విలీనంపై కేసీఆర్ సంకేతాలిచ్చారు: దిగ్విజయ్
కాంగ్రెస్ పార్టీలో టీఆర్ఎస్ విలీనం ఉండొచ్చనే టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ సంకేతాలిచ్చినట్లు ఏఐసీసీ రాష్ట్ర వ్యవహారాల ఇన్చార్జి దిగ్విజయ్ సింగ్ తెలిపారు. ఆయన కాంగ్రెస్ అధినేత్రి సోనియాగాంధీని, ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీని కలిశారని, ఈ సందర్భంగా అలాంటి సంకేతాలు ఇచ్చారని చెప్పారు. సీమాంధ్ర ప్రాంతానికి చెందిన పలువురు కాంగ్రెస్ నాయకులు సోనియాగాంధీతో భేటీ అయిన అనంతరం ఆ వివరాలను దిగ్విజయ్ సింగ్ మీడియాకు వెల్లడించారు. కొత్తగా ఏర్పడే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఐదేళ్ల పాటు ప్రత్యేక హోదా ఉన్నా.. పన్ను రాయితీలు మాత్రం పదేళ్ల పాటు కొనసాగుతాయని, పోలవరం ప్రాజెక్టు తప్పనిసరిగా వచ్చి తీరుతుందని ఆయన చెప్పారు. రాష్ట్ర విభజన బిల్లులో సీమాంధ్రకు అనుకూలంగా ఉన్న విషయాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలని సోనియా సూచించారని, సీమాంధ్రకు కేజీ బేసిన్ గ్యాస్ కేటాయింపుపై దృష్టి పెట్టారని, సోనియాతో అనేక అంశాలపై నాయకులు చర్చించారని అన్నారు.
సీమాంధ్రకు ప్రత్యేక పార్టీ కమిటీ, ప్రత్యేక ఎన్నికల కమిటీ, ప్రత్యేక మేనిఫెస్టో కమిటీ కొన్నిరోజుల్లో ఏర్పాటు చేస్తామని తెలిపారు. రాయలసీమ, కోస్తాంధ్రలో మార్చి నెలాఖరులో బహిరంగ సభలుంటాయని, వాటికి సోనియా, రాహుల్, మన్మోహన్‌లను నాయకులు ఆహ్వానించారని కూడా దిగ్విజయ్ చెప్పారు.
2004 నుంచి 2014 వరకు కాంగ్రెస్ పాలనలో రాష్ట్రం మంచి అభివృద్ధి సాధించిందని, దేశంలోనే అగ్రస్థాయి రాష్ట్రాల్లో ఒకటిగా నిలిచిందని దిగ్విజయ్ సింగ్ అన్నారు. విభజన అనంతరం రెండు రాష్ట్రాలు కూడా మళ్లీ అగ్రస్థానం కోసం పోటీ పడతాయని తాను ఆశిస్తున్నానన్నారు. ఈ రెండు రాష్ట్రాలు ఆరోగ్యకరమైన వాతావరణంలో పోటీ పడతాయని, పరస్పరం సహకరించుకుంటాయని ఆయన అన్నారు. సీమాంధ్రకు ఐదు సంవత్సరాల పాటు ప్రత్యేక హోదా ఇచ్చామని, అయితే పన్ను రాయితీలు మాత్రం పదేళ్ల పాటు కొనసాగుతాయని ఆయన స్పష్టం చేశారు. ఇక ప్రత్యేక హోదా కింద 90శాతం వరకు కేంద్ర గ్రాంటులు అందుతాయన్నారు. కొత్త రాజధాని ఎక్కడుండాలి, అలాగే కొత్త హైకోర్టు ఎక్కడ ఏర్పాటుచేయాలనే అంశాలను నిపుణుల కమిటీ చూసుకుంటుందని తెలిపారు. ఇక రాష్ట్రపతి ఆమోదముద్ర, అపాయింటెడ్ డే కోసం తాము ఎదురు చూస్తున్నామని, అవి రాగానే కొత్త రాష్ట్రం ఏర్పాటవుతుందని దిగ్విజయ్ సింగ్ తెలిపారు.