ఒంగోలు టౌన్, న్యూస్‌లైన్: ర్యాలీలు..వంటా వార్పులు..రాస్తారోకోలు..రిలే దీక్షలు..అర్ధనగ్న ప్రదర్శనలు ఇలా ప్రతి ఒక్కరూ తమదైన శైలిలో సమైక్యాంధ్ర ఉద్యమాన్ని ఉధృతం చేస్తున్నారు. రాష్ట్ర విభజన నిర్ణయాన్ని వెనక్కి తీసుకునే వరకూ మడమ తిప్పబోమని, వెనక్కి తగ్గేది లేదని స్పష్టం చేస్తున్నారు. సోమవారం డ్వాక్రా మహిళలు, విద్యుత్ ఉద్యోగులు, లాయర్లు, విద్యార్థులు నగరంలో భారీ ప్రదర్శనలు నిర్వహించారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఇప్పటికైనా ప్రజాభీష్టాన్ని అర్థం చేసుకోవాలని, లేకుంటే తగిన గుణపాఠం చెబుతామని హెచ్చరించారు.
డ్వాక్రా గ్రూపు మహిళల భారీ ప్రదర్శన
సమైక్యాంధ్రకు మద్దతుగా నగర పాలక సంస్థ ఆధ్వర్యంలో డ్వాక్రా గ్రూపుల మహిళలు నగరంలో కదంతొక్కారు. సుమారు 1500 మంది మహిళలు, నగరపాలక సంస్థ సిబ్బంది నగరంలో భారీ ప్రదర్శన నిర్వహించారు. స్థానిక కార్పొరేషన్ కార్యాలయం నుంచి పొట్టి శ్రీరాములు విగ్రహం మీదుగా చర్చి సెంటర్ వరకు ప్రదర్శన సాగింది. అనంతరం చర్చి సెంటర్‌లో మానవహారం నిర్వహించి, చెమ్మచెక్క ఆట ఆడి వినూత్న రీతిలో నిరసన తెలిపారు. ఇప్పటికైనా కేంద్ర మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు రాజీనామాలు చేసి ఉద్యమంలోకి రావాలని డిమాండ్ చేశారు.
విద్యుత్ ఉద్యోగుల జేఏసీ ఆధ్వర్యంలో వంటా-వార్పు
విద్యుత్ ఉద్యోగులు స్థానిక ఎస్‌ఈ కార్యాలయం ఎదుట వంటా-వార్పు నిర్వహించారు. తొలుత ఎస్‌ఈ కార్యాలయం నుంచి కలెక్టరేట్ వరకు భారీ ర్యాలీ నిర్వహించి అక్కడ మానవహారం ఏర్పాటు చేశారు. అనంతరం కలెక్టరేట్ ఎదుట దీక్షలు చేస్తున్న ఉద్యోగులకు సంఘీభావం తెలిపారు. రాష్ట్రం విడిపోతే జల విద్యుత్ ప్రాజెక్టులకు నీటి కొరత ఏర్పడి రాష్ట్రం అంధకారంగా మారుతుందని ఇంజినీర్లు ఆందోళన వ్యక్తం చేశారు. కార్యక్రమంలో డీఈలు కే వెంకటేశ్వర్లు, టీ శ్రీనివాసరావు, జేఏసీ రాష్ట్ర కో-కన్వీనర్ ఎం హరిబాబు, జిల్లా చైర్మన్ జయాకరరావు, కన్వీనర్ టీ సాంబశివరావు, పిచ్చయ్య, మోహనరావు, సురేష్, తదితరులు పాల్గొన్నారు.
కొనసాగుతున్న ఉద్యోగుల దీక్షలు
స్థానిక కలెక్టరేట్ వద్ద ఉద్యోగుల సామూహిక రిలే దీక్షలు కొనసాగుతున్నాయి. దీక్షలో స్టేట్ ఆడిట్స్, ట్రెజరరీ, గ్రంథాలయ సంస్థ ఉద్యోగులు కూర్చొన్నారు. వీరికి జిల్లా అధికారుల సంఘం, ఎన్‌జీఓలు సంఘీభావం తెలిపారు. డీఆర్‌డీఏ పీడీ పద్మజ మాట్లాడుతూ అందరూ కలిసి హైదరాబాద్‌ను అభివృద్ధి చేశామని, ఇప్పుడు వెళ్లిపొమ్మంటే సీమాంధ్రుల పరిస్థితేమిటని ప్రశ్నించారు. ఇది కేవలం ఉద్యోగుల కోసం జరుగుతున్న ఉద్యమం కాదన్నారు. ప్రతి ఒక్కరూ ఉద్యమంలో భాగస్వాములవ్వాలని ఆమె కోరారు. కార్యక్రమంలో డీఆర్వో రాధాకృష్ణమూర్తి, ఎస్సీ కార్పొరేషన్ ఈడీ రాజు, ఎన్‌జీఓ నాయకులు అబ్దుల్‌బషీర్, రాజ్యలక్ష్మి, తదితరులు పాల్గొన్నారు.
ఇక్రా ఓరియంటల్ చిన్నారుల ప్రదర్శన
నగరంలోని ఇక్రా ఓరియంట్ స్కూల్ చిన్నారులు స్థానిక చర్చి సెంటర్‌లో ఆందోళన నిర్వహించారు. సోనియాగాంధీ వేషధారణలో ఉన్న చిన్నారి, కేసీఆర్ వేషధారణలో ఉన్న మరో చిన్నారికి సూట్‌కేసులో ప్యాకేజీలు అందించే దృశ్యాన్ని ప్రదర్శించారు. కేవలం రాజకీయ స్వార్థంతోనే రాష్ట్రాన్ని ముక్కలు చేస్తున్నారని మండిపడ్డారు.
విద్యార్థి జేఏసీ వినూత్న నిరసన
స్థానిక డీఆర్‌ఆర్‌ఎం మున్సిపల్ హైస్కూల్ గ్రౌండ్‌లో విద్యార్థి జేఏసీ నాయకులు క్రికెట్ ఆడి వినూత్న నిరసనకు దిగారు. బ్యాట్‌ను సమైక్యాంధ్రగా, బంతిని కేసీఆర్‌గా పోల్చి క్రికెట్ ఆడారు. నిరసన కార్యక్రమాన్ని ఎన్‌జీఓ నాయకులు అబ్దుల్‌బషీర్, బండి శ్రీనివాసరావు ప్రారంభించారు. హైదరాబాద్‌లో సీమాంధ్ర ఉద్యోగులపై తెలంగాణ ఉద్యోగుల దాడిని వారు తీవ్రంగా ఖండించారు. ఉద్యోగులకు ప్రజాప్రతినిధులు అండగా నిలవాలని వారు విజ్ఞప్తి చేశారు. కార్యక్రమంలో విద్యార్థి జేఏసీ, ఎన్‌జీఓ నాయకులు రాజ్యలక్ష్మి, క్రిష్ణారెడ్డి, స్వాములు, శరత్, అశోక్, మహేష్, తదితరులు పాల్గొన్నారు.
మడమ తిప్పేది లేదు
Published Tue, Aug 27 2013 3:09 AM | Last Updated on Wed, Jul 25 2018 4:09 PM
Advertisement
Advertisement