సాక్షి నెట్‌వర్క్: రాష్ట్రాన్ని సమైక్యంగానే ఉంచాలని నినదిస్తూ వరుసగా 91వ రోజూ సీమాంధ్ర జిల్లాల్లో ఆందోళనలు కొనసాగాయి. ఎన్జీవోల నిరసన కార్యక్రమాలు యథావిధిగా కొనసాగుతున్నాయి. తిరుపతిలో ఉద్యోగ, ఉపాధ్యాయ, కార్మిక జేఏసీ ఆధ్వర్యంలో ప్రభుత్వోద్యోగులు మోటర్‌సైకిల్ ర్యాలీ నిర్వహించారు. మదన పల్లెలో ఎన్జీవోలు, ఆర్టీసీ కార్మికులు అంబేద్కర్ సర్కిల్‌లో మానవహారం నిర్మించారు. వీఆర్వోలు ఢిల్లీ పెద్దల మాస్క్‌లు ధరించి నిరసన తెలిపారు. వారిని గోనె సంచుల్లో మూటలుగా కట్టి విసిరి పారవేసినట్టుగా ప్రదర్శన నిర్వహించారు. రాష్ట్రాన్ని సమైక్యాంధ్రప్రదేశ్‌గానే ఉంచాలని డిమాండ్ చేస్తూ విశాలాంధ్ర మహాసభ విజయనగరం జిల్లా కన్వీనర్ మామిడి అప్పలనాయడు ఆధ్వర్యంలో విజయనగరంలో ‘సేవ్ ఏపీ’ అనే అక్షరాల రూపంలో కూర్చొని నిరసన తెలిపారు. అనంతపురం జిల్లా హిందూపురంలో విశాలాంధ్ర పరిరక్షణ సమితి సభ్యులు ర్యాలీ చేశారు.
అనంతరం మోకాళ్లపై నిలబడి శాడిస్టు సోనియా డౌన్‌డౌన్ అని నినాదాలు చేశారు. పామిడిలో సమైక్యవాదులు మౌనదీక్ష కొనసాగించారు. కర్నూలు జిల్లా వైద్య ఆరోగ్య శాఖ ఉద్యోగులు స్థానిక కలెక్టరేట్ ఎదుట రాస్తారోకో నిర్వహించారు. కృష్ణాజిల్లా నాగాయలంకలో జేఏసీ నాయకులు వరదనీటిలో జలదీక్ష చేశారు. గన్నవరంలో వైద్య, ఆరోగ్య శాఖ అధికారులు భారీ ర్యాలీ నిర్వహించారు. ఏపీఎన్‌జీఓ సంఘం ఆధ్వర్యంలో నెల్లూరులో, సమైక్యాంధ్ర జేఏసీ ఆధ్వర్యంలో కావలిలో బైక్ ర్యాలీలు నిర్వహించారు.