
రిషితకు అశ్రునివాళి
- సోమవారం ఇంటికి చేరిన మృతదేహం
- తల్లిదండ్రులు,స్నేహితులు కన్నీరు మున్నీరు
- అంత్యక్రి యలు పూర్తి
జగద్గిరిగుట్ట: ‘కాలేజీ నుంచి రావడంలో ఐదు నిమిషాలు ఆలస్యమైతేనే ఆందోళన చెందే మేము ఇప్పుడు నువ్వు మా నుంచి శాశ్వతంగా దూరమయ్యావన్న ఛేదు నిజాన్ని ఎలా తట్టుకోవాలి’.. అంటూ రిషితారెడ్డి తల్లిదండ్రులు కన్నీరు మున్నీరయ్యారు.
హిమచల్‌ప్రదేశ్‌లోని బియాస్ నదిలో గల్లంతై మృతి చెందిన విజ్ఞానజ్యోతి కాలేజీ విద్యార్థిని రిషితారెడ్డి మృతదేహం 42 రోజుల తర్వాత లభించింది. మృతదేహం లభించినట్టు అధికారులు తల్లిదండ్రులకు ఆదివారం సమాచారం ఇచ్చారు. ఈ దుర్వార్త విన్నప్పటి నుంచి తల్లిదండ్రులు దేవుడా! ప్రాణానికి ప్రాణంగా పెంచుకుంటున్న మా ఒక్కగానొక్క కూతుర్ని తీసుకుపోయావా.. అంటూ గుండెలవిసేలా రోదిస్తూనే ఉన్నారు.
సోమవారం మధ్యాహ్నం 1.35కి రిషితారెడ్డి మృతదేహాన్ని తహసీల్దార్ కృష్ణ శంషాబాద్ ఎయిర్‌పోర్టు నుంచి బాచుపల్లిలోని ఆమె నివాసానికి తీసుకొచ్చారు. మృతదేహాన్ని చూడగానే తల్లిదండ్రులు కుప్పకూలిపోయారు. అప్పటికే పెద్ద ఎత్తున అక్కడికి చేరుకున్న బంధువులు, విజ్ఞానజ్యోతి కాలేజీ విద్యార్థులు, సిబ్బంది రిషిత మృతదేహానికి కన్నీటి నివాళులర్పించారు. అనంతరం అశ్రునయనాల మధ్య బాచుపల్లిలోని శ్మాశనవాటికలో అంత్యక్రియలు నిర్వహించారు.
బియాస్ ఘటనలో మృతి చెందిన విద్యార్థుల తల్లిదండ్రులు కూడా అంత్యక్రియల్లో పాల్గొన్నారు. ఇదిలా ఉండగా, బియాస్ నది ప్రమాదంలో మృతి చెందిన విద్యార్థులు 24 మంది, అంతకు ముందు పులిచింతల వద్ద చనిపోయిన ఇద్దరు విద్యార్థుల ఫొటోలతో బ్యానర్ ఏర్పాటు చేసి స్నేహితులు నివాళులర్పించారు.