ఒంగోలు టౌన్, న్యూస్‌లైన్ : కేంద్ర మంత్రివర్గం తెలంగాణ ఏర్పాటుకు ఆమోదం తెలపడంపై జిల్లా కేంద్రం ఒంగోలుల నగరం భగ్గుమంది. ఉద్యోగులు, ఉపాధ్యాయులు, విద్యార్థులు, ప్రజలు, మహిళలు, కార్మికులు స్వచ్ఛందంగా రోడ్లపైకి వచ్చి కాంగ్రెస్ ప్రభుత్వ తీరును దుయ్యబట్టారు. ప్రజా ప్రతినిధులకు శాపనార్థాలు పెట్టారు. కేంద్ర మంత్రివర్గం తీరును నిరసిస్తూ శుక్రవారం ఒంగోలు నగరంలో బంద్ విజయవంతమైంది. బంద్ ప్రభావంతో చిరువ్యాపారులు, టీ దుకాణాలు, బడా వ్యాపారసంస్థలు, విద్యా సంస్థలు, సినిమాహాల్‌లు, కేంద్ర ప్రభత్వు కార్యాలయాలు, బ్యాంక్‌లు పూర్తిగా మూపతడ్డాయి. నగరంలోని ప్రధాన వీధులైన బాపూజీమార్కెట్ కాంప్లెక్స్, గాంధీరోడ్డు, కర్నూల్‌రోడ్డు, ట్రంకురోడ్, అద్దంకి బస్టాండ్ తదితర ప్రాంతాల్లోని షాపులన్నీ స్వచ్ఛందంగా మూతపడ్డాయి. ఇక సమైక్యాంధ్ర పరిరక్షణ వేదిక ఆధ్వర్యంలో ఉద్యోగులు భారీ ఎత్తున బంద్‌లో పాల్గొన్నారు.
నగరానికి ఇరుపైపులా ఉన్నా జాతీయ రహదారిపై ఆందోళనకు దిగారు. దక్షిణ, ఉత్తర బైపాస్‌తో పాటు, కర్నూల్‌రోడ్, గుంటూరు రోడ్ ప్రాంతాల్లో రోడ్డుపై మానవహారాలు, ర్యాలీ నిర్వహించారు. రోడ్డుపై పెద్ద ఎత్తున టైర్లు తగలబెట్టి వాహన రాకపోకలను పూర్తిగా అడ్డుకున్నారు. ఆటోలను కూడా అడ్డుకున్నారు. ఎప్పుడూ జన సంచారంతో రద్దీగా ఉండే ఒంగోలు నగర వీధులన్నీ బోసిపోయాయి. ఎన్‌జీఓ సంఘ నాయకుడు అబ్దుల్‌బషీర్ మాట్లాడుతూ ఉద్యోగులు 65 రోజులుగా తమ జీతాలు వదులుకొని రాష్ట్ర సమైక్యత కోసం పాటుపడుతుంటే కేంద్రం వ్యవహరిస్తున్న తీరు ప్రజలకు ఆగ్రహం తెప్పించేలా ఉందన్నారు. సీమాంధ్ర ప్రజల మనోభావాలను గౌరవించని కాంగ్రెస్ పార్టీకి ఈ ప్రాంతంలో రాజకీయ సమాధి కట్టడం ఖాయమని హెచ్చరించారు. ప్రజా ప్రతినిధులు ఇప్పటికైనా తమ పదవులకు రాజీనామాలు చేయకపోతే తీవ్ర పరిణామాలు ఉంటాయన్నారు. కార్యక్రమంలో ఎన్‌జీఓ నాయకులు బండి శ్రీనివాసరావు, రాజ్యలక్ష్మి, స్వాములు, కృష్ణారెడ్డి, శరత్, మస్తాన్‌వలి, ప్రకాశ్ పాల్గొన్నారు.
కదం తొక్కిన విద్యుత్ ఉద్యోగులు
రాష్ట్ర విభజనను నిరసిస్తూ విద్యుత్ ఉద్యోగులు నగరంలో కదం తొక్కారు. బైక్ ర్యాలీగా నగరంలోని ప్రధాన వీధుల వెంట తిరుగుతూ బంద్‌ను విజయవంతం చేయాలని ప్రజలకు విజ్ఞప్తి చేశారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచకపోతే భవిష్యత్‌లో కఠినమైన నిర్ణయాలు తీసుకోవాల్సి ఉంటుందని హెచ్చరించారు.
విద్యార్థుల రాస్తారోకో
సమైక్యాంధ్రకు మద్దతుగా పేర్నమిట్ట శ్రీప్రతిభా విద్యా సంస్థల ఆధ్వర్యంలో విద్యార్థులు కర్నూల్‌రోడ్డుపై రాస్తారోకో నిర్వహించారు. దీంతో వాహన రాకపోకలు భారీ స్థాయిలో నిలిచిపోయాయి. కేంద్ర మంత్రివర్గం తీసుకున్న నిర్ణయాన్ని వెంటనే వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేశారు. ప్రజా ప్రతినిధులు తమ పదవులకు రాజీనామాలు చేయాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో ప్రతిభా విద్యాసంస్థల అధినేత నల్లూరి వెంకటేశ్వర్లు పాల్గొన్నారు.
ప్రజలను మోసం చేస్తున్న ఎంపీ
సమైక్యాంధ్రకు మద్దతుగా తన ఎంపీ పదవికి రాజీనామా చేయని ఒంగోలు పార్లమెంట్ సభ్యుడు మాగుంట శ్రీనివాసులరెడ్డిపై జిల్లా వ్యాప్తంగా ప్రజలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇప్పటిదాకా మాయమాటలు చెప్తూ జిల్లా వాసులను మోసం చేస్తున్నారని, ఇప్పటికైనా తీరు మార్చుకొని పదవికి రాజీనామా చేయకపోతే భవిష్యత్‌లో పదవే లేకుండా చేస్తామంటూ హెచ్చరించారు. ఈ సందర్భంగా నగరంలోని దివంగత మాగుంట సుబ్బరామరెడ్డి విగ్రహం సాక్షిగా ఎంపీ శ్రీనివాసులరెడ్డి దిష్టిబొమ్మను దహనం చేశారు. ప్రజలకు అండగా ఉండాల్సిన ఎంపీ ఢిల్లీ పెద్దలకు లొంగి పదవికి రాజీనామా చేయకపోవడం దురదృష్టకరమని పలువురు సమైక్యవాదులు వ్యాఖ్యానించారు.
బోసిపోయిన ఒంగోలు
Published Sat, Oct 5 2013 4:29 AM | Last Updated on Mon, Mar 18 2019 9:02 PM
Advertisement