ప్రపంచమంతా పచ్చగా ఉందని, తెల్లనివన్నీ పాలని, నల్లనివన్నీ నీళ్లని అనుకుంటే పొరపాటే! రంగు రంగుల లోకంలోనే రకరకాల రాకాసి జంతు ప్రవృత్తులు ఉంటాయి. జంతుతతి నుంచి మనిషి వేరుపడి సహస్రాబ్దాలు గడచిపోయాయి. అయినా, మనుషుల్లోని జంతుప్రవృత్తి పూర్తిగా తొలగిపోలేదు. కొన్ని సందర్భాల్లో జంతువుల కంటే క్రూరంగా, దారుణంగా ప్రవర్తించే మనుషుల ఉదంతాలు వార్తలకెక్కుతుండటం మనకు తెలియనిదేమీ కాదు.
ఆకుపచ్చని పచ్చికబయళ్లలో సుతిమెత్తని పచ్చిక మాత్రమే కాదు, విషపూరితమైన పసరిక పాములు కూడా ఉంటాయి. దట్టమైన అడవుల్లో పచ్చని చెట్లూ చేమలు, రంగు రంగుల పువ్వులూ పిట్టలూ పిచుకలూ, జంతువులూ మాత్రమే కాదు, ఏమరుపాటుగా దొరికితే మనుషులను పలారం చేసే క్రూరమృగాలు ఉంటాయి.
కసిగా కాటు వేసే కాలసర్పాలు ఉంటాయి. కీకారణ్యాల్లో పొంచి ఉండే ప్రమాదాలన్నీ జనారణ్యంలోనూ ఉంటాయి. జనారణ్యంలో అడుగడుగునా తారసపడే చాలా మంది మనుషుల్లో జంతులక్షణాలు కనిపిస్తాయి. మనుషుల్లోని మేకపోతు గాంభీర్యాలు, గోడమీది పిల్లి వాలకాలు, గుంటనక్క తెలివితేటలు అపరిచితమైనవేమీ కాదు.
మనుషుల్లోని జంతులక్షణాలను గుర్తించడం వల్లనే విష్ణుశర్మ ‘పంచతంత్రం’ రాశాడు. జంతు పాత్రల ద్వారా మనుషుల స్వభావాలను తేటతెల్లం చేస్తూ కథలు చెప్పాడు. ‘పంచతంత్రం’ కథలు చిన్నపిల్లలకు కూడా తేలికగా అర్థమవుతాయి. ఆ తర్వాత చాలాకాలానికి జార్జ్ ఆర్వెల్ ‘యానిమల్ ఫామ్’ రాశాడు.
ఇది కూడా దాదాపు ‘పంచతంత్రం’లాంటి ప్రయోగమే! ‘పంచతంత్రం’ నాటికి, ‘యానిమల్ ఫామ్’ నాటికి సమాజం చాలా మారింది. ‘యానిమల్ ఫామ్’లో దోపిడీ సమాజంలో నలిగిపోతున్న మనుషుల పరిస్థితిని, శ్రమదోపిడీలో నలిగిపోయేవారి స్వేచ్ఛాభిలాషను, వారి స్వేచ్ఛకు తూట్లు పొడిచే శక్తుల కుతంత్రాలను జంతుపాత్రల ద్వారా ఆర్వెల్ చెప్పాడు.
జంతువులను పాత్రలుగా చేసుకుని కథలు చెప్పడం ‘పంచతంత్రం’తోనే మొదలు కాలేదు.‘పంచతంత్రం’ దాదాపుగా క్రీస్తుశకం ఐదో శతాబ్ది నాటిది. అంతకు దాదాపు వెయ్యేళ్ల ముందే– క్రీస్తుపూర్వం ఆరో శతాబ్దికి చెందిన గ్రీకు బానిస ఈసప్ ఇలాంటి కథలనే ఎన్నో చెప్పాడు. ప్రాచీన రోమన్ సాహిత్యంలోని ‘ఫెడ్రస్ కథలు’, గ్రీకు సాహిత్యంలోని బాబ్రియస్ కథలు ఇలాంటివే!
ఫ్రెంచ్ సాహిత్యంలోని ‘లా ఫోంటేన్ ఫేబుల్స్’ కూడా ఇలాంటివే!‘లా ఫోంటేన్ ఫేబుల్స్’ రచయిత జీన్ డి లా ఫోంటేన్ ప్రాచ్య, పాశ్చాత్య దేశాల్లో ప్రచారంలో ఉన్న జంతువుల పాత్రలు ప్రధానంగా ఉన్న కథలను సేకరించి, పదిహేడో శతాబ్దిలో ఈ కథల పుస్తకాలను పన్నెండు భాగాలుగా వెలువరించాడు.
జంతువులను ప్రధాన పాత్రలుగా చేసుకున్న ఈసప్ కథలు, పంచతంత్ర కథలు అనేక ప్రపంచ భాషల్లోకి అనువాదం పొందాయి. ఇవి ఈనాటికీ తాజాగానే ఉన్నాయి. ఇప్పటి సమాజంలో సంచ రిస్తున్న మనుషుల స్వభావాలు పంచతంత్ర కథల్లోనూ, ఈసప్ కథల్లోనూ కొట్టొచ్చినట్లు కనిపిస్తాయి. మనుషుల స్వభావాలను జంతువులకు ఆపాదించి చెప్పడం సమస్త భాషల సాహిత్యంలోనూ ఒక పురాతన కళాత్మక పద్ధతి.
ఓపిక ఉన్న రచయితలు కథలు చెప్పారు. అనుభవం ఉన్నవాళ్లు సామెతలను సృష్టించారు. మన పురాణాల్లోనూ జంతువులు, పక్షులు పాత్రలుగా ఉన్న పిట్ట కథలు కనిపిస్తాయి. బైబిల్‌లోనూ జంతువుల గురించిన సామెతలు ఉన్నాయి. ‘సోమరీ! చీమల యొద్దకు వెళ్లుము. వాటి నడతలు కనిపెట్టి జ్ఞానము తెచ్చుకొనుము.
వాటికి న్యాయాధిపతి లేకున్నను, పై విచారణకర్త లేకున్నను, అధిపతి లేకున్నను అవి వేసవి కాలమందు ఆహారము సిద్ధపరచుకొనును. కోత కాలమందు ధాన్యము కూర్చుకొనును’– ఇది బైబిల్ సామెతల గ్రంథంలోనిది. చీమను చూసి కష్టపడటం నేర్చుకోవాలని సోమరులకు చేసే హెచ్చరిక ఇది.
ప్రాచీన సాహిత్యంలో జంతుపాత్రలు ఉన్న కథలు, జంతువులపై ప్రాచుర్యంలో ఉన్న సామెతలు మానవ స్వభావాన్ని అర్థం చేసుకోవడానికి ఉపకరిస్తాయి. యుక్తాయుక్త విచక్షణ జ్ఞానాన్ని పెంపొందిస్తాయి. ప్రవర్తన లోపాలను ఎత్తిచూపి, సుతిమెత్తని హెచ్చరికలు చేస్తాయి. వీటిని పూర్తిగా ఆకళింపు చేసుకుంటే చాలు, మనుషులు మనుషుల్లా తయారవడం కష్టమేమీ కాదు. వీటిని పిట్ట కథల్లా కొట్టిపారేసే అతితెలివిపరులు జంతువుల కంటే హీనంగా మిగులుతారు. కానికాలం దాపు
రించినప్పుడు దిక్కుతోచని గడ్డు పరిస్థితుల్లో చిక్కుకుని, నానా అవస్థలు పడతారు.
మహాభారతంలోని ‘కాకి హంస’ల కథ ఒక చిన్న ఉదాహరణగా చెప్పుకోవచ్చు. ఒక రాజ్యంలో ధనికుడైన వర్తకుడు ఉండేవాడు. ప్రతిరోజూ ఒక కాకి అతడి పెరటి గోడ మీద వాలేది. వర్తకుడి పిల్లలు దానికి తమ ఎంగిళ్లు పెట్టేవారు. ఎంగిళ్లు తిన్న కాకి వారికి బాగా మాలిమి అయింది. ఎంగిళ్లు తిని తెగబలిసిన కాకి ఒకనాడు ఏకంగా హంసలతో పందేనికి తెగబడి, భంగపడింది.
ఈ కథను కురుక్షేత్రంలో శల్యుడు కర్ణుడికి చెప్పాడు. కర్ణుడికి కథలోని నీతి తలకెక్కలేదు. ఫలితం ఏమైందో మనకు తెలిసిందే! కొందరు ఇప్పటికీ ఎంగిళ్లు తిని బలిసిన కాకుల్లాగే ఎగిరెగిరి పడుతుంటారు. ఇలాంటి స్వభావం ఉన్నవాళ్లు రాజకీయ రంగంలోను, సాహితీ సాంస్కృతిక రంగాల్లోను, వివిధ రకాల వృత్తి ఉద్యోగాల్లోనూ ఉంటారు.
ఎవరో పెట్టే ఎంగిలి మెతుకులు తిని బలిసి, విర్రవీగినంత కాలం కాకికి తన బలహీనత ఏమిటో ఎరుక పడనట్లే, ఇలాంటి స్వభావం ఉన్నవారికి ఎప్పటికీ ఈ కథల్లోని మర్మం అవగతం కాదు. మానవ సమాజంలో బతుకుతున్నా, వారు ఎప్పటికీ సంపూర్ణ మానవులు కాలేరు.
ప్రాణులు నేర్పే పాఠాలు
Published Mon, Oct 7 2024 4:08 AM | Last Updated on Mon, Oct 7 2024 4:08 AM
Advertisement
Comments
Please login to add a commentAdd a comment