సాక్షి, అనంతపురం : ప్రతి ఊరూ పోరుగడ్డ అవుతోంది. పిల్లల నుంచి పెద్దల వరకు ప్రతి ఒక్కరూ పోరాటవీరులు అవుతున్నారు. వారందరిలోనూ చెక్కుచెదరని సమైక్య సంకల్పం కన్పిస్తోంది. ఫలితంగా జిల్లా వ్యాప్తంగా 62 రోజులుగా సమైక్య నినాదం మార్మోగుతూనే ఉంది. సమ్మెలు, బంద్ లు, దీక్షలు, ర్యాలీలు, మానవహారాలతో పాటు వినూత్న నిరసనలు హోరెత్తుతూనే ఉన్నాయి.
సోమవారం కూడా జిల్లా వ్యాప్తంగా ఉద్యమం జోరుగా కొనసాగింది. అనంతపురం నగరంలోని టవర్‌క్లాక్ సర్కిల్‌లో జాక్టో నాయకులు రోడ్డుపై పడుకుని సమైక్య నినాదాలు చేస్తూ నిరసన తెలిపారు. నగర పాలక సంస్థ ఉద్యోగులు నోటికి నల్లగుడ్డలు కట్టుకుని ర్యాలీ చేపట్టారు. విద్యుత్ ఉద్యోగులు భారీ ర్యాలీ చేశారు. నగర పాలక సంస్థ కార్యాలయం ఎదుట రిలే దీక్షలు చేస్తున్న స్వయం సహాయక సంఘాల మహిళలకు వైఎస్సార్‌సీపీ నేత ఎర్రిస్వామిరెడ్డి సంఘీభావం తెలిపారు. పంచాయతీ రాజ్ ఉద్యోగులు ర్యాలీ చేపట్టి... స్థానిక సప్తగిరి సర్కిల్‌లో మానవహారం నిర్మించారు.
కేసీఆర్, సుష్మాస్వరాజ్ దిష్టి బొమ్మలు దహనం చేశారు. వ్యవసాయ మార్కెట్‌యార్డులో మార్కెటింగ్ సిబ్బంది వంటా వార్పు చేపట్టారు. ఈ కార్యక్రమానికి తెలంగాణ ప్రాంతానికి చెందిన మార్కెటింగ్ శాఖ ప్రాంతీయ ఉప సంచాలకుడు (ఆర్‌డీడీ) కే.రాజశేఖరరెడ్డి సంఘీభావం తెలిపారు. ప్రభుత్వ, ఎయిడెడ్ జూనియర్ కళాశాలల అధ్యాపకులు, నోడల్ స్కూల్ సిబ్బంది ఆధ్వర్యంలో నగరంలో భారీ ర్యాలీ చేశారు. ఎస్కేయూలో జేఏసీ నాయకుల రిలే దీక్షలు కొనసాగుతున్నాయి. సమైక్యవాదులు అర్ధనగ్న ప్రదర్శన చేపట్టి... 205 జాతీయ రహదారిపై వాహన రాకపోకలను అడ్డుకున్నారు. ధర్మవరంలో స్వచ్ఛంద సంస్థల ఆధ్వర్యంలో రోడ్డుపై బట్టలు కుట్టి, గుంతకల్లులో మునిసిపల్ కార్యాలయం ఎదుట సిబ్బంది నడి రోడ్డుపై వరినాట్లు వేసి, పామిడిలో జాక్టో నేతలు బజ్జీలు వేస్తూ.. రోడ్డుపై వెళ్లేవారికి మెహందీ పెడుతూ వినూత్న నిరసన వ్యక్తం చేశారు.
బత్తలపల్లి, తాడిమర్రి, ముదిగుబ్బలో రిలే దీక్షలు కొనసాగుతున్నాయి. పామిడిలో సమైక్యవాదులు ర్యాలీ చేశారు. హిందూపురంలో విశాలాంధ్ర పరిరక్షణ సమితి ఆధ్వర్యంలో ప్రధాన రహదారుల్లో ఇటుకలు మోసి నిరసన తెలిపారు. స్థానిక సద్భావన సర్కిల్‌లో ఉపాధ్యాయులు మానవహారం నిర్మించారు. ఆర్టీసీ ఉద్యోగులు ర్యాలీ చేపట్టారు. చిలమత్తూరులో జెడ్పీ పాఠశాల సిబ్బంది రిలే దీక్షలు చేపట్టారు. కదిరిలోని అంబేద్కర్ కూడలిలో తనకల్లు మండల ఉపాధ్యాయులు రిలే దీక్షలు చేశారు. మడకశిరలో జేఏసీ నాయకులు భారీ ర్యాలీ, రాస్తారోకో చేశారు. దళిత హక్కుల పరిరక్షణ సమితి ఆధ్వర్యంలో ర్యాలీ నిర్వహించారు. జాతీయ నాయకుల వేషధారణలతో విద్యార్థులు చేపట్టిన ప్రదర్శన ఆకట్టుకుంది. పుట్టపర్తిలో ‘సమైక్య సమర భేరి’ విజయవంతమైంది. ఈ కార్యక్రమాన్ని సత్యసాయి సెంట్రల్ ట్రస్టు సభ్యుడు ఆర్‌జే రత్నాకర్ ప్రారంభించారు. వేలాది మంది ప్రజలు పాల్గొని సమైక్య నినాదాలు మార్మోగించారు. గజల్ శ్రీనివాస్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. పెనుకొండలో జేఏసీ నాయకులు ర్యాలీ చేశారు. రొద్దంలో టీ విక్రయిస్తూ నిరసన తెలిపారు. గోరంట్లలో జేఏసీ నాయకులు, ఉద్యోగులు, ఉపాధ్యాయుల రిలే దీక్షలు కొనసాగుతున్నాయి. రాయదుర్గంలో ఆల్ మర్చంట్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో భారీ ర్యాలీ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో చిన్నారులు తెలుగుతల్లి వేషధారణలో హైలెట్‌గా నిలిచారు.
పట్టణంలోని వినాయక సర్కిల్‌లో 600 మంది సమైక్యవాదులు రిలే దీక్షలు చేపట్టారు. రిలే దీక్షలు చేస్తున్న సమైక్యవాదులకు ఎమ్మెల్యే కాపు రామచంద్రారెడ్డి సతీమణి భారతి సంఘీభావం తెలిపారు. సమైక్యాంధ్ర ప్రకటన వచ్చే వరకు ఉద్యమం ఉధృతం చేయాలని ఆమె పిలుపునిచ్చారు. కణేకల్లులో జేఏసీ నాయకులు కేంద్ర మంత్రుల మాస్కులు ధరించి నిరసన తెలిపారు. డీ.హీరేహాళ్‌లో జేఏసీ ఆధ్వర్యంలో రక్తదాన శిబిరం ఏర్పాటు చేశారు. రాప్తాడులో జాతీయ రహదారిపై ఉపాధ్యాయులు రాస్తారోకో చేశారు. శింగనమలలో మహిళా సమాఖ్య ఆధ్వర్యంలో సోనియాగాంధీ దిష్టిబొమ్మతో శవయాత్ర నిర్వహించి.. దహనం చేశారు. నార్పలలో సమైక్యవాదులు రోడ్డుపై ఆట పాటలతో నిరసన తెలిపారు.
తాడిపత్రిలో ఆర్టీసీ కార్మికులు మోకాళ్లపై నడిచారు. సమైక్యాంధ్ర అనే అంశంపై వాసవీ క్లబ్ ఆధ్వర్యంలో మహిళలకు పాటల పోటీలు నిర్వహించారు. జేఏసీ నాయకులు రోడ్డుపై బఠానీలు, బిస్కెట్లు అమ్ముతూ నిరసన తెలిపారు. పెద్దవడుగూరులో ఉపాధి హామీ మేట్లు, ఉరవకొండలో ఆర్టీసీ జేఏసీ నాయకులు రిలే దీక్షలు ప్రారంభించారు. ఉరవకొండలో వైఎస్సార్‌సీపీ కార్యకర్తల రిలే దీక్షలు కొనసాగుతున్నాయి. కూడేరులో వైద్య సిబ్బంది, బెళుగుప్పలో జేఏసీ నాయకులు ర్యాలీలు నిర్వహించారు.
అదే దూకుడు
Published Tue, Oct 1 2013 3:06 AM | Last Updated on Fri, Jun 1 2018 8:36 PM
Advertisement