రగులుతున్న పోరు | సమైక్యాంధ్రకు మద్దతుగా వేలాదిగా రోడ్లపైకి | Sakshi
Sakshi News home page

రగులుతున్న పోరు

Published Tue, Sep 3 2013 1:11 AM | Last Updated on Mon, Sep 17 2018 7:38 PM

సమైక్యాంధ్రకు మద్దతుగా వేలాదిగా రోడ్లపైకి

సాక్షి, విజయవాడ : సమైక్య ఆందోళనలు రోజురోజుకీ ఉధృత రూపం దాలుస్తున్నాయి. ఈ నెల ఏడున హైదరాబాద్‌లో జరిగే సమైక్య గర్జనను విజయవంతం చేసేందుకు ఏపీ ఎన్జీవోలు నడుం కట్టారు. దీనిలో భాగంగా ఉద్యమాన్ని ఉధృతం చేయాలని ఉద్యోగ సంఘాలు నిర్ణయించాయి. ఏపీ ఎన్జీవోలు రామవరప్పాడు రింగ్‌లో మానవహారం నిర్వహించారు. జగ్జీవన్‌రామ్ విగ్రహం వద్ద తమ నిరసన వ్యక్తంచేశారు. సుమారు 45 నిమిషాల పాటు సాగిన ఈ నిరసన కార్యక్రమంతో భారీగా ట్రాఫిక్ నిలిపోయింది. పాలిటెక్నిక్ లెక్చరర్ల జేఏసీ ఆధ్వర్యంలో ఐదు నుంచి పూర్తి స్థాయిలో సమ్మెలోకి వెళ్లాలని నిర్ణయించారు.

జిల్లా కేంద్ర సహకార బ్యాంకు, సహకార శాఖ ఆధ్వర్యంలో మచిలీపట్నంలో వేలాది మంది ర్యాలీ నిర్వహించారు. లక్ష్మీటాకీసు సెంటరు నుంచి ప్రారంభమైన ఈ ర్యాలీ కోనేరుసెంటరుకు చేరుకుంది. ఈ ర్యాలీని కేడీసీసీ బ్యాంకు చైర్మన్ పిన్నమనేని వెంకటేశ్వరరావు ప్రారంభించారు. జగ్గయ్యపేట, పెనుగంచిప్రోలు మండలాలలో జేఏసీ ఆధ్వర్యంలో చేపట్టిన రిలే దీక్షలు కొనసాగుతున్నాయి. జేఏసీ ఆధ్వర్యంలో భిక్షాటన కార్యక్రమం నిర్వహించి దున్నపోతుకు వినతిపత్రం సమర్పించారు. వైఎస్సార్ సీపీ జిల్లా కన్వీనర్ సామినేని ఉదయభాను టీ అమ్ముతూ నిరసన వ్యక్తం చేశారు. మైలవరంలోని విజయవాడ బస్టాప్ వద్ద ఎన్జీఓ, ఆర్టీసీ, ఉపాధ్యాయ జేఏసీ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న రిలే దీక్షలు నాలుగో రోజుకు చేరాయి. జి.కొండూరులో ఉపాధ్యాయ జేఏసీ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న రిలే దీక్షలో వికలాంగులు కూర్చుని సంఘీభావం తెలిపారు. ఉపాధ్యాయులు నోటికి నల్లరిబ్బన్లు కట్టుకుని నిరసన ప్రదర్శన నిర్వహించారు.
 
వీటీపీఎస్ సిబ్బంది పెన్‌డౌన్..


 వీటీపీఎస్ వద్ద కార్మికులు, సిబ్బంది పెన్‌డౌన్ కార్యక్రమం నిర్వహించి నిరసన తెలియజేశారు. తిరువూరులో ఆర్టీసీ కార్మికులు, పశుసంవర్థకశాఖ ఉద్యోగులు, కోర్టు ఉద్యోగులు, ఎన్జీవో జేఏసీల ఆధ్వర్యంలో కేంద్ర ప్రభుత్వ మొండివైఖరిని నిరసిస్తూ కార్యక్రమాలు చేపట్టారు. రోడ్డుపై అల్పాహారం వండి పంపిణీ చేశారు. కైకలూరు వైఎస్సార్ సీపీ కార్యాలయం వద్ద సమన్వయకర్త దూలం నాగేశ్వరరావు ఆధ్వర్యంలో సాగుతున్న రిలే దీక్షలు 27వ రోజుకు చేరాయి. తాలూకా సెంటర్ వద్ద ఉన్నత పాఠశాల ఉపాధ్యాయులు రిలే దీక్షలు చేపట్టారు. వీరి ఆధ్వర్యంలో వంటావార్పు జరిగింది. ఉపాధ్యాయులు రోడ్డు మీద పాఠాలు చెప్పారు. ముదినేపల్లిలో జేఏసీ ఆధ్వర్యంలో ఉపాధ్యాయులు 36 గంటలు రిలే దీక్షలు చేపట్టారు. వీరికి 1500 మంది విద్యార్థులు మద్దతు తెలుపుతూ సహస్ర గళ ఘోష చేపట్టారు. చిగురుకోటలో దళితపేట గ్రామస్తులు సమైక్యాంధ్రకు మద్దతుగా రోడ్డుపై ధర్నా చేపట్టారు. కైకలూరు వైఎస్సార్ సీపీ కార్యాలయం వద్ద సమన్వయకర్త దూలం నాగేశ్వరరావు ఆధ్వర్యంలో సాగుతున్న రిలే దీక్షలు 27వ రోజుకు చేరాయి.    
 
గుడివాడలో 72 గంటల బంద్ ప్రారంభం..

గుడివాడలో జేఏసీ 72 గంటల బంద్‌కు పిలుపునివ్వటంతో వ్యాపార సంస్థలు, కార్యాలయాలను మూసివేశారు. స్థానిక నెహ్రూ చౌక్ సెంటర్‌లో జేఏసీ ఆధ్వర్యంలో దీక్షలు కొనసాగుతున్నాయి. స్థానిక బస్టాండ్ వద్ద ఆర్టీసీ జేఏసీ ఆధ్వర్యంలో నాయకుడు దారం ఏడుకొండలు ఆమరణ నిరాహార దీక్షకు దిగారు. ఆయనకు మద్దతుగా ఆర్టీసీ కార్మికులు సుమారు 50 మంది రిలే దీక్షలో పాల్గొన్నారు. ఐఎంఏ ఆధ్వర్యంలో వినూత్నంగా నిరసన తెలుపుతూ దీక్షాధారులకు బీ-కాంప్లెక్సు టాబ్లెట్లు పంపిణీ చేశారు. గుడ్లవల్లేరులో జేఏసీ ఆధ్వర్యంలో ఉద్యోగులు రిలేదీక్షలు చేశారు. పాలిటెక్నిక్ కాలేజీ సిబ్బంది పంచాయతీ మంచినీటి చెరువు వద్ద ఉన్న బాపూజీ మందిరంలో రిలేదీక్షలకు కూర్చున్నారు. పామర్రులో జరుగుతున్న రిలేదీక్షలలో వృద్ధులు పాల్గొన్నారు. పామర్రు హైస్కూల్ విద్యార్థులు, గవర్నమెంట్ కాలేజీ విద్యార్థులు నాలుగురోడ్ల కూడలిలో మానవహారం ఏర్పాటుచేసి ట్రాఫిక్ స్తంభింపచేశారు.   
 
విజయవాడలో నేడు వైద్యగర్జన..

 మరోవైపు వైద్యులు విజయవాడలో వైద్య గర్జన నిర్వహించనున్నారు. మంగళవారం వైద్యసేవలు నిలిపివేయాలని నిర్ణయించారు. మున్సిపల్, దుర్గగుడి ఉద్యోగుల దీక్షలు కొనసాగాయి. విద్యార్థి జేఏసీ ఆధ్వర్యంలో దున్నపోతు మీద వాన పడుతున్నట్లుగా నిరసన చేపట్టారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement