కొలువులన్నీ కోతలే.. | Chandra babu Naidu has removed employees in his 9years rule | Sakshi
Sakshi News home page

కొలువులన్నీ కోతలే..

Published Wed, Apr 9 2014 2:00 AM | Last Updated on Tue, Aug 14 2018 4:46 PM

కొలువులన్నీ  కోతలే.. - Sakshi

కొలువులన్నీ కోతలే..

* అధికారం కోసం అరచేతిలో వైకుంఠం చూపుతున్న బాబు
* ఇంటికో ఉద్యోగమంటూ మేనిఫెస్టోలో మాయమాటలు
* అంటే దాదాపు 3.5 కోట్ల కొలువులు... ఎలా సాధ్యం బాబూ?
* ఉద్యోగుల తొలగింపే అజెండాగా తొమ్మిదిన్నరేళ్ల పాలన
* ఖాళీల భర్తీకి చెల్లుచీటీ... నిరుద్యోగులకు నిత్య నరకం
* అలాంటి ఘనుడు కోట్లాది కొలువులిస్తానంటే నమ్మేదెవరు?

 
1995-2004 మధ్య ఏపీపీఎస్సీ ద్వారా  బాబు భర్తీ చేసిన ఉద్యోగాలివీ...
1998    గ్రూప్-1    83 పోస్టులు (బ్యాక్‌లాగ్)
1998    ఎంపీడీవో    235 పోస్టులు
1999    గ్రూప్-2    104 పోస్టులు
2001    జూనియర్ లెక్చరర్స్    360
మొత్తం        782

 
1999 గ్రూప్-2లో 1,500కు పైగా గ్రూప్-2 పోస్టులు ఖాళీలుంటే కేవలం 245 పోస్టులకే నోటిఫికేషన్ ఇచ్చారు. మళ్లీ వాటిలోనూ 141 సచివాలయ అసిస్టెంట్ సెక్షన్ ఆఫీసర్ పోస్టులను ఉపసంహరించారు.
 
మల్లు విశ్వనాథ్‌రెడ్డి: ఎన్నికల వేళ చంద్రబాబు గుప్పించే ఆచరణసాధ్యం కాని హామీలను చూస్తే అచ్చం కొయ్య తుపాకీ చేతపట్టుకుని నోటికొచ్చినట్టల్లా గొప్పలు పోయే పిట్టల దొరే గుర్తొస్తాడు. తేడా అల్లా ఒక్కటే. పిట్టల దొర గప్పాలన్నీ ఉదర పోషణార్థమైతే రెండు కళ్ల బాబు పేరు గొప్ప హామీల లక్ష్యమేమో తలకిందులుగా తపస్సు చేసైనా సరే అధికారాన్ని చేజిక్కించుకోవడం! 2009 ఎన్నికల్లో ‘నగదు బదిలీ’ అంటూ ఊరూవాడా ఊదరగొట్టిన బాబు ఈసారి దాన్ని అటకెక్కించి, దాని బాబు లాంటి ‘ఇంటికో ఉద్యోగం’ నినాదాన్ని తలకెత్తుకున్నారు.
 
 టీడీపీ ఎన్నికల మేనిఫెస్టోలోనూ చేర్చారు. రాష్ట్రంలోని కుటుంబాల సంఖ్య అధికారిక లెక్కల ప్రకారమే 2.1 కోట్లు. వాస్తవానికి 3.5 కోట్ల కుటుంబాలుంటాయి. మరి అన్ని కోట్ల ఉద్యోగాలిచ్చేందుకు బాబు చేతిలో మంత్రదండమేదైనా ఉందా? తన పాలన పొడవునా ఉద్యోగులను విచ్చలవిడిగా తొలగించడం, ఖాళీల భర్తీ మాటే ఎత్తకుండా నిరుద్యోగుల జీవితాలతో చెలగాటమాడటమే పనిగా పెట్టుకున్న ఈ ప్రపంచ బ్యాంకు తాబేదారు ఇప్పుడు ఇంటికో ఉద్యోగమిస్తానంటే నవ్వాలా, ఏడవాలా...?
 
 అదో భయానక గతం
 బాబు ఆర్థిక సంస్కరణలకు ప్రధానంగా బలైంది ఉద్యోగులే! ఉన్న ఉద్యోగులను ఇంటికి పంపించే పద్ధతినే చంద్రబాబు భాషలో సంస్కరణలు అంటారని సామాజిక కార్యకర్తలు ఎప్పుడూ విమర్శిస్తుంటారు కూడా. ఆయన తొమ్మిదేళ్ల పాలనంతా ఉద్యోగుల ఉసురు పోసుకుంటూనే సాగింది. ఉన్న ఉద్యోగాలనే వీలైనంతగా తొలగించిన బాబు ఇప్పుడు కొత్త ఉద్యోగాలిస్తానంటే ఎలా నమ్ముతామని ప్రజలు సంధిస్తున్న ప్రశ్నలకు సమాధానం లేదు. ఆర్థిక సంస్కరణలో భాగంగా ఏటా 1.9 శాతం మేర ఉద్యోగులను తొలగిస్తానంటూ ప్రపంచ బ్యాంకుతో ఒప్పందమే కుదుర్చుకున్న ఘనుడు బాబు! ఉద్యోగుల కుదింపుకు సంబంధించి ఉత్తర్వులు (జీవో 58) కూడా జారీ చేశారు! 1998లో 747 మంది కార్మికులను, 1999లో 1,683, 2000లో 3,439, 2001లో 1,382 మందిని తొలగించారు. పైగా, ‘రిటైరైన ఉద్యోగులకు పెన్షన్ ఇవ్వడమే మహా ఎక్కువ. మళ్లీ డీఏ కూడానా? ఇచ్చేది లేదు’ అంటూ అధికారంలో ఉండగా తెగేసి చెప్పిన చరిత్ర చంద్రబాబుది.
 
 వైద్యులూ కాంట్రాక్టు కార్మికులే

 ఇదీ బాబు మార్కు వైద్యం: వైద్యో నారాయణో హరీ అన్నారు. అలాంటి వైద్య వృత్తిని కూడా కాంట్రాక్టు పని స్థాయికి దిగజార్చిన ఘనుడు చంద్రబాబు. ప్రభుత్వానికి మూలస్తంభమైన ఉద్యోగ వ్యవస్థనే నీరుగార్చి ‘కాంట్రాక్టు’ వ్యవస్థకు బీజం వేసిన బాబంటే ఉద్యోగులు ఇప్పటికీ హడలిపోతుంటారు. ప్రపంచంలో ఎక్కడా జరగని విధంగా ఆరోగ్య వ్యవస్థలో కాంట్రాక్టు ఉద్యోగులను తీసుకున్నారు. ఈ జాఢ్యానికి ఆరోగ్య శాఖ నుంచే శ్రీకారం చుట్టారు. 1994 నుంచీ నియామకాల్లేక ప్రభుత్వాసుపత్రులన్నీ అల్లాడుతున్నా, వాటిలో రాష్ట్రవ్యాప్తంగా 3,000 దాకా వైద్యుల పోస్టులు ఖాళీగా ఉన్నా బాబు పట్టించుకోలేదు. వారిని కాంట్రాక్టు పద్ధతిలో తీసుకున్నా రు.
 
  ప్రభుత్వోద్యోగంలో చేరాలనుకున్న ఎందరో వైద్యులు ఈ కాంట్రాక్టు పద్ధతిని తీవ్రంగా వ్యతిరేకించినా లాభం లేకపోయింది. తర్వాత్తర్వాత ఈ కాంట్రాక్టు పద్ధతిని పారా మెడికల్ సిబ్బందికీ  విస్తరించారు బాబు. అది కూడా 2003లో, ఎన్నికలు ఇంకో ఏడాదిలో ఉన్నాయనగా వేలాది పారామెడికల్ కాంట్రాక్టు పోస్టులను నియమించేందుకు పూనుకున్నారు. బాబు పుణ్యాన మొదలైన కాంట్రాక్టు, ఔట్‌సోర్సింగ్ జాఢ్యం ఆ తర్వాత ఇతర శాఖల్లోకీ ప్రవేశించి రెగ్యులర్ నియామకాలను మింగేసింది.
 
 ఆస్పత్రులను నిర్వీర్యం చేసిన బాబు
 ప్రభుత్వాసుపత్రుల వ్యవస్థ బాబు పాలనలో నిర్వీర్యమైంది. కాంట్రాక్టు, ఔట్‌సోర్సింగ్ వ్యవస్థలను ప్రవేశపెట్టడంతో ప్రభుత్వాసుపత్రుల్లో సేవలకు రోగులు దూరమయ్యారు. ప్రజలు బాబును తిరస్కరించినా ఆయన తెచ్చిన కాంట్రాక్టు, ఔట్‌సోర్సింగ్ విధానం మాత్రం ఇప్పటికీ పోలేదు. బాబు విధానాల కారణంగా ఎన్నో పెద్దాసుపత్రులు అనాథలుగా మారాయి. వేలాదిమంది నిరుద్యోగులు ప్రభుత్వోద్యోగాలు పొందే అవకాశాలను కోల్పోయారు. రాబోయే ప్రభుత్వాలైనా పెద్దాసుపత్రుల్లో ఔట్‌సోర్సింగ్, కాంట్రాక్టు పద్ధతిని తొలగించి వాటిని బలోపేతం చెయ్యాలి.
 - డాక్టర్ బి.రమేశ్, ఉస్మానియా జనరల్ ఆస్పత్రి
 

-     అసలు రాష్ట్రంలో ఎన్ని కుటుంబాలున్నాయో టీడీపీకి తెలుసా? కుటుంబానికో ఉద్యోగమం టూ ఊదరగొడుతున్నారే తప్ప ఎన్ని ఉద్యోగాలి స్తారో స్పష్టంగా చెప్పరేం? అలా సంఖ్య చెబితే అన్ని ఉద్యోగాలు ఎలా సాధ్యమో కూడా చెప్పా ల్సి వస్తుంది. కాబట్టే ఎటూ తేల్చకుండా తెలివి గా తప్పించుకుంటున్నారన్నది నిజం కాదా?
-     ‘ఒక వంటగది వాడుతున్న వారంతా ఒక కుటుంబం’ అనే నిర్వచనాన్ని ఆధారంగా చేసుకొని అని జనాభా లెక్కల సేకరణ విభాగం 2011లో చెప్పిన లెక్క ప్రకారం రాష్ట్రంలో మొత్తం 2.1 కోట్ల కుటుంబాలున్నాయి. వాస్తవానికి వాటి సంఖ్య 3.5 కోట్ల దాకా ఉంటుంది. మరి బాబు ఎక్కడి నుంచి ఉద్యోగాలిస్తారు?
-     {పభుత్వ, ప్రభుత్వ రంగ సంస్థలు, కాంట్రాక్టు, ఔట్ సోర్సింగ్ తదితరాలన్నింటినీ కలిపి కూడా రాష్ట్రంలో ప్రస్తుతమున్న ప్రభుత్వోద్యోగాలు 13 లక్షలే. భారీ, మధ్య, చిన్న తరహా పరిశ్రమలు, ఐటీ, సేవ రంగం తదితరాల్లోని మొత్తం ప్రైవేట్ ఉద్యోగుల సంఖ్య 35 లక్షలు దాటదు. అంటే ప్రస్తుతం రాష్ట్రంలో ఉన్న ఉద్యోగాల సంఖ్య 50 లక్షల్లోపే. అలాంటిది మరో 3 కోట్ల ఉద్యోగాలంటే ఎలా సృష్టిస్తారు? దానికేమైనా ప్రణాళిక బాబు దగ్గర సిద్ధంగా ఉందా? ఉద్యోగాల కల్పనకు మ్యాజిక్‌లు పని చేయవు. పారిశ్రామికీకరణ జరగాలి. అందుకు ఏం చేస్తారో చెప్పకుండా ‘ఉద్యోగాలిస్తాం’ అని మాత్రమే అంటున్నారంటే ప్రజలను మోసం చేయడానికేనని వేరే చెప్పాల్సిన అవసరం లేదు.
 
 ఇదీ వైఎస్ బాట...
 ఉద్యోగ ఖాళీల భర్తీ డిమాండ్‌ను 2000 డిసెంబర్ 26న విపక్ష నేత హోదాలో వైఎస్ రాజశేఖరరెడ్డి శాసనసభలో లేవనెత్తారు. అందుకు చర్యలు తీసుకుంటామంటూ హామీ ఇవ్వాల్సిందేనని పట్టబట్టారు. నిరుద్యోగుల ఆమరణ నిరాహార దీక్ష శిబిరాన్ని 2001 జనవరి 9న వైఎస్ సందర్శించారు. దీక్షలో ప్రాణాలొదిలినా బాబు కరకు హృదయం కరగదని, తాను అధికారంలోకి వస్తే ఖాళీలు భర్తీ చేస్తానని హామీ ఇచ్చి దీక్షను విరమింపజేశారు. 2004లో తాను అధికారంలోకి రాగానే ఆ హామీని నిలబెట్టుకున్నారు.
 
-  1999 గ్రూప్-2 నోటిఫికేషన్‌లో ఖాళీలు చూపించిన 1,500 పోస్టులను భర్తీ చేసి నిరుద్యోగుల సుదీర్ఘ న్యాయ పోరాటానికి తెర దించారు. తర్వాత పలు గ్రూప్ 1, 2, 4 నోటిఫికేషన్లు ఇచ్చారు. జూనియర్, డిగ్రీ కాలేజ్ లెక్చరర్ పోస్టులు భర్తీ చేశారు. డీఎస్సీ ద్వారా భారీగా ఉపాధ్యాయ పోస్టులు, పోలీస్ రిక్రూట్‌మెంట్ బోర్డు ద్వారా కానిస్టేబుళ్లు, ఎస్‌ఐ పోస్టులు భర్తీ చేశారు. వైఎస్ ఐదేళ్ల హయాంలో లక్షకు పైగా ఉద్యోగాలను భర్తీ చేశారు!
 
 ‘కార్పొరేట్’కే దన్ను
 ప్రభుత్వ, ఎయిడెడ్ కాలేజీలు విజయపథంలో దూసుకుపోతున్న రోజలవి. కానీ బాబు అధికార పగ్గాలు చేపట్టగానే ప్రభుత్వ కాలేజీల్లో ఖాళీలను భర్తీ చేయకుండా నిర్లక్ష్యం చేశారు. ఎయిడెడ్ కాలేజీల్లో పోస్టుల నియామకం మీద నిషేధం విధిస్తూ ఏకంగా జీవో (నంబర్ 37) జారీ చేశారు. దాంతో కొన్నేళ్లలోనే ఎయిడెడ్ కాలేజీలు నిర్వీర్యమైపోయాయి. ప్రత్యామ్నాయంగా కార్పొరేట్ కాలేజీలు తెర మీదికొచ్చాయి. భారీ ఫీజులతో విద్యను విలాస వస్తువుగా మార్చేశాయి. అలా చదువును కూడా కొనుక్కోవాల్సిన దుస్థిథి కల్పించిన ఘనుడు బాబు!

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement