సాక్షి, తిరుపతి: జిల్లాలోని తిరుపతి, చిత్తూరు నగరాలను బుధవారం సమైక్యవాదులు దిగ్బంధించారు. ద్విచక్ర వాహనాలు మినహా మరే వాహనాన్ని తిరగనివ్వలేదు. తిరుపతి శ్రీదేవి కాంప్లెక్స్‌లోని ఎల్‌ఐసీ కార్యాలయం అద్దాలను ధ్వంసం చేశారు. సమైక్యవాదుల పిలుపుమేరకు రెండు నగరాల్లో అన్నిరకాల దుకాణాలు, కార్యాలయాలు, విద్యాసంస్థలు స్వచ్ఛందంగా మూసివేసి సమైక్యాంధ్రకు మద్దతు ప్రకటించారు. చిత్తూరులో వినూత్న తరహాలో నిరసనలు తెలిపారు. పశుసంవర్ధక శాఖ ఆధ్వర్యంలో గాంధీ విగ్రహం చుట్టూ పాడి ఆవులతో నిరసన తెలిపారు.
స్వచ్ఛంద బంద్
తిరుపతిలో స్వచ్ఛంద సంస్థలు, అన్ని ఉద్యోగ సంఘా ల ఐక్యకార్యాచరణ కమిటీ సభ్యులు నగరమంతా పర్యటిస్తూ సమైక్యాంధ్రకు మద్దతుగా బంద్‌కు సహకరించాలని ప్రజలను కోరారు. చిత్తూరులోనూ వివిధ జేఏసీల ఆధ్వర్యంలో విడివిడిగా వినూత్న తరహాలో ర్యాలీ నిర్వహించారు. తమిళనాడు, కర్ణాటక నుంచి వచ్చే వాహనాలను అడ్డుకున్నారు. విద్యార్థులు అతిపెద్ద జాతీయజెండాతో నగరంలో భారీ ప్రదర్శన చేశారు. తెలుగుతల్లి విగ్రహం చుట్టూ నిలబడి వందన సమర్పణ చేశారు. తిరుపతి కార్పొరేషన్ ఉద్యోగులు కేఎల్ వర్మ ఆధ్వర్యంలో కార్యాలయం ఎదుట నిరసన తెలియజేశారు. తిరుపతి కూరగాయల మార్కెట్ సంఘం అధ్యక్షుడు ముత్తూజ ఆధ్వర్యంలో కూరగాయలతో ప్రదర్శన చేశారు.
తోపుడుబండ్ల వ్యాపారులు నగరంలో పలు వీధుల్లో భారీ ర్యాలీ చేశారు. విద్యార్థులు శ్రీకృష్ణుడు, గోపికల వేషధారణలో భారీ ర్యాలీగా కార్పొరేషన్ కార్యాలయానికి చేరుకుని కోలాటాలు వేసి నిరసన తెలిపారు. టౌన్‌బ్యాంకు పాలకవర్గం, ఉద్యోగులు సంయుక్తంగా రహదారిని దిగ్బంధించి కళాకారులతో ప్రదర్శన నిర్వహించారు. తిరుపతి పట్టణాభివృద్ధి సంస్థ ఉద్యోగులు నగరంలో భారీ బైక్‌ర్యాలీ నిర్వహించి నిరసన తెలిపారు. ఎంఆర్‌పల్లి కూడలిలో ఉట్టి కొట్టి నిరసన తెలిపారు.
చిత్తూరులో సమైక్య గర్జన...
చిత్తూరులో మత్స్యశాఖ ఆధ్వర్యంలో రోడ్డుపై వలలు విసిరి చేపలు పడుతున్నట్లుగా నిరసన తెలిపారు. సాంఘిక సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో ర్యాలీ నిర్వహించి రోడ్డుపై కబడ్డీ, చమ్మాచక్క ఆటలు ఆడారు. గాంధీ విగ్రహం వద్ద రక్తదాన శిబిరం ఏర్పాటు చేశారు. వ్యవసాయశాఖ మార్కెట్ యార్డు, ట్రాక్టర్ యజమానులు భారీ ర్యాలీలు నిర్వహించారు. ఉపాధ్యాయులు రోడ్లు శుభ్రం చేస్తూ నిరసన తెలిపారు. న్యాయవాదులు, కోర్టు సిబ్బంది పసుపు చీరలు కట్టుకుని రిలే నిరాహారదీక్ష చేశారు. జేఏసీ దీక్షా శిబిరంలో ఎమ్మెల్యే సీకేబాబు నిరసన తెలిపారు.
శ్రీకాళహస్తిలో కదంతొక్కిన రైతులు
శ్రీకాళహస్తిలో వందలాది మంది రైతులు అరటి చెట్లు, చెరుకు గడలు, వరి కంకులను చేతబట్టుకుని భారీ ర్యాలీ నిర్వహించారు. అనంతరం భిక్షాలగోపురం వద్ద మానవహారం చేపట్టారు. స్కిట్ కళాశాల సిబ్బంది రోడ్డుపై ఆటపాటలతో నిరసన తెలిపారు. చంద్రగిరి మండలం ఐతేపల్ల్లె వద్ద పొలిటికల్, సమైక్యాంధ్ర జేఏసీ ఆధ్వర్యంలో రోడ్డుపై గానాబజానా నిర్వహించారు. మదనపల్లెలో సాప్స్ నాయకుడు ఉత్తన్న ఆమరణ నిరాహారదీక్షకు పూనుకున్నారు. ఆర్టీసీ ఉద్యోగ, కార్మికులు బస్సులతో ర్యాలీ చేపట్టారు.
పీలేరులో ఐసీడీఎస్ సిబ్బంది సుమారు 700 మంది మహిళలతో భారీ ర్యాలీ నిర్వహించారు. జీవీ శ్రీనాథరెడ్డి 48 గంటల దీక్ష కొనసాగింది. పుత్తూరులో ఉద్యోగ, ఉపాధ్యాయ, ఆర్టీసీ ఆధ్వర్యంలో రిలేదీక్షలు చేశారు. నగరిలో న్యాయవాదుల వంటావార్పు, ఉద్యోగ, ఉపాధ్యాయులు రిలేదీక్షలు చేశారు. పలమనేరులో చిత్తూరు ఎంపీ శివప్రసాద్ ర్యాలీ నిర్వహించారు. తంబళ్లపల్ల్లె నియోజకవర్గ పరిధిలోని అన్ని మండలాల్లో రిలేదీక్షలు కొనసాగాయి. పెనుమూరులో విద్యార్థులు ర్యాలీ నిర్వహించారు. ఎస్సార్‌పురం, కార్వేటినగరం, వెదురుకుప్పంలో విద్యార్థులు ర్యాలీలు, మానవహారాలు చేశారు. సత్యవేడులో సమైక్యవాదులు ఒక్కరోజు రిలే దీక్ష చేశారు.
తిరుపతి , చిత్తూరు , సర్వం బంద్
Published Thu, Aug 29 2013 2:18 AM | Last Updated on Tue, Jun 4 2019 5:04 PM
Advertisement
Advertisement