అంబేడ్కర్ విగ్రహం వద్ద నిరసన దీక్ష చేపట్టిన ఏపీ నిరుద్యోగ జేఏసీ నేతలు, నిరుద్యోగులు
సాక్షి, డాబాగార్డెన్స్(విశాఖ దక్షిణ) : పంచాయతీ సెక్రటరీ పోస్టుల కోసం విడుదల చేసిన జీవో 39 రద్దు చేయాలని, గ్రూపు – 2 ఎగ్జిక్యూటివ్ ఉద్యోగాల భర్తీ కోసం రాష్ట్ర ప్రభుత్వం కొత్తగా గ్రూపు – 1తో కలిపి డిస్క్రిప్టు విధానంలో పరీక్ష నిర్వహించేందుకు విడుదల చేసిన జీవో 622, 623ని వెంటనే రద్దు చేయాలని కోరుతూ నిరుద్యోగులు మంగళవారం విశాఖ నగర రోడ్లపై కదం తొక్కారు. పెద్ద ఎత్తున నిరసన ప్రదర్శన చేపట్టారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ... సీఎం డౌన్ డౌనంటూ నినదించారు. వందలాది మంది నిరుద్యోగులు నిరసన ప్రదర్శనలో పాల్గొన్నారు. అనంతరం ఏపీ నిరుద్యోగ జేఏసీ రాష్ట్ర అధ్యక్షుడు సమయం హేమంత్‌కుమార్ డాబాగార్డెన్స్ అంబేడ్కర్ విగ్రహం వద్ద నిరసన దీక్ష చేపట్టారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ 2014లో రాష్ట్ర విభజన జరిగన తర్వాత విడిపోయిన ఆంధ్ర రాష్ట్రంలో ఉద్యోగాల విభజన కూడా జరిగిందన్నారు. ఖాళీలున్న ఉద్యోగాల సర్వేకు కమల్‌నాథన్ కమిటీని నియమించారన్నారు. ఆ కమిటీ చేసిన సర్వేలో రాష్ట్రంలో సుమారు 1,42,000 ప్రభుత్వ ఉద్యోగాలు ఖాళీగా ఉన్నాయని సూచించారని చెప్పారు. కానీ ప్రభుత్వం మాత్రం 20వేలు ఖాళీలే ఉన్నాయని ప్రకటించి 2016 – 17 ఏడాదిలో 4వేల పోస్టులకు మాత్రమే ప్రకటన జారీ చేసిందని, అన్ని శాఖలు కలుపుకుని ఇప్పటికి 10వేల ఉద్యోగాలు కూడా భర్తీ చేయలేదని ఆరోపించారు. 42 నోటిఫికేషన్లతో ఇయర్ క్యాలెండర్‌ని కూడా ప్రకటించి ఇప్పటికి ఒక్క నోటిఫికేషన్ కూడా జారీ చేయలేదని మండిపడ్డారు.
కాంట్రాక్టు పద్ధతితో ఉద్యోగ భద్రతకు ప్రమాదం
పంచాయతీ కార్యదర్శులుగా ఏడాది కాలపరిమితితో కాంట్రాక్టు పద్ధతిలో 1511మందిని నియమించడానికి జీవో 39ని ప్రభుత్వం జారీ చేసిందని, ఈ కాంట్రాక్టు ఉద్యోగుల వేతనాలు నెలకు రూ.15వేలు చెల్లిస్తారని ప్రకటించారని పేర్కొన్నారు. అసలు ఈ ఉద్యోగాలకు కాంట్రాక్టు విధానాన్ని ఎందుకు ఎంచుకుంటున్నారో తెలపాలని డిమాండ్ చేశారు. దీనివల్ల ఉద్యోగ భద్రత కొరవడుతుందని ఆందోళన వ్యక్తం చేశారు. పంచాయతీ కార్యదర్శుల పోస్టులను ప్రభుత్వ ఉద్యోగాలుగా భర్తీ చేయాలని డిమాండ్ చేశారు. పంచాయతీ శాఖ మంత్రిగా లోకేష్‌ను నియమించిన తర్వాతే జీవో 39 విడుదల చేశారని గుర్తు చేశారు. అలాగే గ్రూప్ – 2 ఎగ్జిక్యూటీవ్ ఉద్యోగాల భర్తీని రాష్ట్ర ప్రభుత్వం కొత్తగా గ్రూపు – 1తో కలిపి డిస్క్రిప్టు విధానంగా పరీక్షను నిర్వహిస్తామని జీవో 622, 623 విడుదల చేసిందన్నారు. ఇప్పటి వరకు అబ్జెక్ట్ విధానాన్ని అనుసరిస్తూ పరీక్షకు సిద్ధమవుతుంటే కొత్తగా డిస్క్రిప్టుగా పెడతామని ప్రభుత్వం ప్రకటించడం దారుణమన్నారు. జీవో 39, జీవో 622, 623 వల్ల లాభం కంటే యువతకు జరిగే నష్టమే ఎక్కువని ఆందోళన వ్యక్తం చేశారు.
ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి తక్షణమే ఈ జీవోలన్నింటినీ రద్దు చేయాలని డిమాండ్ చేశారు. అదేవిధంగా గ్రూప్–1 సిలబస్‌ను మార్చి సివిల్ సర్వీస్ సిలబస్ పెడతానన్న ప్రభుత్వ నిర్ణయం మార్చుకోవాలని, తెలంగాణ తరహాలో వయోపరిమితి 44 ఏళ్లకు పెంచాలని, కానిస్టేబుల్ ఉద్యోగ వయో పరిమితి రెండేళ్లు పెంచాలని, తెలంగాణ రిజర్వేషన్లతో సమానంగా ఏపీలో కూడా నాన్‌లోకల్ రిజర్వేషన్ చేయాలని, వీఆర్వో, వీఆర్‌ఏ పోస్టులు తక్షణమే భర్తీ చేయాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వం స్పందించకపోతే విద్యార్థి/నిరుద్యోగ లోకం ప్రభుత్వంపై తిరుగుబాటు చేస్తుందని హెచ్చరించారు. నిరసనకు సెంచూరియన్ విశ్వ విద్యాలయం వీసీ ఆచార్య జీఎస్‌ఎన్ రాజు, సీపీఎం జిల్లా కార్యదర్శి కె.లోకనాథం, డీవైఎఫ్‌ఐ, వైఎస్సార్‌సీపీ విద్యార్థి విభాగం, ఉత్తరాం«ధ్ర విద్యార్థి సేన సంఘీభావం తెలిపారు. నిరసన కార్యక్రమంలో విజయనగరం జిల్లా జేఏసీ కో ఆర్డినేటర్, రాష్ట్ర కో ఆర్డినేటర్ షేక్ మహబూబ్ బాషా, విశాఖ జిల్లా కో ఆర్డినేటర్ జగన్ విద్యార్థులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment