పర్చూరు, న్యూస్‌లైన్: సమైక్యాంధ్ర విషయంలో కేంద్ర ప్రభుత్వం నుంచి మరో పదిరోజుల్లో సానుకూల నిర్ణయం వస్తుందని ఆశిస్తున్నట్లు ఏపీ సెక్రటేరియట్ ఎంప్లాయీస్ యూనియన్ అధ్యక్షుడు ఉప్పుటూరి మురళీకృష్ణ తెలిపారు. శనివారం ప్రకాశం జిల్లా పర్చూరు వచ్చిన ఆయన విలేకరులతో మాట్లాడారు. ఇప్పటికే కేంద్ర మంత్రులతో పాటు ప్రతిపక్ష నేతలైన సుష్మా స్వరాజ్, ఎల్‌కే అద్వానీ, టీడీపీ ఎంపీలతో సీమాంధ్ర ఎంప్లాయీస్ ప్రతినిధి బృందం చర్చలు జరిపిందన్నారు. కేంద్రంపై మరింత ఒత్తిడి పెంచేందుకు 300 మంది సెక్రటేరియట్ ఉద్యోగులతో న్యూఢిల్లీలోని జంతర్‌మంతర్ వద్ద ధర్నా నిర్వహిస్తామన్నారు. బీజేపీ చిన్నరాష్ట్రాలకు అనుకూలంగా ఉన్నప్పటికీ సీమాంధ్ర అభివృద్ధికి స్పష్టమైన హామీ కోరతామని ఆ పార్టీ జాతీయ నేత వెంకయ్యనాయుడు చెప్పారన్నారు. ఆమోదయోగ్యమైన ప్రకటన వెలువడేవరకు ఉద్యమాన్ని కొనసాగిస్తామన్నారు.