తండ్రి రాజశేఖర్‌తో రిషిత
మాటల కోసం తపిస్తున్న మూగ గొంతు
ఆపరేషన్ల ఖర్చులతో అప్పులపాలైన తండ్రి
హియరింగ్ మిషన్ల కొనుగోలుకు చిల్లిగవ్వ లేని వైనం
దాతల సాయం కోసం ఎదురుచూపు
కరీంనగర్: ఆ కుటుంబంలో మొదటి సంతానంగా పాప జన్మించింది. ఇంట్లో లక్ష్మీదేవి పుట్టిందని సంబరపడ్డారు. ఆ సంబరం ఏడాది తిరగకముందే ఆవిరైంది. పాపకు మాటలు రాకపోవడంతో ఆసుపత్రుల చుట్టూ తిరిగారు. ఆస్తులు అమ్ముకొని కొంత, దాతల సహకారంతో కొంత సొమ్ము సేకరించి కేంద్ర ప్రభుత్వ పథకంతో ఆపరేషన్ చేయించినా, లక్షల్లో ఖరీదు చేసే హియరింగ్ మిషన్ల కొనుగోలుకు డబ్బుల్లేక తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. పాపకు మాటలు రావాలంటే మిషన్లకు, హియరింగ్ థెరపీకి రూ.11 లక్షలు అవసరముండడంతో దాతల సాయం కోసం ఎదురుచూస్తున్నారు.
కూతురు తపన.. తండ్రి ఆవేదన!
కరీంనగర్ జిల్లా రామడుగు మండలం రంగసాయిపల్లె గ్రామానికి చెందిన పోతు రాజశేఖర్, కావ్యశ్రీ దంపతులకు 2016లో రిషిత జన్మించింది. ఆరోగ్యంగానే ఉన్న పాప ఏడాది వయస్సు వచ్చినా మాట్లాడకపోవడంతో అనుమానం వచ్చి ఆసుపత్రిలో చూపించారు. అన్ని పరీక్షలు నిర్వహించిన వైద్యులు పాపకు పుట్టుకతోనే మూగ, చెవుడు సమస్య ఉన్నట్లు గుర్తించారు.
స్పీచ్ థెరపీతో మాటలు వస్తాయని చెప్పడంతో 2017లో తిరుపతిలోని శ్రవణం స్వీచ్ థెరపీ ఆస్పత్రిలో ఏడాది పాటు ఉండి చికిత్స అందించారు. అయినా ఫలితం లేకపోవడంతో 2018లో దాతల సాయంతో రూ.1.5 లక్షలతో వినికిడి యంత్రం కొనుగోలు చేసినా పాపకు ఉపయోగపడలేదు. మళ్లీ 2019లో హైదరాబాద్ అపోలో ఆస్పత్రికి వెళ్లగా ఆపరేషన్ చేస్తే నయం అవుతుందని తెలిపారు. ఆపరేషన్‌కు రూ.15 లక్షలు ఖర్చవుతాయని చెప్పడంతో దిక్కుతోచని పరిస్థితి ఏర్పడింది. కేంద్ర పథకం అడిప్ స్కీం కింద అవకాశం ఉండడంతో దరఖాస్తు చేసుకున్నారు.
అడిప్ స్కీం కింద తల లోపల కాక్లర్ ఇంప్లాట్ మిషన్ వేశారు. ఆపరేషన్ చేయడం ఒక ఎత్తయితే, తర్వాత హియరింగ్ మిషన్ కొనుగోలు చేయడం తలకుమించిన భారంగా మారింది. ఆపరేషన్ తర్వాత ప్రతీ రెండు నెలలకోసారి ఆస్పత్రికి తీసుకెళ్లి పరీక్షలు నిర్వహించాలి. ఈ క్రమంలో చెవిలో ఇన్‌ఫెక్షన్ సోకడంతో 2022లో మరోసారి ఆపరేషన్ చేయించారు. ఓ బిల్డర్ వద్ద సూపర్‌వైజర్‌గా పనిచేసుకునే రాజశేఖర్ తరచూ బిడ్డను ఆసుపత్రులకు తీసుకెళ్తున్న క్రమంలో ఉద్యోగం కూడా పోయింది. దీంతో ఇల్లు గడవడం కష్టంగా మారింది.
ఊళ్లో ఉన్న ఇల్లు అమ్మినా అప్పులు తీరలేదు. ప్రస్తుతం రేకుర్తిలో ఉంటున్నారు. రిషిత మాట్లాడాలంటే కుడి చెవికి రూ.7.5 లక్షల విలువైన న్యూక్లియర్–8 మిషన్, ఎడమ చెవికి రూ.1.5 లక్షల మరో మిషన్ అవసరముంది. వీటిని కొనుగోలు చేసినా ప్రతినెలా రూ.13 వేలు వెచ్చించి రెండేళ్లపాటు స్పీచ్ థెరపీ అందించాల్సి ఉంటుంది. సుమారు రూ.11 లక్షలు ఖర్చు చేస్తే తప్ప పాప మూగ గొంతుకు మాటలు వచ్చే అవకాశం లేదు. ఇప్పటికే అప్పుల్లో కూరుకుపోయిన రాజశేఖర్ కూతురు కోసం రోదిస్తున్నాడు. పాపపై కరుణతో హృదయమున్న దాతలు సహకరించాలని వేడుకుంటున్నాడు.
రాజశేఖర్‌కు సహాయం చేయాలనుకునేవారు: అకౌంట్ నంబర్ : 20343433912 ఎస్‌బీఐ బ్యాంకు, ఐఎఫ్‌ఎస్‌సీ కోడ్: ఎస్‌బీఐఎన్0014237, ఫోన్‌పే/గూగుల్‌పే నంబర్ : 77024 88503.
Comments
Please login to add a commentAdd a comment