రాజశేఖర్ (ఫైల్)
విందు ఇవ్వాలని కోరిన స్నేహితులు
ఇంటి నుంచి వెళ్లిన గంటకే రోడ్డు ప్రమాదం
ముందునుంచి వేగంగా వచ్చి కబళించిన లారీ
అక్కడికక్కడే దుర్మరణం.. మరొకరికి తీవ్ర గాయాలు
కరీంనగర్: భార్య రెండు ఉద్యోగాలు సాధించడంతో స్నేహితులు పార్టీ అడిగారు. వారికి విందు ఇచ్చేందుకు వెళ్లిన గంటలోనే రోడ్డు ప్రమాదం కబళించింది. దీంతో ఆ ఇంట్లో విషాదం నిండింది. ఈ ఘటన ధర్మపురిలో మంగళవారం అర్ధరాత్రి చోటుచేసుకుంది. బంధువులు, పోలీసుల కథనం ప్రకారం.. ధర్మపురి పట్టణంలోని గంగపుత్రకాలనీకి చెందిన నర్ముల రాజశేఖర్ (36) బీర్‌పూర్ మండల పరిషత్ కార్యాలయంలో ఉపాధి హామీ పథకంలో టెక్నికల్ అసిస్టెంట్‌గా పని చేస్తున్నాడు. రాజశేఖర్ భార్య మనీషా ఇటీవల ప్రకటించిన టీజీటీ, పీజీటీలో ప్రభుత్వ ఉద్యోగాలు సాధించింది.
దీంతో పార్టీ (దావత్) ఇవ్వాలని తోటి మిత్రులు కోరారు. మంగళవారం సాయంత్రం బీర్‌పూర్‌లో విధులు ముగించుకుని ఇంటికి చేరిన రాజశేఖర్ నిద్రకు ఉపక్రమించాడు. అదే సమయంలో తన స్నేహితుడైన ధర్మపురికి చెందిన సిరుప బద్రి ఇంటికొచ్చి పార్టీ కోసమని ద్విచక్రవాహనంపై మండలంలోని రాయపట్నం గ్రామానికి వెళ్లారు. విందు చేసుకుని తిరిగి వస్తుండగా బూరుగుపల్లె బస్టాండ్ వద్ద ఎదురుగా వస్తున్న లారీ అతి వేగంగా ఢీకొట్టింది. ఈ ఘటనలో రాజశేఖర్‌కు తీవ్ర గాయాలై అక్కడికక్కడే మృతి చెందాడు. సీపతి బద్రి తీవ్రంగా గాయపడ్డాడు. అతడిని 108 అంబులెన్సులో జగిత్యాల ఏరియా ఆస్పత్రికి.. అక్కడి నుంచి కరీంనగర్‌కు తరలించారు.
ఇంటి నుంచి వెళ్లిన గంటలోపే..
ఇప్పుడే వస్తానంటూ రాజశేఖర్ మంగళవారం రాత్రి తొమ్మిది గంటలకు ఇంటి నుంచి బయల్దేరాడు. వెళ్లిన కొద్దిసేపటికే పార్టీ ముగించుకుని తిరుగు పయనమయ్యారు. అంతలోనే ఈ ప్రమాదం చోటుచేసుకోవడంతో భార్య, తల్లిదండ్రులు శోక సంద్రంలో మునిగిపోయారు. రాజశేఖర్‌కు కుమారుడు శ్రీహర్ష ఒక్కగానొక్క కుమారుడు. అతడు తండ్రి చితికి నిప్పు పెట్టడం అక్కడున్నవారిని కలిచివేసింది. కేసు దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై ఉదయ్‌కుమార్ తెలిపారు.
ఇవి చదవండి: అమ్మా.. 'ఎందుకు ఏడుస్తున్నావమ్మా..! నాన్నకు ఏమైంది..?
Comments
Please login to add a commentAdd a comment