risita
-
నాన్న..! 'నాకు మాట్లాడాలని ఉంది'..
కరీంనగర్: ఆ కుటుంబంలో మొదటి సంతానంగా పాప జన్మించింది. ఇంట్లో లక్ష్మీదేవి పుట్టిందని సంబరపడ్డారు. ఆ సంబరం ఏడాది తిరగకముందే ఆవిరైంది. పాపకు మాటలు రాకపోవడంతో ఆసుపత్రుల చుట్టూ తిరిగారు. ఆస్తులు అమ్ముకొని కొంత, దాతల సహకారంతో కొంత సొమ్ము సేకరించి కేంద్ర ప్రభుత్వ పథకంతో ఆపరేషన్ చేయించినా, లక్షల్లో ఖరీదు చేసే హియరింగ్ మిషన్ల కొనుగోలుకు డబ్బుల్లేక తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. పాపకు మాటలు రావాలంటే మిషన్లకు, హియరింగ్ థెరపీకి రూ.11 లక్షలు అవసరముండడంతో దాతల సాయం కోసం ఎదురుచూస్తున్నారు. కూతురు తపన.. తండ్రి ఆవేదన! కరీంనగర్ జిల్లా రామడుగు మండలం రంగసాయిపల్లె గ్రామానికి చెందిన పోతు రాజశేఖర్, కావ్యశ్రీ దంపతులకు 2016లో రిషిత జన్మించింది. ఆరోగ్యంగానే ఉన్న పాప ఏడాది వయస్సు వచ్చినా మాట్లాడకపోవడంతో అనుమానం వచ్చి ఆసుపత్రిలో చూపించారు. అన్ని పరీక్షలు నిర్వహించిన వైద్యులు పాపకు పుట్టుకతోనే మూగ, చెవుడు సమస్య ఉన్నట్లు గుర్తించారు. స్పీచ్ థెరపీతో మాటలు వస్తాయని చెప్పడంతో 2017లో తిరుపతిలోని శ్రవణం స్వీచ్ థెరపీ ఆస్పత్రిలో ఏడాది పాటు ఉండి చికిత్స అందించారు. అయినా ఫలితం లేకపోవడంతో 2018లో దాతల సాయంతో రూ.1.5 లక్షలతో వినికిడి యంత్రం కొనుగోలు చేసినా పాపకు ఉపయోగపడలేదు. మళ్లీ 2019లో హైదరాబాద్ అపోలో ఆస్పత్రికి వెళ్లగా ఆపరేషన్ చేస్తే నయం అవుతుందని తెలిపారు. ఆపరేషన్‌కు రూ.15 లక్షలు ఖర్చవుతాయని చెప్పడంతో దిక్కుతోచని పరిస్థితి ఏర్పడింది. కేంద్ర పథకం అడిప్ స్కీం కింద అవకాశం ఉండడంతో దరఖాస్తు చేసుకున్నారు. అడిప్ స్కీం కింద తల లోపల కాక్లర్ ఇంప్లాట్ మిషన్ వేశారు. ఆపరేషన్ చేయడం ఒక ఎత్తయితే, తర్వాత హియరింగ్ మిషన్ కొనుగోలు చేయడం తలకుమించిన భారంగా మారింది. ఆపరేషన్ తర్వాత ప్రతీ రెండు నెలలకోసారి ఆస్పత్రికి తీసుకెళ్లి పరీక్షలు నిర్వహించాలి. ఈ క్రమంలో చెవిలో ఇన్ఫెక్షన్ సోకడంతో 2022లో మరోసారి ఆపరేషన్ చేయించారు. ఓ బిల్డర్ వద్ద సూపర్వైజర్గా పనిచేసుకునే రాజశేఖర్ తరచూ బిడ్డను ఆసుపత్రులకు తీసుకెళ్తున్న క్రమంలో ఉద్యోగం కూడా పోయింది. దీంతో ఇల్లు గడవడం కష్టంగా మారింది. ఊళ్లో ఉన్న ఇల్లు అమ్మినా అప్పులు తీరలేదు. ప్రస్తుతం రేకుర్తిలో ఉంటున్నారు. రిషిత మాట్లాడాలంటే కుడి చెవికి రూ.7.5 లక్షల విలువైన న్యూక్లియర్–8 మిషన్, ఎడమ చెవికి రూ.1.5 లక్షల మరో మిషన్ అవసరముంది. వీటిని కొనుగోలు చేసినా ప్రతినెలా రూ.13 వేలు వెచ్చించి రెండేళ్లపాటు స్పీచ్ థెరపీ అందించాల్సి ఉంటుంది. సుమారు రూ.11 లక్షలు ఖర్చు చేస్తే తప్ప పాప మూగ గొంతుకు మాటలు వచ్చే అవకాశం లేదు. ఇప్పటికే అప్పుల్లో కూరుకుపోయిన రాజశేఖర్ కూతురు కోసం రోదిస్తున్నాడు. పాపపై కరుణతో హృదయమున్న దాతలు సహకరించాలని వేడుకుంటున్నాడు. రాజశేఖర్‌కు సహాయం చేయాలనుకునేవారు: అకౌంట్ నంబర్ : 20343433912 ఎస్బీఐ బ్యాంకు, ఐఎఫ్ఎస్సీ కోడ్: ఎస్బీఐఎన్0014237, ఫోన్‌పే/గూగుల్‌పే నంబర్ : 77024 88503. ఇవి చదవండి: డూప్లెక్స్ ‘ఇందిరమ్మ’! -
బోల్తాపడ్డ స్కూలు బస్సు.. చిన్నారి మృతి
పాలకొల్లు పట్టణంలోని బ్రాడీపేట బైపాస్ రోడ్డు వద్ద ఓ స్కూలు బస్సు అదుపుతప్పి బోల్తాపడింది. ప్రమాదానికి గురైన బస్సు సన్‌షైన్ స్కూల్‌కి చెందినదిగా గుర్తించారు. ఈ ఘటనలో పెద్దేవారిపేట గ్రామానికి చెందిన ఎన్. రిషిత(5) అనే యూకేజీ విద్యార్థినికి తీవ్రగాయాలయ్యాయి. చిన్నారిని ఆసుపత్రికి తరలిస్తుండగా మార్గమధ్యంలోనే ప్రాణాలు విడిచింది. మరో పది మంది చిన్నారులు స్వల్పంగా గాయపడ్డారు. గాయపడిన వారిని స్థానిక ఆసుపత్రులకు తరలించి చికిత్స అందిస్తున్నారు. -
రిషితకు అశ్రునివాళి
సోమవారం ఇంటికి చేరిన మృతదేహం తల్లిదండ్రులు,స్నేహితులు కన్నీరు మున్నీరు అంత్యక్రి యలు పూర్తి జగద్గిరిగుట్ట: ‘కాలేజీ నుంచి రావడంలో ఐదు నిమిషాలు ఆలస్యమైతేనే ఆందోళన చెందే మేము ఇప్పుడు నువ్వు మా నుంచి శాశ్వతంగా దూరమయ్యావన్న ఛేదు నిజాన్ని ఎలా తట్టుకోవాలి’.. అంటూ రిషితారెడ్డి తల్లిదండ్రులు కన్నీరు మున్నీరయ్యారు. హిమచల్‌ప్రదేశ్‌లోని బియాస్ నదిలో గల్లంతై మృతి చెందిన విజ్ఞానజ్యోతి కాలేజీ విద్యార్థిని రిషితారెడ్డి మృతదేహం 42 రోజుల తర్వాత లభించింది. మృతదేహం లభించినట్టు అధికారులు తల్లిదండ్రులకు ఆదివారం సమాచారం ఇచ్చారు. ఈ దుర్వార్త విన్నప్పటి నుంచి తల్లిదండ్రులు దేవుడా! ప్రాణానికి ప్రాణంగా పెంచుకుంటున్న మా ఒక్కగానొక్క కూతుర్ని తీసుకుపోయావా.. అంటూ గుండెలవిసేలా రోదిస్తూనే ఉన్నారు. సోమవారం మధ్యాహ్నం 1.35కి రిషితారెడ్డి మృతదేహాన్ని తహసీల్దార్ కృష్ణ శంషాబాద్ ఎయిర్‌పోర్టు నుంచి బాచుపల్లిలోని ఆమె నివాసానికి తీసుకొచ్చారు. మృతదేహాన్ని చూడగానే తల్లిదండ్రులు కుప్పకూలిపోయారు. అప్పటికే పెద్ద ఎత్తున అక్కడికి చేరుకున్న బంధువులు, విజ్ఞానజ్యోతి కాలేజీ విద్యార్థులు, సిబ్బంది రిషిత మృతదేహానికి కన్నీటి నివాళులర్పించారు. అనంతరం అశ్రునయనాల మధ్య బాచుపల్లిలోని శ్మాశనవాటికలో అంత్యక్రియలు నిర్వహించారు. బియాస్ ఘటనలో మృతి చెందిన విద్యార్థుల తల్లిదండ్రులు కూడా అంత్యక్రియల్లో పాల్గొన్నారు. ఇదిలా ఉండగా, బియాస్ నది ప్రమాదంలో మృతి చెందిన విద్యార్థులు 24 మంది, అంతకు ముందు పులిచింతల వద్ద చనిపోయిన ఇద్దరు విద్యార్థుల ఫొటోలతో బ్యానర్ ఏర్పాటు చేసి స్నేహితులు నివాళులర్పించారు. -
‘రిషిత’ ఇంట విషాదఛాయలు
జగద్గిరిగుట్ట(బాచుపల్లి), నల్లకుంట: హిమాచల్‌ప్రదేశ్ బియాస్ నదిలో గల్లంతైన వీఎన్ఆర్ విజ్ఞాన జ్యోతి ఇంజనీరింగ్ కళాశాల విద్యార్థి రిషితారెడ్డి ఇంట ఆదివారం విషాద ఛాయలు అలుముకున్నాయి. ఆమె మృతదేహం ఆదివారం లభించినట్లు అధికారులు వెల్లడించారు. గల్లంతైన వారిలో నగరానికి చెందిన 16 మందిలో ఇప్పటి వరకు 15 మంది మృతదేహాలు లభ్యమయ్యాయి. ఇక నల్లకుంటకు చెందిన శ్రీహర్ష ఆచూకీ లభించాల్సి ఉంది. గల్లంతైన 42 రోజుల తరువాత రిషితారెడ్డి మృతదేహం లభ్యమైందన్న సమాచారం తెలుసుకున్న కుటుంబ సభ్యులు బోరున విలపించారు. ఆమె మరణ వార్త తెలియడంతో కుప్పకూలిపోయారు. అమ్మానాన్నల కుటుంబాల తరఫున.. రిషితారెడ్డి అమ్మ తరఫున, ఇటు నాన్న బంధువుల్లో ఒకే ఒక ఆడపడుచు కావడంతో ఆమె కుటుంబ సభ్యులు, బంధువులు తీవ్ర దుఖ: సాగరంలో మునిగిపోయారు. అంత్యక్రియలకు ఏర్పాట్లు రిషితఅంత్యక్రియలను బాచుపల్లి గ్రామంలోని శ్మశాన వాటికలో నిర్వహించనున్నట్లు బంధువులు పేర్కొన్నారు. అంత్యక్రియల కోసం కుత్బుల్లాపూర్ మండల రెవెన్యూ అధికారులు, బాచుపల్లి పంచాయతీ పాలక వర్గం అన్ని ఏర్పాట్లు చేయనున్నట్లు తెలిపారు. ఇంకా ఎదురుచూపులే.. ఇక కల్లూరి శ్రీహర్ష (19) ఆచూకి నేటికి తెలియరాలేదు. నల్లకుంట శివం రోడ్డు బతుకమ్మ కుంట సబ్‌స్టేషన్ ఎదురు వీధిలోని శ్రీమత్ రాజాస్ రెసిడెన్సీలో ఉండే అడ్వకేట్ కేఆర్‌కేబీ.ప్రసాద్, స్వర్ణలత దంపతుల కుమారుడు కల్లూరి శ్రీహర్ష (19) గత నెల 8న బియాస్ నదిలో గల్లంతయ్యాడు. ఆదివారం మరో ఇద్దరు విద్యార్థినుల మృతదేహాలు లభ్యం కాగా గల్లంతైన వారిలో నల్లకుంటకు చెందిన శ్రీ హర్ష జాడ నేటికి తెలియరాలేరు. -
ఎడతెగని నిరీక్షణ..
బియాస్ దుర్ఘటన జరిగి నేటికి నెల ఇంకా తీరని వేదన.. ఆగని రోదన గల్లంతైన వారి కోసం కొనసాగుతున్న గాలింపు మరణించిన విద్యార్థుల ఇళ్ల వద్ద తొలగని విషాద ఛాయలు సాక్షి, సిటీబ్యూరో/నల్లకుంట/జగద్గిరిగుట్ట: బియాస్ ఘటన జరిగిన నేటికి సరిగ్గా నెల.. అయినా ఇంకా తీరని వేదన.. ఆగని రోదన.. ఈ ఘటనలో నగరానికి చెందిన 16 మంది విద్యార్థులు మరణించారు. గల్లంతైన వారిలో మరో ముగ్గురి ఆచూకీ లేకుండా పోయింది. గల్లంతైన విద్యార్థులు శ్రీనిధి (కరీంనగర్), రిషితారెడ్డి (బాచుపల్లి), కల్లూరి శ్రీహర్ష (నల్లకుంట) కోసం కన్నవారు కళ్లలో వేయి వత్తులు వేసుకొని ఎదురు చూస్తున్నారు. నిద్రాహారాలు మాని తమ వారి కోసం ఎడతెగని నిరీక్షణతో భారంగా కాలం వెళ్లదీస్తున్నారు. ఇక దుర్ఘటనలో మృత్యువాత పడిన 16 మంది నగర విద్యార్థుల ఇళ్ల వద్ద కూడా ఇంకా విషాదఛాయలు తొలిగిపోలేదు. బంధుమిత్రుల పరామర్శలతో, ఆత్మీయుల పలకరింపులతో నేటికీ ఉద్విగ్నవాతావరణం నెలకొంది. బాచుపల్లిలోని వీఎన్ఆర్ విజ్ఞాన్ జ్యోతి కళాశాలలో సెలవుల అనంతరం సోమవారం తరగతులు పునఃప్రారంభమయ్యాయి. తోటి విద్యార్థులను కోల్పోయి షాక్‌కు గురైన పలువురు విద్యార్థులు భారంగా కాలేజీకి వచ్చారు. మొన్నటివరకు తమ మిత్రులతో కళాశాల ఆవరణలో గడిపిన తీపి జ్ఞాపకాలను గుర్తుచేసుకోవడంతో కళాశాల వాతావరణం ఉద్విగ్నంగా మారింది. కళాశాల వద్ద విషాద ఛాయలు దుర్ఘటన జరిగి నెలైనా వీఎన్ఆర్ విజ్ఞాన జ్యోతి కాలేజీ విద్యార్థులు ఇంకా షాక్ నుంచి తేరుకోలేదు. సెలవుల అనంతరం సోమవారం పునఃప్రారంభమైన బాచుపల్లిలోని కళాశాల ప్రాంగణంలో ఉద్విగ్నత నెలకొంది. నదీ ప్రవాహంలో 24 మంది విద్యార్థులు గల్లంతు కాగా వారిలో 21 మంది మృత్యువాతపడడం, మరో ముగ్గురు విద్యార్థుల ఆచూకీ తెలియకపోవడంతో తోటి విద్యార్థులు తీవ్రంగా కలత చెందారు. తమ తోటి వారితో గడిపిన స్మృతులను, కళాశాల ప్రాంగణంలో వారితో కలిసి మెలిసి గడిపిన సంఘటనలను గుర్తుచేసుకొని తల్లడిల్లారు. ప్రతి విద్యార్థి ముఖంలోనూ విషాద ఛాయలే కనిపించాయి. కళాశాల ఆవరణలో విద్యార్థులతోపాటు, సిబ్బంది, ఫ్యాకల్టీలు మృతి చెందిన విద్యార్థుల ఆత్మకు శాంతి కలగాలని రెండు నిమిషాలు మౌనం పాటించారు. అనంతరం కాలేజీకి సెలవు ప్రకటించడంతో విద్యార్థులు బరువెక్కిన హృదయాలతో ఇళ్లకు తిరిగి వెళ్లారు. పరిహారంపై సర్కార్ల నిర్లక్ష్యం.. దుర్ఘటనలో మృత్యువాత పడిన విద్యార్థుల కుటుంబాలకు హిమాచల్ ప్రదేశ్, ఏపీ, తెలంగాణ రాష్ట్రాల ప్రభుత్వాలు రూ.5 లక్షల చొప్పున నష్టపరిహారం ప్రకటించాయి. కానీ ఇప్పటివరకు బాధిత కుటుంబాలకు ఏ ఒక్క ప్రభుత్వం నుంచి పరిహారం అందలేదని బాధితుడు సంజయ్‌కుమార్ (మిట్టపల్లి అఖిల్ తండ్రి) ‘సాక్షి’కి తెలిపారు. విద్యారుణాలను మాఫీ చేస్తామని, కళాశాలకు చెల్లించిన ఫీజులను తిరిగి తల్లిదండ్రులకు ఇస్తామన్న వాగ్దానాలు సైతం మాటలకే పరిమితమయ్యాయని ఆయన పేర్కొన్నారు. ప్రాణాలు కోల్పోయిన నగర విద్యార్థులు వీరే.. బియాస్ నదిలో గల్లంతైన వారిలో 16 మంది నగర విద్యార్థులు మృత్యువాత పడ్డారు. వీరిలో విజేత, లక్ష్మీగాయత్రి, ఐశ్వర్య, రాంబాబు, దేవాశీష్బోస్, సాబేర్ హుస్సేన్, అరవింద్, పరమేశ్వర్, పి.వెంకటదుర్గ తరుణ్, అశీష్మంతా, మాచర్ల అఖిల్, శివప్రకాశ్‌వర్మ, సాయిరాజ్, బైరినేని రిత్విక్, కిరణ్‌కుమార్, మిట్టపల్లి అఖిల్ ఉన్నారు. రిషితా ఎక్కడున్నావమ్మా... కూతురు రిషితారెడ్డి జాడ తెలియక తల్లి మంచం దిగడంలేదు. చెల్లెలి కోసం చెమ్మగిల్లిన కళ్లతో అన్న.. ఏమి చేయాలో తెలియని నిస్సహాయ స్థితిలో నేను కొట్టుమిట్టాడుతున్నాం. కూతురి జాడ కోసం నెల రోజులుగా ఎదురు చూస్తున్నాం. హిమాచల్‌ప్రదేశ్ ప్రభుత్వం ఏర్పాటుచేసిన హెల్ప్‌లైన్ నంబర్లకు నిత్యం ఫోన్‌చేసి సమాచారం తెలుసుకుంటున్నాం. ప్రాణాలతో వస్తుందనే ఆశతోనే బతుకుతున్నాం. దుర్ఘటనకుకాలేజీ యాజమాన్యమే కారణం. విద్యార్థులను స్టడీ టూర్‌కి తీసుకెళ్లిన కళాశాల యాజమాన్యంతోపాటు ఫ్యాకల్టీలు అడుగడుగునానిర్లక్ష్యంగా వ్యవహరించారు. - కృష్ణారెడ్డి (గల్లంతైన రిషితారెడ్డి తండ్రి) శ్రీహర్ష కోసం వేయికళ్లతో.. బియాస్ నదిలో గల్లంతైన కల్లూరి శ్రీహర్ష (19) కోసం తల్లిదండ్రులు కేఆర్‌కేబీ ప్రసాద్, స్వర్ణలతలు కళ్లలో వత్తులు వేసుకొని ఎదురుచూస్తున్నారు. ఎప్పటికైనా తమవాడు తిరిగివస్తాడన్న ఆశతో జీవిస్తున్నారు. నల్లకుంట శివం రోడ్డు బతుకమ్మకుంట సబ్‌స్టేషన్ ఎదురు వీధిలోని శ్రీమత్ రాజాస్ రెసిడెన్సీలో (ఇంటి నంబర్ 2-2-1118/ఏ) వారు నివాసముంటున్నారు. కేఆర్‌కేబీ ప్రసాద్ వృత్తిరీత్యా అడ్వకేట్. జూన్ 3న వీఎన్ఆర్ కళాశాల నుంచి హిమాచల్‌ప్రదేశ్ స్టడీ టూర్‌కు వెళ్లిన వారిలో ప్రసాద్ కుమారుడు శ్రీహర్ష కూడా ఉన్నాడు. అదే నెల 8న స్నేహితులతో కలిసి ఫొటోలు దిగుతూ బియాస్ నదిలో గల్లంతైన విషయం విదితమే. నెల రోజులు గడుస్తున్నా నేటికీ ఆచూకీ లభించలేదు. తమ కుమారుడు ఇంకా ప్రాణాలతోనే ఉన్నాడని, ఏదో ఒక రోజు క్షేమంగా ఇంటికి తిరిగి వస్తాడని శ్రీహర్ష తల్లిదండ్రులు ఆశతో కుమారుని కోసం కళ్లుకాయలు కాసేలా ఎదురు చూస్తుండడం అందరినీ కలచివేస్తోంది. కుటుంబ సభ్యులతోపాటు బందువులు, స్నేహితులు శ్రీహర్ష జాడకోసం ప్రత్యేక పూజలు చేస్తున్నారు. క్షేమంగా తిరిగి రావాలని కోరుకుంటున్నారు. చాలా బాధగా ఉంది... బియాస్ ఘటన దురదృష్టకరం. ఇంత మంది మృతి చెందడం ఎంతో బాధకలిగించింది. కాలేజీలోని ప్రతి విద్యార్థి ఇప్పటికి ఈ షాక్ నుంచి తేరుకోలేక పోతున్నారు. - రాజేశ్, ఎంటెక్, ఫస్ట్ ఇయర్ ఎక్కడ చూసినా అదే చర్చ.. ఈ రోజు కాలేజీకి రాగానే బియాస్ ఘటననే గుర్తుచేసుకున్నాం. మరణించిన విద్యార్థులను తలచుకుంటేనే ఎంతో ఆవేదన కలుగుతోంది. వారి తల్లిదండ్రులకు భగవంతుడు ధైర్యం ఇవ్వాలి. - రామ్, ఎంటెక్, ఫస్ట్ ఇయర్ తలచుకుంటేనే భయంగా ఉంది.. మా తోటి విద్యార్థులు నది ప్రవాహంలో కొట్టుకుపోవడం.. ఆపై మరణించడం తలచుకుంటేనే భయంగా ఉంది. ఇలాంటి సంఘటన జరగడం దురదృష్టకరం. - రఘువీర్, బిటెక్, తృతీయ సంవత్సరం మరువలేని చేదు జ్ఞాపకం... బియాస్ నదిలో మా స్నేహితులను కోల్పోవడం జీవితంలో ఓ చేదు జ్ఞాపకం. ఈ దురదృష్టకర సంఘటన నిజం కాకుంటే బాగుండు అనిపించింది. - చైతన్య, బిటెక్, తృతీయ సంవత్సరం