సాక్షి, అమరావతి: మత్స్యకార సహకార సంఘాల అభ్యున్నతి కోసం జారీ చేసిన జీవో 217 విషయంలో మత్స్యకారులు ఎలాంటి ఆందోళన చెందాల్సిన పనిలేదని మత్స్యశాఖ కమిషనర్ కె.కన్నబాబు స్పష్టం చేశారు. వాస్తవానికి దీనివల్ల వారికి మేలు జరుగుతుందన్నారు. మంగళవారం సచివాలయంలో ఆయన మీడియాతో మాట్లాడారు. మత్స్యకార సొసైటీల్లో ప్రతి మత్స్యకారుడు కనీసం రూ.15 వేలకు తక్కువ కాకుండా ఆదాయం పొందేలా ప్రభుత్వం చర్యలు చేపట్టిందని తెలిపారు.
వంద హెక్టార్లు పైబడిన చెరువులను బహిరంగ వేలం ద్వారా కేటాయించి ఆదాయంలో 30 శాతాన్ని సొసైటీ సభ్యులకు సమానంగా జమ చేయాలని, మరో 20 శాతం మత్స్య కారుల సహకార సంఘాల ఫెడరేషన్(ఆప్కాఫ్) ద్వారా వారి అభ్యున్నతి కోసం ఖర్చు చేయాలని నిర్ణయించామన్నారు. వేలం పాటల్లో మత్స్యకార సహకార సొసైటీలు కూడా పాల్గొనవచ్చన్నారు. సహజంగా అత్యధికంగా సముద్రంపైనే ఆధారపడి జీవించే మత్స్యకారులకు 217 జీవోతో ఎలాంటి నష్టం ఉండదన్నారు. మంచినీటి చెరువులకు సంబంధించిన ఈ జీవో వల్ల వారికి ఇబ్బంది ఉండదన్నారు. వంద హెక్టార్లకు పైబడిన, పైలెట్ ప్రాజెక్టుగా అమలు చేస్తున్న నెల్లూరు జిల్లాలోని 27 చెరువులకు ప్రస్తుతం ఈ జీవోను వర్తింపచేస్తామని, మిగిలిన చోట్ల పాత పద్ధతిలోనే కొనసాగిస్తామని చెప్పారు.
సందేహాల నివృత్తికి సిద్ధం
వంద హెక్టార్లు పైబడిన చెరువులు దళారీల చేతుల్లో ఉండడం వల్ల లీజు సొసైటీల్లో సభ్యులు ఏటా రూ.300 నుంచి రూ.10 వేలకు మించి ఆదాయాన్ని పొందడం లేదని కన్నబాబు తెలిపారు. 90 శాతం సొసైటీల్లో గరిష్టంగా ఏటా రూ.2500 మించి పొందలేకపోతున్నారని చెప్పారు. రాష్ట్రవ్యాప్తంగా వంద హెక్టార్ల విస్తీర్ణం పైబడినవి 582 చెరువులుండగా 337 చోట్ల మాత్రమే మత్స్యకార సçహకార సంఘాలకు లీజుకు ఇస్తున్నామన్నారు. జీవోపై సందేహాలుంటే నివృత్తి చేసేందుకు తమ శాఖ సిద్ధంగా ఉందన్నారు.
వ్యాపారం చేయడం లేదు
మత్స్య ఉత్పత్తుల స్థానిక వినియోగం పెంచడం, ఫిష్ ఆంధ్ర పేరిట నాణ్యమైన మత్స్య ఉత్పత్తులను ప్రజలకు అందుబాటులోకి తెచ్చే లక్ష్యంతో హబ్ అండ్ స్పోక్ మోడల్ ద్వారా దేశీయ మార్కెటింగ్ విధానాన్ని రాష్ట్ర ప్రభుత్వం ప్రోత్సహిస్తోందని కమిషనర్ కన్నబాబు చెప్పారు. 70 ఆక్వా హబ్‌లు, 14 వేలకు పైగా రిటైల్ అవుట్‌లెట్స్‌ను ఏర్పాటు చేస్తున్నామన్నారు. ఈ విషయంలో ప్రభుత్వం ఫెసిలిటర్‌గా వ్యవహరిస్తుందే కానీ వ్యాపారం చేయడం లేదన్నారు. సమావేశంలో సమాచార, పౌరసంబంధాల శాఖ కమిషనర్ విజయకుమార్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
డీజిల్ సబ్సిడీ, పరిహారం, భరోసా
గతంలో డీజిల్ సబ్సిడీ రూ.6.03 మాత్రమే ఇవ్వగా ఇప్పుడు రూ.9కి రాష్ట్ర ప్రభుత్వం పెంచిందని కన్నబాబు తెలిపారు. టీడీపీ హయాంలో ఐదేళ్లలో డీజిల్ సబ్సిడీ కింద రూ.59.42 కోట్లు ఇవ్వగా ఇప్పుడు 33 నెలల్లోనే ప్రభుత్వం రూ.89.17 కోట్లు చెల్లించింది. ప్రమాదవశాత్తూ మరణిస్తే పరిహారాన్ని రూ.ఐదు లక్షల నుంచి రూ.10 లక్షలకు ప్రభుత్వం పెంచింది. ఇప్పటివరకు 64 కుటుంబాలకు రూ.64.10 కోట్లు పరిహారంగా చెల్లించింది. వేట నిషేధ సమయంలో నాడు ఐదేళ్లలో రూ.104.67 కోట్లు ఇవ్వగా ఇప్పుడు వైఎస్సార్ మత్స్యకార భరోసా కింద మూడేళ్లలో రూ.309.33 కోట్లు చెల్లించింది.
Comments
Please login to add a commentAdd a comment