సాక్షి, కరీంనగర్: నువ్వు వీడియో డిలీట్ చెయ్‌రా ఫస్ట్.. ఏడున్నవ్ నువ్వు.. చౌరస్తా కాడికి రా.. అంటూ ఓ అధికార పార్టీ నేత తమ్ముడు ఏఐఎఫ్‌టీయూ రాష్ట్ర కమిటీ సభ్యుడు సోమిశెట్టి దశరథంకు బెదిరింపు కాల్ చేయడం శుక్రవారం సిరిసిల్లలో వైరలయ్యింది. బాధితుడు విలేకరులతో తన గోడు వెలిబు చ్చాడు.
సిరిసిల్ల పట్టణంలో గురువారం రాత్రి 9.30 గంటలకు పట్టణానికి చెందిన అధికార పార్టీకి చెందిన ఓ ప్రముఖ నేత తమ్ముడు ట్రాక్టర్లలో ఇసుకను అక్రమంగా తరలిస్తున్నాడు. పర్మిట్ లేని ట్రాక్టర్లలో ఇసుక తీసుకెళ్లడాన్ని తాను ఫోన్‌లో వీడియో తీయగా.. శుక్రవారం ఉదయం తనకు ఫోన్ చేసి వీడియో నువ్వు ఎందుకు తీసినవ్.. వీడియో డిలీట్ చేయ్ అంటూ పరుష పదజాలంతో మాట్లాడుతూ బెదిరింపులకు పాల్పడ్డారు.
సిరిసిల్ల మానేరు నుంచి ఎలాంటి వేబిల్లులు లేకుండానే రాత్రివేళలో ఇసుకను తరలించడమే కాకుండా బెదిరింపులకు పాల్పడ్డాడని, బూతు పురాణం అందుకున్న అతడిపై చట్టరీత్యా చర్యలు తీసుకోవాలని కోరారు. అక్రమంగా తరలిస్తున్న ఇసుక ఆధారాలతో జిల్లా ఎస్పీ, డీఎస్పీ, టౌన్ సీఐలకు ఫిర్యాదు చేసినట్లు తెలిపారు. అయితే ఫోన్‌లో ఇరువురి సంభాషణ.. అధికార పార్టీకి చెందిన వ్యక్తి బెదిరింపులు.. తిట్లు.. 150 ట్రాక్టర్లు నడుస్తున్నయ్.. కేటీఆర్ పేరెందుకు తీస్తున్నవ్ అంటూ సాగిన సంభాషణ సామాజిక మాధ్యమాల్లో వైరలవడం ప్రజల్లో చర్చనీయాంశమైంది.
Comments
Please login to add a commentAdd a comment