నెల్లూరు సిటీ, న్యూస్‌లైన్: జిల్లాలోని ఎక్కువమంది ఉపాధ్యాయులు గురువారం నుంచి సమ్మెకు దిగనుండడంతో బడి బంద్ కానుంది. సమైక్యాంధ్ర ఉపాధ్యాయ పోరాట సమితి ఆధ్వర్యంలో పలు సంఘాలు సమ్మెలోకి దిగుతున్నట్టు డీఈఓ రామలింగానికి మంగళవారం సమ్మె నోటీస్ ఇచ్చారు. జిల్లాలో బలమైన సంఘాలైన యూటీఎఫ్, ఏపీటీఎఫ్, ఎస్‌టీయూ మాత్రమే సమ్మెకు దూరంగా ఉన్నాయి. ఆయా సంఘాల్లోని ఉపాధ్యాయుల్లో మెజార్టీ వర్గం తమ సంఘం నిర్ణయాన్ని వ్యతిరేకిస్తున్నట్టు సమాచారం.
ప్రస్తుత పరిస్థితుల్లో సీమాం ధ్రుల మనోభావాలననుసరించి సంఘాలు నడుచుకోవాల్సి ఉంటుందని తమ అధిష్టానానికి తెలియచేసిన ట్టు సమాచారం. దీంతో సమ్మెలో పాల్గొంటున్న ఉపాధ్యాయులకు పరోక్ష మద్దతుగా ప్రకటించేందుకు కొందరు ఉపాధ్యాయులు సిద్ధమయ్యారు. జిల్లాలోని 3568 ప్రభుత్వ పాఠశాలల్లో 14,128 మంది ఉపాధ్యాయులు పని చేస్తున్నారు. జిల్లాలోని 14 ఉపాధ్యాయ సంఘాల్లో పలు సంఘాలు సమైక్యాంధ్ర ఉపాధ్యాయ పోరాట సమితి పేరుతో ఇప్పటికే చురుగ్గా ఉద్యమిస్తున్నాయి. అయితే ప్రధాన సంఘాలు దూరంగా ఉండడంతో సమ్మె ప్రభావం ఏ మేరకు ఉంటుందోనని అనుమానాలు రేకెత్తుతున్నాయి.