ఆరోగ్య కార్యకర్తల నియామకంపై తెలంగాణ హైకోర్టు ఆగ్రహం
కాంట్రాక్టు విధానంలో తీసుకున్నా అర్హతలు ఉండాల్సిందే
2013లో ఉమ్మడి ఏపీ సర్కార్‌ఇచ్చిన జీవో చెల్లదు
సాక్షి, హైదరాబాద్: సుప్రీంకోర్టు, హైకోర్టు ఉత్తర్వులతో తొలగింపునకు గురైన 1,200 మందిని కాంట్రాక్టు పద్ధతిలో బహుళ ప్రయోజన ఆరోగ్య కార్యకర్తలుగా విధుల్లోకి తీసుకోవడం చట్టవిరుద్ధమని తెలంగాణ హైకోర్టు స్పష్టం చేసింది. ఈ మేరకు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం 2013లో జారీ చేసిన జీవో 1207ను కొట్టివేసింది. బహుళ ప్రయోజన ఆరోగ్య కార్యకర్తల నియామకంపై 2002లో అర్హతల వివాదం నెలకొనగా, నిబంధనలకు విరుద్ధంగా సర్కార్ జీవోలు జారీ చేసి, నియామకాలు చేపట్టడం సరికాదని పేర్కొంది.
ఈ అంశాన్ని ఉన్నత, అత్యున్నత న్యాయస్థానాలు తప్పుబట్టిన విషయాన్ని గుర్తు చేసింది. అర్హతలకు సంబంధించి న్యాయస్థానాలు తీర్పులు వెలువరించిన తర్వాత వాటికి విరుద్ధంగా మళ్లీ జీవో తీసుకురావడాన్ని తప్పుబట్టింది. ప్రభుత్వ నిర్ణయాన్ని సమర్థించలేమని, వారి తప్పును కొనసాగించలేమని వ్యాఖ్యానిస్తూ.. ఈ ఉత్తర్వులు వెలువడిన 90 రోజుల్లోగా అర్హులతో జాబితా రూపొందించి చర్యలు చేపట్టాలని తెలంగాణ, ఏపీ ప్రభుత్వాలకు తేల్చిచెప్పింది.
అర్హులైన వారిని కొనసాగించవచ్చని పేర్కొంది. బహుళ ప్రయోజన ఆరోగ్య కార్యకర్తల నియామకానికి సంబంధించి 2002లో ఇచి్చన నోటిఫికేషన్ వివాదాస్పదమైంది. దీనిపై కొందరు హైకోర్టును ఆశ్రయించారు. గుర్తింపు పొందిన సంస్థ నుంచి హెల్త్ అసిస్టెంట్లుగా డిప్లొమా చేసిన వారినే అర్హులుగా పరిగణించాలని స్పష్టం చేసింది. ఆ మేరకే మెరిట్ జాబితా రూపొందించాలని ఆదేశాలు జారీ చేసింది. సుప్రీంకోర్టు కూడా ఇదే తీర్పును సమర్థించింది. దీంతో ప్రభుత్వం సరైన అర్హతలు లేని 1,200 మందిని తొలగిస్తూ జీవో జారీ చేసింది.
అయితే ఇంత మందిని ఒకేసారి తొలగించాల్సి రావడంతో ప్రభుత్వం వీరందరినీ కాంట్రాక్టు విధానంలో తీసుకుంటూ జీవో 1207 జారీ చేసింది. దీనిపై కొందరు నాడు ఏపీ పరిపాలన ట్రిబ్యునల్‌లో పిటిషన్లు దాఖలు చేయగా, సర్కార్ నిర్ణయం సబబేనని చెప్పింది. ట్రిబ్యునల్ ఉత్తర్వులను సవాల్ చేస్తూ కొందరు హైకోర్టులో పిటిషన్లు వేశారు.
ఖాళీలుంటే నిబంధనల మేరకు భర్తీ..
ఈ పిటిషన్లపై విచారణ చేపట్టిన జస్టిస్ సుజోయ్‌పాల్, జస్టిస్ నామవరపు రాజేశ్వర్‌రావు ధర్మాసనం తీర్పు వెలువరించింది. ‘కేవలం 9 ఏళ్లు (2002 నుంచి) సర్వీస్ చేశారన్న కారణంగా సుప్రీంకోర్టు, హైకోర్టు నిర్ధారించిన అర్హతలు లేని వారిని కాంట్రాక్టు విధానంలో తీసుకోవడం సరికాదు. రెగ్యులర్, కాంట్రాక్టు విధానం.. ఏ నియామకమైనా అర్హతలు పాటించాల్సిందే. ఒకసారి తొలగించిన వారిని తిరిగి విధుల్లోకి తీసుకోవడం చెల్లదు.
ప్రభుత్వ నిర్ణయాన్ని సమర్థిస్తే.. గతంలో హైకోర్టు, సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పులకు విరుద్ధంగా ఉత్తర్వులిచ్చినట్లే అవుతుంది. 1,200 మందిని కాంట్రాక్టు పద్ధతిలో తీసుకోవడం తప్పుబట్టాల్సిందే. 90 రోజుల్లో అర్హులతో జాబితా రూపొందించాలని తెలంగాణ, ఏపీ సర్కార్‌లను ఆదేశిస్తున్నాం. అర్హులను కొనసాగింపుపై చర్యలు తీసుకోవచ్చు. ఒకవేళ ఇంకా ఖాళీలు ఉంటే చట్టప్రకారం నిబంధనలు పాటిస్తూ నియామకాలు చేపట్టవచ్చు’అని తీర్పులో స్పష్టం చేసింది.
Comments
Please login to add a commentAdd a comment