Contract system
-
అనర్హులను ఎలా నియమిస్తారు?
సాక్షి, హైదరాబాద్: సుప్రీంకోర్టు, హైకోర్టు ఉత్తర్వులతో తొలగింపునకు గురైన 1,200 మందిని కాంట్రాక్టు పద్ధతిలో బహుళ ప్రయోజన ఆరోగ్య కార్యకర్తలుగా విధుల్లోకి తీసుకోవడం చట్టవిరుద్ధమని తెలంగాణ హైకోర్టు స్పష్టం చేసింది. ఈ మేరకు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం 2013లో జారీ చేసిన జీవో 1207ను కొట్టివేసింది. బహుళ ప్రయోజన ఆరోగ్య కార్యకర్తల నియామకంపై 2002లో అర్హతల వివాదం నెలకొనగా, నిబంధనలకు విరుద్ధంగా సర్కార్ జీవోలు జారీ చేసి, నియామకాలు చేపట్టడం సరికాదని పేర్కొంది. ఈ అంశాన్ని ఉన్నత, అత్యున్నత న్యాయస్థానాలు తప్పుబట్టిన విషయాన్ని గుర్తు చేసింది. అర్హతలకు సంబంధించి న్యాయస్థానాలు తీర్పులు వెలువరించిన తర్వాత వాటికి విరుద్ధంగా మళ్లీ జీవో తీసుకురావడాన్ని తప్పుబట్టింది. ప్రభుత్వ నిర్ణయాన్ని సమర్థించలేమని, వారి తప్పును కొనసాగించలేమని వ్యాఖ్యానిస్తూ.. ఈ ఉత్తర్వులు వెలువడిన 90 రోజుల్లోగా అర్హులతో జాబితా రూపొందించి చర్యలు చేపట్టాలని తెలంగాణ, ఏపీ ప్రభుత్వాలకు తేల్చిచెప్పింది. అర్హులైన వారిని కొనసాగించవచ్చని పేర్కొంది. బహుళ ప్రయోజన ఆరోగ్య కార్యకర్తల నియామకానికి సంబంధించి 2002లో ఇచి్చన నోటిఫికేషన్ వివాదాస్పదమైంది. దీనిపై కొందరు హైకోర్టును ఆశ్రయించారు. గుర్తింపు పొందిన సంస్థ నుంచి హెల్త్ అసిస్టెంట్లుగా డిప్లొమా చేసిన వారినే అర్హులుగా పరిగణించాలని స్పష్టం చేసింది. ఆ మేరకే మెరిట్ జాబితా రూపొందించాలని ఆదేశాలు జారీ చేసింది. సుప్రీంకోర్టు కూడా ఇదే తీర్పును సమర్థించింది. దీంతో ప్రభుత్వం సరైన అర్హతలు లేని 1,200 మందిని తొలగిస్తూ జీవో జారీ చేసింది. అయితే ఇంత మందిని ఒకేసారి తొలగించాల్సి రావడంతో ప్రభుత్వం వీరందరినీ కాంట్రాక్టు విధానంలో తీసుకుంటూ జీవో 1207 జారీ చేసింది. దీనిపై కొందరు నాడు ఏపీ పరిపాలన ట్రిబ్యునల్‌లో పిటిషన్లు దాఖలు చేయగా, సర్కార్ నిర్ణయం సబబేనని చెప్పింది. ట్రిబ్యునల్ ఉత్తర్వులను సవాల్ చేస్తూ కొందరు హైకోర్టులో పిటిషన్లు వేశారు. ఖాళీలుంటే నిబంధనల మేరకు భర్తీ.. ఈ పిటిషన్లపై విచారణ చేపట్టిన జస్టిస్ సుజోయ్‌పాల్, జస్టిస్ నామవరపు రాజేశ్వర్‌రావు ధర్మాసనం తీర్పు వెలువరించింది. ‘కేవలం 9 ఏళ్లు (2002 నుంచి) సర్వీస్ చేశారన్న కారణంగా సుప్రీంకోర్టు, హైకోర్టు నిర్ధారించిన అర్హతలు లేని వారిని కాంట్రాక్టు విధానంలో తీసుకోవడం సరికాదు. రెగ్యులర్, కాంట్రాక్టు విధానం.. ఏ నియామకమైనా అర్హతలు పాటించాల్సిందే. ఒకసారి తొలగించిన వారిని తిరిగి విధుల్లోకి తీసుకోవడం చెల్లదు.ప్రభుత్వ నిర్ణయాన్ని సమర్థిస్తే.. గతంలో హైకోర్టు, సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పులకు విరుద్ధంగా ఉత్తర్వులిచ్చినట్లే అవుతుంది. 1,200 మందిని కాంట్రాక్టు పద్ధతిలో తీసుకోవడం తప్పుబట్టాల్సిందే. 90 రోజుల్లో అర్హులతో జాబితా రూపొందించాలని తెలంగాణ, ఏపీ సర్కార్లను ఆదేశిస్తున్నాం. అర్హులను కొనసాగింపుపై చర్యలు తీసుకోవచ్చు. ఒకవేళ ఇంకా ఖాళీలు ఉంటే చట్టప్రకారం నిబంధనలు పాటిస్తూ నియామకాలు చేపట్టవచ్చు’అని తీర్పులో స్పష్టం చేసింది. -
టీటీడీలో కాంట్రాక్ట్ వ్యవస్థను రద్దు చేయాలి
తిరుపతి అర్బన్: టీటీడీలో కాంట్రాక్టు వ్యవస్థను రద్దు చేయాలని సీఐటీయూ జిల్లా ప్రధాన కార్యదర్శి కందారపు మురళి డిమాండ్ చేశారు. ధార్మిక సంస్థలోని 13వేల మంది కాంట్రాక్ట్ కార్మికులకు వేతనాలు పెంచాలని, ఏళ్ల తరబడి ఎదుర్కొంటున్న సమస్యలను పరిష్కరించాలని కోరుతూ శుక్రవారం సీఐటీయూ ఆధ్వర్యంలో రౌండ్‌టేబుల్ సమావేశం ఏర్పాటు చేశారు. నగరంలోని ఓ కల్యాణ మండపంలో నిర్వహించిన ఈ సమావేశానికి టీటీడీ స్టాఫ్ అండ్ వర్కర్స్ యునైటెడ్ ఫ్రంట్ నేతలు, కళాకారుల సంఘాలు, కాంట్రాక్ట్–ఔట్సోర్సింగ్ జేఏసీ నాయకులతో పాటు టీటీడీ ఫారెస్ట్, హాస్టల్స్, వెండర్స్ యూనియన్, కల్యాణకట్ట, మహిళా సంఘాల నాయకులు హాజరయ్యారు. ఈ సందర్భంగా కందారపు మురళి మాట్లాడుతూ ఏడాదికి సుమారు రూ.3వేల కోట్ల బడ్జెట్‌తో ధార్మిక సంస్థ నడుస్తుందన్నారు. అయినా 13వేల మంది కార్మికులకు కష్టానికి తగిన వేతనాలు పెంచేందుకు అధికారులు మీనమేషాలు లెక్కించడం బాధాకరమన్నారు. ఇప్పటికీ కాంట్రాక్ట్ కార్మికులకు నెల వేతనం రూ.7వేలు మించడం లేదన్నారు. కార్మికుల ఘోష తగిలితే సంస్థకు మంచిది కాదని వ్యాఖ్యానించారు. సుప్రీంకోర్టు తీర్పు మేరకు అన్ని విభాగాల కాంట్రాక్ట్ కార్మికులకు సమాన పనికి సమాన వేతనం అమలు చేయాలని కోరారు. కాంట్రాక్ట్ వ్యవస్థను పూర్తిగా రద్దుచేసి స్వామివారి నిధులను కాపాడాలన్నారు. 5 ఏళ్లు సర్వీస్ పూర్తి చేసుకున్న కార్మికులకు టైంస్కేల్ అమలు చేయాలన్నారు. విజిలెన్స్ విభాగం కార్మికులకు 24 గంటల పనివిధానాన్ని రద్దు చేయాలన్నారు. కళాకారులందరికీ ఇప్పటి ధరలకు అనుగుణంగా భత్యాలు, వేతనాలు అమలు చేయాలని విజ్ఞప్తి చేశారు.దశలవారీగా పోరాటం ఈ డిమాండ్లన్నింటిపై ఆగస్టు–15లోపు ధర్మకర్తల మండలి, ఉన్నతాధికారులు స్పందించి సానుకూలంగా చర్యలు తీసుకోవాలని కందారపు మురళి డిమాండ్‌చేశారు. లేకుంటే దశలవారీగా ఆందోళనలను చేపడతామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో టీటీడీ యూనియన్ నాయకులు నాగార్జున, గోల్కొండ వెంకటేశం, మునిరాజా, నాగరత్నం, కాంట్రాక్ట్ కార్మికుల సంఘం ప్రధాన కార్యదర్శి సుబ్రమణ్యం, కళాకారుల సంఘం నాయకులు గంగులప్ప, చంద్రశేఖర్, ఫారెస్ట్ యూనియన్ నాయకులు మల్లికార్జున రెడ్డి, వాసు, సురేష్, ఈశ్వర్‌రెడ్డి, గార్డెన్ యూనియన్ నాయకులు వెంకకటేష్, వాసు, హాస్టల్ వర్కర్స్ నాయకులు హరికృష్ణ, లగేజీ వర్కర్స్ నాయకులు గజేంద్ర, ఈశ్వరయ్య, వెండర్స్ యూనియన్ నాయకులు వెంకటయ్య, మురళి, కల్యాణకట్ట నాయకులు హేమంత్‌కుమార్, అన్నదాన క్యాంటీన్ నాయకులు పాల్గొన్నారు. టీటీడీ చైర్మన్‌కు ఆందోళన నోటీసు టీటీడీలో పనిచేస్తున్న శాశ్వత ఉద్యోగుల సమస్యల పరిష్కారానికి చేపట్టదలచిన దశల వారీ ఆందోళనకు సంబంధించి టీటీడీ చైర్మన్ పుట్టాసుధాకర్ యాదవ్‌కు ఉద్యోగ సంఘాల నాయకులు శుక్రవారం నోటీస్ అందజేశారు. ఈ సందర్భంగా పద్మావతి అతిథి గృహంలో చైర్మన్‌ను కలసి ఆగస్టు 15లోపు తమ డిమాండ్లను పరిష్కరించకుంటే ఆందోళనకు సన్నద్ధమవుతామని హెచ్చరించారు. ఈకార్యక్రమంలో జేఏసీ నాయకుడు లక్ష్మీనారాయణ, గోల్కొండ వెంకటేశం, నాగార్జున, మునికుమార్, త్యాగరాజు, దయాకర్, చీర్ల కిరణ్, నాగరత్నం, ప్రసాదరావు, హనుమంతరెడ్డి, మోహన్, కృష్ణమూర్తి పాల్గొన్నారు. -
కదం తొక్కిన నిరుద్యోగులు
సాక్షి, డాబాగార్డెన్స్(విశాఖ దక్షిణ) : పంచాయతీ సెక్రటరీ పోస్టుల కోసం విడుదల చేసిన జీవో 39 రద్దు చేయాలని, గ్రూపు – 2 ఎగ్జిక్యూటివ్ ఉద్యోగాల భర్తీ కోసం రాష్ట్ర ప్రభుత్వం కొత్తగా గ్రూపు – 1తో కలిపి డిస్క్రిప్టు విధానంలో పరీక్ష నిర్వహించేందుకు విడుదల చేసిన జీవో 622, 623ని వెంటనే రద్దు చేయాలని కోరుతూ నిరుద్యోగులు మంగళవారం విశాఖ నగర రోడ్లపై కదం తొక్కారు. పెద్ద ఎత్తున నిరసన ప్రదర్శన చేపట్టారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ... సీఎం డౌన్ డౌనంటూ నినదించారు. వందలాది మంది నిరుద్యోగులు నిరసన ప్రదర్శనలో పాల్గొన్నారు. అనంతరం ఏపీ నిరుద్యోగ జేఏసీ రాష్ట్ర అధ్యక్షుడు సమయం హేమంత్‌కుమార్ డాబాగార్డెన్స్ అంబేడ్కర్ విగ్రహం వద్ద నిరసన దీక్ష చేపట్టారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ 2014లో రాష్ట్ర విభజన జరిగన తర్వాత విడిపోయిన ఆంధ్ర రాష్ట్రంలో ఉద్యోగాల విభజన కూడా జరిగిందన్నారు. ఖాళీలున్న ఉద్యోగాల సర్వేకు కమల్‌నాథన్ కమిటీని నియమించారన్నారు. ఆ కమిటీ చేసిన సర్వేలో రాష్ట్రంలో సుమారు 1,42,000 ప్రభుత్వ ఉద్యోగాలు ఖాళీగా ఉన్నాయని సూచించారని చెప్పారు. కానీ ప్రభుత్వం మాత్రం 20వేలు ఖాళీలే ఉన్నాయని ప్రకటించి 2016 – 17 ఏడాదిలో 4వేల పోస్టులకు మాత్రమే ప్రకటన జారీ చేసిందని, అన్ని శాఖలు కలుపుకుని ఇప్పటికి 10వేల ఉద్యోగాలు కూడా భర్తీ చేయలేదని ఆరోపించారు. 42 నోటిఫికేషన్లతో ఇయర్ క్యాలెండర్‌ని కూడా ప్రకటించి ఇప్పటికి ఒక్క నోటిఫికేషన్ కూడా జారీ చేయలేదని మండిపడ్డారు. కాంట్రాక్టు పద్ధతితో ఉద్యోగ భద్రతకు ప్రమాదం పంచాయతీ కార్యదర్శులుగా ఏడాది కాలపరిమితితో కాంట్రాక్టు పద్ధతిలో 1511మందిని నియమించడానికి జీవో 39ని ప్రభుత్వం జారీ చేసిందని, ఈ కాంట్రాక్టు ఉద్యోగుల వేతనాలు నెలకు రూ.15వేలు చెల్లిస్తారని ప్రకటించారని పేర్కొన్నారు. అసలు ఈ ఉద్యోగాలకు కాంట్రాక్టు విధానాన్ని ఎందుకు ఎంచుకుంటున్నారో తెలపాలని డిమాండ్ చేశారు. దీనివల్ల ఉద్యోగ భద్రత కొరవడుతుందని ఆందోళన వ్యక్తం చేశారు. పంచాయతీ కార్యదర్శుల పోస్టులను ప్రభుత్వ ఉద్యోగాలుగా భర్తీ చేయాలని డిమాండ్ చేశారు. పంచాయతీ శాఖ మంత్రిగా లోకేష్‌ను నియమించిన తర్వాతే జీవో 39 విడుదల చేశారని గుర్తు చేశారు. అలాగే గ్రూప్ – 2 ఎగ్జిక్యూటీవ్ ఉద్యోగాల భర్తీని రాష్ట్ర ప్రభుత్వం కొత్తగా గ్రూపు – 1తో కలిపి డిస్క్రిప్టు విధానంగా పరీక్షను నిర్వహిస్తామని జీవో 622, 623 విడుదల చేసిందన్నారు. ఇప్పటి వరకు అబ్జెక్ట్ విధానాన్ని అనుసరిస్తూ పరీక్షకు సిద్ధమవుతుంటే కొత్తగా డిస్క్రిప్టుగా పెడతామని ప్రభుత్వం ప్రకటించడం దారుణమన్నారు. జీవో 39, జీవో 622, 623 వల్ల లాభం కంటే యువతకు జరిగే నష్టమే ఎక్కువని ఆందోళన వ్యక్తం చేశారు. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి తక్షణమే ఈ జీవోలన్నింటినీ రద్దు చేయాలని డిమాండ్ చేశారు. అదేవిధంగా గ్రూప్–1 సిలబస్‌ను మార్చి సివిల్ సర్వీస్ సిలబస్ పెడతానన్న ప్రభుత్వ నిర్ణయం మార్చుకోవాలని, తెలంగాణ తరహాలో వయోపరిమితి 44 ఏళ్లకు పెంచాలని, కానిస్టేబుల్ ఉద్యోగ వయో పరిమితి రెండేళ్లు పెంచాలని, తెలంగాణ రిజర్వేషన్లతో సమానంగా ఏపీలో కూడా నాన్‌లోకల్ రిజర్వేషన్ చేయాలని, వీఆర్వో, వీఆర్ఏ పోస్టులు తక్షణమే భర్తీ చేయాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వం స్పందించకపోతే విద్యార్థి/నిరుద్యోగ లోకం ప్రభుత్వంపై తిరుగుబాటు చేస్తుందని హెచ్చరించారు. నిరసనకు సెంచూరియన్ విశ్వ విద్యాలయం వీసీ ఆచార్య జీఎస్ఎన్ రాజు, సీపీఎం జిల్లా కార్యదర్శి కె.లోకనాథం, డీవైఎఫ్ఐ, వైఎస్సార్సీపీ విద్యార్థి విభాగం, ఉత్తరాం«ధ్ర విద్యార్థి సేన సంఘీభావం తెలిపారు. నిరసన కార్యక్రమంలో విజయనగరం జిల్లా జేఏసీ కో ఆర్డినేటర్, రాష్ట్ర కో ఆర్డినేటర్ షేక్ మహబూబ్ బాషా, విశాఖ జిల్లా కో ఆర్డినేటర్ జగన్ విద్యార్థులు పాల్గొన్నారు. -
'కాంట్రాక్ట్‌ను మించిన దోపిడీ మరొకటి లేదు'
హైదరాబాద్: ‘‘కాంట్రాక్ట్ వ్యవస్థ అన్యాయమైనది. ఓ వ్యక్తిని పోషించే వ్యవస్థ. ఏ పనీ చేయని మధ్య దళారి, కార్మికుల జీతాల్లో కొంత భాగాన్ని ఎగరేసుకుపోతున్నాడు. ఆ కాంట్రాక్టర్ ఎవరో కార్మికులకూ తెలియదు.. పని చేసే కార్మికులను కాదని ఏ పనీ చేయని కాంట్రాక్టర్లకు జీతాలు ఇవ్వడం సరికాదు..ఇంతకు మించిన అన్యాయమైన దోపిడీ వ్యవస్థ మరోకటి ఉండదు.’’ అని తెలంగాణ జేఏసీ చైర్మన్ ఎం.కోదండరామ్ రాష్ట్రంలో కాంట్రాక్ట్ కార్మిక వ్యవస్థపై ఆగ్రహం వ్యక్తం చేశారు. తెలంగాణ విద్యుత్ కాంట్రాక్ట్ వర్కర్స్ యూనియన్ ఆధ్వర్యంలో ఈ నెల 31 నుంచి ప్రారంభం కానున్న విద్యుత్ కాంట్రాక్ట్ కార్మికుల హక్కుల యాత్రకు సంబంధించిన పోస్టర్‌ను సోమాజీగూడ ప్రెస్‌క్లబ్‌లో బుధవారం ఆవిష్కరించారు. విద్యుత్ జేఏసీ సమన్వయకర్త, జేఏసీ అధికార ప్రతినిధి కె.రఘు నేతృత్వంలో కాంట్రాక్టు కార్మిక వ్యవస్థపై సబ్ కమిటీని ఏర్పాటు చేస్తున్నామని కోదండరామ్ ప్రకటించారు. కాంట్రాక్ట్, ఔట్ సోర్సింగ్ అంటూ వేర్వేరుగా పిలుచుకోవడమే కాని రెండింటి మధ్య తేడా లేదన్నారు. ఔట్ సోర్సింగ్ కార్మికులను క్రమబద్ధీకరించమని ప్రభుత్వం చెప్పడంలో అర్థం లేదన్నారు. ‘సంగారెడ్డి జిల్లాలోని కోహీర్ సబ్ స్టేషన్‌ను కార్మిక యూనియన్ దత్తత తీసుకుని కేవలం రూ.30 వేల ఖర్చుతోనే నిర్వహణ జరుపుతోంది. అదే కాంట్రాక్టర్లు సబ్ స్టేషన్ల నిర్వహణకు రూ.1.50లక్షలు తీసుకుంటున్నారు. కాంట్రాక్ట్ కార్మికుల యూనియన్ చేసి చూపెట్టిన ఈ పనులను ప్రభుత్వం చేయలేదా?’’ అని కోదండరాం ప్రశ్నించారు. విద్యుత్ సంస్థల్లో కాంట్రాక్ట్ ఉద్యోగాల నియామకాల్లో తీవ్ర అవినీతి జరుగుతోంది, భవిష్యత్తులో క్రమబద్ధీకరిస్తారన్న ఆశతో నిరుద్యోగులు రూ.5లక్షల వరకు ముడుపులు చెల్లించి ఉద్యోగాల్లో చేరుతున్నారని విద్యుత్ జేఏసీ సమన్వయకర్త కె.రఘు ఆరోపించారు. విద్యుత్ కార్మికుల హక్కుల సాధన కోసం 31వ తేదీ నుంచి 90 రోజుల పాటు రాష్ట్రంలోని 31 జిల్లాల్లో యాత్రను నిర్వహిస్తామని, అన్ని శాఖల్లోని కాంట్రాక్టు కార్మికులను ఏకం చేస్తామని యూనియన్ అధ్యక్షులు జి.నాగరాజు తెలిపారు. ఈ కార్యక్రమంలో జేఏసీ నేతలు పిట్టల రవీందర్, పురుషోత్తం, గురజాల రవీందర్, వెంకట్ రెడ్డి, బైరీ రమేశ్ తదితరులు పాల్గొన్నారు. -
ఎల్లుండి ఆర్బీఎస్కే కాంట్రాక్టు పోస్టుల భర్తీకి కౌన్సెలింగ్
సాక్షి, రంగారెడ్డి జిల్లా : రాష్ట్రీయ బాల స్వస్థ్య కార్యక్రమం (ఆర్బీఎస్కే) పథకం కింద కాంట్రాక్టు పద్ధతిలో పనిచేసేందుకు దరఖాస్తు చేసుకున్న వారికి ఈనెల 22న జిల్లా వైద్య, ఆరోగ్య శాఖ కార్యాలయంలో కౌన్సెలింగ్ నిర్వహిస్తున్నట్లు డీఎహెచ్‌ఓ భానుప్రకాష్ తెలిపారు. ఈ మేరకు ఆయన బుధవారం ఓ ప్రకటన విడుదల చేశారు. మెరిట్ ప్రాతిపదికన ఎంపిక చేపడుతున్నామని, 18 మెడికల్ ఆఫీసర్ పోస్టులు, 9 ఫార్మాసిస్టు పోస్టులు, ఒక ల్యాబ్ టెక్నీషియన్, 8 ఏఎన్ఎం పోస్టులు భర్తీ చేస్తున్నామని, 1:10 పద్ధతిలో కౌన్సెలింగ్‌కు ఆహ్వానిస్తున్నామన్నారు. -
పర్మినెంట్ ఆశలు
- తెలంగాణ రాష్ట్రంలో కాంట్రాక్టు వ్యవస్థ రద్దు - ఆశల పల్లకీలో కాంట్రాక్ట్ ఉద్యోగులు - 10 వేల మందికి ప్రభుత్వ కొలువులు! - గెజిటెడ్ కేడర్‌కు మినహాయింపు? - ఔట్‌సోర్సింగ్‌పై అధ్యయనం కొత్త రాష్ట్రం కొలువులు తేనుంది. ఏళ్ల తరబడి అరకొర వేతనాలతో పనిచేస్తున్న కాంట్రాక్టు ఉద్యోగుల్లో ఆశలు చిగురింపజేస్తోంది. వీరిని సర్కారు ఉద్యోగాలు వరించనున్నాయి. మరోవైపు ఉన్న ఉద్యోగుల్లో చాలా మందికి రాష్ట్రం ఏర్పడ్డాక ప్రమోషన్లు రానున్నాయి. సాక్షి, కరీంనగర్ : తెలంగాణ రాష్ట్రంలో కాంట్రాక్టు వ్యవస్థ ఉండదని.. అధికారంలోకి వస్తే కాంట్రాక్ట్ ఉద్యోగులందరినీ పర్మినెంట్ చేస్తామని టీఆర్ఎస్ అధ్యక్షుడు కేసీఆర్ ఇప్పటికే పలుమార్లు ప్రకటించారు. తాజాగా.. ఈ నెల 23న హైదరాబాద్‌లో తెలంగాణ ప్రాంత ఉద్యోగ సంఘాలతో సమావేశమైన కేసీఆర్ ఈ విషయాన్ని మరోసారి స్పష్టం చేశారు. దీంతో జిల్లా వ్యాప్తంగా అన్ని ప్రభుత్వ శాఖల్లో పనిచేస్తున్న కాంట్రాక్టు ఉద్యోగుల్లో ఆశలు చిగురిస్తున్నాయి. కొత్త ప్రభుత్వం తమ తలరాత మార్చుతుందని వారు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. అందరికా? కొందరికా? పర్మినెంట్ విషయమై కొన్ని క్యాడర్ల ఉద్యోగుల్లో యం పట్టుకుంది. అందరినీ పర్మినెంట్ చేస్తారా? లేక మూడు, నాలుగో తరగతి ఉద్యోగులకే అవకాశం కల్పిస్తారా? అనే విషయాలపై స్పష్టత రాలేదు. ప్రస్తు త పరిస్థితుల్లో గెజిటెడ్ స్థాయిలో పనిచేస్తున్న వారిని పర్మినెంట్ చేసే అవకాశాలు కనిపించడం లేదు. కాంట్రాక్టు ఉద్యోగులను పర్మినెంట్ చేస్తే.. భవిష్యత్తులో తమ పరిస్థితి ఏంటని ఓయూ జేఏసీ, విద్యార్థులు ప్రశ్నిస్తున్నారు. పోస్టులు ప్రకటించి, పరీక్ష ద్వారా భర్తీ చేయాలని వారు కేసీఆర్‌కు విజ్ఞప్తి చేశారు. దీంతో గెజిటెడ్‌స్థాయి ఉద్యోగులను పర్మినెంట్ చేసే విషయంలో టీఆర్ఎస్ స్పష్టమైన నిర్ణయం తీసుకోలేదని ఉద్యోగులు చెప్తున్నారు. ఔట్‌సోర్సింగ్‌లో ఉత్కంఠ ఔట్సోర్సింగ్ పద్ధతిలో ఏజెన్సీల ఆధీనంలో పని చేస్తున్న సిబ్బందిని పర్మినెంట్ చేయాలంటే సాంకేతిక ఇబ్బందులు తలెత్తే అవకాశాలున్నాయి. దీంతో వ్యవస్థపై అధ్యయనం చేసేందుకు ప్రత్యేక కమిటీని ఏర్పాటు చేయాలని నిర్ణయించినట్లు కేసీఆర్ ఉద్యోగ సంఘాలకు వివరించారు. కమిటీ నివేదికననుసరించి నిర్ణయం తీసుకోనున్నారు. ఔట్సోర్సింగ్ సిబ్బంది ప్రస్తుతం ఎదుర్కొంటున్న సమస్యలు మాత్రం కొత్త ప్రభుత్వంలో ఉండబోవని ఉద్యోగ సంఘ నాయకులు చెబుతున్నారు. జిల్లాలో మొత్తం 45 వేల మంది ప్రభుత్వ ఉద్యోగులున్నారు. కొత్త రాష్ట్రంలో కాంట్రా క్టు సిబ్బంది అందరినీ పర్మినెంట్ చేస్తే ప్రభుత్వంపై ఆర్థికభారం పెరిగే అవకాశాలున్నాయి. ఎక్కడెక్కడ? ఎందరు? జిల్లావ్యాప్తంగా అన్ని ప్రభుత్వశాఖల్లో కలిపి 22,670 మంది కాంట్రాక్టు, ఔట్సోర్సింగ్ పద్ధతిలో పని చేస్తున్నారు. వీరిలో కాంట్రాక్టు పద్ధతిలో పని చేస్తున్న వారి సంఖ్య 12 వేలకు పైనే. ప్రాథమిక విద్యశాఖలో 3 వేల మంది కాంట్రాక్టు పద్ధతిలో విధులు నిర్వర్తిస్తున్నారు. ఇందిర క్రాంతి పథం(ఐకేపీ), ఉపాధిహామీ పథకంలో 1500 మంది చొప్పున, మెప్మాలో 700, మున్సిపాలిటీల్లో 2500, వైద్యారోగ్యశాఖలో థర్డ్ పార్టీ ఉద్యోగులు 500, సెకండ్ ఏఎన్ఎంలు 500, ఆర్టీసీలో 800, సింగరేణిలో 4 వేలు, విద్యుత్‌శాఖలో 1200, పంచాయతీరాజ్‌శాఖలో 5 వేలు, డ్వామా, అటవీశాఖలో వంద మంది చొప్పున, ఉన్నత విద్యాశాఖలో 900 మంది కాంట్రాక్టు పద్ధతిలో పనిచేస్తున్నారు. వీటితోపాటు గృహనిర్మాణం, పశుసంవర్ధక, వ్యవసాయశాఖల్లోనూ కాంట్రాక్టు ఉద్యోగులున్నారు. వీరందరూ తమకు పర్మినెంట్ అవుతుందనే ఆనందంలో ఉన్నారు. తెలంగాణ తొలి ప్రభుత్వం నుంచి ఉత్తర్వులు వస్తేనే పూర్తి స్పష్టత వచ్చే అవకాశముంది. శుభపరిణామం ఎం.ప్రతాపరెడ్డి, టీఆర్టీఎఫ్, జిల్లా అధ్యక్షుడు విద్యాశాఖలో ఏళ్ల నుంచి కాంట్రాక్టు పద్ధతిలో పనిచేస్తున్న కంప్యూటర్ ఆపరేటర్లు.. స్వీపర్లు ఉన్నారు. కేసీఆర్ నిర్ణయంతో.. 1989 నుంచి జెడ్పీ, మండల పరిషత్ పాఠశాలల్లో పని చేస్తున్న 670 మంది పార్ట్‌టైం స్వీపర్ల ఉద్యోగాలు పర్మినెంట్ కానున్నాయి. కొత్తరాష్ట్రంలో.. వీరిలాంటి వేలాది మంది కలలు నెరవేరనున్నాయి. ఇది శుభపరిణామం. -
కొలువులన్నీ కోతలే..
* అధికారం కోసం అరచేతిలో వైకుంఠం చూపుతున్న బాబు * ఇంటికో ఉద్యోగమంటూ మేనిఫెస్టోలో మాయమాటలు * అంటే దాదాపు 3.5 కోట్ల కొలువులు... ఎలా సాధ్యం బాబూ? * ఉద్యోగుల తొలగింపే అజెండాగా తొమ్మిదిన్నరేళ్ల పాలన * ఖాళీల భర్తీకి చెల్లుచీటీ... నిరుద్యోగులకు నిత్య నరకం * అలాంటి ఘనుడు కోట్లాది కొలువులిస్తానంటే నమ్మేదెవరు? 1995-2004 మధ్య ఏపీపీఎస్సీ ద్వారా బాబు భర్తీ చేసిన ఉద్యోగాలివీ... 1998 గ్రూప్-1 83 పోస్టులు (బ్యాక్లాగ్) 1998 ఎంపీడీవో 235 పోస్టులు 1999 గ్రూప్-2 104 పోస్టులు 2001 జూనియర్ లెక్చరర్స్ 360 మొత్తం 782 1999 గ్రూప్-2లో 1,500కు పైగా గ్రూప్-2 పోస్టులు ఖాళీలుంటే కేవలం 245 పోస్టులకే నోటిఫికేషన్ ఇచ్చారు. మళ్లీ వాటిలోనూ 141 సచివాలయ అసిస్టెంట్ సెక్షన్ ఆఫీసర్ పోస్టులను ఉపసంహరించారు. మల్లు విశ్వనాథ్‌రెడ్డి: ఎన్నికల వేళ చంద్రబాబు గుప్పించే ఆచరణసాధ్యం కాని హామీలను చూస్తే అచ్చం కొయ్య తుపాకీ చేతపట్టుకుని నోటికొచ్చినట్టల్లా గొప్పలు పోయే పిట్టల దొరే గుర్తొస్తాడు. తేడా అల్లా ఒక్కటే. పిట్టల దొర గప్పాలన్నీ ఉదర పోషణార్థమైతే రెండు కళ్ల బాబు పేరు గొప్ప హామీల లక్ష్యమేమో తలకిందులుగా తపస్సు చేసైనా సరే అధికారాన్ని చేజిక్కించుకోవడం! 2009 ఎన్నికల్లో ‘నగదు బదిలీ’ అంటూ ఊరూవాడా ఊదరగొట్టిన బాబు ఈసారి దాన్ని అటకెక్కించి, దాని బాబు లాంటి ‘ఇంటికో ఉద్యోగం’ నినాదాన్ని తలకెత్తుకున్నారు. టీడీపీ ఎన్నికల మేనిఫెస్టోలోనూ చేర్చారు. రాష్ట్రంలోని కుటుంబాల సంఖ్య అధికారిక లెక్కల ప్రకారమే 2.1 కోట్లు. వాస్తవానికి 3.5 కోట్ల కుటుంబాలుంటాయి. మరి అన్ని కోట్ల ఉద్యోగాలిచ్చేందుకు బాబు చేతిలో మంత్రదండమేదైనా ఉందా? తన పాలన పొడవునా ఉద్యోగులను విచ్చలవిడిగా తొలగించడం, ఖాళీల భర్తీ మాటే ఎత్తకుండా నిరుద్యోగుల జీవితాలతో చెలగాటమాడటమే పనిగా పెట్టుకున్న ఈ ప్రపంచ బ్యాంకు తాబేదారు ఇప్పుడు ఇంటికో ఉద్యోగమిస్తానంటే నవ్వాలా, ఏడవాలా...? అదో భయానక గతం బాబు ఆర్థిక సంస్కరణలకు ప్రధానంగా బలైంది ఉద్యోగులే! ఉన్న ఉద్యోగులను ఇంటికి పంపించే పద్ధతినే చంద్రబాబు భాషలో సంస్కరణలు అంటారని సామాజిక కార్యకర్తలు ఎప్పుడూ విమర్శిస్తుంటారు కూడా. ఆయన తొమ్మిదేళ్ల పాలనంతా ఉద్యోగుల ఉసురు పోసుకుంటూనే సాగింది. ఉన్న ఉద్యోగాలనే వీలైనంతగా తొలగించిన బాబు ఇప్పుడు కొత్త ఉద్యోగాలిస్తానంటే ఎలా నమ్ముతామని ప్రజలు సంధిస్తున్న ప్రశ్నలకు సమాధానం లేదు. ఆర్థిక సంస్కరణలో భాగంగా ఏటా 1.9 శాతం మేర ఉద్యోగులను తొలగిస్తానంటూ ప్రపంచ బ్యాంకుతో ఒప్పందమే కుదుర్చుకున్న ఘనుడు బాబు! ఉద్యోగుల కుదింపుకు సంబంధించి ఉత్తర్వులు (జీవో 58) కూడా జారీ చేశారు! 1998లో 747 మంది కార్మికులను, 1999లో 1,683, 2000లో 3,439, 2001లో 1,382 మందిని తొలగించారు. పైగా, ‘రిటైరైన ఉద్యోగులకు పెన్షన్ ఇవ్వడమే మహా ఎక్కువ. మళ్లీ డీఏ కూడానా? ఇచ్చేది లేదు’ అంటూ అధికారంలో ఉండగా తెగేసి చెప్పిన చరిత్ర చంద్రబాబుది. వైద్యులూ కాంట్రాక్టు కార్మికులే ఇదీ బాబు మార్కు వైద్యం: వైద్యో నారాయణో హరీ అన్నారు. అలాంటి వైద్య వృత్తిని కూడా కాంట్రాక్టు పని స్థాయికి దిగజార్చిన ఘనుడు చంద్రబాబు. ప్రభుత్వానికి మూలస్తంభమైన ఉద్యోగ వ్యవస్థనే నీరుగార్చి ‘కాంట్రాక్టు’ వ్యవస్థకు బీజం వేసిన బాబంటే ఉద్యోగులు ఇప్పటికీ హడలిపోతుంటారు. ప్రపంచంలో ఎక్కడా జరగని విధంగా ఆరోగ్య వ్యవస్థలో కాంట్రాక్టు ఉద్యోగులను తీసుకున్నారు. ఈ జాఢ్యానికి ఆరోగ్య శాఖ నుంచే శ్రీకారం చుట్టారు. 1994 నుంచీ నియామకాల్లేక ప్రభుత్వాసుపత్రులన్నీ అల్లాడుతున్నా, వాటిలో రాష్ట్రవ్యాప్తంగా 3,000 దాకా వైద్యుల పోస్టులు ఖాళీగా ఉన్నా బాబు పట్టించుకోలేదు. వారిని కాంట్రాక్టు పద్ధతిలో తీసుకున్నా రు. ప్రభుత్వోద్యోగంలో చేరాలనుకున్న ఎందరో వైద్యులు ఈ కాంట్రాక్టు పద్ధతిని తీవ్రంగా వ్యతిరేకించినా లాభం లేకపోయింది. తర్వాత్తర్వాత ఈ కాంట్రాక్టు పద్ధతిని పారా మెడికల్ సిబ్బందికీ విస్తరించారు బాబు. అది కూడా 2003లో, ఎన్నికలు ఇంకో ఏడాదిలో ఉన్నాయనగా వేలాది పారామెడికల్ కాంట్రాక్టు పోస్టులను నియమించేందుకు పూనుకున్నారు. బాబు పుణ్యాన మొదలైన కాంట్రాక్టు, ఔట్సోర్సింగ్ జాఢ్యం ఆ తర్వాత ఇతర శాఖల్లోకీ ప్రవేశించి రెగ్యులర్ నియామకాలను మింగేసింది. ఆస్పత్రులను నిర్వీర్యం చేసిన బాబు ప్రభుత్వాసుపత్రుల వ్యవస్థ బాబు పాలనలో నిర్వీర్యమైంది. కాంట్రాక్టు, ఔట్సోర్సింగ్ వ్యవస్థలను ప్రవేశపెట్టడంతో ప్రభుత్వాసుపత్రుల్లో సేవలకు రోగులు దూరమయ్యారు. ప్రజలు బాబును తిరస్కరించినా ఆయన తెచ్చిన కాంట్రాక్టు, ఔట్సోర్సింగ్ విధానం మాత్రం ఇప్పటికీ పోలేదు. బాబు విధానాల కారణంగా ఎన్నో పెద్దాసుపత్రులు అనాథలుగా మారాయి. వేలాదిమంది నిరుద్యోగులు ప్రభుత్వోద్యోగాలు పొందే అవకాశాలను కోల్పోయారు. రాబోయే ప్రభుత్వాలైనా పెద్దాసుపత్రుల్లో ఔట్సోర్సింగ్, కాంట్రాక్టు పద్ధతిని తొలగించి వాటిని బలోపేతం చెయ్యాలి. - డాక్టర్ బి.రమేశ్, ఉస్మానియా జనరల్ ఆస్పత్రి - అసలు రాష్ట్రంలో ఎన్ని కుటుంబాలున్నాయో టీడీపీకి తెలుసా? కుటుంబానికో ఉద్యోగమం టూ ఊదరగొడుతున్నారే తప్ప ఎన్ని ఉద్యోగాలి స్తారో స్పష్టంగా చెప్పరేం? అలా సంఖ్య చెబితే అన్ని ఉద్యోగాలు ఎలా సాధ్యమో కూడా చెప్పా ల్సి వస్తుంది. కాబట్టే ఎటూ తేల్చకుండా తెలివి గా తప్పించుకుంటున్నారన్నది నిజం కాదా? - ‘ఒక వంటగది వాడుతున్న వారంతా ఒక కుటుంబం’ అనే నిర్వచనాన్ని ఆధారంగా చేసుకొని అని జనాభా లెక్కల సేకరణ విభాగం 2011లో చెప్పిన లెక్క ప్రకారం రాష్ట్రంలో మొత్తం 2.1 కోట్ల కుటుంబాలున్నాయి. వాస్తవానికి వాటి సంఖ్య 3.5 కోట్ల దాకా ఉంటుంది. మరి బాబు ఎక్కడి నుంచి ఉద్యోగాలిస్తారు? - {పభుత్వ, ప్రభుత్వ రంగ సంస్థలు, కాంట్రాక్టు, ఔట్ సోర్సింగ్ తదితరాలన్నింటినీ కలిపి కూడా రాష్ట్రంలో ప్రస్తుతమున్న ప్రభుత్వోద్యోగాలు 13 లక్షలే. భారీ, మధ్య, చిన్న తరహా పరిశ్రమలు, ఐటీ, సేవ రంగం తదితరాల్లోని మొత్తం ప్రైవేట్ ఉద్యోగుల సంఖ్య 35 లక్షలు దాటదు. అంటే ప్రస్తుతం రాష్ట్రంలో ఉన్న ఉద్యోగాల సంఖ్య 50 లక్షల్లోపే. అలాంటిది మరో 3 కోట్ల ఉద్యోగాలంటే ఎలా సృష్టిస్తారు? దానికేమైనా ప్రణాళిక బాబు దగ్గర సిద్ధంగా ఉందా? ఉద్యోగాల కల్పనకు మ్యాజిక్‌లు పని చేయవు. పారిశ్రామికీకరణ జరగాలి. అందుకు ఏం చేస్తారో చెప్పకుండా ‘ఉద్యోగాలిస్తాం’ అని మాత్రమే అంటున్నారంటే ప్రజలను మోసం చేయడానికేనని వేరే చెప్పాల్సిన అవసరం లేదు. ఇదీ వైఎస్ బాట... ఉద్యోగ ఖాళీల భర్తీ డిమాండ్‌ను 2000 డిసెంబర్ 26న విపక్ష నేత హోదాలో వైఎస్ రాజశేఖరరెడ్డి శాసనసభలో లేవనెత్తారు. అందుకు చర్యలు తీసుకుంటామంటూ హామీ ఇవ్వాల్సిందేనని పట్టబట్టారు. నిరుద్యోగుల ఆమరణ నిరాహార దీక్ష శిబిరాన్ని 2001 జనవరి 9న వైఎస్ సందర్శించారు. దీక్షలో ప్రాణాలొదిలినా బాబు కరకు హృదయం కరగదని, తాను అధికారంలోకి వస్తే ఖాళీలు భర్తీ చేస్తానని హామీ ఇచ్చి దీక్షను విరమింపజేశారు. 2004లో తాను అధికారంలోకి రాగానే ఆ హామీని నిలబెట్టుకున్నారు. - 1999 గ్రూప్-2 నోటిఫికేషన్లో ఖాళీలు చూపించిన 1,500 పోస్టులను భర్తీ చేసి నిరుద్యోగుల సుదీర్ఘ న్యాయ పోరాటానికి తెర దించారు. తర్వాత పలు గ్రూప్ 1, 2, 4 నోటిఫికేషన్లు ఇచ్చారు. జూనియర్, డిగ్రీ కాలేజ్ లెక్చరర్ పోస్టులు భర్తీ చేశారు. డీఎస్సీ ద్వారా భారీగా ఉపాధ్యాయ పోస్టులు, పోలీస్ రిక్రూట్మెంట్ బోర్డు ద్వారా కానిస్టేబుళ్లు, ఎస్ఐ పోస్టులు భర్తీ చేశారు. వైఎస్ ఐదేళ్ల హయాంలో లక్షకు పైగా ఉద్యోగాలను భర్తీ చేశారు! ‘కార్పొరేట్’కే దన్ను ప్రభుత్వ, ఎయిడెడ్ కాలేజీలు విజయపథంలో దూసుకుపోతున్న రోజలవి. కానీ బాబు అధికార పగ్గాలు చేపట్టగానే ప్రభుత్వ కాలేజీల్లో ఖాళీలను భర్తీ చేయకుండా నిర్లక్ష్యం చేశారు. ఎయిడెడ్ కాలేజీల్లో పోస్టుల నియామకం మీద నిషేధం విధిస్తూ ఏకంగా జీవో (నంబర్ 37) జారీ చేశారు. దాంతో కొన్నేళ్లలోనే ఎయిడెడ్ కాలేజీలు నిర్వీర్యమైపోయాయి. ప్రత్యామ్నాయంగా కార్పొరేట్ కాలేజీలు తెర మీదికొచ్చాయి. భారీ ఫీజులతో విద్యను విలాస వస్తువుగా మార్చేశాయి. అలా చదువును కూడా కొనుక్కోవాల్సిన దుస్థిథి కల్పించిన ఘనుడు బాబు!