సాక్షి ప్రతినిధి, కడప: సమైక్యాంధ్ర ఉద్యమం ఉగ్రరూపం దాల్చడంతో అధికార కాంగ్రెస్, ప్రతిపక్ష తెలుగుదేశం నేతల్లో వణుకు పుడుతోంది. ప్రత్యేక తెలంగాణకు టీడీపీ అధినేత చంద్రబాబు లేఖ ఇవ్వడం... ఆ వెనువెంటనే యూపీఏ భాగస్వామ్య పక్షాలతో కాంగ్రెస్ అధిష్టానం చర్చించి రాష్ట్ర విభజనపై ప్రకటన చేయడాన్ని ప్రజానీకం జీర్ణించుకోలేక పోతున్నారు.
ఆ రెండు పార్టీల నాయకులు పదవులకు, పార్టీలకు రాజీనామా చే శాకే ఉద్యమంలోకి రావాలనే డిమాండ్ ఊపందుకుంటోంది. స్పందించాల్సిన సమయంలో స్పందించకుండా నిమ్మకునీరెత్తినట్లు ఉండిపోయి...మొసలి కన్నీరు కారుస్తుండటంపై ఆగ్రహోదగ్రులవుతున్నారు. ఆ ఫలితమే మంత్రి అహ్మదుల్లా, 20సూత్రాల అమలు కమిటీ చెర్మైన్ తులసిరెడ్డిలపై ప్రత్యక్షదాడులుగా పలువురు వర్ణిస్తున్నారు.
రాజకీయ నాటకాలపై ఆగ్రహం :
సమైక్యవాదుల నిరసనల నుంచి తప్పించుకునేందుకు కాంగ్రెస్, టీడీపీ ప్రజాప్రతినిధులు రాజకీయ నాటకాలకు తెరలేపారు. కాంగ్రెస్ ఎమ్మెల్యేలలో జమ్మలమడుగు ఎమ్మెల్యే ఆదినారాయణరెడ్డి మినహా కమలాపురం ఎమ్మెల్యే వీరశివారెడ్డి, బద్వేలు ఎమ్మెల్యే కమలమ్మ, రాష్ట్ర విభజన అనంతరమే రాజీనామాల ప్రకటన చేశారు. అది కూడా ఉద్యమకారుల ఒత్తిడి ఫలితమేనని పలువురు పేర్కొంటున్నారు. మంత్రులు అహ్మదుల్లా, సి.రామచంద్రయ్య స్వగృహాలను పలుమార్లు ముట్టడించినా వారి నుంచి ఆశించిన మేర స్పందన లభించలేదని చెప్పవచ్చు. ఎమ్మెల్సీ బత్యాలను రాజీనామా చేయలేదని నిలదీసిన నేరానికి ప్రత్యక్ష దాడులకు సైతం ఎగబడ్డారు. కాంగ్రెస్ నేతల పరిస్థితి ఇలా ఉంటే టీడీపీ ఎమ్మెల్యే, ఎమ్మెల్సీ, ఎంపీ సైతం రాజీనామా నాటకానికే ప్రాధాన్యతనిచ్చారు.
ఎమ్మెల్యే లింగారెడ్డిని ఉద్యమకారులు కాళ్లు పట్టుకొని అభ్యర్థించినా అధినేత చంద్రబాబును కాదని రాజీనామా చేసేందుకు వెనుకంజ వేశారు. ప్రస్తుతం వీరంతా రాజీనామా చేసినట్లు ప్రకటించినా వారి రాజీనామా లేఖలు ఇప్పటికీ స్పీకర్ కార్యాలయానికి చేరలేదని అక్కడి యంత్రాంగం స్పష్టం చేస్తోంది. ఈ పరిణామాన్ని ఉద్యమకారులు జీర్ణించుకోలేకపోతున్నారు. సమైక్యవాదుల ఒత్తిడి నుంచి తప్పించుకునేందుకు రాజీనామా నాటకానికి ప్రాధాన్యత ఇచ్చినట్లుగా పలువురు పేర్కొంటున్నారు. ఈ ప్రాంతానికి తీవ్రమైన అన్యాయం జరుగుతున్నా సకాలంలో స్పందించాల్సిన అధికార కాంగ్రెస్, ప్రతిపక్ష తెలుగుదేశం నేతలు దాగుడు మూతలు ఆడుతుండటాన్ని ప్రజానీకం జీర్ణించుకోలేకపోతున్నారు. తత్ఫలితంగా మంత్రి అహ్మదుల్లా, 20 సూత్రాల అమలు కమిటీ ఛెర్మైన్ తులసిరెడ్డిలపై చెప్పులు విసిరిన ఘటనలు ఉత్పన్నమయ్యాయని పరిశీలకులు అభిప్రాయపడుతున్నారు.
జన నేత జగన్‌కు సంఘీభావం :
రాష్ట్ర విభజనకు కాంగ్రెస్, టీడీపీలు కుట్రపన్నడాన్ని పసిగట్టిన వైఎస్‌ఆర్‌సీపీ ఎమ్మెల్యేలు ప్రజాభిప్రాయం మేరకు శాసనసభ సభ్యత్వాలకు స్పీకర్ ఫార్మాట్‌లో రాజీనామాలు చేశారు. వైఎస్‌ఆర్‌సీపీ గౌరవాధ్యక్షురాలు వైఎస్ విజయమ్మ, అధ్యక్షుడు వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి సైతం వారి పదవులకు రాజీనామా చేశారు.
అనంతరం కాంగ్రెస్ అధిష్టానం తీరుకు నిరసనగా సమైక్యాంధ్ర డిమాండ్‌తో వైఎస్ విజయమ్మ ఆమరణ దీక్ష చేపట్టారు. ఆ దీక్షను పోలీసులు భగ్నం చేసిన అనంతరం కడప ఎంపీ, వైఎస్‌ఆర్‌సీపీ రాష్ట్ర అధ్యక్షుడు వైఎస్‌జగన్‌మోహన్‌రెడ్డి జైలులో ఉన్నా తెలుగు ప్రజల కోసం నిరవధిక నిరాహారదీక్ష చేపట్టారు. ప్రజా సంక్షేమమే తన అజెండాగా వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి దీక్ష చేపట్టినట్లు జనం ప్రశంసలు కురిపిస్తున్నారు.
పార్టీలకతీతంగా రాజకీయ నేతలు, ఉద్యోగ, ఉపాధ్యాయ, కార్మిక, కర్షక, విద్యార్థి, ప్రజా సంఘాలు జగన్ దీక్షకు సంఘీభావం ప్రకటిస్తున్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో చిత్తశుద్ధి లోపించిన రాజకీయ నేతలకు ఉద్యమకారుల నుంచి ప్రతిఘటన తప్పడం లేదు. ప్రాంతం కోసం, ప్రజానీకం కోసం కాంగ్రెస్, టీడీపీలకు నాయకులు రాజీనామాలు చేయాలనే డిమాండ్ ఉధృతమవుతోంది. పరిస్థితి మరింత ఉద్రిక్తతలకు దారి తీయక ముందే ప్రజానీకమా...పార్టీలా అనే విషయాన్ని ఆ రెండు పార్టీల నాయకులు తేల్చుకోవాలని పలువురు డిమాండ్ చేస్తుండటం విశేషం.
కలవరం...కలకలం...!
Published Thu, Aug 29 2013 4:21 AM | Last Updated on Fri, Sep 1 2017 10:12 PM
Advertisement
Advertisement