సాక్షి, అనంతపురం : సమైక్యాంధ్ర పరిరక్షణ ఉద్యమం నిర్విరామంగా కొనసాగుతోంది. రాష్ట్రాన్ని ముక్కలు చేయాలన్న నిర్ణయాన్ని పాలకులు వెనక్కు తీసుకునే వరకు ఉద్యమ పథం నుంచి వైదొలగబోమని అన్ని వర్గాల ప్రజలు ముక్తకంఠంతో చాటుతున్నారు. జిల్లాలో ప్రతి ఊరూ వాడ సమైక్య నినాదం మార్మోగుతూనే ఉంది. మంగళవారం అనంతపురం నగరంలో యూత్ జేఏసీ ఆధ్వర్యంలో వేలాది మంది విద్యార్థులు భారీ ర్యాలీ నిర్వహించారు. స్థానిక టవర్ క్లాక్ సర్కిల్‌లో మానవహారం నిర్మించారు.
జాక్టో ఆధ్వర్యంలో ఉపాధ్యాయుల రిలే దీక్షలు కొనసాగుతున్నాయి. ఎస్కేయూలో విద్యార్థులు, ధర్మవరంలో వైఎస్సార్‌సీపీ శ్రేణుల రిలే దీక్షలు కొనసాగాయి. బత్తలపల్లిలో విద్యార్థులు ర్యాలీ చేపట్టి.. మానవహారం నిర్మించారు. పామిడిలో సమైక్యాంధ్ర పరిరక్షణ సమితి ఆధ్వర్యంలో మౌనదీక్ష కొనసాగుతోంది. సమైక్యాంధ్ర ఉద్యమానికి వ్యతిరేకంగా ఎవరు మాట్లాడినా నాలుక కోస్తామని హిందూపురంలో విశాలాంధ్ర పరిరక్షణ సమితి నాయకులు హెచ్చరించారు.
ఈ మేరకు వారు కేంద్ర మంత్రి పనబాక లక్ష్మి మాస్క్‌ధారికి నాలుక కోస్తున్నట్లు ప్రదర్శన చేశారు. అంతకుముందు పట్టణంలో ర్యాలీ నిర్వహించారు. చిలమత్తూరులో ఉపాధ్యాయులు ర్యాలీ చేశారు. నంబులపూలకుంట, మడకశిరలో విద్యార్థులు రాస్తారోకో, మానవహారం చేపట్టారు. కళ్యాణదుర్గంలో నార్త్ ఉన్నత పాఠశాల ఉపాధ్యాయులు విరామ సమయం లో నిరసన తెలిపారు. రాష్ట్ర విభజనను వ్యతిరేకిస్తూ కుందుర్పిలో సమైక్యవాదులు గాడిదకు వినతిపత్రం అందజేశారు. కణేకల్లులో నాలుగవ తరగతి విద్యార్థులు రిలే దీక్షలు చేపట్టారు. తాడిపత్రిలో నాయీబ్రాహ్మణ సంఘం, ఇంజనీరింగ్ కళాశాల విద్యార్థుల ఆధ్వర్యంలో రిలే దీక్షలు కొనసాగాయి.
నిర్విరామ పోరు
Published Wed, Oct 23 2013 2:37 AM | Last Updated on Fri, Jun 1 2018 8:36 PM
Advertisement