'విడిపోదన్న సంకేతం వచ్చే వరకూ సమ్మె కొనసాగిస్తాం'
హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం విడిపోదన్న సంకేతం వచ్చే వరకూ సమ్మె కొనసాగిస్తామని ఏపీఎన్జీవో అధ్యక్షుడు అశోక్ బాబు తెలిపారు. ఇప్పటి వరకూ ఎవరినీ వ్యక్తిగతంగా దూషించలేదని ఆయన పేర్కొన్నారు. సీమాంధ్ర జిల్లాలో సమైక్యాంధ్ర ఉద్యమం తీవ్ర స్థాయిలో జరుగుతున్న నేపథ్యంలో అశోక్ బాబు మీడియాతో మాట్లాడారు. రాజీనామాలు చేయకుండా రాష్ట్రం విభజనను ఏవిధంగా అడ్డుకుంటారో నేతలు తెలపాలని ఆయన డిమాండ్ చేశారు. ఈ నెల 20 న విజయవాడలో, 23న హిందూపురంలో, 29న వైజాగ్ లో బహిరంగ సభలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఏడు లక్షల మంది ఉద్యమంలో పాల్గొంటున్న ఎలాంటి నష్టమూ చేయలేదన్నారు.
రాష్ట్ర విభజనపై కేంద్రానికి నచ్చజెప్పాల్సిన బాధ్యత నాయకులపైనే ఉందని అశోక్ బాబు తెలిపారు. ప్రజలు నమ్మకం పోతే ఎవరికీ రాజీకీయ భవిష్య్తత్తు ఉండదనే విషయాన్ని ఈ సందర్భంగా గుర్తు చేశారు. రాజీనామాలు చేస్తారా..లేదా అనేది నేతలే నిర్ణయించుకోవాలన్నారు. 19న కేంద్ర ప్రభుత్వం కార్యాలయాలు మూయించి వేస్తామన్నారు. హైదరాబాద్ నగరంలో సద్భావన సభ నిర్వహించే ఆలోచన లేదని, తమ సమ్మెపై ఎవరు పిలిచి మాట్లాడినా వారితో చర్చిస్తామన్నారు. రాజకీయాలకు అతీతంగా ఉద్యమం జరుగుతుందన్న విషయాన్ని ప్రభుత్వం గుర్తించాలన్నారు. ప్రజల ఆస్తులకు ఎటువంటి నష్టం జరగకుండా సమ్మె చేస్తున్నామని తెలిపారు. నందమూరి హరికృష్ణ యాత్ర చేస్తే తామ మద్దతు తెలుపుతామన్నారు.