సాక్షి, అనంతపురం : సమైక్యాంధ్ర పరిరక్షణ కోసం ప్రతి ఊరూ ఉద్యమ పథంలో సాగుతోంది. ప్రతి వాడలోనూ సమైక్య నినాదం మార్మోగుతూనే ఉంది. 32వ రోజైన శనివారం కూడా జిల్లాలో ఉద్యమం ఉధృతంగా కొనసాగింది. అనంతపురం నగరంలో పత్రికా రవాణా వాహనాలతో భారీ ప్రదర్శన నిర్వహించారు. తహశీల్దార్ కార్యాలయం ఎదుట రిలే దీక్షలు కొనసాగుతున్నాయి. ఇక్కడే వంటా వార్పు చేపట్టారు. రెవెన్యూ ఉద్యోగుల రిలే దీక్షలకు జిల్లా గెజిటెడ్ అధికారుల సంఘం అధ్యక్షుడు హేమసాగర్, కార్యదర్శి తిమ్మప్ప తదితరులు సంఘీభావం తెలిపారు. ఇదే శిబిరంలో కవులు, అటవీశాఖ ఉద్యోగులు, ప్రభుత్వ డ్రైవర్లు రిలే దీక్షలు చేపట్టారు. టవర్‌క్లాక్ సర్కిల్‌లో సమైక్యాంధ్ర పరిరక్షణ సమితి ఆధ్వర్యంలో కోగటం విజయభాస్కర్‌రెడ్డి చేపట్టిన ఆమరణ దీక్ష రెండో రోజూ కొనసాగింది.
మెడికల్ జేఏసీ నాయకుల దీక్షలకు ఎన్‌జీఓ సంఘం జిల్లా అధ్యక్షుడు దేవరాజు సంఘీభావం తెలిపారు. జేఎన్‌టీయూలో ఉద్యోగులు చేపట్టిన రిలే దీక్షలు పదకొండో రోజూ కొనసాగాయి. పంచాయతీరాజ్ ఉద్యోగులు, న్యాయవాదులు, ముస్లిం యువకులు నగరంలో బైక్ ర్యాలీ నిర్వహించారు. టీచర్లు చెవిలో పూలు పెట్టుకుని ‘సోనియమ్మా... నీ భరతం పడతాం’ అంటూ భజన చేసుకుంటూ అర్ధనగ్న ప్రదర్శన చేశారు. రిటైర్డ్ పోలీసు అధికారులు, ఉద్యోగుల ఆధ్వర్యంలో ర్యాలీ నిర్వహించారు. మంత్రులు ఎక్కడ దాక్కున్నారంటూ పశుసంవర్ధకశాఖ ఉద్యోగులు డాగ్‌స్క్వాడ్, టార్చిలైట్లతో వెతికి, నిరసన తెలిపారు. ఎస్కేయూలో విద్యార్థుల రిలే దీక్షలు 31వ రోజుకు చేరుకున్నాయి.
ఈ దీక్షలకు ధర్మవరం పట్టణానికి చెందిన న్యాయవాదులు మద్దతు తెలిపారు. ఎస్కేయూ మహిళా ఉద్యోగులు జాతీయ రహదారిపై ముగ్గులు వేసి నిరసన తెలిపారు. ధర్మవరంలో జేఏసీ రిలేదీక్షలు కొనసాగుతున్నాయి. ప్రజాసంఘాల ఆధ్వర్యంలో పెద్దఎత్తున ప్రదర్శన నిర్వహించారు. బత్తలపల్లిలో జేఏసీ, ముదిగుబ్బలో టీచర్ల రిలే దీక్షలు కొనసాగుతున్నాయి. ముదిగుబ్బలో పాత్రికేయులు రిలే దీక్షలు చేపట్టారు. గుంతకల్లులో విద్యుత్ ఉద్యోగులు సామూహిక నిరాహార దీక్షలకు దిగారు. న్యాయవాదులు, ప్రభుత్వ ఉద్యోగుల జేఏసీ, వైఎస్సార్‌సీపీ, టీడీపీ, కాంగ్రెస్ ఆధ్వర్యంలో రిలే దీక్షలు కొనసాగుతున్నాయి. గుత్తిలో ముస్లింలు భారీ ప్రదర్శన నిర్వహించి, రోడ్డుపై ప్రార్థన చేశారు. హిందూపురంలో ప్రైవేటు విద్యాసంస్థల ఆధ్వర్యంలో చిన్నారులు, విద్యార్థులు జాతీయ నాయకుల వేషధారణలో ప్రదర్శన చేశారు. మంత్రులు, ఎంపీలకు పదవులే ముఖ్యమని విమర్శిస్తూ ఉపాధ్యాయులు కుర్చీలతో ప్రదర్శన చేపట్టారు. విశాలాంధ్ర పరిరక్షణ సమితి, ఎన్‌జీఓలు ,విద్యుత్ జేఏసీ ఆధ్వర్యంలో ర్యాలీలు చేశారు. చిలమత్తూరులో పంచాయతీ కార్మికులు రిలేదీక్షలు చేపట్టారు. లేపాక్షిలో సమైక్యవాదులు ర్యాలీ చేశారు. కదిరిలోని అంబేద్కర్ కూడలిలో జెడ్పీహెచ్‌ఎస్ ఉపాధ్యాయులు రిలే దీక్షలు చేపట్టారు. తలుపులలో ఉపాధ్యాయులు రోడ్లు శుభ్రం చేస్తూ నిరసన తెలిపారు. ఎన్‌పీకుంటలో సమైక్యవాదులు కొవ్వొత్తుల ప్రద ర్శన నిర్వహించారు.
కళ్యాణదుర్గం, పుట్టపర్తి, పుట్లూరులో జేఏసీ నాయకులు, మడకశిరలో వైద్య,ఆరోగ్యశాఖ ఉద్యోగులు, పెనుకొండలో చేనేతలు, గోరంట్లలో ట్రాన్స్‌కో ఉద్యోగులు, గార్లదిన్నెలో రిక్షావాలాలు, నార్పలలో సమైక్యవాదులు ర్యాలీలు నిర్వహించారు. అమరాపురంలో తోపుడుబండ్ల వ్యాపారులు ర్యాలీ చేశారు. ఉపాధ్యాయులు చెవిలో పూలుపెట్టుకుని నిరసన ప్రదర్శన నిర్వహించారు. బుక్కపట్నంలో వాల్మీకి సంఘం ఆధ్వర్యంలో భారీ ర్యాలీ, రోడ్డుపై వంటా వార్పు చేపట్టారు. ఓడీచెరువులో ఉపాధ్యాయులు మోకాళ్లపై నడిచి నిరసన తెలిపారు. అమడగూరులో రిలే దీక్షలు చేపట్టారు. రాయదుర్గంలో జాక్టో ఆధ్వర్యంలో పార్టీ కార్యాలయాలను ముట్టడించారు. కాంగ్రెస్, టీడీపీ ప్రజాప్రతినిధులు దొంగ రాజీనామాలు చేశారంటూ చెవిలో పూలుపెట్టుకుని నిరసన తెలిపారు. మధ్యాహ్న భోజన ఏజెన్సీ నిర్వాహకులు, విద్యార్థి జేఏసీ, అరబిక్ కళాశాల, ప్రైవేటు బస్సుల కండక్టర్లు ఆధ్వర్యంలో రిలేదీక్షలు చేపట్టారు. విద్యుత్ ఉద్యోగులు సైకిళ్లపై ర్యాలీ నిర్వహించారు.
కణేకల్లులో నలుగురు వైఎస్సార్‌సీపీ కార్యకర్తలు రిలే దీక్షలు చేపట్టారు. ఎన్‌జీఓలు గంజి పంపిణీ చేసి నిరసన తెలిపారు. 48 గంటల నిరాహార దీక్ష చేపట్టిన డిగ్రీ విద్యార్థి రాజేష్‌కు మాజీ ఎమ్మెల్యే పాటిల్ వేణుగోపాల్‌రెడ్డి నిమ్మరసం ఇచ్చి విరమింపజేశారు. ఆత్మకూరులో రైతులు ఎడ్లబండ్ల ర్యాలీ నిర్వహించారు. సీకేపల్లెలో మాదిగలు దండోరా కార్యక్రమం నిర్వహించారు. శింగనమలలో రిలేదీక్షలు కొనసాగుతున్నాయి. తాడిపత్రి మునిసిపల్ కార్యాలయం ఎదుట జేఏసీ రిలేదీక్షలు కొనసాగుతున్నాయి. పెద్దపప్పూరులోని ఆలయాల్లో పూజలు, మసీదుల్లో ప్రార్థనలు చేశారు. ఉరవకొండలో సమైక్యవాదులు ప్రదర్శనలతో హోరెత్తించారు.
విశ్వరూపం
Published Sun, Sep 1 2013 4:46 AM | Last Updated on Fri, Sep 1 2017 10:19 PM
Advertisement
Advertisement