Unemployed JAC
-
ప్రగతిభవన్ ముట్టడికి నిరుద్యోగ జేఏసీ యత్నం; ఉద్రిక్త పరిస్థితులు
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో ఉద్యోగ నియామకాలకు సంబంధించిన నోటిఫికేషన్ జారీ చేయాలంటూ నిరుద్యోగ జేఏపీ మంగళవారం ప్రగతిభవన్ ముట్టడికి యత్నించింది. అయితే నిరుద్యోగులు తలపెట్టిన కార్యక్రమాన్ని పోలీసులు అడ్డుకోవడంతో ఉద్రిక్త పరిస్థితులు తలెత్తాయి. ఈ నేపథ్యంలో కొంతమంది జేఏసీ విద్యార్థులను అదుపులోకి తీసుకున్నారు. రాష్ట్రంలో వెంటనే ఉద్యోగ నోటిఫికేషన్ విడుదల చేయాలంటూ డిమాండ్ చేశారు. ప్రగతి భవన్ వద్ద ఉన్న గేటు ఎక్కి ఆందోళనకారులు కార్యాలయంలోకి వెళ్లేందుకు ప్రయత్నించారు. పోలీసులు వారిని అడ్డుకొని అరెస్ట్ చేశారు. నిరుద్యోగుల ఆందోళనతో ప్రగతి భవన్ వద్ద ట్రాఫిక్ కు కొద్దిసేపు అంతరాయం ఏర్పడింది.రాష్ట్ర ప్రభుత్వం ఇటీవలనే 50వేల ప్రభుత్వ ఉద్యోగాలను భర్తీ చేయాలని నిర్ణయం తీసుకొంది. ఈ మేరకు కేబినెట్ కూడ ఈ పోస్టుల భర్తీకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. -
కదం తొక్కిన నిరుద్యోగులు
సాక్షి, డాబాగార్డెన్స్(విశాఖ దక్షిణ) : పంచాయతీ సెక్రటరీ పోస్టుల కోసం విడుదల చేసిన జీవో 39 రద్దు చేయాలని, గ్రూపు – 2 ఎగ్జిక్యూటివ్ ఉద్యోగాల భర్తీ కోసం రాష్ట్ర ప్రభుత్వం కొత్తగా గ్రూపు – 1తో కలిపి డిస్క్రిప్టు విధానంలో పరీక్ష నిర్వహించేందుకు విడుదల చేసిన జీవో 622, 623ని వెంటనే రద్దు చేయాలని కోరుతూ నిరుద్యోగులు మంగళవారం విశాఖ నగర రోడ్లపై కదం తొక్కారు. పెద్ద ఎత్తున నిరసన ప్రదర్శన చేపట్టారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ... సీఎం డౌన్ డౌనంటూ నినదించారు. వందలాది మంది నిరుద్యోగులు నిరసన ప్రదర్శనలో పాల్గొన్నారు. అనంతరం ఏపీ నిరుద్యోగ జేఏసీ రాష్ట్ర అధ్యక్షుడు సమయం హేమంత్‌కుమార్ డాబాగార్డెన్స్ అంబేడ్కర్ విగ్రహం వద్ద నిరసన దీక్ష చేపట్టారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ 2014లో రాష్ట్ర విభజన జరిగన తర్వాత విడిపోయిన ఆంధ్ర రాష్ట్రంలో ఉద్యోగాల విభజన కూడా జరిగిందన్నారు. ఖాళీలున్న ఉద్యోగాల సర్వేకు కమల్‌నాథన్ కమిటీని నియమించారన్నారు. ఆ కమిటీ చేసిన సర్వేలో రాష్ట్రంలో సుమారు 1,42,000 ప్రభుత్వ ఉద్యోగాలు ఖాళీగా ఉన్నాయని సూచించారని చెప్పారు. కానీ ప్రభుత్వం మాత్రం 20వేలు ఖాళీలే ఉన్నాయని ప్రకటించి 2016 – 17 ఏడాదిలో 4వేల పోస్టులకు మాత్రమే ప్రకటన జారీ చేసిందని, అన్ని శాఖలు కలుపుకుని ఇప్పటికి 10వేల ఉద్యోగాలు కూడా భర్తీ చేయలేదని ఆరోపించారు. 42 నోటిఫికేషన్లతో ఇయర్ క్యాలెండర్‌ని కూడా ప్రకటించి ఇప్పటికి ఒక్క నోటిఫికేషన్ కూడా జారీ చేయలేదని మండిపడ్డారు. కాంట్రాక్టు పద్ధతితో ఉద్యోగ భద్రతకు ప్రమాదం పంచాయతీ కార్యదర్శులుగా ఏడాది కాలపరిమితితో కాంట్రాక్టు పద్ధతిలో 1511మందిని నియమించడానికి జీవో 39ని ప్రభుత్వం జారీ చేసిందని, ఈ కాంట్రాక్టు ఉద్యోగుల వేతనాలు నెలకు రూ.15వేలు చెల్లిస్తారని ప్రకటించారని పేర్కొన్నారు. అసలు ఈ ఉద్యోగాలకు కాంట్రాక్టు విధానాన్ని ఎందుకు ఎంచుకుంటున్నారో తెలపాలని డిమాండ్ చేశారు. దీనివల్ల ఉద్యోగ భద్రత కొరవడుతుందని ఆందోళన వ్యక్తం చేశారు. పంచాయతీ కార్యదర్శుల పోస్టులను ప్రభుత్వ ఉద్యోగాలుగా భర్తీ చేయాలని డిమాండ్ చేశారు. పంచాయతీ శాఖ మంత్రిగా లోకేష్‌ను నియమించిన తర్వాతే జీవో 39 విడుదల చేశారని గుర్తు చేశారు. అలాగే గ్రూప్ – 2 ఎగ్జిక్యూటీవ్ ఉద్యోగాల భర్తీని రాష్ట్ర ప్రభుత్వం కొత్తగా గ్రూపు – 1తో కలిపి డిస్క్రిప్టు విధానంగా పరీక్షను నిర్వహిస్తామని జీవో 622, 623 విడుదల చేసిందన్నారు. ఇప్పటి వరకు అబ్జెక్ట్ విధానాన్ని అనుసరిస్తూ పరీక్షకు సిద్ధమవుతుంటే కొత్తగా డిస్క్రిప్టుగా పెడతామని ప్రభుత్వం ప్రకటించడం దారుణమన్నారు. జీవో 39, జీవో 622, 623 వల్ల లాభం కంటే యువతకు జరిగే నష్టమే ఎక్కువని ఆందోళన వ్యక్తం చేశారు. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి తక్షణమే ఈ జీవోలన్నింటినీ రద్దు చేయాలని డిమాండ్ చేశారు. అదేవిధంగా గ్రూప్–1 సిలబస్‌ను మార్చి సివిల్ సర్వీస్ సిలబస్ పెడతానన్న ప్రభుత్వ నిర్ణయం మార్చుకోవాలని, తెలంగాణ తరహాలో వయోపరిమితి 44 ఏళ్లకు పెంచాలని, కానిస్టేబుల్ ఉద్యోగ వయో పరిమితి రెండేళ్లు పెంచాలని, తెలంగాణ రిజర్వేషన్లతో సమానంగా ఏపీలో కూడా నాన్‌లోకల్ రిజర్వేషన్ చేయాలని, వీఆర్వో, వీఆర్ఏ పోస్టులు తక్షణమే భర్తీ చేయాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వం స్పందించకపోతే విద్యార్థి/నిరుద్యోగ లోకం ప్రభుత్వంపై తిరుగుబాటు చేస్తుందని హెచ్చరించారు. నిరసనకు సెంచూరియన్ విశ్వ విద్యాలయం వీసీ ఆచార్య జీఎస్ఎన్ రాజు, సీపీఎం జిల్లా కార్యదర్శి కె.లోకనాథం, డీవైఎఫ్ఐ, వైఎస్సార్సీపీ విద్యార్థి విభాగం, ఉత్తరాం«ధ్ర విద్యార్థి సేన సంఘీభావం తెలిపారు. నిరసన కార్యక్రమంలో విజయనగరం జిల్లా జేఏసీ కో ఆర్డినేటర్, రాష్ట్ర కో ఆర్డినేటర్ షేక్ మహబూబ్ బాషా, విశాఖ జిల్లా కో ఆర్డినేటర్ జగన్ విద్యార్థులు పాల్గొన్నారు. -
టెట్ లేకుండా డీఎస్సీ నిర్వహించాలి
నల్లగొండ రూరల్ : టెట్‌తో సంబంధం లేకుండా డీఎస్సీ నిర్వహించాలని డిమాండ్ చేస్తూ నిరుద్యోగ జేఏసీ ఆధ్వర్యంలో మంగళవారం హైదరాబాద్ రో డ్డులోని పాల్టెక్నిక్ కాలేజీ వద్ద నిరసన తెలిపారు. ఈ సందర్భంగా నిరుద్యోగ జేఏసీ చైర్మన్ పాల్వాయి రవి మాట్లాడుతూ రాష్ట్రంలో 60లక్షల మంది నిరుద్యోగులు ఉన్నారని.. ప్రస్తుతం ఖాళీగా లిగా ఉన్న 2లక్షల 60 వేల పోస్టులను వెంటనే భర్తీ చేయాలని డిమాండ్ చేశారు. ప్రస్తుత టీఆర్ఎస్ ప్రభుత్వం నిరుద్యోగులపై పక్షపాత వైఖరి అవలంభిస్తోందని విమర్శించారు. ఈనెల 24, 26 తేదీల్లో నిర్వహించే టీఆర్టీ íపరీక్షలను సిలబస్ కారణంగా రెండు నెలలు వాయిదా వేయాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో చుక్క సైదులు, నర్సింహ, పరుశురాం, హరీష్, నాగరాజు, శ్రీలత, నాగలక్ష్మి, సంధ్య, వెంకన్న తదితరులు పాల్గొన్నారు. -
ఓయూ విద్యార్థుల ముందస్తు అరెస్టులు
- ఉద్యోగాలడిగితే మూకుమ్మడి అరెస్టులా? - నిరుద్యోగ జేఏసీ సూటి ప్రశ్న సాక్షి, హైదరాబాద్: ఉస్మానియా శతజయంతి ఉత్సవాల సందర్భంగా ముందస్తు చర్యగా పలువురు నిరుద్యోగ జేఏసీ విద్యార్థులతో పాటు వివిధ విద్యార్థి సంఘాల నాయకులను పోలీసులు అరెస్టు చేశారు. ఈ రోజు ఉదయం ఐదుగంటలకే ఉస్మానియా హాస్టళ్ల వద్ద విద్యార్థులను అరెస్టు చేసేందుకు పోలీసులు మోహరించారు. పలువురు విద్యార్థులు అరెస్టులను తప్పించుకొనేందుకు అజ్ఞాతం లోకి వెళ్ళినట్లు విద్యార్థి నాయకులు తెలిపారు. కొంతమందిని హాస్టల్ గదుల్లోనే పోలీసులు అరెస్టు చేసి అదుపులోకి తీసుకున్నారు. ‘ఇ’హాస్టల్, ‘బి’ హాస్టల్, న్యూ రీసెర్చ్ స్కాలర్స్ హాస్టల్(ఎన్‌ఆర్‌ఎస్‌హెచ్) నుంచి నిరుద్యోగ జేఏసీ విద్యార్థులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. కొందరిని ఉత్సవ ప్రాంగణం నుంచి బయటకు పంపారు. అదేవిధంగా నిరుద్యోగ విద్యార్థి ఉద్యమ నాయకుడు, తెలంగాణ విద్యార్థి ఉద్యమ వేదిక రాష్ట్ర అధ్యక్షుడు నిజ్జన రమేశ్‌ను మంగళవారం మధ్యాహ్నం 3 గంటలకే పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. పాస్‌లు ఇచ్చి అరెస్టులు చేశారు యూనివర్సిటీ ఉత్సవ ప్రాంగణంలోనికి వస్తున్న విద్యార్థులను, ఎన్‌ఆర్‌ఎస్‌హెచ్ ‘ఎ’ గ్రౌండ్ నుంచి, ‘బి’ గ్యాలరీకి వెళ్తున్న ఓయూ జేఏసీ విద్యార్థులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అరెస్టయిన వారిలో తెలంగాణ విద్యార్థి సంఘం నాయకుడు దుర్గం భాస్కర్, మాదిగ స్టూడెంట్స్ ఫెడరేషన్ జాతీయ అధ్యక్షుడు రుద్రవరం లింగస్వామి, వట్టికూటి రామారావు, నిజ్జన రమేశ్, ఏఐఎస్ఎఫ్ ప్రేమ్, టీయూఎస్ఎఫ్ పుల్లారావు, దరువు మల్లన్న, ఆశప్ప, శ్రవణ్, విజయ్‌కుమార్ మాదిగ, గణేశ్ తదితరులున్నారు. వీరిని అంబర్పేట్ పోలీస్ స్టేషన్లో ఉంచారు. మా యూనివర్సిటీ, మా సెలబ్రేషన్స్ అని భావించి పాల్గొనేందుకు వస్తుంటే ఉత్సవాల్లో పాల్గొనకుండా అరెస్టులు చేయడం అప్రజాస్వామికమని దుర్గం భాస్కర్ ఆవేదన వ్యక్తం చేశారు. భయభ్రాంతులకు గురిచేస్తారా? ఉద్యోగాలడిగితే మూకుమ్మడిగా అరెస్టులు చేస్తారా అని నిరుద్యోగ జేఏసీ ప్రశ్నించింది. నిరుద్యోగ జేఏసీ గత కొంతకాలంగా చేస్తు న్న డిమాండ్లను పట్టించుకోకుండా, విద్యా ర్థులను ఉన్నపళంగా అరెస్టు చేసి, భయ భ్రాంతులకు గురిచేయడం అన్యాయమని నిజ్జన రమేశ్ అన్నారు. ప్రభుత్వ చర్యలను తీవ్రంగా ఖండిస్తున్నామన్నారు. విద్యార్థుల ఉద్యోగాల విషయంలో ఏ హామీ లేకుండా, కేవలం అరగంట కోసం పోలీసులతో వర్సిటీని నింపేసి, కార్యక్రమాన్ని హడావుడిగా ముగించుకొన్నారని ఆయన ఆరోపించారు. తెలంగాణ ఉద్యమంలో ఇప్పటికే తమపై 132 కేసులున్నాయని, ఇంకా కేసులు పెట్టి సాధించేదేమీ ఉండదని ఆయన తెలిపారు.