టీటీడీలో కాంట్రాక్ట్‌ వ్యవస్థను రద్దు చేయాలి | Contract System Ban In TTD Chittoor | Sakshi
Sakshi News home page

టీటీడీలో కాంట్రాక్ట్‌ వ్యవస్థను రద్దు చేయాలి

Published Sat, Jul 28 2018 9:26 AM | Last Updated on Sat, Jul 28 2018 9:26 AM

Contract System Ban In TTD Chittoor - Sakshi

టీటీడీ చైర్మన్‌కు నోటీస్‌ అందజేస్తున్న ఉద్యోగ సంఘాల నాయకులు

తిరుపతి అర్బన్‌: టీటీడీలో కాంట్రాక్టు వ్యవస్థను రద్దు చేయాలని సీఐటీయూ జిల్లా ప్రధాన కార్యదర్శి కందారపు మురళి డిమాండ్‌ చేశారు. ధార్మిక సంస్థలోని 13వేల మంది కాంట్రాక్ట్‌ కార్మికులకు వేతనాలు పెంచాలని, ఏళ్ల తరబడి ఎదుర్కొంటున్న సమస్యలను పరిష్కరించాలని కోరుతూ శుక్రవారం సీఐటీయూ ఆధ్వర్యంలో రౌండ్‌టేబుల్‌ సమావేశం ఏర్పాటు చేశారు. నగరంలోని ఓ కల్యాణ మండపంలో నిర్వహించిన ఈ సమావేశానికి టీటీడీ స్టాఫ్‌ అండ్‌ వర్కర్స్‌ యునైటెడ్‌ ఫ్రంట్‌ నేతలు, కళాకారుల సంఘాలు, కాంట్రాక్ట్‌–ఔట్‌సోర్సింగ్‌ జేఏసీ నాయకులతో పాటు టీటీడీ ఫారెస్ట్, హాస్టల్స్, వెండర్స్‌ యూనియన్, కల్యాణకట్ట, మహిళా సంఘాల నాయకులు హాజరయ్యారు. ఈ సందర్భంగా కందారపు మురళి మాట్లాడుతూ  ఏడాదికి సుమారు రూ.3వేల కోట్ల బడ్జెట్‌తో  ధార్మిక సంస్థ నడుస్తుందన్నారు. అయినా 13వేల మంది కార్మికులకు కష్టానికి తగిన వేతనాలు పెంచేందుకు  అధికారులు మీనమేషాలు లెక్కించడం బాధాకరమన్నారు. 

ఇప్పటికీ కాంట్రాక్ట్‌ కార్మికులకు నెల వేతనం రూ.7వేలు మించడం లేదన్నారు. కార్మికుల ఘోష తగిలితే సంస్థకు మంచిది కాదని వ్యాఖ్యానించారు. సుప్రీంకోర్టు తీర్పు మేరకు అన్ని విభాగాల కాంట్రాక్ట్‌ కార్మికులకు సమాన పనికి సమాన వేతనం అమలు చేయాలని కోరారు. కాంట్రాక్ట్‌ వ్యవస్థను పూర్తిగా రద్దుచేసి స్వామివారి నిధులను కాపాడాలన్నారు. 5 ఏళ్లు సర్వీస్‌ పూర్తి చేసుకున్న కార్మికులకు టైంస్కేల్‌ అమలు చేయాలన్నారు. విజిలెన్స్‌ విభాగం కార్మికులకు 24 గంటల పనివిధానాన్ని రద్దు చేయాలన్నారు. కళాకారులందరికీ ఇప్పటి ధరలకు అనుగుణంగా భత్యాలు, వేతనాలు అమలు చేయాలని విజ్ఞప్తి చేశారు.దశలవారీగా పోరాటం

ఈ డిమాండ్‌లన్నింటిపై  ఆగస్టు–15లోపు ధర్మకర్తల మండలి, ఉన్నతాధికారులు స్పందించి సానుకూలంగా చర్యలు తీసుకోవాలని కందారపు మురళి డిమాండ్‌చేశారు. లేకుంటే దశలవారీగా ఆందోళనలను చేపడతామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో టీటీడీ యూనియన్‌ నాయకులు నాగార్జున, గోల్కొండ వెంకటేశం, మునిరాజా, నాగరత్నం, కాంట్రాక్ట్‌ కార్మికుల సంఘం ప్రధాన కార్యదర్శి సుబ్రమణ్యం, కళాకారుల సంఘం నాయకులు గంగులప్ప, చంద్రశేఖర్, ఫారెస్ట్‌ యూనియన్‌ నాయకులు మల్లికార్జున రెడ్డి, వాసు, సురేష్, ఈశ్వర్‌రెడ్డి, గార్డెన్‌ యూనియన్‌ నాయకులు వెంకకటేష్, వాసు, హాస్టల్‌ వర్కర్స్‌ నాయకులు హరికృష్ణ, లగేజీ వర్కర్స్‌ నాయకులు గజేంద్ర, ఈశ్వరయ్య, వెండర్స్‌ యూనియన్‌ నాయకులు వెంకటయ్య, మురళి, కల్యాణకట్ట నాయకులు హేమంత్‌కుమార్, అన్నదాన క్యాంటీన్‌ నాయకులు  పాల్గొన్నారు.

టీటీడీ చైర్మన్‌కు ఆందోళన నోటీసు
 టీటీడీలో పనిచేస్తున్న శాశ్వత ఉద్యోగుల సమస్యల పరిష్కారానికి చేపట్టదలచిన దశల వారీ ఆందోళనకు సంబంధించి టీటీడీ చైర్మన్‌ పుట్టాసుధాకర్‌ యాదవ్‌కు ఉద్యోగ సంఘాల నాయకులు శుక్రవారం నోటీస్‌ అందజేశారు. ఈ సందర్భంగా పద్మావతి అతిథి గృహంలో చైర్మన్‌ను కలసి ఆగస్టు 15లోపు తమ డిమాండ్లను పరిష్కరించకుంటే ఆందోళనకు సన్నద్ధమవుతామని హెచ్చరించారు. ఈకార్యక్రమంలో జేఏసీ నాయకుడు లక్ష్మీనారాయణ, గోల్కొండ వెంకటేశం, నాగార్జున, మునికుమార్, త్యాగరాజు, దయాకర్, చీర్ల కిరణ్, నాగరత్నం, ప్రసాదరావు, హనుమంతరెడ్డి, మోహన్, కృష్ణమూర్తి పాల్గొన్నారు.

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement