ఊసరవెల్లిని మించిన బాబు | Chandrababu Naidu cheats cross more than Chameleon | Sakshi
Sakshi News home page

ఊసరవెల్లిని మించిన బాబు

Published Sun, Apr 27 2014 5:09 AM | Last Updated on Tue, Aug 14 2018 4:46 PM

ఊసరవెల్లిని మించిన బాబు - Sakshi

ఊసరవెల్లిని మించిన బాబు

రాజకీయ ప్రస్థానమంతా మోసాలు, వెన్నుపోట్లు, అవినీతిమయం
తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబునాయుడు రెండు అరుదైన రికార్డులను సాధించారు. రాష్ట్రానికి ఎక్కువకాలం ముఖ్యమంత్రిగా కొనసాగిన నాయకుడిగా మాత్రమే కాదు, ఎక్కువ కాలం ప్రతిపక్ష నేతగా కొనసాగిన రికార్డునూ  సొంతం చేసుకున్నారు. సుదీర్ఘ రాజకీయ అనుభవం గల చంద్రబాబుకు ఎలాంటి సైద్ధాంతిక నిబద్ధత, నైతిక విలువలు లేకపోవడం ఆశ్చర్యకరం. ఊసరవెల్లి కంటే శరవేగంగా తన రాజకీయ రంగులను మార్చే ఆయనను చూస్తే ఎవరైనా నివ్వెరపోవాల్సిందే. కొన్నేళ్ల కిందటే బీజేపీ నేతృత్వంలోని ఎన్డీఏను విమర్శించిన బాబు, ఇప్పుడు మోడీపై పొగడ్తల వర్షం కురిపిస్తూ, ఆ పార్టీతోనే పొత్తు పెట్టుకున్నారు.
 
 నిబద్ధత లేని రాజకీయం...
 చంద్రబాబు రాజకీయ జీవితమే ఎలాంటి నిబద్ధత లేకుండా ప్రారంభమైంది. ఎకనామిక్స్‌లో పోస్ట్‌గ్రాడ్యుయేషన్ చేసిన చంద్రబాబు, ప్రొఫెసర్ ఎన్జీ రంగా ఆర్థిక విధానాలపై డాక్టరేట్ కోసం నమోదు చేయించుకున్నారు. 1978 అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసేందుకు ఏ పార్టీలో చేరితే బాగుంటుం దని తన గైడ్‌ను అడిగారు. ఇందిరా కాంగ్రెస్ లేదా బ్రహ్మానందరెడ్డి కాంగ్రెస్‌లో చేరవచ్చని ఆయన సలహా ఇచ్చారు.
 
 రెడ్డి కాంగ్రెస్ రాజకీయాల్లో కొన్ని విలువలను నెలకొల్పిందని, అయితే, ఇందిరా కాంగ్రెస్‌లో చేరితే గెలిచే అవకాశాలు ఎక్కువగా ఉంటాయని అభిప్రాయపడ్డారు. గెలుపు మాత్రమే లక్ష్యం కావడంతో చంద్రబాబు వెంటనే ఇందిరా కాంగ్రెస్‌లో చేరిపోయారు. ఆ పార్టీ టికెట్‌పై ఎన్నికల్లో పోటీచేసి ఎమ్మెల్యేగా గెలుపొందారు. దరిమిలా, అంజయ్య, భవనం వెంకట్రామ్,  కోట్ల విజయభాస్కరరెడ్డి మంత్రివర్గాల్లో మంత్రి కాగలిగారు. రాష్ట్ర మంత్రిగానే ఆయన ఎన్టీఆర్ దృష్టిని ఆకర్షించి, ఆయనకు అల్లుడు కాగలిగారు.
 
 వసూల్‌రాజా...
 మంత్రిగా వివిధ శాఖల్లో పనిచేసిన కాలంలో చంద్రబాబు ఎడాపెడా వసూళ్లకు పాల్పడేవారు. చిన్నతరహా నీటిపారుదల శాఖ మంత్రిగా ఉన్నప్పుడు ఒక జిల్లాకు వెళ్లి అక్కడి ఇంజినీర్లతో సమావేశం పెట్టారు. తన రాజకీయ ఖర్చుల కోసం భారీ మొత్తాలు చెల్లిం చాలని హుకుం జారీ చేశారు. తమ శాఖకు బడ్జెట్ కేటాయింపులే అంతంతమాత్రంగా ఉన్నాయని, అడిగినంత చెల్లించుకోలేమని ఇంజినీర్లు చేతులెత్తేస్తే వారిపై మండిపడి, అప్పటికప్పుడే ఆ జిల్లాలో ఆకస్మిక తనిఖీ చేపట్టారు.
 
 చిన్నా చితకా లోపాలను గుర్తించి ఇంజినీర్లను అక్కడికక్కడే సస్పెండ్ చేశారు. సస్పెన్షన్ నుంచి విముక్తి కోసం ఆ ఇంజినీర్లంతా అప్పటి ముఖ్యమంత్రి భవనం వెంకట్రామ్ వద్ద మొరపెట్టుకోవాల్సి వచ్చింది. చంద్రబాబు వసూళ్ల దూకుడు మరో ముఖ్యమంత్రి కోట్ల ఆగ్రహానికీ కారణమైంది. కోట్ల మంత్రివర్గంలో చంద్రబాబు సాంకేతిక విద్యాశాఖ మంత్రిగా పనిచేశారు. అప్పట్లో కోట్ల సన్నిహితుడైన ఒక పాలిటెక్నిక్ కాలేజీ చైర్మన్‌ను కూడా విడిచిపెట్టకుండా వసూళ్లకు పాల్పడ్డారు. ఈ విషయం కోట్లకు తెలియడంతో వసూళ్లను కట్టిపెట్టాలంటూ ఆయన బాబును హెచ్చరించారు.
 
 ఉల్లం‘ఘనుడు’...

 అంజయ్య కేబినెట్‌లో కొనసాగిన కాలంలో బాబు యథేచ్ఛగా క్రమశిక్షణ ఉల్లంఘనకు పాల్పడ్డారు. మరో మంత్రి సి.దాస్‌తో కలిసి చిత్తూరు జిల్లా పరిషత్ చైర్‌పర్సన్ పదవికి జరిగిన ఎన్నికల్లో పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడ్డారు. పార్టీ అభ్యర్థిని ఓడించి, తమ అభ్యర్థి జి.కుతూహలమ్మను గెలిపించుకున్నారు. దీంతో చంద్రబాబును, సి.దాస్‌ను అప్పటి పీసీసీ అధ్యక్షుడు కోన ప్రభాకరరావు సస్పెండ్ చేశారు. ఆ సమయంలో ఢిల్లీలో ఉన్న సీఎం అంజయ్య వారిద్దరినీ క్షమించి, సస్పెన్షన్‌ను ఎత్తివేయాలని అప్పటి ప్రధాని ఇందిరాగాంధీని కోరారు. దాంతో ఆమె సస్పెన్షన్‌ను ఎత్తివేశారు.
 
 ప్రగల్బాలలో ఉత్తర కుమారుడు...
 ఎన్టీఆర్ టీడీపీని స్థాపించినప్పుడు, పార్టీలో చేరాల్సిందిగా చంద్రబాబును తోడల్లుడు దగ్గుబాటి వెంకటేశ్వరరావు ఆహ్వానించారు. అయితే బాబు నిరాకరించారు. ఎన్నికల్లో టీడీపీకి 5 శాతానికి మించి సీట్లు రావని, తిరిగి కాంగ్రెస్ ప్రభుత్వమే అధికారంలోకి వస్తుందని లెక్కలు వేశారు. దాంతోనే పార్టీ కోరితే మామ ఎన్టీఆర్‌పైనే పోటీ చేస్తానంటూ ఉత్తర కుమారుడి ప్రగల్భాలు పలికారు. కానీ టీడీపీ ఆ ఎన్నికల్లో ఘనవిజయం సాధిం చింది. వెంటనే చంద్రబాబు తన పంథాను మార్చుకుని టీడీపీలోకి చేరిపో యారు. అప్పటి నుంచి పార్టీలో పట్టు పెంచుకుంటూ వచ్చారు.
 
 ముఖ్యమంత్రిగా నిర్వాకాలు...
 ఎన్టీఆర్‌ను వెన్నుపోటు పొడిచి, ముఖ్యమంత్రి పదవి చేపట్టిన తర్వాత చంద్రబాబు ప్రభుత్వం, పార్టీపై పట్టు పెంచుకున్నారు. పాలనాధికారాలను గుప్పి ట్లో పెట్టుకుని, మంత్రివర్గ సహచరులపై తన ఆధిపత్యాన్ని కాపాడుకునేవారు. ఎన్టీఆర్ ముఖ్యమంత్రిగా ఉండగా, సంపూర్ణ మద్యనిషేధాన్ని అమలు చేస్తే, చంద్రబాబు మద్యనిషేధాన్ని ఎత్తివేశారు. రెండు రూపాయల కిలో బియ్యం పథకానికీ తూట్లు పొడిచారు. ముఖ్యమంత్రిగా అధికారంలో ఉన్నంత కాలం ఏ ఒక్క విధానానికీ కట్టుబడని చంద్రబాబు నిర్వాకాలు మచ్చుకు కొన్ని...
 
 -    అప్పట్లో మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రిగా ఉన్న దిగ్విజయ్ సింగ్ పంచాయతీరాజ్ సంస్థలకు అధికారాలను కట్టబెట్టి, పాలనను వికేంద్రీకరించారు. ఎంపీలో కాంగ్రెస్ రెండోసారి గెలుపొందడానికి ఇదే కారణమని కాంగ్రెస్ నేతలు ప్రచారం చేసుకున్నారు. దీంతో చంద్రబాబు అదే తీరులో రాష్ట్రంలోని పంచాయతీరాజ్ సంస్థలకు మరిన్ని ఆర్థిక అధికారాలు కల్పించేందుకు ఆర్డినెన్స్ రూపొందించాల్సిందిగా అధికారులను ఆదేశించారు. అయితే, ఆర్డినెన్స్ రూపొం దించేలోగా మధ్యప్రదేశ్‌లో అసెంబ్లీ ఎన్నికలు జరిగాయి. ఆ ఎన్నికల్లో కాంగ్రెస్ ఓడిపోయింది. అంతే అధికారులు రూపొందించిన ఆర్డినెన్స్‌ను చంద్రబాబు బుట్టదాఖలు చేశారు.
 
 -    మలేసియా విజయాలను గమనించి, ‘విజన్-2020’ రూపకల్పన బాధ్యతలను ఒక అంతర్జాతీయ సంస్థకు కట్టబెట్టారు. ‘విజన్-2020’ సూచనలపై ఎడాపెడా విదేశీ సలహాదారులను నియమించుకుని, వారికి భారీ పారితోషికాలు చెల్లించారు. ‘నాగార్జునసాగర్ నిర్మాణం సమయంలో చంద్రబాబు ముఖ్యమంత్రిగా లేరు. అందుకే దాని నిర్మాణం విదేశీ నిపుణుల సలహా లేకుండానే పూర్తయింది’ అని కొందరు రిటైర్డ్ ప్రభుత్వాధికారులు వ్యాఖ్యానించేవారంటే, పరిస్థితిని అర్థం చేసుకోవచ్చు.
 -    హైదరాబాద్‌లోని నెహ్రూ జూ పార్కు అభివృద్ధి కోసం సింగపూర్ జూ అధికారులను ఇక్కడకు రప్పించడం మరీ విడ్డూరం. నిజానికి సింగపూర్‌లో జూ ఏర్పాటు చేసినప్పుడు హైదరాబాద్ వచ్చి, ఇక్కడి నెహ్రూ జూ పార్కును పరిశీలించి వెళ్లామని సింగపూర్ అధికారులే అప్పట్లో చెప్పారు.
 - ఇజ్రాయెలీ పరిజ్ఞానంతో కుప్పం ప్రాజెక్టు కోసం రూ.10 కోట్లు ఖర్చు చేశారు. అమెరికాకు చెందిన ఒక ఉత్తుత్తి కంపెనీకి దీనికోసం రూ.10 కోట్లు కన్సల్టెన్సీ ఫీజుగా చెల్లించారు.
 -    ప్రైవేటు కంపెనీలతో విద్యుత్ కొనుగోలు ఒప్పందాలపై ఎడాపెడా సంతకాలు చేశారు. ఈ ఒప్పందాలన్నీ ఏకపక్షంగా ప్రైవేటు కంపెనీలకు లబ్ధి కలిగించేవే.
 -    ‘జన్మభూమి’ పథకం కింద గ్రామీణ ప్రాంతాల్లో చేపట్టే పనుల్లో 50 శాతం వ్యయాన్ని ప్రజలే ‘శ్రమదానం’ రూపంలో లేదా స్వచ్ఛంద విరాళాల రూపంలో భరించాల్సి ఉండేది. ‘జన్మభూమి’ కింద చేపట్టిన పనుల అంచనా వ్యయాన్ని పెంచి చూపి టీడీపీ కార్యకర్తలే ఎక్కువగా లబ్ధి పొందారు.
 -    బాబు హయాంలో మహిళలపై అత్యాచారాల్లో ఆంధ్రప్రదేశ్ దేశంలోనే మొదటిస్థానంలో నిలిచింది. ఆయన హయాంలో అరవై లక్షల మంది యువకులు నిరుద్యోగులుగా మిగిలారు.
 -    పారిశ్రామిక రంగంలో అంతకు ముందు 5వ స్థానంలో ఉన్న ఆంధ్రప్రదేశ్, బాబు హయాంలో 9వ స్థానానికి పడిపోయింది. ఇక సేవారంగంలోనైతే ఏకంగా రెండో స్థానం నుంచి పన్నెండో స్థానానికి దిగజారింది. తొమ్మిదేళ్ల పాలనలో బాబు, కార్పొరేట్ సంస్థలకు భారీ రాయితీలు ఇవ్వడంతో పాటు తన తాబేదార్లకు లాభసాటి కాంట్రాక్టులను కట్టబెట్టడం మినహా ప్రజలకు ఒరగబెట్టిందేమీ లేదు.
 
 వెన్నుపోటు...
 ఎన్టీఆర్ నియంతృత్వ పోకడల కారణంగా నాదెండ్ల భాస్కరరావు నేతృత్వంలో ఆయనపై జరిగిన తొలి కుట్ర విఫలమైన సంగతి తెలిసిందే. రెండోసారి చంద్రబాబు మాత్రం విజయవంతంగా తన కుట్రను అమలు చేయగలిగారు. ఒకవైపు మీడియా అండతో పాటు మరోవైపు ఎన్టీఆర్ రెండో భార్య లక్ష్మీపార్వతికి వ్యతిరేకంగా ఆయన కుటుంబ సభ్యులందరినీ కూడగట్టుకుని వెన్నుపోటు పొడిచారు. చంద్రబాబు కుట్ర సమాచారం తెలుసుకున్న ఎన్టీఆర్ ఆయనను తన కేబినెట్ నుంచి తప్పించాలని భావించారు.
 
 ఈ మేరకు గవర్నర్‌కు లేఖ పంపాలనుకున్నారు. అయితే, సీఎం కార్యాలయంలోని అధికారులు ఆయనను వారించారు. ప్రభుత్వ వ్యవహారాల్లో లక్ష్మీపార్వతి జోక్యాన్ని మాత్రమే చంద్రబాబు వ్యతిరేకిస్తున్నారని, ముఖ్యమంత్రిని కాదని నచ్చజెప్పారు. తర్వాత శ్రీకాకుళంలో జరిగిన సభలో చంద్రబాబు తన ప్రసంగంలో ఎన్టీఆర్‌ను పొగడ్తలతో ముంచెత్తారు. అక్కడి నుంచి ఎన్టీఆర్‌తో కలసి విశాఖ చేరుకున్నాక ఒంటరిగా ఒక హోటల్‌కు చేరుకున్నారు. అక్కడి నుంచే ఎమ్మెల్యేలతో ఫోన్‌లో మంతనాలు సాగించి, ఎన్టీఆర్ పదవీచ్యుతికి కుట్ర పన్నారు.

- సీహెచ్.రాజేశ్వర్ రావు
 సీనియర్ జర్నలిస్టు
 (ముఖ్యమంత్రి మాజీ సమాచార సలహాదారు)

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement