కలవరం.. కలకలం | Confusion .. Outrage | Sakshi
Sakshi News home page

కలవరం.. కలకలం

Published Wed, Aug 28 2013 5:14 AM | Last Updated on Mon, Mar 18 2019 9:02 PM

Confusion .. Outrage

సాక్షి ప్రతినిధి, అనంతపురం : సమైక్యాంధ్ర ఉద్యమం మహోగ్రరూపం దాల్చడం అధికార కాంగ్రెస్, విపక్ష టీడీపీ నేతల వెన్నులో వణుకు పుట్టిస్తోంది. ప్రత్యేక తెలంగాణకు మద్దతుగా టీడీపీ అధినేత చంద్రబాబు కేంద్ర ప్రభుత్వానికి లేఖ ఇవ్వడం.. ఆ వెంటనే యూపీఏ పక్షాలు, కాంగ్రెస్ అధిష్టానం రాష్ట్ర విభజన ప్రకటన చేయడాన్ని ప్రజలు జీర్ణించుకోలేకపోతున్నారు. రాష్ట్ర విభజనకు కారణమైన కాంగ్రెస్, టీడీపీలపై జనం మండిపడుతున్నారు.
 
 కాంగ్రెస్, టీడీపీ ప్రజాప్రతినిధులను ఎక్కడికక్కడ అడ్డుకుంటోన్న సమైక్యవాదులు.. పదవులకు రాజీనామాలు చేసి, వాటిని ఆమోదించుకున్న తర్వాతే ఉద్యమంలోకి రావాలని అల్టిమేటం జారీ చేస్తున్నారు. ఈ నేపథ్యంలో జైల్లో ఉన్నా ప్రజాభిప్రాయానికి కట్టుబడి సమైక్యాంధ్ర నినాదంతో నిరవధిక నిరాహార దీక్ష చేపట్టిన వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డికి జనం ఉవ్వెత్తున సంఘీభావం ప్రకటిస్తున్నారు. ఇది కాంగ్రెస్, టీడీపీ శ్రేణుల్లో కలకలం రేపుతోంది. ఇరు పక్షాల నేతలను కలవరానికి గురిచేస్తోంది. రాష్ట్ర విభజనపై యూపీఏ పక్షాలు, కాంగ్రెస్ అధిష్టానం నిర్ణయం తీసుకోగానే అనంతపురంలో సమైక్యాంధ్ర ఉద్యమ కెరటం ఎగిసింది. సీమాంధ్రలో సమైక్యాంధ్ర ఉద్యమానికి ‘అనంత’ చుక్కానిలా నిలుస్తోంది. రాష్ట్ర విభజన నిర్ణయాన్ని కేంద్ర ప్రభుత్వం వెనక్కు తీసుకునే వరకూ ఎత్తిన పిడికిలి దించేది లేదని.. మడమ తిప్పకుండా ఉద్యమపథాన కదంతొక్కుతామని ‘అనంత’ ప్రజానీకం స్పష్టీకరిస్తోంది. అందుకు తార్కాణమే 28 రోజులుగా జిల్లా నలుమూలల ప్రతిధ్వనిస్తోన్న సమైక్యగర్జన. ఉద్యోగ, కార్మిక, విద్యార్థి, కర్షక, ప్రజాసంఘాలు, ప్రజలు స్వచ్ఛందంగా ఉద్యమంలో కదంతొక్కుతున్నారు. సమైక్యాంధ్ర ఉద్యమంలో నినదిస్తున్న ప్రజలు కాంగ్రెస్, టీడీపీ ప్రజాప్రతినిధులను ఎక్కడికక్కడ నిలదీస్తున్నారు.
 
 రాజీనామాల డ్రామాలు..
 సమైక్యావాదుల నిరసనలను తప్పించుకునేందుకు కాంగ్రెస్, టీడీపీ ప్రజాప్రతినిధులు రాజీనామా డ్రామాలకు తెరతీశారు. టీడీపీ ఎమ్మెల్యేలు పయ్యావుల కేశవ్, పరిటాల సునీత, అబ్దుల్‌ఘనీ, కందికుంట వెంకటప్రసాద్, పల్లె రఘునాథరెడ్డి, బీకే పార్థసారధి శాసనసభ్యత్వాలకు రాజీనామా చేసినట్లు ప్రకటించారు. కానీ.. వారి రాజీనామా లేఖలు ఇప్పటికీ తమకు చేరలేదని స్పీకర్ కార్యాలయవర్గాలు స్పష్టీకరిస్తోండటం గమనార్హం. కాంగ్రెస్ ప్రజాప్రతినిధులదీ అదే తీరు. కాంగ్రెస్ ఎమ్మెల్యేలు కొట్రికే మధుసూదన్‌గుప్తా, జేసీ దివాకర్‌రెడ్డి, కె.సుధాకర్ శాసనసభ్యత్వాలకు రాజీనామా చేసినట్లు ప్రకటించారు.
 
 కానీ.. వారి రాజీనామా లేఖలు కూడా ఇప్పటిదాకా స్పీకర్ కార్యాలయానికి చేరలేదు. కేవలం సమైక్యవాదుల నిరసనల నుంచి తప్పించుకోవడానికి కాంగ్రెస్, టీడీపీ ప్రజాప్రతినిధులు రాజీనామాల డ్రామాలు ఆడినట్లు స్పష్టమవుతోంది. వీటిని పసిగట్టిన సమైక్యవాదులు చేసిన రాజీనామాలను ఆమోదించుకున్న తర్వాతనే ఉద్యమంలోకి రావాలని అల్టిమేటం జారీ చేస్తున్నారు. మంగళవారం కళ్యాణదుర్గంలో టీడీపీ ఎమ్మెల్యే పయ్యావుల కేశవ్‌కు సమైక్యవాదులు ఇదే రీతిలో నిరసన వ్యక్తం చేశారు.
 
 బీకే పార్థసారధి, పల్లె రఘునాథరెడ్డి, అబ్దుల్‌ఘనీ తదితరులకు కూడా ఇదే తరహాలో సమైక్యవాదులు స్పష్టం చేసిన విషయం విదితమే. ప్రజల నుంచి తీవ్రమైన ప్రతిఘటన ఎదుర్కోవాల్సి వస్తోండటాన్ని కాంగ్రెస్, టీడీపీ ప్రజాప్రతినిధులు జీర్ణించుకోలేకపోతున్నారు. కాంగ్రెస్ ఎమ్మెల్యేలు జేసీ దివాకర్‌రెడ్డి, కొట్రికే మధుసూదన్‌గుప్తా, ఎమ్మెల్సీ గుండుమల తిప్పేస్వామి రాయల తెలంగాణం చేస్తోండటంపై జనం మండిపడుతున్నారు. ఇది పసిగట్టిన టీడీపీ ఎమ్మెల్యే పయ్యావుల కేశవ్ బహిరంగంగా రాయల తెలంగాణ డిమాండ్‌ను చేయడానికి సాహసించడం లేదు. కానీ.. అంతర్గతంగా రాయల తెలంగాణను సమర్థిస్తోండటాన్ని పసిగట్టిన ప్రజలు ఆయనపై మండిపడుతున్నారు.
 
 జననేత జగన్‌కు సంఘీభావం..
 రాష్ట్ర విభజనకు కాంగ్రెస్, టీడీపీలు కుట్రపన్నడాన్ని పసిగట్టన వైస్సార్‌సీపీ ఎమ్మెల్యేలు ప్రజాభిప్రాయం మేరకు శాసనసభ్యత్వాలకు రాజీనామా చేశారు. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ గౌరవాధ్యక్షురాలు వైఎస్ విజయమ్మ, అధినేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి శాసనసభ, లోక్‌సభ సభ్యత్వాలకు రాజీనామా చేశారు. కాంగ్రెస్ అధిష్టానం తీరుకు నిరసనగా.. సమైక్యాంధ్ర డిమాండ్‌తో వైఎస్ విజయమ్మ గుంటూరులో ఆమరణ దీక్ష చేపట్టారు. ఆ దీక్షను ఏడు రోజుల తర్వాత పోలీసులు భగ్నం చేశారు.
 
 ఆ వెంటనే వైఎస్సార్‌సీపీ అధినేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి జైల్లో ఉన్నా తెలుగు ప్రజలంతా కలిసి ఉండాలన్న లక్ష్యంతో నిరవధిక నిరాహార దీక్ష చేపట్టారు. జైల్లో ఉన్నా ప్రజాసంక్షేమమే పరమావధిగా జగన్ దీక్ష చేపట్టడంపై జనం ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. పార్టీలకు అతీతంగా రాజకీయ నేతలు, ఉద్యోగ, ఉపాధ్యాయ, కార్మిక, కర్షక, విద్యార్థి, ప్రజా సంఘాలు జగన్ దీక్షకు సంఘీభావం తెలుపుతున్నాయి. ఇది కాంగ్రెస్, టీడీపీ నేతలను ఆందోళనకు గురిచేస్తోంది. ధర్మవరం ఎమ్మెల్యే కేతిరెడ్డి వెంటకరామిరెడ్డి కాంగ్రెస్ పార్టీని వీడి.. జగన్‌కు జైకొట్టి వైఎస్సార్‌సీపీలో చేరడమే అందుకు తార్కాణం.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement