ఈసీ సరిగా పనిచేయలేదు: చంద్రబాబు
ఎన్నికల కమిషన్, కోర్టులపై చంద్రబాబు ఆగ్రహం
130 శాసనసభ, 21 లోక్‌సభ సీట్లు మావే
సాక్షి, హైదరాబాద్: ఈ ఎన్నికల నిర్వహణలో ఎన్నికల సంఘం సరిగా పనిచేయలేదని తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు ఆరోపించారు. బుధవారం సీమాంధ్రలో పోలింగ్ ప్రశాంతంగా ముగియగా, గురువారం ఆయన తన నివాసంలో మీడియాతో మాట్లాడారు. ఈ సందర్భంగా ఎన్నికల సంఘంతో పాటు కోర్టులపైనా ఆగ్రహం వ్యక్తం చేశారు. ‘‘ఎన్నికల సంఘం ఏమైనా ఆకాశం నుంచి ఊడిపడిందా?’’ అంటూ ఆగ్రహం ప్రదర్శించారు. అది కేవలం ఒక సౌకర్యాలు కల్పించే సంస్థ మాత్రమేనన్నారు. ఆ సంస్థ రిఫరీగా వ్యవహరించాలే తప్ప ఇష్టం వచ్చినట్టు పనిచేయడం సరికాదన్నారు.
తాను ఓటు వేసిన అనంతరం బయటకు వచ్చి మాట్లాడితే ఆ ఓటు చెల్లదని చెప్పిన ఎన్నికల కమిషన్.. డబ్బు, మద్యం పంపిణీని ఎందుకు అడ్డుకోలేకపోయిందో చెప్పాలన్నారు. తామిచ్చిన ఫిర్యాదులపై స్పందించలేదన్నారు. జమ్మలమడుగు అసెంబ్లీ నియోజకవర్గం విషయంలో కోర్టులు అన్యాయం చేశాయన్నారు. ఆ నియోజకవర్గంలో బయటి ప్రాంతాలకు చెందిన వారిని ఎన్నికల ఏజెంట్లుగా నియమించుకోవచ్చని ఎన్నికల సంఘం ఉత్తర్వులు జారీచేస్తే కోర్టు స్టే జారీ చేసిందన్నారు. కోర్టులు ఎక్కడైనా న్యాయం చేస్తాయని, అయితే ఇక్కడ అందుకు విరుద్ధంగా జరిగిందని తప్పుపట్టారు. జమ్మలమడుగు, మైదుకూరు నియోజకవర్గాల్లో తాము రీపోలింగ్ అడిగామని బాబు చెప్పారు.
వెయ్యి శాతం అధికారం మాకే...
సీమాంధ్రలో బుధవారం జరిగిన ఎన్నికల సరళిని చూస్తే ప్రజల్లో పెద్ద ఎత్తున తిరుగుబాటు కనిపించిందని చంద్రబాబు పేర్కొన్నారు. కొత్త రాష్ట్రాన్ని నిర్మించుకోవాలన్న కసితో ఓటు వేశారన్నారు. ఓటమి భయంతో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర వ్యాప్తంగా దాడులకు పాల్పడిందన్నారు. ఓటింగ్ శాతం తగ్గించేందుకు ఆ పార్టీ విశ్వప్రయత్నం చేసిందన్నారు. వైఎస్సార్ సీపీ ఓటర్లను భయబ్రాంతులకు గురి చేయటం ద్వారా ఓటింగ్ శాతం తగ్గించాలని చూసినా ప్రజలు మాత్రం వాటిని పట్టించుకోకుండా భారీ పోలింగ్ జరిగేలా చూశారని ఆయన పేర్కొన్నారు. చంద్రబాబు పాత్రికేయ సంఘాలపైనా అసంతృప్తి వ్యక్తం చేశారు. ఏదైనా చిన్న సంఘటన జరిగితే హడావుడి చేసే సంఘాలు ఎన్నికల సందర్భంగా పాత్రికేయులపై దాడులు జరిగితే ఎందుకు స్పందించలేద ని ప్రశ్నించారు. సీమాంధ్రలో తమ పార్టీ వెయ్యి శాతం అధికారాన్ని చేపడుతుందన్నారు. పార్టీ 120 నుంచి 130 శాసనసభ, 21 లోక్‌సభ స్థానాలు సాధిస్తుందన్నారు.
పవన్‌కు చంద్రబాబు విందు
సినీ నటుడు పవన్‌కల్యాణ్‌కు చంద్రబాబు గురువారం విందు ఇచ్చారు. ఈ కార్యక్రమంలో నారా లోకేష్ కూడా పాల్గొన్నారు. ఇటీవల జరిగిన ఎన్నికల్లో టీ డీపీ తరఫున పవన్ ప్రచారం చేసిన విషయం తెలిసిందే. తనకు ప్రచారం చేసినందుకు మర్యాదపూర్వకంగానే పవన్‌కు విందు ఇచ్చానని, ఇందులో ఎలాంటి ప్రత్యేకత లేదని మీడియాకు చంద్రబాబు చెప్పారు. చంద్రబాబు గురువారం రాత్రి కుటుంబ సమేతంగా మాల్దీవుల రాజధాని మాలేకు బయల్దేరి వెళ్లారు. ఆయన 13వ తేదీన తిరిగి హైదరాబాద్ చేరుకుంటారు. ప్రతి విడత ఎన్నికలు ముగిసిన అనంతరం విశ్రాంతి నిమిత్తం చంద్రబాబు విదేశాలకు వెళుతూనే ఉన్నారు.
ఓటమికి సాకులు
వెతుక్కోవటం కోసమేనా.. బాబూ?
ఈ విలేకరుల సమావేశానికి ‘సాక్షి’ని అనుమతించలేదు. వివిధ మార్గాల నుంచి సేకరించిన సమాచారం ఆధారంగా వార్త ఇవ్వటం జరిగింది. ‘సాక్షి’ని అనుమతించి ఉంటే ఈ క్రింది ప్రశ్నలకు సమాధానాలు రాబట్టేది.
1. ఓటమికి సాకులు వెతుక్కునే భాగంలోనే మీరు వైఎస్సార్ సీపీపై ఆరోపణలు చేస్తున్నారన్న విమర్శ ఉంది. మీరేమంటారు?
2. మీకు అనుకూలంగా లేనంత మాత్రాన అదీ ఎన్నికలు అయిపోయిన తర్వాత ఎలక్షన్ కమిషన్, కోర్టులపై ఆరోపణలు చేయడం ఎంత వరకు సమంజసం?
3. వైఎస్సార్ సీపీ పోలింగ్ శాతాన్ని తగ్గించడానికి ప్రయత్నించిందని మీరంటున్నారు? సీమాంధ్రలో 82 శాతం పోలింగ్ ఎలా జరిగిందంటారు?