తోకే కుక్కను ఊపితే? | seemandhra employees leading leaders | Sakshi
Sakshi News home page

తోకే కుక్కను ఊపితే?

Published Fri, Aug 30 2013 9:17 PM | Last Updated on Fri, Sep 1 2017 10:17 PM

seemandhra employees leading leaders

మామూలుగా అయితే కుక్క.. తోకను ఊపుతుంది. కానీ, తోకే కుక్కను ఊపే పరిస్థితి వస్తే..? సీమాంధ్ర ప్రాంతంలో పరిస్థితి ఇప్పుడు సరిగ్గా ఇలాగే తయారైంది. ఇన్నాళ్లూ తమకు ఫలానా చోట పోస్టింగు కావాలనో.. ప్రమోషన్ ఇప్పించాలనో, ఏదో ఒక పనిమీద రాజకీయ నాయకుల వద్దకు ఉద్యోగులు వెళ్లడం, వాళ్లను ప్రాధేయపడటం సర్వసాధారణంగా జరిగే విషయం. నాయకులు కుదిరితే పని చేయడం, లేనిపక్షంలో వాళ్లను పదే పదే వెంట పడొద్దంటూ ఒక్కోసారి కసురుకోవడం కూడా మనం ఇన్నాళ్లూ చూస్తూనే వచ్చాం.

కానీ ఒక్కసారిగా రాష్ట్రంలో పరిస్థితి మారిపోయింది. ఉద్యోగ నాయకులు ఒక్కసారిగా నాయకుల మీద మండిపడుతున్నారు. రాష్ట్రం మండిపోతుంటే ఇంకా మీరెందుకు పట్టించుకోవట్లేదంటూ నిలదీస్తున్నారు. నాయకులు వాళ్లకు సమాధానం చెప్పుకోలేక, ఏం చేయాలో అర్థం కాక మౌనంగా మిగిలిపోతున్నారు. రాష్ట్ర విభజనకు తాము అనుకూలంగానే ఉన్నామని, త్వరలో తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ప్రక్రియ ప్రారంభం అవుతుందని ఏఐసీసీ రాష్ట్ర వ్యవహారాల ఇన్చార్జి దిగ్విజయ్ సింగ్ సరిగ్గా నెల రోజుల క్రితం ఏ ముహూర్తంలో ప్రకటించారో గానీ, అప్పటి నుంచి సీమాంధ్ర ప్రాంతం ఆందోళనలతో అట్టుడుకుతోంది. ఒకరు కాదు, ఇద్దరు కాదు.. అన్ని వర్గాల వాళ్లు ఒక్కసారిగా రోడ్లమీదకు వచ్చి కనీ వినీ ఎరగని స్థాయిలో ఉద్యమం నడిపిస్తున్నారు.

మొదట్లో, ఏముందిలే.. నాలుగు రోజులు గడిస్తే వాళ్లే ఊరుకుంటారని నాయకులు ఈ ఉద్యమాన్ని చాలా తేలిగ్గా తీసుకున్నారు. నాయకత్వం లేని ఉద్యమం ఎన్నాళ్లో సాగదని భావించారు. అందుకే దీని మీద పెద్దగా స్పందించలేదు. ముఖ్యంగా ఎంపీలు, కేంద్రమంత్రులు సీమాంధ్ర ఉద్యమం విషయంలో వ్యవహరించిన తీరు చాలా విమర్శలకు దారితీసింది. కానీ రోజులు  గడిచేకొద్దీ వాళ్లకు పరిస్థితి క్రమంగా అర్థం కావడం మొదలైంది. కానీ అప్పటికే చెయ్యి జారిపోయింది. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు నిర్ణయం తీసేసుకున్నామని, ఈ విషయంలో యూటర్న్ తీసుకునే ప్రసక్తి లేదని అధిష్ఠానం వాళ్లకు స్పష్టం చేసింది. పార్టీ పెద్దలకు ఏమైనా చెబుదామన్నా వాళ్లు వినిపించుకోవట్లేదు. తప్పనిసరిగా విభజనకు అంగీకరించాల్సిందేనని సీమాంధ్ర ప్రాంతానికి చెందిన ఉద్యోగులు, ఇతర వర్గాలకు చెబుదామంటే, కనీసం మాట కూడా మాట్లాడనిచ్చేలా లేరు. దీంతో ఏం చేయాలో తెలియక మాట్లాడకుండా ఊరుకున్నారు.

కానీ ఈ మౌనాన్ని భరించేందుకు మాత్రం సీమాంధ్ర ప్రాంత ప్రజలు, ఉద్యోగులు ఏమాత్రం సిద్ధంగా లేరు. పరిస్థితి ఇంత తీవ్రంగా ఉంటే, కేంద్రంలో ఉన్న ప్రజాప్రతినిధులు ఏం చేస్తున్నారని వాళ్లంతా తీవ్రంగా మండిపడుతున్నారు. కేవలం పదవులు పట్టుకుని వేలాడటం తప్ప ఈ విషయంలో అసలు చేసిందేంటని నిలదీశారు. గురువారం ఢిల్లీలో జరిగిన ఓ సమావేశంలో సరిగ్గా ఇదే జరిగింది. కేంద్ర మంత్రులు, ఎంపీల మీద ఏపీ ఎన్జీవో నాయకులు, విద్యార్థి నాయకులు ఒక రకంగా విరుచుకుపడ్డారు. ఇన్నాళ్లూ అసలేం చేస్తున్నారని నిలదీశారు. కేంద్ర మంత్రులు కె. చిరంజీవి, కోట్ల సూర్యప్రకాశ రెడ్డి, పనబాక లక్ష్మి, కావూరి సాంబశివరావు, ఎం.ఎం. పళ్లంరాజు, జె.డి. శీలం, కిల్లి కృపారాణి, ఎంపీలు కేవీపీ రామచంద్రారావు, లగడపాటి రాజగోపాల్, అనంత వెంకట్రామిరెడ్డి, ఉండవిల్లి అరుణ్‌కుమార్, హర్షకుమార్ పాల్గొన్నారు. ఉద్యోగుల తరఫున ఏపీఎన్జీవోల సంఘం అధ్యక్షుడు అశోక్‌బాబుతో పాటు దాదాపు 30 మంది వివిధ సంఘాల ప్రతినిధులు ఈ భేటీలో పాల్గొన్నారు.

రాజీనామాలు చేయకుండా జనంలో తిరగగలమనుకుంటున్నారా? రాజీనామాలు చేసి జనంలోకి రండి.. మిమ్మల్ని గెలిపించే పూచీ మాది అని కూడా నాయకులకు ఉద్యోగ నేతలు స్పష్టం చేశారు. చిరంజీవి, కావూరి, కోట్ల, పనబాక.. ఇలా ప్రతి ఒక్కరినీ ఉద్యోగ సంఘాల నాయకులు, విద్యార్థి నాయకులు నిలబెట్టి కడిగేశారు. దాంతో నాయకులంతా తాము కూడా రాజీనామాలకు సిద్ధమేనని చెప్పినా.. వాటివల్ల పెద్దగా ప్రయోజనం ఉండబోదని, చెయ్యాలంటే రెండు మూడు రోజుల్లోనే రాజీనామాలు చేసేస్తామని వాళ్లకు నచ్చజెప్పారు.

అయితే, ప్రస్తుతానికి ఏమీ చేయలేక మెత్తగానే వ్యవహరించిన ఈ నాయకులు, రేపు ఆందోళనలు చల్లారి, కొత్త రాష్ట్రం ఏర్పడినా లేక ఒకే రాష్ట్రంగా ఉన్నా కూడా.. తమ విషయంలో ఎలా వ్యవహరిస్తారోనన్న అనుమానాలు కూడా ఉద్యోగ వర్గాల్లో లేకపోలేవు. తెలంగాణ ఉద్యమ సమయంలో కూడా ఉద్యోగులు ఆందోళనలు చేసి, నాయకులను నిలదీసినా, అప్పట్లో ప్రధానంగా జేఏసీ అనే ఒక వేదిక ఉండటం, టీఆర్ఎస్ కూడా అందులో ప్రధాన పాత్ర పోషించడంతో ఉద్యోగ వర్గాల మీద పెద్దగా కక్షసాధింపు చర్యల్లాంటివి ఏమీ జరగలేదు. పైపెచ్చు, స్వామిగౌడ్ లాంటి వాళ్లకు ఎమ్మెల్సీ పదవులు కూడా దక్కాయి. కానీ ఈసారి ఉద్యమంలో అలా జరిగే అవకాశం కనిపించట్లేదు. ఉద్యోగుల ఉద్యమాన్ని ప్రస్తుతానికి ఎలా చూస్తున్నా.. తర్వాతి కాలంలో నాయకులు వీళ్ల విషయంలో ఎలా వ్యవహరిస్తారోనన్నది అనుమానమే.

అప్పుడు మళ్లీ కుక్కే తోకను ఊపుతుందన్న మాట!!

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement