'కాంట్రాక్ట్‌ను మించిన దోపిడీ మరొకటి లేదు' | There is nothing beyond the exploitation of contract system says kodandaram | Sakshi
Sakshi News home page

'కాంట్రాక్ట్‌ను మించిన దోపిడీ మరొకటి లేదు'

Published Wed, Oct 26 2016 6:36 PM | Last Updated on Mon, Jul 29 2019 2:51 PM

'కాంట్రాక్ట్‌ను మించిన దోపిడీ మరొకటి లేదు' - Sakshi

'కాంట్రాక్ట్‌ను మించిన దోపిడీ మరొకటి లేదు'

హైదరాబాద్: ‘‘కాంట్రాక్ట్ వ్యవస్థ అన్యాయమైనది. ఓ వ్యక్తిని పోషించే వ్యవస్థ. ఏ పనీ చేయని మధ్య దళారి, కార్మికుల జీతాల్లో కొంత భాగాన్ని ఎగరేసుకుపోతున్నాడు. ఆ కాంట్రాక్టర్ ఎవరో కార్మికులకూ తెలియదు.. పని చేసే కార్మికులను కాదని ఏ పనీ చేయని కాంట్రాక్టర్లకు జీతాలు ఇవ్వడం సరికాదు..ఇంతకు మించిన అన్యాయమైన దోపిడీ వ్యవస్థ మరోకటి ఉండదు.’’ అని తెలంగాణ జేఏసీ చైర్మన్ ఎం.కోదండరామ్ రాష్ట్రంలో కాంట్రాక్ట్ కార్మిక వ్యవస్థపై ఆగ్రహం వ్యక్తం చేశారు. తెలంగాణ విద్యుత్ కాంట్రాక్ట్ వర్కర్స్ యూనియన్ ఆధ్వర్యంలో ఈ నెల 31 నుంచి ప్రారంభం కానున్న విద్యుత్ కాంట్రాక్ట్ కార్మికుల హక్కుల యాత్రకు సంబంధించిన పోస్టర్‌ను సోమాజీగూడ ప్రెస్‌క్లబ్‌లో బుధవారం ఆవిష్కరించారు.

విద్యుత్ జేఏసీ సమన్వయకర్త, జేఏసీ అధికార ప్రతినిధి కె.రఘు నేతృత్వంలో కాంట్రాక్టు కార్మిక వ్యవస్థపై సబ్ కమిటీని ఏర్పాటు చేస్తున్నామని కోదండరామ్ ప్రకటించారు. కాంట్రాక్ట్, ఔట్ సోర్సింగ్ అంటూ వేర్వేరుగా పిలుచుకోవడమే కాని రెండింటి మధ్య తేడా లేదన్నారు. ఔట్ సోర్సింగ్ కార్మికులను క్రమబద్ధీకరించమని ప్రభుత్వం చెప్పడంలో అర్థం లేదన్నారు. ‘సంగారెడ్డి జిల్లాలోని కోహీర్ సబ్ స్టేషన్‌ను కార్మిక యూనియన్ దత్తత తీసుకుని కేవలం రూ.30 వేల ఖర్చుతోనే నిర్వహణ జరుపుతోంది. అదే కాంట్రాక్టర్లు సబ్ స్టేషన్ల నిర్వహణకు రూ.1.50లక్షలు తీసుకుంటున్నారు. కాంట్రాక్ట్ కార్మికుల యూనియన్ చేసి చూపెట్టిన ఈ పనులను ప్రభుత్వం చేయలేదా?’’ అని కోదండరాం ప్రశ్నించారు.

విద్యుత్ సంస్థల్లో కాంట్రాక్ట్ ఉద్యోగాల నియామకాల్లో తీవ్ర అవినీతి జరుగుతోంది, భవిష్యత్తులో క్రమబద్ధీకరిస్తారన్న ఆశతో నిరుద్యోగులు రూ.5లక్షల వరకు ముడుపులు చెల్లించి ఉద్యోగాల్లో చేరుతున్నారని విద్యుత్ జేఏసీ సమన్వయకర్త కె.రఘు ఆరోపించారు. విద్యుత్ కార్మికుల హక్కుల సాధన కోసం 31వ తేదీ నుంచి 90 రోజుల పాటు రాష్ట్రంలోని 31 జిల్లాల్లో యాత్రను నిర్వహిస్తామని, అన్ని శాఖల్లోని కాంట్రాక్టు కార్మికులను ఏకం చేస్తామని యూనియన్ అధ్యక్షులు జి.నాగరాజు తెలిపారు. ఈ కార్యక్రమంలో జేఏసీ నేతలు పిట్టల రవీందర్, పురుషోత్తం, గురజాల రవీందర్, వెంకట్ రెడ్డి, బైరీ రమేశ్ తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement