ఎడతెగని నిరీక్షణ..
- బియాస్ దుర్ఘటన జరిగి నేటికి నెల
- ఇంకా తీరని వేదన.. ఆగని రోదన
- గల్లంతైన వారి కోసం కొనసాగుతున్న గాలింపు
- మరణించిన విద్యార్థుల ఇళ్ల వద్ద తొలగని విషాద ఛాయలు
సాక్షి, సిటీబ్యూరో/నల్లకుంట/జగద్గిరిగుట్ట: బియాస్ ఘటన జరిగిన నేటికి సరిగ్గా నెల.. అయినా ఇంకా తీరని వేదన.. ఆగని రోదన.. ఈ ఘటనలో నగరానికి చెందిన 16 మంది విద్యార్థులు మరణించారు. గల్లంతైన వారిలో మరో ముగ్గురి ఆచూకీ లేకుండా పోయింది. గల్లంతైన విద్యార్థులు శ్రీనిధి (కరీంనగర్), రిషితారెడ్డి (బాచుపల్లి), కల్లూరి శ్రీహర్ష (నల్లకుంట) కోసం కన్నవారు కళ్లలో వేయి వత్తులు వేసుకొని ఎదురు చూస్తున్నారు. నిద్రాహారాలు మాని తమ వారి కోసం ఎడతెగని నిరీక్షణతో భారంగా కాలం వెళ్లదీస్తున్నారు.
ఇక దుర్ఘటనలో మృత్యువాత పడిన 16 మంది నగర విద్యార్థుల ఇళ్ల వద్ద కూడా ఇంకా విషాదఛాయలు తొలిగిపోలేదు. బంధుమిత్రుల పరామర్శలతో, ఆత్మీయుల పలకరింపులతో నేటికీ ఉద్విగ్నవాతావరణం నెలకొంది. బాచుపల్లిలోని వీఎన్‌ఆర్ విజ్ఞాన్ జ్యోతి కళాశాలలో సెలవుల అనంతరం సోమవారం తరగతులు పునఃప్రారంభమయ్యాయి. తోటి విద్యార్థులను కోల్పోయి షాక్‌కు గురైన పలువురు విద్యార్థులు భారంగా కాలేజీకి వచ్చారు. మొన్నటివరకు తమ మిత్రులతో కళాశాల ఆవరణలో గడిపిన తీపి జ్ఞాపకాలను గుర్తుచేసుకోవడంతో కళాశాల వాతావరణం ఉద్విగ్నంగా మారింది.
కళాశాల వద్ద విషాద ఛాయలు
దుర్ఘటన జరిగి నెలైనా వీఎన్‌ఆర్ విజ్ఞాన జ్యోతి కాలేజీ విద్యార్థులు ఇంకా షాక్ నుంచి తేరుకోలేదు. సెలవుల అనంతరం సోమవారం పునఃప్రారంభమైన బాచుపల్లిలోని కళాశాల ప్రాంగణంలో ఉద్విగ్నత నెలకొంది. నదీ ప్రవాహంలో 24 మంది విద్యార్థులు గల్లంతు కాగా వారిలో 21 మంది మృత్యువాతపడడం, మరో ముగ్గురు విద్యార్థుల ఆచూకీ తెలియకపోవడంతో తోటి విద్యార్థులు తీవ్రంగా కలత చెందారు. తమ తోటి వారితో గడిపిన స్మృతులను, కళాశాల ప్రాంగణంలో వారితో కలిసి మెలిసి గడిపిన సంఘటనలను గుర్తుచేసుకొని తల్లడిల్లారు. ప్రతి విద్యార్థి ముఖంలోనూ విషాద ఛాయలే కనిపించాయి. కళాశాల ఆవరణలో విద్యార్థులతోపాటు, సిబ్బంది, ఫ్యాకల్టీలు మృతి చెందిన విద్యార్థుల ఆత్మకు శాంతి కలగాలని రెండు నిమిషాలు మౌనం పాటించారు. అనంతరం కాలేజీకి సెలవు ప్రకటించడంతో విద్యార్థులు బరువెక్కిన హృదయాలతో ఇళ్లకు తిరిగి వెళ్లారు.
పరిహారంపై సర్కార్ల నిర్లక్ష్యం..
దుర్ఘటనలో మృత్యువాత పడిన విద్యార్థుల కుటుంబాలకు హిమాచల్ ప్రదేశ్, ఏపీ, తెలంగాణ రాష్ట్రాల ప్రభుత్వాలు రూ.5 లక్షల చొప్పున నష్టపరిహారం ప్రకటించాయి. కానీ ఇప్పటివరకు బాధిత కుటుంబాలకు ఏ ఒక్క ప్రభుత్వం నుంచి పరిహారం అందలేదని బాధితుడు సంజయ్‌కుమార్ (మిట్టపల్లి అఖిల్ తండ్రి) ‘సాక్షి’కి తెలిపారు. విద్యారుణాలను మాఫీ చేస్తామని, కళాశాలకు చెల్లించిన ఫీజులను తిరిగి తల్లిదండ్రులకు ఇస్తామన్న వాగ్దానాలు సైతం మాటలకే పరిమితమయ్యాయని ఆయన పేర్కొన్నారు.
ప్రాణాలు కోల్పోయిన నగర విద్యార్థులు వీరే..
బియాస్ నదిలో గల్లంతైన వారిలో 16 మంది నగర విద్యార్థులు మృత్యువాత పడ్డారు. వీరిలో విజేత, లక్ష్మీగాయత్రి, ఐశ్వర్య, రాంబాబు, దేవాశీష్‌బోస్, సాబేర్ హుస్సేన్, అరవింద్, పరమేశ్వర్, పి.వెంకటదుర్గ తరుణ్, అశీష్‌మంతా, మాచర్ల అఖిల్, శివప్రకాశ్‌వర్మ, సాయిరాజ్, బైరినేని రిత్విక్, కిరణ్‌కుమార్, మిట్టపల్లి అఖిల్ ఉన్నారు.
రిషితా ఎక్కడున్నావమ్మా...
కూతురు రిషితారెడ్డి జాడ తెలియక తల్లి మంచం దిగడంలేదు. చెల్లెలి కోసం చెమ్మగిల్లిన కళ్లతో అన్న.. ఏమి చేయాలో తెలియని నిస్సహాయ స్థితిలో నేను కొట్టుమిట్టాడుతున్నాం. కూతురి జాడ కోసం నెల రోజులుగా ఎదురు చూస్తున్నాం. హిమాచల్‌ప్రదేశ్ ప్రభుత్వం ఏర్పాటుచేసిన హెల్ప్‌లైన్ నంబర్లకు నిత్యం ఫోన్‌చేసి సమాచారం తెలుసుకుంటున్నాం. ప్రాణాలతో వస్తుందనే ఆశతోనే బతుకుతున్నాం. దుర్ఘటనకుకాలేజీ యాజమాన్యమే కారణం. విద్యార్థులను స్టడీ టూర్‌కి తీసుకెళ్లిన కళాశాల యాజమాన్యంతోపాటు ఫ్యాకల్టీలు అడుగడుగునానిర్లక్ష్యంగా వ్యవహరించారు.
- కృష్ణారెడ్డి (గల్లంతైన రిషితారెడ్డి తండ్రి)
శ్రీహర్ష కోసం వేయికళ్లతో..
బియాస్ నదిలో గల్లంతైన కల్లూరి శ్రీహర్ష (19) కోసం తల్లిదండ్రులు కేఆర్‌కేబీ ప్రసాద్, స్వర్ణలతలు కళ్లలో వత్తులు వేసుకొని ఎదురుచూస్తున్నారు. ఎప్పటికైనా తమవాడు తిరిగివస్తాడన్న ఆశతో జీవిస్తున్నారు. నల్లకుంట శివం రోడ్డు బతుకమ్మకుంట సబ్‌స్టేషన్ ఎదురు వీధిలోని శ్రీమత్ రాజాస్ రెసిడెన్సీలో (ఇంటి నంబర్ 2-2-1118/ఏ) వారు నివాసముంటున్నారు. కేఆర్‌కేబీ ప్రసాద్ వృత్తిరీత్యా అడ్వకేట్. జూన్ 3న వీఎన్‌ఆర్ కళాశాల నుంచి హిమాచల్‌ప్రదేశ్ స్టడీ టూర్‌కు వెళ్లిన వారిలో ప్రసాద్ కుమారుడు శ్రీహర్ష కూడా ఉన్నాడు. అదే నెల 8న స్నేహితులతో కలిసి ఫొటోలు దిగుతూ బియాస్ నదిలో గల్లంతైన విషయం విదితమే. నెల రోజులు గడుస్తున్నా నేటికీ ఆచూకీ లభించలేదు. తమ కుమారుడు ఇంకా ప్రాణాలతోనే ఉన్నాడని, ఏదో ఒక రోజు క్షేమంగా ఇంటికి తిరిగి వస్తాడని శ్రీహర్ష తల్లిదండ్రులు ఆశతో కుమారుని కోసం కళ్లుకాయలు కాసేలా ఎదురు చూస్తుండడం అందరినీ కలచివేస్తోంది. కుటుంబ సభ్యులతోపాటు బందువులు, స్నేహితులు శ్రీహర్ష జాడకోసం ప్రత్యేక పూజలు చేస్తున్నారు. క్షేమంగా తిరిగి రావాలని కోరుకుంటున్నారు.
చాలా బాధగా ఉంది...
బియాస్ ఘటన దురదృష్టకరం. ఇంత మంది మృతి చెందడం ఎంతో బాధకలిగించింది. కాలేజీలోని ప్రతి విద్యార్థి ఇప్పటికి ఈ షాక్ నుంచి తేరుకోలేక పోతున్నారు.
- రాజేశ్, ఎంటెక్, ఫస్ట్ ఇయర్
ఎక్కడ చూసినా అదే చర్చ..
ఈ రోజు కాలేజీకి రాగానే బియాస్ ఘటననే గుర్తుచేసుకున్నాం. మరణించిన విద్యార్థులను తలచుకుంటేనే ఎంతో ఆవేదన కలుగుతోంది. వారి తల్లిదండ్రులకు భగవంతుడు ధైర్యం ఇవ్వాలి.
- రామ్, ఎంటెక్, ఫస్ట్ ఇయర్
తలచుకుంటేనే భయంగా ఉంది..
మా తోటి విద్యార్థులు నది ప్రవాహంలో కొట్టుకుపోవడం.. ఆపై మరణించడం తలచుకుంటేనే భయంగా ఉంది. ఇలాంటి సంఘటన జరగడం దురదృష్టకరం.
- రఘువీర్, బిటెక్, తృతీయ సంవత్సరం
మరువలేని చేదు జ్ఞాపకం...
బియాస్ నదిలో మా స్నేహితులను కోల్పోవడం జీవితంలో ఓ చేదు జ్ఞాపకం. ఈ దురదృష్టకర సంఘటన నిజం కాకుంటే బాగుండు అనిపించింది.
- చైతన్య, బిటెక్, తృతీయ సంవత్సరం