సమైక్యాంధ్ర పరిరక్షణ కోసం జిల్లాలో అలుపెరగని పోరు కొనసాగుతోంది. ఒకపక్క హైదరాబాదులో ఏపీ ఎన్జీవోల సభ విజయవంతమవగా, దానికి మద్దతుగా జిల్లాలో ఆందోళనలు ఉధృతంగా సాగాయి. హోమాలు, మానవహారాలు, ధర్నాలు, వినూత్న నిరసనలు చేపట్టారు. సమైక్యాంధ్ర పరిరక్షణే తమ లక్ష్యమంటూ నినాదాలతో హోరెత్తించారు. జిల్లాలో చేపట్టిన రిలేదీక్షలు శనివారం కూడా కొనసాగాయి. అన్ని వర్గాల ప్రజలూ ఆందోళనలో భాగస్వాములయ్యారు.
సాక్షి , విజయవాడ : ఏపీ ఎన్జీవోలు రాజధానిలో నిర్వహించిన సేవ్ ఆంధ్రప్రదేశ్ సభకు మద్దతుగా జిల్లావ్యాప్తంగా ప్రదర్శనలు, ధర్నాలు, రిలే దీక్షలు జరిగాయి. సభ విజయవంతం కావాలంటూ విజయవాడ దుర్గగుడిలో శాంతి హోమం నిర్వహించారు. దుర్గగుడి అర్చకులు దుర్గఘాట్‌లో ప్రదర్శన నిర్వహించి, యాగం చేశారు. శాంతియుతంగా సభ కోసం వెళ్తున్న ఉద్యోగులపై పలుచోట్ల రాళ్లతో దాడి, బస్సుల టైర్లలో గాలి తీయడం, చెప్పులు విసరడం, నల్లజెండాలతో నిరసన వంటి అనాగరిక చర్యలను జిల్లాలోని సమైక్యవాదులు ముక్తకంఠంతో ఖండించారు.
సమైక్యంగా ఉంచాలని గణేష్ పూజలు..
తెలుగుజాతి అంతా సమైక్యంగా ఉండాలని, ప్రజలంతా ప్రాంతీయ భేదాలు లేకుండా అన్నదమ్ముల్లా కలిసిమెలిసి సుఖసంతోషాలతో జీవించాలని ఆకాంక్షిస్తూ మచిలీపట్నంలో శివగంగకు చెందిన స్వాతి హైస్కూల్ విద్యార్థులు వినాయకుడిని పూజించారు. జేఏసీ ఆధ్వర్యంలో స్థానిక కోనేరుసెంటరులో ఏర్పాటుచేసిన దీక్షలో హైనీ ప్రాథమిక, ఉన్నత పాఠశాల ఉపాధ్యాయులు, సిబ్బంది, గుండుపాలెం కాంప్లెక్స్ పాఠశాలలోని ఉపాధ్యాయులు, గూడూరు మండల పాఠశాలల ఉపాధ్యాయులు పాల్గొన్నారు.
నూజివీడులో జేఏసీ ఆధ్వర్యంలో మాజీ సైనికోద్యోగులు రిలేదీక్ష చేపట్టారు. హైకోర్టులో సీమాంధ్ర న్యాయవాదులపై దాడికి నిరసనగా పెద్ద గాంధీబొమ్మ సెంటర్‌లో లాయర్లు ధర్నా చేశారు. నూజివీడులో వైఎస్సార్‌సీపీ నాయకుల రిలేదీక్షలు 12వ రోజుకు చేరాయి. మైలవరంలో ఐకేపీ ఆధ్వర్యంలో డ్వాక్రా మహిళలు ర్యాలీ జరిపారు. అనంతరం మైలవరం తెలుగుతల్లి సెంటర్‌లో మానవ హార ం ఏర్పాటుచేసి, కబడ్డీ ఆడి నిరసన వ్యక్తం చేశారు. కైకలూరు తాలూకా సెంటర్‌లో ఎన్జీవో దీక్షలకు మద్దతుగా విద్యార్థులు రోడ్డుపై ముగ్గులు వేశారు.
కలిదిండిలో జేఏసీ నాయకులు చంద్రబాబు దిష్టిబొమ్మను దహనం చేశారు. ముదినేపల్లి మండలం వడాలి విద్యార్థులు రోడ్డుపై వంటావార్పూ జరిపారు. పామర్రు శ్రీఅరుణోదయ డీఎస్‌ఆర్ పబ్లిక్ స్కూల్ విద్యార్థులు మానవహారంగా ఏర్పడి ట్రాఫిక్‌ను స్తంభింపజేశారు. గన్నవరంలో శ్రీశ్రీనివాస కళాశాల విద్యార్థులతో కలిసి జేఏసీ నాయకులు జాతీయ రహదారిపై మానవహారం నిర్మించారు. సుమారు 200 అడుగుల జాతీయ పతాకంతో విద్యార్థులు జరిపిన ఈ ప్రదర్శన ప్రధాన ఆకర్షణగా నిలిచింది. చల్లపల్లిలో జేఏసీ నాయకులు రాష్ట్ర విభజనకు వ్యతిరేకంగా వినూత్న నిరసన చేశారు. చెవిలో పూలు, నోటిలో అరటిపండ్లతో నిరసన తెలిపారు. రాష్ట్ర విభజన ఒకరికి భోజనంగా, మరొకరికి చెవిలో పూలలా ఉందని విమర్శించారు. నాగాయలంకలో రైతు, విద్యార్థి, మహిళా గర్జన సభ నిర్వహించారు.
కేంద్రానికి మంచి బుద్ధి ప్రసాదించాలని..
కేంద్ర ప్రభుత్వానికి మంచి బుద్ధి ప్రసాదించి రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచాలని కోరుతూ మోపిదేవి శ్రీసుబ్రహ్మణ్యేశ్వరస్వామివారి దేవస్థానం ఎదుట వైఎస్సార్ సీపీ నాయకులు ఒంటికాలితో నిరసన తెలిపారు. అవనిగడ్డలో లారీ యజమానులు లారీలతో ర్యాలీ నిర్వహించి, పులిగడ్డ వద్ద జాతీయ రహదారిపై రాస్తారోకో చేశారు. పామర్రు మండలం ఉరుటూరులో పంచాయతీ పాలకవర్గ సభ్యులు, గ్రామస్తులు రిలేదీక్షల్లో పాల్గొన్నారు. జేఏసీ నేతృత్వంలో ఉయ్యూరులో రిలే దీక్షల్లో కేసీపీ ఉద్యోగులు పాల్గొన్నారు.
శ్రీశ్రీనివాసా విద్యాసంస్థల విద్యార్థులు విభజన నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ ప్రధాన సెంటరులో మానవహారం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో వైఎస్సార్ సీపీ పెనమలూరు నియోజకవర్గ సమన్వయకర్త తాతినేని పద్మావతి పాల్గొన్నారు. మండల ఉపాధ్యాయులు పోరంకిలో బందరు రోడ్డుపై ధర్నా చేశారు. మండలంలోని దాదాపు 150 మంది ఉపాధ్యాయులు పెనమలూరు నుంచి పోరంకి వద్దకు ర్యాలీగా వచ్చారు. అనంతరం వారు పోరంకిలో బందరు రోడ్డుపై ధర్నా చేశారు. పెడనలో వీవీఆర్ ఆధ్వర్యంలో సమైక్యాంధ్రకు మద్దతుగా రిలే దీక్ష జరిగింది. వీరంకిలాకులో చేపట్టిన రిలే దీక్షలు 13 రోజుకు చేరాయి.
చాట్రాయి మండలం చనుబండలో ఐకాస ఆధ్వర్యంలో మోకాళ్లపై నిలుచుని నిరసన తెలిపారు. జోరున వర్షం కురుస్తున్నా లెక్కచేయక ముఖానికి నల్లరిబ్బన్లు కట్టుకుని ఆందోళన చేశారు. వైఎస్సార్‌సీపీ ఆధ్వర్యంలో నూజివీడు పట్టణంలోని జంక్షన్ రోడ్డులో నిర్వహిస్తున్న రిలేదీక్షలు శనివారం నాటికి 12వ రోజుకు చేరాయి. ఈ దీక్షలను యువజన విభాగం నాయకులైన పిళ్లా చరణ్, సందీప్ ప్రారంభించారు. నందిగామ బార్ అసోసియేషన్ ఆధ్వర్యంలో న్యాయవాదులు పట్టణంలో ర్యాలీ నిర్వహించారు. గాంధీ సెంటర్‌లో కార్లను తుడిచి నిరసన తెలిపారు. గాంధీ సెంటర్‌లోని పొట్టి శ్రీరాములు విగ్రహానికి ఉపాధ్యాయ నాయకులు క్షీరాభిషేకం చేశారు. స్థానిక ఎన్టీటీపీఎస్ మెయిన్ గేట్ ఎదుట విద్యుత్ ఉద్యోగులు నిర్వహిస్తున్న రిలే దీక్షలు ఆరో రోజుకు చేరాయి.
అలుపెరగని పోరు
Published Sun, Sep 8 2013 1:54 AM | Last Updated on Tue, Sep 4 2018 5:07 PM
Advertisement
Advertisement