కర్నూలు(విద్య)/ కల్లూరు రూరల్, న్యూస్‌లైన్:
రాష్ట్ర విభజన నిర్ణయంపై మహిళాలోకం కన్నెర్ర జేసింది. సమైక్యాంధ్ర కోసం రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళన చేస్తున్నా కేంద్రం దిగిరాకపోవడంతో వారి కడుపు మండింది. యూపీఏ చైర్‌పర్సన్ సోనియాగాంధీ కళ్లు తెరిపించాలంటే మహిళలే సమర నినాదం చేయాలని నిర్ణయించుకున్నారు. ఈ మేరకు జిల్లా విద్యాసంస్థల జేఏసీ సహకారంతో కొండారెడ్డి బురుజు సాక్షిగా తెలుగుతల్లి విగ్రహం వద్ద గురువారం మహిళా గర్జన పేరుతో భారీ సభను ఏర్పాటు చేశారు. మహిళా జేఏసీ ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ కార్యక్రమానికి నగరంలోని పలు విద్యాసంస్థల అధ్యాపకులు, విద్యార్థినులతోపాటు ప్రభుత్వ, ప్రైవేటు సంస్థల ఉద్యోగినులు, సాధారణ మహిళలు వేల సంఖ్యలో హాజరయ్యారు. తెలుగుతల్లి విగ్రహానికి పూలమాలలతో అలంకరించి రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచాలని వారు కోరుకున్నారు.
సమాఖ్య అధ్యక్షురాలు శౌరీలురెడ్డి అధ్యక్షతన నిర్వహించిన ఈ కార్యక్రమంలో రాష్ట్ర విభజన అంశంపై తమదైన శైలిలో పలువురు మహిళలలు ప్రసంగించారు. శ్రీ కృష్ణ కమిటీ ఇచ్చిన నివేదికను సమాధి చేసి కేంద్రం రాష్ట్ర విభజనకు బరి తెగించిందని పంచాయతీరాజ్ శాఖ ఉద్యోగిణి అనురాధ మండిపడ్డారు. శ్రీ కృష్ణ కమిటీ నివేదికను పక్కన పెట్టి ఇప్పుడు ఆంటోని కమిటీ అంటూ కొత్త పల్లవి పాడుతోందని విమర్శించారు. మన హక్కులను కాపాడుకునేందుకే ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినట్లు వాసవి మహిళా ప్రిన్సిపాల్ పార్వతీదేవి చెప్పారు. రాజకీయ నిరుద్యోగుల కారణంగానే రాష్ట్ర విభజనకు బీజం పడిందని రిటైర్డ్ డిప్యూటీ కలెక్టర్ సాయికుమారి మండిపడ్డారు.
ఆకట్టుకున్న సత్యవాణి ప్రసంగం: భారతీయ సంస్కృతి, సాంప్రదాయాలను మేళవిస్తూ, మహాభారతం, మహాభాగవతంలోని అంశాలను నేటి పరిస్థితులకు అనుగుణంగా పోలుస్తూ భారతీయ సంస్కృతి పరిరక్షణ వేదిక అధ్యక్షురాలు సత్యవాణి చేసిన ప్రసంగం ఆద్యంతం ఆకట్టుకుంది. భాషాప్రయుక్త రాష్ట్ర తొలిరాజధాని అయిన కర్నూలులోని కొండారెడ్డి బురుజు వద్ద తనను ప్రసంగించాలని కోరడంతో ఆనందబాష్పాలు రాల్చానని చెప్పారు. ఈ ప్రాంతానికి చెందిన జి. పుల్లారెడ్డి తనను మానస పుత్రికగా అభిమానించేవారని గుర్తు చేసుకున్నారు. ఈరోజు ఇంతమంది మహిళలు ఉద్యమానికి నడుం బిగించారంటే సీమాంధ్ర ప్రాంతానికి జరిగిన అన్యాయమే కారణమన్నారు. స్త్రీ అంటే సకార, తకార, రకారాలతో కూడిన ఆదిశక్తి అని, ఆమె ఉగ్రరూపం దాలిస్తే తట్టుకునే శక్తి ఎవ్వరికీ ఉండదని హెచ్చరించారు. అంతకుముందు మున్సిపల్ హైస్కూలు వద్ద నుంచి భారీ ర్యాలీ నిర్వహించారు. కార్యక్రమంలో జేఏసీ కార్యదర్శి స్వర్ణలత(మాంటిస్సోరి), ఉపాధ్యక్షురాలు జి.ఆర్.రజనీపాల్(ఎస్టీబీసీ), అనురాధ (పంచాయతీరాజ్), మాధవీలత (శ్రీలక్ష్మి), పార్వతీ (వాసవీ), న్యాయవాది నాగలక్ష్మిదేవి, కె.చెన్నయ్య, కట్టమంచి రామలింగారెడ్డి, జి.పుల్లయ్యలతో పాటు వివిధ కళాశాలల విద్యార్థినులు, అధ్యాపకురాళ్లు, ఉద్యోగినులు, మహిళాసంఘాలు, ప్రజాసంఘాల నాయకురాళ్లు పాల్గొన్నారు.
కర్నూలులో భారీ బహిరంగ సభ
Published Fri, Sep 13 2013 3:05 AM | Last Updated on Thu, Sep 27 2018 5:56 PM
Advertisement
Advertisement