వ్యవసాయ భూములను కొందరు లేఅవుట్లుగా మార్చుతున్నారు.. అధికారుల నుంచి అనుమతి తీసుకోకుండానే విక్రయిస్తున్నారు.. ఒకటికాదు.. రెండుకాదు.. నెలలో ఏకంగా నాలుగు సార్లు ఒకేప్లాటు విక్రయిస్తూ రూ.కోట్లు గడిస్తున్నారు. సర్కారు ఆదాయానికి గండికొడుతున్నారు.. అయినా వీరి ఆగడాలను అరికట్టేందుకు ఎలాంటి చర్యలు తీసుకోవడంలేదు. ఎల్లారెడ్డిపేటతోపాటు సమీప గ్రామాల్లో జోరుగా సాగుతున్న రియల్ ఎస్టేట్ దందాపై ప్రత్యేక కథనం..
సాక్షి, ఎల్లారెడ్డిపేట(సిరిసిల్ల): అక్రమ లే అవుట్లతో అమ్మిన భూముల్లో స్థానిక గ్రామపంచాయతీ సిబ్బంది హద్దురాళ్లు తొలగిస్తున్నారు. అయినా, రియల్ వ్యాపారులు తమ దందా యథేచ్ఛగా కొనసాగిస్తున్నారు. తక్కువ ధరలకు వ్యవసాయ భూములను కొనుగోలు చేసిన రియల్టర్లు.. వాటిని ప్లాట్లుగా మార్చి క్రయవిక్రయాలు సాగిస్తున్నారు. ఎల్లారెడ్డిపేట మేజర్ గ్రామపంచాయతీ, రాచర్ల బొప్పాపూర్, రాచర్ల గొల్లపల్లి, కిష్టంపల్లి పరిధిలో ఈదందా ‘మూడు వెంచర్లు.. ఆరు ప్లాట్లు’గా సాగుతోంది.
అనుమతులు లేకుండానే లే అవుట్లు
గ్రామపంచాయతీ నుంచి అనుమతి పొందకుండానే కొందరు వ్యవసాయ భూములను ప్లాట్లుగా ఏర్పాటు చేసి అమ్మకాలు చేస్తున్నారు. తక్కువ ధరకు ఎకరాల కొద్దిభూములను కొనుగోలు చేసి వాటిని ప్లాట్లుగా విభజించి అమ్మడంతో రూ.లక్షలు రియల్ ఎస్టేట్ వ్యాపారుల జేబుల్లోకి వెళ్తున్నాయి. అమాయకులను నమ్మిస్తూ లేఅవుట్లు లేకుండానే వారికి ప్లాట్లను అంటగడుతున్నారు. అనుమతులు లేవని గ్రామపంచాయతీ సిబ్బంది దాడులు చేస్తుండడంతో ప్లాట్లు కొనుగోలు చేసిన వారు ఆందోళనకు గురవుతున్నారు. రియల్ ఎస్టేట్ వ్యాపారులపై అధికారులు పూర్తిస్థాయిలో చర్యలు తీసుకోవడంలో నిర్లక్ష్యం చేయడంతోనే అక్రమ లేఅవుట్లతో రూ.కోట్లు ఆర్జిస్తున్నారనే ఆరోపణలు ఉన్నాయి.
గ్రామపంచాయతీ ఆదాయానికి గండి
గ్రామపంచాయతీ నుంచి లేఅవుట్లు పొందడానికి రూ.వేలల్లో రుసుం చెల్లించాల్సి ఉంది. కానీ, రియల్ వ్యాపారులు రుసుం చెల్లించకుండానే తమ ఇష్టానుసారంగా లేఅవుట్లను తయారుచేసి ప్లాట్లను విక్రయిస్తున్నారు. దీంతో గ్రామపంచాయతీకి రావాల్సిన ఆదాయం రావడం లేదు. ఫలితంగా గ్రామపంచాయతీల నిర్వాహణ భారంగా మారుతోంది. ఒకవ్యక్తి ప్లాట్లను తీసుకున్న వారం రోజుల్లోనే మరోవ్యక్తికి రూ.లక్షల్లో ధర ఎక్కువచేసి ఇంకొకరికి అమ్ముతున్నారు. ఇలా నెలరోజుల్లో ఒక్కో భూమి నలుగురి చేతులు మారుతున్నాయి.
ఫోర్‌లేన్‌తో రూ.కోట్లకు చేరిన ప్లాట్ల ధరలు
ఎల్లారెడ్డిపేట– డాక్టర్ కేవీఆర్ పాఠశాల నుంచి రాచర్ల గొల్లపల్లి – పెట్రోల్ బంకు వరకు ఫోర్‌లేన్ రోడ్డు నిర్మిస్తున్నారు. దీం తో ఈరోడ్డువెంట ఉన్న భూముల ధరలకు రెక్కలొచ్చాయి. మొన్నటివరకు రూ.లక్షల్లో ధర పలుకగా రోడ్డు నిర్మాణంతో అ మాంతం ఆ ధరలు రూ.కోట్లకు చేరాయి. రోడ్డు నిర్మాణం జ రుగుతున్న మూడున్నర కిలోమీటర్ల దూరం వరకు రో డ్డుకిరువైపులా ఉన్న ప్లాట్ల కొనుగోలుకు చేయడానికి రియల్టర్లు పోటీ పడుతున్నారు. రాత్రి చూసిన ప్లాట్లు తెల్లవారేసరికి అ మ్ముడు పోతున్నాయి. ఒకరకంగా ఫోర్‌లేన్ రోడ్డు నిర్మాణం రి యల్టర్లకు కలిసి వచ్చిందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.
ప్లాటు ఏర్పాటుకు నిబంధనలు ఇవీ..
వ్యవసాయేతర భూమిగా మార్చడానికి జిల్లా టౌన్ ప్లానింగ్ అధికారికి దరఖాస్తు చేయాలి. దీంతోపాటు ఆర్డీవో ప్రొసీడింగ్ ముఖ్యం. 67 జీవో ప్రకారం..వ్యవసాయేతర భూమిగా మార్చుకోవడానికి వారు ఇచ్చే అనుమతి కాపీని గ్రామపంచాయతీకి అప్పగించాలి. గ్రామపంచాయతీ పరిశీలిస్తుంది. నిబంధనల ప్రకారం ప్లాట్ల మధ్య 30 అడుగుల రోడ్డు కోసం స్థలం వదిలిపెట్టాలి. గ్రామపంచాయతీ అనుమతి కోసం కనీస రుసుం చెల్లించాలి. ప్లాటు మధ్య 12 అడుగులకు మించి స్థలం లేకుండానే వ్యాపారులు విక్రయిస్తున్నారు. దీంతో నిబంధనల మేరకు వ్యవసాయేతర భూమిగా మార్చుకోకుండా, కనీసం ముప్ఫయి అడుగుల మధ్య రోడ్లు లేనందున జీవో 67ను అనుసరించి అనుమతిలేని లేఅవుట్ల హద్దురాళ్లను అధికారులు తొలగించారు. ఎల్లారెడ్డిపేట నుంచి రాచర్లగొల్లపల్లి వరకు చేపట్టిన అనుమతిలేని సుమారు 300 ప్లాట్ల హద్దురాళ్లను గ్రామపంచాయతీ అధికారులు గత మే, జూన్‌లో తొలగించారు.
పంచాయతీలకు ఆదాయం..
రియల్ ఎస్టేట్ వ్యాపారం ద్వారా ఎల్లారెడ్డిపేట గ్రామపంచాయతీకి ఏడాదికి రూ.9.80 లక్షలు, రాచర్లగొల్లపల్లికి రూ.4.85 లక్షల ఆదాయం సమకూరింది. దీంతోపాటు ప్లాట్ల రిజిస్ట్రేషన్ ద్వారా ప్లాటు ధరలో 4శాతం వరకు స్టాంప్ డ్యూటీ పేరిట ఏడాదికి రూ.10 లక్షల – రూ.12 లక్షల వరకు ఆదాయం వస్తోంది. ఈ నిబంధనల మేరకు ఈ ఆదాయం చాలా తక్కువ.
అనుమతులు లేని ప్లాట్లు కొనుగోలు చేయవద్దు
గ్రామపంచాయతీ పరిధిలో అనుమతులు లేని ప్లాట్లను ప్రజలు కొనుగోలు చేయవద్దు. అక్రమ లేఅవుట్లపై చర్యలు తీసుకుంటున్నాం. కొనుగోలు చేసిన భూములకు సంబంధించి నోటీసులు జారీచేశాం. వ్యాపారులు చదును చేసిన భూములలో ఫ్లెక్సీలు ఏర్పాటు చేసి లేఅవుట్లపై ప్రజలకు అవగాహన కల్పిస్తున్నాం. వ్యవసాయ భూముల్లో ప్లాట్లను ఏర్పాటు చేసి అమ్ముకోవడం వ్యాపారులు మానుకోవాలి.
-బాబు, ఇన్‌చార్జి ఈవో, ఎల్లారెడ్డిపేట
Comments
Please login to add a commentAdd a comment