సాక్షి, తిరుపతి/తిరుమల : తిరుమలకు శుక్రవారం సమైక్యసెగ తాకింది. తెలంగాణ నోట్‌కు కేంద్ర క్యాబినెట్ ఆమోదం తెలపడాన్ని నిరసిస్తూ రెండు ఘాట్ రోడ్లలో ఏపీ ఎన్‌జీవోలు, ఆర్టీసీ జేఏసీ నాయకులు వాహనాలను అడ్డుకున్నారు. అలిపిరిలో రాస్తారోకో చేశారు. శ్రీవారి బ్రహ్మోత్సవాల్లో భాగంగా జరిగిన అంకురార్పణ కార్యక్రమాన్ని తిలకించేందుకు వేలాది మంది భక్తులు తిరుపతికి చేరుకున్నారు. వాహనాలను పైకి పోనివ్వకపోవడంతో వారందరూ అలిపిరిలోనే ఉండిపోవాల్సి వచ్చింది.
టీటీడీ అధికారులు ఉదయం నుంచి రెండో ఘాట్ రోడ్డులో వినాయకుని ఆలయం వద్ద నుంచి రాకపోకలు సాగిస్తూ, సిబ్బందిని తిరుమలకు తరలిస్తుండగా.. ఆందోళనకారులు బస్సుల టైర్లకు గాలి తీసేశారు.పోలీసులు కూడా తిరుమలకు వెళ్లలేకపోయారు. బ్రహ్మోత్సవాలకు వాలంటీర్లుగా వెళ్లాల్సిన 200మంది స్కౌట్స్, గైడ్సు వాహనాలు లేక నడిచి వెళ్లారు. సాయంత్రం ఆరుగంటలకు తిరుమల రహదారిని పునరుద్ధరించారు. శనివారం ఉదయం 7 గంటలకు తిరిగి వాహనాల రాకపోకలను అడ్డుకుంటామని ఏపీ ఎన్‌జీవోల నాయకులు తెలిపారు. కాగా, బంద్ ప్రభావం తిరుమలలో స్పష్టంగా కనిపించింది. రద్దీ తక్కువగా ఉండడంతో ఆలయంలో లఘు దర్శనం అమలు చేశారు. ఆలయ ప్రాంతం భక్తులు లేక బోసిపోయింది.
భక్తులకు ప్రయాణ సౌకర్యం కల్పించలేం: టీటీడీ ఈవో గోపాల్
బంద్ పరిస్థితుల నేపథ్యంలో తిరుమలకు వచ్చే భక్తులకు ప్రయాణపరంగా అదనపు ఏర్పాట్లు చేయలేమని టీటీడీ ఈవో ఎంజీ.గోపాల్ స్పష్టంచేశారు. శుక్రవారం ఆయన విలేకరుతో మాట్లాడుతూ, మలుపులతో కూడిన ఘాట్ రోడ్లలో కొత్తగా ప్రైవేట్ వాహనాలను తీసుకొచ్చి ప్రయాణం కల్పించే అవకాశాల్లేవన్నారు. కొత్తవారిని ఘాట్ రోడ్డు ప్రయాణానికి అనుమతిస్తే అనుకోని ఘటనలు జరిగే అవకాశముందని తెలిపారు. తిరుమలలో నిలిచిపోయిన భక్తులకు 48 గంటల కాలపరిమితి దాటినా గదులకు ఎలాంటి అపరాధ రుసుమూ వసూలు చేయబోమన్నారు.
తిరుమలకు వాహనాలు బంద్
Published Sat, Oct 5 2013 3:23 AM | Last Updated on Fri, Sep 1 2017 11:20 PM
Advertisement