వానలోనూ ‘ఒక్కటే’ నినాదం
సాక్షి నెట్‌వర్క్ :ఎడతెరిపిలేకుండా వర్షం పడుతున్నప్పటికీ సమైక్యాంధ్ర కోసం సీమంధ్రులు తమ నినాదాన్ని మాత్రం పక్కకు పెట్టలేదు. గురువారం 86వ రోజూ తమ ఉద్యమాన్ని కొనసాగించారు. తుపానుతో తాము ఏం కోల్పోయిన దానికంటే రాష్ర్టం విడిపోతేనే ఎక్కువ బాధ కలుగుతుందని వారు పేర్కొంటున్నారు. ఏపీఎన్జీవోలు ఇచ్చిన పిలుపుమేరకు విశాఖ కలెక్టరేట్ వద్ద సమైక్యవాదులు మధ్యాహ్న భోజన విరామసమయంలో నిరసన వ్యక్తం చేశారు. భీమిలిలో జేఏసీ ఆధ్వర్యంలో ఉపాధ్యాయ, ఉద్యోగ సంఘాల సభ్యులు తహశీల్దార్ కార్యాలయాన్ని ముట్టడించారు. ఏలూరులోని కలెక్టరేట్ వద్ద రెవెన్యూ, జెడ్పీ, వివిధ శాఖల ఉద్యోగుల ప్రదర్శన నిర్వహించారు. రైతులు 50 ట్రాక్టర్లతో దువ్వ గ్రామం నుంచి ర్యాలీగా తణుకు చేరుకుని మానవహారం ఏర్పాటు చేశారు. విజయనగరం జిల్లా పార్వతీపురంలో అయ్యప్ప మాలధారులు సమైక్యాంధ్రకు మద్దతుగా నినాదాలు చేస్తూ పూజలు నిర్వహించారు. అనంతపురం జిల్లా నల్లమాడలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకులు అర్ధనగ్న ప్రదర్శన చేశారు.
ఎస్కేయూ విద్యార్థులు జాతీయ రహదారిపై 86 ఆకారంలో కూర్చొని ఆందోళన చేశారు. అనంతపురంలో జాక్టో ఆధ్వర్యంలో ఉపాధ్యాయులు, తనకల్లు, కనగానపల్లి, ఉరవకొండలో విద్యార్థులు ర్యాలీలు చేశారు. తలకిందులుగా తపస్సుచేసయినా రాష్ట్రాన్ని కాపాడుకుంటామంటూ నాగాయలంకలో గురువారం జేఏసీ, లయన్స్‌క్లబ్ ఆధ్వర్యంలో వినూత్న నిరసన తెలిపారు. పలువురు తలకిందులుగా నిలబడి జైసమైక్యాంధ్ర, తెలంగాణ వద్దు-సమైక్యాంధ్ర ముద్దంటూ నినాదాలు చేశారు. విజయవాడలో ఇరిగేషన్ కార్యాలయం వద్ద ఎన్జీవోలు, ఇరిగేషన్ ఉద్యోగులు భోజనవిరామ సమయంలో ధర్నా చేశారు. ఉపాధ్యాయుల జేఏసీ ఆధ్వర్యంలో పామర్రు హైస్కూల్ విరామ సమయంలో పాఠశాల ముందు నుంచి ఉపాధ్యాయులు ధర్నా చేశారు. సమైక్యాంధ్రకు మద్దతుగా మైలవరంలోని పలు ప్రభుత్వ పాఠశాలల్లో ఉపాధ్యాయులు మధ్యాహ్న భోజన విరామ సమయంలో నిరసన కార్యక్రమాన్ని చేపట్టారు. నెల్లూరులో జెడ్పీ ఉద్యోగులు నల్ల బ్యాడ్జీలు ధరించి నిరసన తెలిపారు. ఎన్‌జీఓ జేఏసీ ఆధ్వర్యంలో కలెక్టరేట్ ఎదుట ధర్నా నిర్వహించారు. వెంకటగిరిలో రాత్రి 7 గంటల ప్రాంతంలో జేఏసీ నేతలు గొడుగులతో ర్యాలీ నిర్వహించారు.