతపురంలో భారీ ఎత్తున కవాతు చేయించి.. ఉద్యమకారులను భయోత్పాతానికి గురి చేసేందుకు పోలీసు ఉన్నతాధికారులు యత్నించారు. శాంతియుతంగా ఉద్యమం సాగుతోన్న క్రమంలో కవాతు నిర్వహించాల్సిన అవసరం ఏమొచ్చిందని ప్రశ్నించిన పాపానికి కాంగ్రెస్ నేత కోగటం విజయభాస్కర్‌రెడ్డి, ప్రజా సంఘాల జేఏసీ నేత బి.నాగరాజులపై పోలీసులు కేసు నమోదు చేసి, అరెస్టు చేయడం గమనార్హం. ఈ అరెస్టుల వెనుక కాంగ్రెస్, టీడీపీలకు చెందిన ఇద్దరు ప్రజాప్రతినిధుల హస్తం ఉందనే అభిప్రాయం బలంగా వ్యక్తమవుతోంది.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement