G.O
-
ఇతర శాఖల్లోకి వీఆర్వోలు, జీవో జారీ.. భగ్గుమన్న జేఏసీ నేతలు
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో గ్రామ రెవెన్యూ అధికారుల (వీఆర్వోల) శకం ముగిసింది. రెవెన్యూ శాఖను పర్యవేక్షించే భూపరిపాలన విభాగంలో వీఆర్వోలుగా పనిచేస్తున్న 5,385 మందిని ఇతర ప్రభుత్వ శాఖల్లో సర్దుబాటు (విలీనం) చేసేందుకు ఆర్థిక శాఖ అనుమతి ఇచ్చింది. దీంతో వీఆర్వోలుగా పనిచేస్తున్న వారిని వివిధ ప్రభుత్వ శాఖల్లో జూనియర్ అసిస్టెంట్ సమాన హోదాలో సర్దుబాటు చేయనున్నారు. ఈ ప్రక్రియను సజావుగా నిర్వహించే బాధ్యతను జిల్లాల కలెక్టర్లకు అప్పగిస్తూ రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్‌కుమార్ సోమవారం జీవో నంబర్ 121ను విడుదల చేశారు. 2020లో అమల్లోకి వచ్చిన కొత్త రెవెన్యూ చట్టం ప్రకారం వీఆర్వోల వ్యవస్థ రద్దయినందున.. ఆ పోస్టుల్లోని సిబ్బందిని ఇతర శాఖల్లోకి తీసుకోనున్నట్టు అందులో తెలిపారు. ఇప్పటికే ఆయా జిల్లాల ప్రభుత్వ యంత్రాంగం గుర్తించిన ఖాళీల్లో వారిని సర్దుబాటు చేయాలని, లాటరీ తీసి ప్రక్రియను పూర్తి చేయాలని కలెక్టర్లను ఆదేశించారు. రెవెన్యూ శాఖ ఇచ్చే సర్వీస్ రిజిస్టర్, తాజా పే సర్టిఫికెట్ ఆధారంగా ప్రభుత్వ శాఖలు వారిని చేర్చుకోవాల్సి ఉంటుందని వెల్లడించారు. ప్రస్తుతం సెలవు, సస్పెన్షన్, డిప్యుటేషన్, ఫారిన్ సర్వీసులో ఉన్న వీఆర్వోలను కూడా ఇతర శాఖలకు పంపాలని ఆదేశించారు. అదనంగా ఉంటే పొరుగు జిల్లాలకు.. రాష్ట్రవ్యాప్తంగా పనిచేస్తున్న వీఆర్వోలను ఇతర శాఖల్లో సర్దుబాటు చేసేందుకు ఆర్థికశాఖ ప్రతి జిల్లాకు ఓ ఉత్తర్వును జారీ చేసింది. సదరు జిల్లాల్లో గుర్తించిన ప్రభుత్వ శాఖల్లోని ఖాళీలను విభాగాల వారీగా ప్రకటిస్తూ.. ఎంతమంది వీఆర్వోలను సర్దుబాటు చేయాలో పేర్కొంది. ఈ మేరకు ఆర్థిక శాఖ కార్యదర్శి రొనాల్డ్ రాస్ మెమో నంబర్: 1634052–బీ/186/ఏ1/హెచ్ఆర్ఎం–7/2022 పేరిట అన్ని జిల్లాల కలెక్టర్లకు సర్క్యులర్ పంపారు. లాటరీ ప్రక్రియను వీడియో తీయాలని.. నిర్దేశిత ఫార్మాట్లో ఉద్యోగుల కేటాయింపు ఉత్తర్వులను ఆయా జిల్లాల కలెక్టర్లే ఇవ్వాలని సూచించారు. ఏదైనా జిల్లాలో గుర్తించిన ఖాళీల కంటే వీఆర్వోల సంఖ్య ఎక్కువగా ఉంటే పొరుగు జిల్లాలకు పంపాలని ఆదేశించారు. భూపరిపాలన మినహా.. జిల్లాల వారీగా ఇచ్చిన ఉత్తర్వులను పరిశీలిస్తే.. వీఆర్వోలను ఎక్కువగా నీటి పారుదల, పంచాయతీరాజ్, విద్య, వైద్య శాఖలకు కేటాయించారు. జిల్లాల్లో హెచ్‌వోడీల పరిధిలోకి వచ్చే విభాగాల్లోని ఖాళీల్లో వీఆర్వోలను సర్దుబాటు చేయాలన్నారు. దేవాదా య, ఎక్సైజ్, పన్నులు, రిజిస్ట్రేషన్ల శాఖల్లోకి కూడా వీరిని తీసుకునేందుకు అనుమతినిచ్చిన ఆర్థిక శాఖ.. భూపరిపాలన విభాగంలోకి తీసుకునేందుకు అనుమతించలేదు. జీవో నం 121 ప్రతి దహనం తమను ఇతర ప్రభుత్వ శాఖల్లో సర్దుబాటు చేయడంపై వీఆర్వోల సంఘాలు భగ్గుమంటున్నాయి. ప్రభుత్వం విడుదల చేసిన జీవో నం 121 ప్రతిని వీఆర్వో సంఘాల జేఏసీ నేతలు హైదరాబాద్‌లోని సీసీఎల్ఏ కార్యాలయ ప్రాంగణంలో దహనం చేశారు. వీఆర్వోలుగా తాము ఒక్క భూపరిపాలన విధులు మాత్రమే చూడటం లేదని.. మొత్తం 54 రకాల విధుల్లో అదీ ఒకటని, తమను ఇతర శాఖలకు పంపితే మిగతా 53 విధులను ఎవరు నిర్వర్తించాలని ప్రశ్నించారు. తమను సంప్రదించకుండా, సీనియారిటీని పరిగణనలోకి తీసుకోకుండా ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంపై న్యాయస్థానాలను ఆశ్రయిస్తామని ప్రకటించారు. అప్పటివరకు జిల్లా కలెక్టర్లు ఇచ్చే సర్దుబాటు ఉత్తర్వులను తీసుకోవద్దని నిర్ణయించారు. దీనిపై జాతీయ మానవ హక్కుల సంఘానికి ఫిర్యాదు చేస్తామని వీఆర్వోల జేఏసీ నేత వింజమూరి ఈశ్వర్ తెలిపారు. ఎక్కడో అవినీతి జరిగిందనే సాకుతో వ్యవస్థనే రద్దు చేయడం దారుణమన్నారు. ముందు కేడర్ స్ట్రెంత్ నిర్ధారించండి: ట్రెసా వీఆర్వోలను ఇతర శాఖల్లో సర్దుబాటు చేసే ప్రక్రియను ప్రారంభించడంపై తెలంగాణ రెవెన్యూ ఎంప్లాయీస్ సర్వీసెస్ అసోసియేషన్ (ట్రెసా) అసంతృప్తి వ్యక్తం చేసింది. రెవెన్యూ శాఖ 6,874 పోస్టులను కోల్పోతోందని ట్రెసా రాష్ట్ర అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు వంగా రవీందర్‌రెడ్డి, కె.గౌతమ్‌కుమార్ పేర్కొన్నారు. వీఆర్వో వ్యవస్థ రద్దుతో తమ శాఖలో పని ఒత్తిడి పెరుగుతుందని.. పరిపాలన, ఎన్నికలు, ప్రభుత్వ భూముల పరిరక్షణ, ప్రకృతి వైపరీత్యాలు, ధ్రువపత్రాల జారీ, సంక్షేమ పథకాల అమలు వంటి కార్యక్రమాలకు విఘాతం కలుగుతుందన్నారు. పాలనా సౌకర్యార్ధం ప్రతి మండలానికి ఐదుగురు అదనపు సిబ్బందిని వెంటనే కేటాయించాలని డిమాండ్ చేశారు. రెవెన్యూశాఖను అనాథ చేశారు: టీజీటీఏ తెలంగాణ పాలన వ్యవస్థకు ఆయువు పట్టు అయిన రెవెన్యూ శాఖను ప్రభుత్వం అనాథను చేసిందని తెలంగాణ తహసీల్దార్ల అసోసియేషన్ (టీజీటీఏ) పేర్కొంది. ప్రభుత్వం వీఆర్వో వ్యవస్థను ఎందుకు రద్దు చేయాల్సి వచ్చిందో ఇప్పటివరకు చెప్పలేదని టీజీటీఏ వ్యవస్థాపక అధ్యక్షుడు వి.లచ్చిరెడ్డి మండిపడ్డారు. కొత్త మండలాలు, డివిజన్లు, జిల్లాలు ఏర్పాటయ్యాక ఒక్క పోస్టునూ పెంచని ప్రభుత్వం.. ఏకంగా 6వేలకు పైగా పోస్టులను రెవెన్యూ శాఖ నుంచి తీసేయడం దారుణమన్నారు. వెంటనే జీవో 121ను రద్దు చేయాలని, లేదంటే నిరవధిక సమ్మెకు దిగుతామని హెచ్చరించారు. -
గుడ్‌న్యూస్: గెస్ట్ లెక్చరర్ల వేతనాలు.. గంటకు రూ. 90 పెంపు
సాక్షి,హైదరాబాద్: రాష్ట్రంలోని గెస్ట్ లెక్చరర్ వేతనాలు గంటకు రూ.300 నుంచి 390 వరకూ పెంచుతూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు ఆర్థిక శాఖ ప్రభుత్వ కార్యదర్శి రొనాల్డ్ రాస్ గురువారం ఉత్తర్వులు జారీచేశారు. నెలకు 72 గంటలపాటు బోధించే అవకాశం కల్పించాలని, నెలసరి వేతనం రూ. 28,080కి పరిమితం చేయాలని జీవోలో పేర్కొన్నారు. రాష్ట్రవ్యాప్తంగా 405 ప్రభుత్వ జూనియర్ కళాశాలల్లో దాదాపు 2 వేలమంది గెస్ట్ లెక్చరర్లు ఉన్నారు. వేతనం పెంపు నిర్ణయం పట్ల ప్రభుత్వ జూనియర్ కళాశాలల గెస్ట్ లెక్చరర్స్ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షుడు దామెర ప్రభాకర్, ప్రధాన కార్యదర్శి దార్ల భాస్కర్ తదితరులు హర్షం వ్యక్తం చేశారు. క్రమబద్ధీకరణ చేయకుంటే 12న ఆందోళన సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలోని జూనియర్ కళా శాలల్లోని కాంట్రాక్టు అధ్యాపకులను క్రమబద్ధీ కరించాలని, ఆ జాబితాను ఈ నెల 12లోగా ప్రభుత్వానికి పంపకుంటే అదేరోజు ఆందోళన చేపడతామని ఇంటర్ విద్యా పరి రక్షణ సమితి హెచ్చరించింది. ఈ మేరకు ఇం టర్ విద్య పరిరక్షణ సమితి కన్వీనర్ మాచర్ల రామకృష్ణ గౌడ్, సమన్వయకర్త మైలారం జంగయ్య, కాంట్రాక్టు ఉద్యోగుల క్రమబద్ధీ కరణ సాధన సమితి సమన్వయకర్త కొప్పిశెట్టి సురేష్ ప్రభుత్వానికి వినతి పత్రం ఇచ్చారు. -
చెరువుల వేలంపై ఆందోళన అనవసరం
సాక్షి, అమరావతి: మత్స్యకార సహకార సంఘాల అభ్యున్నతి కోసం జారీ చేసిన జీవో 217 విషయంలో మత్స్యకారులు ఎలాంటి ఆందోళన చెందాల్సిన పనిలేదని మత్స్యశాఖ కమిషనర్ కె.కన్నబాబు స్పష్టం చేశారు. వాస్తవానికి దీనివల్ల వారికి మేలు జరుగుతుందన్నారు. మంగళవారం సచివాలయంలో ఆయన మీడియాతో మాట్లాడారు. మత్స్యకార సొసైటీల్లో ప్రతి మత్స్యకారుడు కనీసం రూ.15 వేలకు తక్కువ కాకుండా ఆదాయం పొందేలా ప్రభుత్వం చర్యలు చేపట్టిందని తెలిపారు. వంద హెక్టార్లు పైబడిన చెరువులను బహిరంగ వేలం ద్వారా కేటాయించి ఆదాయంలో 30 శాతాన్ని సొసైటీ సభ్యులకు సమానంగా జమ చేయాలని, మరో 20 శాతం మత్స్య కారుల సహకార సంఘాల ఫెడరేషన్(ఆప్కాఫ్) ద్వారా వారి అభ్యున్నతి కోసం ఖర్చు చేయాలని నిర్ణయించామన్నారు. వేలం పాటల్లో మత్స్యకార సహకార సొసైటీలు కూడా పాల్గొనవచ్చన్నారు. సహజంగా అత్యధికంగా సముద్రంపైనే ఆధారపడి జీవించే మత్స్యకారులకు 217 జీవోతో ఎలాంటి నష్టం ఉండదన్నారు. మంచినీటి చెరువులకు సంబంధించిన ఈ జీవో వల్ల వారికి ఇబ్బంది ఉండదన్నారు. వంద హెక్టార్లకు పైబడిన, పైలెట్ ప్రాజెక్టుగా అమలు చేస్తున్న నెల్లూరు జిల్లాలోని 27 చెరువులకు ప్రస్తుతం ఈ జీవోను వర్తింపచేస్తామని, మిగిలిన చోట్ల పాత పద్ధతిలోనే కొనసాగిస్తామని చెప్పారు. సందేహాల నివృత్తికి సిద్ధం వంద హెక్టార్లు పైబడిన చెరువులు దళారీల చేతుల్లో ఉండడం వల్ల లీజు సొసైటీల్లో సభ్యులు ఏటా రూ.300 నుంచి రూ.10 వేలకు మించి ఆదాయాన్ని పొందడం లేదని కన్నబాబు తెలిపారు. 90 శాతం సొసైటీల్లో గరిష్టంగా ఏటా రూ.2500 మించి పొందలేకపోతున్నారని చెప్పారు. రాష్ట్రవ్యాప్తంగా వంద హెక్టార్ల విస్తీర్ణం పైబడినవి 582 చెరువులుండగా 337 చోట్ల మాత్రమే మత్స్యకార సçహకార సంఘాలకు లీజుకు ఇస్తున్నామన్నారు. జీవోపై సందేహాలుంటే నివృత్తి చేసేందుకు తమ శాఖ సిద్ధంగా ఉందన్నారు. వ్యాపారం చేయడం లేదు మత్స్య ఉత్పత్తుల స్థానిక వినియోగం పెంచడం, ఫిష్ ఆంధ్ర పేరిట నాణ్యమైన మత్స్య ఉత్పత్తులను ప్రజలకు అందుబాటులోకి తెచ్చే లక్ష్యంతో హబ్ అండ్ స్పోక్ మోడల్ ద్వారా దేశీయ మార్కెటింగ్ విధానాన్ని రాష్ట్ర ప్రభుత్వం ప్రోత్సహిస్తోందని కమిషనర్ కన్నబాబు చెప్పారు. 70 ఆక్వా హబ్‌లు, 14 వేలకు పైగా రిటైల్ అవుట్‌లెట్స్‌ను ఏర్పాటు చేస్తున్నామన్నారు. ఈ విషయంలో ప్రభుత్వం ఫెసిలిటర్గా వ్యవహరిస్తుందే కానీ వ్యాపారం చేయడం లేదన్నారు. సమావేశంలో సమాచార, పౌరసంబంధాల శాఖ కమిషనర్ విజయకుమార్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు. డీజిల్ సబ్సిడీ, పరిహారం, భరోసా గతంలో డీజిల్ సబ్సిడీ రూ.6.03 మాత్రమే ఇవ్వగా ఇప్పుడు రూ.9కి రాష్ట్ర ప్రభుత్వం పెంచిందని కన్నబాబు తెలిపారు. టీడీపీ హయాంలో ఐదేళ్లలో డీజిల్ సబ్సిడీ కింద రూ.59.42 కోట్లు ఇవ్వగా ఇప్పుడు 33 నెలల్లోనే ప్రభుత్వం రూ.89.17 కోట్లు చెల్లించింది. ప్రమాదవశాత్తూ మరణిస్తే పరిహారాన్ని రూ.ఐదు లక్షల నుంచి రూ.10 లక్షలకు ప్రభుత్వం పెంచింది. ఇప్పటివరకు 64 కుటుంబాలకు రూ.64.10 కోట్లు పరిహారంగా చెల్లించింది. వేట నిషేధ సమయంలో నాడు ఐదేళ్లలో రూ.104.67 కోట్లు ఇవ్వగా ఇప్పుడు వైఎస్సార్ మత్స్యకార భరోసా కింద మూడేళ్లలో రూ.309.33 కోట్లు చెల్లించింది. -
ఏపీలో టీచర్ల బదిలీలకు ఉత్తర్వులు జారీ
సాక్షి, అమరావతి: ఉపాధ్యాయ బదిలీలకు సంబంధించి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సోమవారం ఉత్తర్వులు జారీ చేసింది. ఆన్లైన్ ద్వారా టీచర్ల బదిలీలు చేయాలని పాఠశాల విద్యాశాఖ అధికారులకు ఆదేశాలిచ్చింది. వెబ్‌కౌన్సిల్ ఆప్షన్ల ఆధారంగా బదిలీల ప్రక్రియ జరుగనుంది. టీచర్ల బదిలీల ఉత్తర్వుల పట్ల పట్ల ఉపాధ్యాయ సంఘాలు హర్షం వ్యక్తం చేస్తున్నాయి. కాగా, ప్రభుత్వ యాజమాన్యంలోని పాఠశాలల ఉపాధ్యాయులు గత మూడేళ్లుగా బదిలీల కోసం నిరీక్షిస్తున్నారు. (చదవండి: మా నాన్న మృతిపై రాజకీయాలు చేస్తావా?) -
సిరిసిల్ల: ‘మూడు వెంచర్లు.. ఆరు ప్లాట్లు’గా రియల్ దందా..!
వ్యవసాయ భూములను కొందరు లేఅవుట్లుగా మార్చుతున్నారు.. అధికారుల నుంచి అనుమతి తీసుకోకుండానే విక్రయిస్తున్నారు.. ఒకటికాదు.. రెండుకాదు.. నెలలో ఏకంగా నాలుగు సార్లు ఒకేప్లాటు విక్రయిస్తూ రూ.కోట్లు గడిస్తున్నారు. సర్కారు ఆదాయానికి గండికొడుతున్నారు.. అయినా వీరి ఆగడాలను అరికట్టేందుకు ఎలాంటి చర్యలు తీసుకోవడంలేదు. ఎల్లారెడ్డిపేటతోపాటు సమీప గ్రామాల్లో జోరుగా సాగుతున్న రియల్ ఎస్టేట్ దందాపై ప్రత్యేక కథనం.. సాక్షి, ఎల్లారెడ్డిపేట(సిరిసిల్ల): అక్రమ లే అవుట్లతో అమ్మిన భూముల్లో స్థానిక గ్రామపంచాయతీ సిబ్బంది హద్దురాళ్లు తొలగిస్తున్నారు. అయినా, రియల్ వ్యాపారులు తమ దందా యథేచ్ఛగా కొనసాగిస్తున్నారు. తక్కువ ధరలకు వ్యవసాయ భూములను కొనుగోలు చేసిన రియల్టర్లు.. వాటిని ప్లాట్లుగా మార్చి క్రయవిక్రయాలు సాగిస్తున్నారు. ఎల్లారెడ్డిపేట మేజర్ గ్రామపంచాయతీ, రాచర్ల బొప్పాపూర్, రాచర్ల గొల్లపల్లి, కిష్టంపల్లి పరిధిలో ఈదందా ‘మూడు వెంచర్లు.. ఆరు ప్లాట్లు’గా సాగుతోంది. అనుమతులు లేకుండానే లే అవుట్లు గ్రామపంచాయతీ నుంచి అనుమతి పొందకుండానే కొందరు వ్యవసాయ భూములను ప్లాట్లుగా ఏర్పాటు చేసి అమ్మకాలు చేస్తున్నారు. తక్కువ ధరకు ఎకరాల కొద్దిభూములను కొనుగోలు చేసి వాటిని ప్లాట్లుగా విభజించి అమ్మడంతో రూ.లక్షలు రియల్ ఎస్టేట్ వ్యాపారుల జేబుల్లోకి వెళ్తున్నాయి. అమాయకులను నమ్మిస్తూ లేఅవుట్లు లేకుండానే వారికి ప్లాట్లను అంటగడుతున్నారు. అనుమతులు లేవని గ్రామపంచాయతీ సిబ్బంది దాడులు చేస్తుండడంతో ప్లాట్లు కొనుగోలు చేసిన వారు ఆందోళనకు గురవుతున్నారు. రియల్ ఎస్టేట్ వ్యాపారులపై అధికారులు పూర్తిస్థాయిలో చర్యలు తీసుకోవడంలో నిర్లక్ష్యం చేయడంతోనే అక్రమ లేఅవుట్లతో రూ.కోట్లు ఆర్జిస్తున్నారనే ఆరోపణలు ఉన్నాయి. గ్రామపంచాయతీ ఆదాయానికి గండి గ్రామపంచాయతీ నుంచి లేఅవుట్లు పొందడానికి రూ.వేలల్లో రుసుం చెల్లించాల్సి ఉంది. కానీ, రియల్ వ్యాపారులు రుసుం చెల్లించకుండానే తమ ఇష్టానుసారంగా లేఅవుట్లను తయారుచేసి ప్లాట్లను విక్రయిస్తున్నారు. దీంతో గ్రామపంచాయతీకి రావాల్సిన ఆదాయం రావడం లేదు. ఫలితంగా గ్రామపంచాయతీల నిర్వాహణ భారంగా మారుతోంది. ఒకవ్యక్తి ప్లాట్లను తీసుకున్న వారం రోజుల్లోనే మరోవ్యక్తికి రూ.లక్షల్లో ధర ఎక్కువచేసి ఇంకొకరికి అమ్ముతున్నారు. ఇలా నెలరోజుల్లో ఒక్కో భూమి నలుగురి చేతులు మారుతున్నాయి. ఫోర్లేన్తో రూ.కోట్లకు చేరిన ప్లాట్ల ధరలు ఎల్లారెడ్డిపేట– డాక్టర్ కేవీఆర్ పాఠశాల నుంచి రాచర్ల గొల్లపల్లి – పెట్రోల్ బంకు వరకు ఫోర్‌లేన్ రోడ్డు నిర్మిస్తున్నారు. దీం తో ఈరోడ్డువెంట ఉన్న భూముల ధరలకు రెక్కలొచ్చాయి. మొన్నటివరకు రూ.లక్షల్లో ధర పలుకగా రోడ్డు నిర్మాణంతో అ మాంతం ఆ ధరలు రూ.కోట్లకు చేరాయి. రోడ్డు నిర్మాణం జ రుగుతున్న మూడున్నర కిలోమీటర్ల దూరం వరకు రో డ్డుకిరువైపులా ఉన్న ప్లాట్ల కొనుగోలుకు చేయడానికి రియల్టర్లు పోటీ పడుతున్నారు. రాత్రి చూసిన ప్లాట్లు తెల్లవారేసరికి అ మ్ముడు పోతున్నాయి. ఒకరకంగా ఫోర్‌లేన్ రోడ్డు నిర్మాణం రి యల్టర్లకు కలిసి వచ్చిందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ప్లాటు ఏర్పాటుకు నిబంధనలు ఇవీ.. వ్యవసాయేతర భూమిగా మార్చడానికి జిల్లా టౌన్ ప్లానింగ్ అధికారికి దరఖాస్తు చేయాలి. దీంతోపాటు ఆర్డీవో ప్రొసీడింగ్ ముఖ్యం. 67 జీవో ప్రకారం..వ్యవసాయేతర భూమిగా మార్చుకోవడానికి వారు ఇచ్చే అనుమతి కాపీని గ్రామపంచాయతీకి అప్పగించాలి. గ్రామపంచాయతీ పరిశీలిస్తుంది. నిబంధనల ప్రకారం ప్లాట్ల మధ్య 30 అడుగుల రోడ్డు కోసం స్థలం వదిలిపెట్టాలి. గ్రామపంచాయతీ అనుమతి కోసం కనీస రుసుం చెల్లించాలి. ప్లాటు మధ్య 12 అడుగులకు మించి స్థలం లేకుండానే వ్యాపారులు విక్రయిస్తున్నారు. దీంతో నిబంధనల మేరకు వ్యవసాయేతర భూమిగా మార్చుకోకుండా, కనీసం ముప్ఫయి అడుగుల మధ్య రోడ్లు లేనందున జీవో 67ను అనుసరించి అనుమతిలేని లేఅవుట్ల హద్దురాళ్లను అధికారులు తొలగించారు. ఎల్లారెడ్డిపేట నుంచి రాచర్లగొల్లపల్లి వరకు చేపట్టిన అనుమతిలేని సుమారు 300 ప్లాట్ల హద్దురాళ్లను గ్రామపంచాయతీ అధికారులు గత మే, జూన్‌లో తొలగించారు. పంచాయతీలకు ఆదాయం.. రియల్ ఎస్టేట్ వ్యాపారం ద్వారా ఎల్లారెడ్డిపేట గ్రామపంచాయతీకి ఏడాదికి రూ.9.80 లక్షలు, రాచర్లగొల్లపల్లికి రూ.4.85 లక్షల ఆదాయం సమకూరింది. దీంతోపాటు ప్లాట్ల రిజిస్ట్రేషన్ ద్వారా ప్లాటు ధరలో 4శాతం వరకు స్టాంప్ డ్యూటీ పేరిట ఏడాదికి రూ.10 లక్షల – రూ.12 లక్షల వరకు ఆదాయం వస్తోంది. ఈ నిబంధనల మేరకు ఈ ఆదాయం చాలా తక్కువ. అనుమతులు లేని ప్లాట్లు కొనుగోలు చేయవద్దు గ్రామపంచాయతీ పరిధిలో అనుమతులు లేని ప్లాట్లను ప్రజలు కొనుగోలు చేయవద్దు. అక్రమ లేఅవుట్లపై చర్యలు తీసుకుంటున్నాం. కొనుగోలు చేసిన భూములకు సంబంధించి నోటీసులు జారీచేశాం. వ్యాపారులు చదును చేసిన భూములలో ఫ్లెక్సీలు ఏర్పాటు చేసి లేఅవుట్లపై ప్రజలకు అవగాహన కల్పిస్తున్నాం. వ్యవసాయ భూముల్లో ప్లాట్లను ఏర్పాటు చేసి అమ్ముకోవడం వ్యాపారులు మానుకోవాలి. -బాబు, ఇన్చార్జి ఈవో, ఎల్లారెడ్డిపేట -
కదం తొక్కిన నిరుద్యోగులు
సాక్షి, డాబాగార్డెన్స్(విశాఖ దక్షిణ) : పంచాయతీ సెక్రటరీ పోస్టుల కోసం విడుదల చేసిన జీవో 39 రద్దు చేయాలని, గ్రూపు – 2 ఎగ్జిక్యూటివ్ ఉద్యోగాల భర్తీ కోసం రాష్ట్ర ప్రభుత్వం కొత్తగా గ్రూపు – 1తో కలిపి డిస్క్రిప్టు విధానంలో పరీక్ష నిర్వహించేందుకు విడుదల చేసిన జీవో 622, 623ని వెంటనే రద్దు చేయాలని కోరుతూ నిరుద్యోగులు మంగళవారం విశాఖ నగర రోడ్లపై కదం తొక్కారు. పెద్ద ఎత్తున నిరసన ప్రదర్శన చేపట్టారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ... సీఎం డౌన్ డౌనంటూ నినదించారు. వందలాది మంది నిరుద్యోగులు నిరసన ప్రదర్శనలో పాల్గొన్నారు. అనంతరం ఏపీ నిరుద్యోగ జేఏసీ రాష్ట్ర అధ్యక్షుడు సమయం హేమంత్‌కుమార్ డాబాగార్డెన్స్ అంబేడ్కర్ విగ్రహం వద్ద నిరసన దీక్ష చేపట్టారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ 2014లో రాష్ట్ర విభజన జరిగన తర్వాత విడిపోయిన ఆంధ్ర రాష్ట్రంలో ఉద్యోగాల విభజన కూడా జరిగిందన్నారు. ఖాళీలున్న ఉద్యోగాల సర్వేకు కమల్‌నాథన్ కమిటీని నియమించారన్నారు. ఆ కమిటీ చేసిన సర్వేలో రాష్ట్రంలో సుమారు 1,42,000 ప్రభుత్వ ఉద్యోగాలు ఖాళీగా ఉన్నాయని సూచించారని చెప్పారు. కానీ ప్రభుత్వం మాత్రం 20వేలు ఖాళీలే ఉన్నాయని ప్రకటించి 2016 – 17 ఏడాదిలో 4వేల పోస్టులకు మాత్రమే ప్రకటన జారీ చేసిందని, అన్ని శాఖలు కలుపుకుని ఇప్పటికి 10వేల ఉద్యోగాలు కూడా భర్తీ చేయలేదని ఆరోపించారు. 42 నోటిఫికేషన్లతో ఇయర్ క్యాలెండర్‌ని కూడా ప్రకటించి ఇప్పటికి ఒక్క నోటిఫికేషన్ కూడా జారీ చేయలేదని మండిపడ్డారు. కాంట్రాక్టు పద్ధతితో ఉద్యోగ భద్రతకు ప్రమాదం పంచాయతీ కార్యదర్శులుగా ఏడాది కాలపరిమితితో కాంట్రాక్టు పద్ధతిలో 1511మందిని నియమించడానికి జీవో 39ని ప్రభుత్వం జారీ చేసిందని, ఈ కాంట్రాక్టు ఉద్యోగుల వేతనాలు నెలకు రూ.15వేలు చెల్లిస్తారని ప్రకటించారని పేర్కొన్నారు. అసలు ఈ ఉద్యోగాలకు కాంట్రాక్టు విధానాన్ని ఎందుకు ఎంచుకుంటున్నారో తెలపాలని డిమాండ్ చేశారు. దీనివల్ల ఉద్యోగ భద్రత కొరవడుతుందని ఆందోళన వ్యక్తం చేశారు. పంచాయతీ కార్యదర్శుల పోస్టులను ప్రభుత్వ ఉద్యోగాలుగా భర్తీ చేయాలని డిమాండ్ చేశారు. పంచాయతీ శాఖ మంత్రిగా లోకేష్‌ను నియమించిన తర్వాతే జీవో 39 విడుదల చేశారని గుర్తు చేశారు. అలాగే గ్రూప్ – 2 ఎగ్జిక్యూటీవ్ ఉద్యోగాల భర్తీని రాష్ట్ర ప్రభుత్వం కొత్తగా గ్రూపు – 1తో కలిపి డిస్క్రిప్టు విధానంగా పరీక్షను నిర్వహిస్తామని జీవో 622, 623 విడుదల చేసిందన్నారు. ఇప్పటి వరకు అబ్జెక్ట్ విధానాన్ని అనుసరిస్తూ పరీక్షకు సిద్ధమవుతుంటే కొత్తగా డిస్క్రిప్టుగా పెడతామని ప్రభుత్వం ప్రకటించడం దారుణమన్నారు. జీవో 39, జీవో 622, 623 వల్ల లాభం కంటే యువతకు జరిగే నష్టమే ఎక్కువని ఆందోళన వ్యక్తం చేశారు. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి తక్షణమే ఈ జీవోలన్నింటినీ రద్దు చేయాలని డిమాండ్ చేశారు. అదేవిధంగా గ్రూప్–1 సిలబస్‌ను మార్చి సివిల్ సర్వీస్ సిలబస్ పెడతానన్న ప్రభుత్వ నిర్ణయం మార్చుకోవాలని, తెలంగాణ తరహాలో వయోపరిమితి 44 ఏళ్లకు పెంచాలని, కానిస్టేబుల్ ఉద్యోగ వయో పరిమితి రెండేళ్లు పెంచాలని, తెలంగాణ రిజర్వేషన్లతో సమానంగా ఏపీలో కూడా నాన్‌లోకల్ రిజర్వేషన్ చేయాలని, వీఆర్వో, వీఆర్ఏ పోస్టులు తక్షణమే భర్తీ చేయాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వం స్పందించకపోతే విద్యార్థి/నిరుద్యోగ లోకం ప్రభుత్వంపై తిరుగుబాటు చేస్తుందని హెచ్చరించారు. నిరసనకు సెంచూరియన్ విశ్వ విద్యాలయం వీసీ ఆచార్య జీఎస్ఎన్ రాజు, సీపీఎం జిల్లా కార్యదర్శి కె.లోకనాథం, డీవైఎఫ్ఐ, వైఎస్సార్సీపీ విద్యార్థి విభాగం, ఉత్తరాం«ధ్ర విద్యార్థి సేన సంఘీభావం తెలిపారు. నిరసన కార్యక్రమంలో విజయనగరం జిల్లా జేఏసీ కో ఆర్డినేటర్, రాష్ట్ర కో ఆర్డినేటర్ షేక్ మహబూబ్ బాషా, విశాఖ జిల్లా కో ఆర్డినేటర్ జగన్ విద్యార్థులు పాల్గొన్నారు. -
ప్రభుత్వ ఉత్తర్వులు అమలు చేయండి
బాలాజీచెరువు : ఔట్సోర్సింగ్ ఏజన్సీల నుంచి ప్రభుత్వ విభాగాలు మూడేళ్లకు మించి పొరుగుసేవలను పొందరాదన్న జీఓ 151ను జిల్లా యంత్రాంగం అమలు చేయాలని ఔట్సోర్సింగ్ ఏజన్సీల సంఘం అధ్యక్షుడు ఎం.నారాయణ పేర్కొన్నారు. శనివారం సాయంత్రం స్థానిక జిల్లా ఉపాధి కార్యాలయ ఆవరణలో జరిగిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ హైకోర్టు గతంలో జారీ చేసిన ఉత్తర్వులు, జీఓ ప్రకారం జిల్లాలో వికాస సంస్థకు పొరుగు సేవలను అందించే అధికారం లేదన్నారు. 2013లో హైకోర్టు ఇచ్చిన ఉత్తర్వుల ప్రకారం పొరుగు సేవల ప్రక్రియ ఎంపిక కాబడిన ఔట్సోర్సింగ్ ఏజన్సీల ద్వారా ఓపెన్ టెండర్ సిస్టమ్ ద్వారా జరిగి ఉండాలన్నారు. ఈ ప్రక్రియ జిల్లా కమిటీ ఆధ్వర్యంలో జరగాలన్నారు. 2010 తరువాత వికాస స్వచ్ఛంద సంస్థ ఆధ్వర్యంలో జిల్లా ఉపాధి కార్యాలయం గుర్తింపు లేకుండా సాగించిన పొరుగుసేవల కార్యకలాపాలు కోర్టు ధిక్కారమన్నారు. ఈ మేరకు ఎస్ఎస్ఏ పీవోకు వినతి పత్రం సమర్పించినట్టు ఆయన పేర్కొన్నారు. అసోసియేషన్ సభ్యులు వెంకట్, కమలాకర్, కిషోర్‌నాయుడు తదితరులు పాల్గొన్నారు. ధృవపత్రాలు పరిశీలన జిల్లాలో పొరుగు సేవలను నిర్వహించేందుకు ఔట్సోర్సింగ్ ఏజన్సీల ఎంపేనల్మెంట్కు సంబంధించి ధృవపత్రాలను జిల్లా ఉపాధి అధికారిణి శాంతి ఆధ్వర్యంలో శనివారం పరిశీలించారు. ఈ ఎంపానల్కు సంబంధించి 23 ఔట్సోర్సింగ్ ఏజన్సీలు నమోదయ్యాయి. ధృవపత్రాలు పరిశీలనలో జిల్లా లేబర్ ఆఫీసర్ ప్రకాశరావు, ట్రెజరీ అధికారి తదితరులు పాల్గొన్నారు. -
‘ప్రథమ పౌరుల’కు పరాభవమే!
సర్పంచులకు జాతీయ పతాక ఆవిష్కరణ గౌరవం దూరం సర్కారు నిర్ణయంపై పార్టీలకు అతీతంగా సర్పంచుల ఆవేదన భవిష్యత్తులో ఆందోళనకు సన్నద్ధం సాక్షి ప్రతినిధి, కాకినాడ : స్థానిక సంస్థల్లో కీలకమైంది గ్రామ పంచాయతీ. గ్రామస్థాయిలో సర్పంచులు, మండల, జిల్లా పరిషత్ ప్రాదేశిక నియోజకవర్గ సభ్యులు కూడా ఉంటారు. రాజ్యాంగంలో పంచాయతీలకు పెద్ద పీట వేశారు. రాజకీయాల్లో ఉన్నత స్థాయికి చేరుకున్న ఎందరో ఒకప్పుడు పంచాయతీ సర్పంచ్‌లుగా పనిచేసిన వారే. పంచాయతీ సర్పంచ్‌నే గ్రామానికి ప్రథమ పౌరుడిగా రాజ్యాంగం పేర్కొంది. ఇదే సంప్రదాయం ఎప్పటి నుంచో కొనసాగుతోంది. గ్రామంలో ప్రథమ పౌరుడికి గౌరవం ఇవ్వాలనే సంకల్పంతో స్వాతంత్య్ర దినోత్సవం జరిగే పాఠశాలల్లో జాతీయ జెండా ఎగురవేసే అవకాశాన్ని సర్పంచ్‌లకు కల్పించారు. ఆ రోజు పాఠశాలల్లో జెండా వందనం చేయడాన్ని సర్పంచులు ఎంతో గౌరవంగా భావిస్తూ వస్తున్నారు. అటువంటి అవకాశాన్ని తమ నుంచి చంద్రబాబు ప్రభుత్వం ఓ జీఓతో ఊడబీకిందని సర్పంచులు మండిపడుతున్నారు. జెండా వందనంచేసే అవకాశాన్ని తమ నుంచి ఎంపీటీసీలకు కల్పించడం ద్వారా తమను తీవ్రంగా అవమానించిందని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికే జన్మభూమి కమిటీల పెత్తనం విభజన అనంతరం కూడా రాష్ట్రంలోనే అతి పెద్ద జిల్లా తూర్పుగోదావరి. అటువంటి జిల్లాలో అత్యధికంగా 1069 పంచాయతీలున్నాయి. వీటిని పరిపాలనా సౌలభ్యం కోసం 774 క్లస్టర్లుగా విభజించారు. ఇన్ని పంచాయతీల పరిధిలోని పాఠశాలల్లో జెండా వందనం చేసే అవకాశాన్ని తొలిసారి కోల్పోతున్నామనే బాధ సర్పంచులందరిలో కనిపిస్తోంది. అన్నింటా అగ్రగామి పంచాయతీ సర్పంచులేనని పైకి చెబుతున్న పాలకులు తీరా ఆచరణకొచ్చేసరికి స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా అవమానాలకు గురిచేయడం తగునా అని విజ్ఞులు ప్రశ్నిస్తున్నారు. ఇప్పటికే తెలుగుతమ్ముళ్లతో జన్మభూమి కమిటీలను ఏర్పాటుచేసి గ్రామాల్లో పరోక్ష పాలనను వారితో సాగిస్తోంది. గ్రామంలో ఒక సంక్షేమ పథకం మంజూరవ్వాలన్నా, నిధులు విడుదలవ్వాలన్నా జన్మభూమి కమిటీలకే సర్వాధికారాలు అప్పగించేసిందని ఇప్పటికే సర్పంచ్ల నుంచి పెద్ద ఎత్తున విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఇప్పుడు తాజాగా స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా పాఠశాలల్లో జరిగే జెండా వందనానికి కూడా తమను నోచుకోకుండా విద్యాశాఖ కమిషనర్ జిల్లా విద్యాశాఖకు మెమో జారీచేయడాన్ని పలువురు గర్హిస్తున్నారు. జాతీయ పతాకావిష్కరణ గౌరవాన్ని సర్పంచులకు కాక ఎంపీటీసీలకు, జడ్పీటీసీలకు అవకాశం కల్పించడంలో ఆంతర్యమేమిటో అర్థం కావడం లేదని సర్పంచులు చంద్రబాబు తీరును ఎండగడుతున్నారు. దీనిపై భవిష్యత్తులో ఆందోళనకు పార్టీరహితంగా సర్పంచ్‌లు సంసిద్ధులవుతున్నారు. త్వరలో వీరంతా సమావేశమయ్యేందుకు సమాలోచనలు జరుపుతున్నారు. ‘బాబు’ జీవో సర్పంచులను అవమానించడమే స్వాతంత్య్ర దినోత్సవం రోజున పాఠశాలల్లో జెండా ఎగరవేయకుండా చంద్రబాబు సర్కారు జీఓ జారీ చేయడం సర్పంచులను అవమానపర్చడమే. టీడీపీ ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయం చాలా దారుణం. – పెంకే కృష్ణవేణి, సర్పంచ్, కందుల పాలెం,రామచంద్రపురం నియోజకవర్గం -
జీవవైవిద్య మండలికి నిపుణుల కమిటీ
హైదరాబాద్ సిటీ: జీవ వైవిద్య మండలికి నిపుణుల కమిటీలను ఏర్పాటుచేస్తూ రాష్ట్ర ప్రభుత్వం శనివారం ఉత్తర్వులను జారీ చేసింది. జీవి వైవిధ్య మండలి పరిరక్షణకు 8 నిపుణుల కమిటీలను ఏర్పాటుచేస్తూ ఉత్తర్వులను రాష్ట్రప్రభుత్వం వెల్లడించింది. వన్యమృగ సంరక్షణకు, జంతు, చేపల, ఆగ్రో, సంస్కృతి, ఆస్తుల పరిరక్షణ, వైద్య సంబంధ మొక్కల పరిరక్షణ, చైతన్య పరిచే కమిటీలను ఏర్పాటుచేసింది. ఈ కమిటీల్లో వివిధ ప్రభుత్వ విభాగాలకు చెందిన ప్రతినిధులు సభ్యులుగా ఉంటారని ఆ ఉత్తర్వుల్లో పేర్కొన్నది.