fisher families
-
చేపల వేటకు వెళ్లి పలువురి మృతి!
నిజామాబాద్: బాన్సువాడ మండలంలోని తాడ్కోల్ గ్రామానికి చెందిన బక్కని సాయిలు(35) గురువారం చేపల వేటకు వెళ్లి చెరువులో గల్లంతు అయ్యాడు. రాత్రి ఇంటికి రాకపోవడంతో శుక్రవారం చెరువుగట్టుపై చూడగా చెప్పులు, బట్టలు కనిపించాయి. చెరువులో గాలించగా మృతదేహం లభ్యమైంది. చేపల వల కాళ్లకు చుట్టుకోవడంతో మృతి చెందినట్లు మృతుని భార్య మౌనిక ఫిర్యాదు చేశారు. మృతుడికి కూతురు మనుస్మిత, కుమారుడు గంగాప్రసాద్ ఉన్నారు. టీసీసీసీ సభ్యుడు కాసుల బాలరాజు, బుడిమి సొసైటీ చైర్మన్ గంగుల గంగారాం బాధిత కుటుంబ సభ్యులను ఓదార్చారు. మల్కాపూర్ శివారులో ఒకరు నవీపేట పోలీస్ స్టేషన్ పరిధిలోని మల్కాపూర్ శివారులోని చెరువులో శుక్రవారం చేపలు పట్టేందుకు వెళ్లిన ఒకరు మృతి చెందినట్లు ఎస్సై యాదగిరిగౌడ్ తెలిపారు. నిజామాబాద్ మండలంలోని గుండారం గ్రామానికి చెందిన సిర్నాపల్లి సాయారెడ్డి(52) చెరువు అలుగులో చేపలు పట్టేందుకు వెళ్లి ప్రమాదవశాత్తు నీటిలో మునిగాడని పేర్కొన్నారు. ఈత రాకపోవడంతో మృతి చెందాడని తెలిపారు. మృతుడి భార్య సుమలత ఫిర్యాదు కేసు నమోదు చేశామన్నారు. గల్లంతైన వ్యక్తి మృతదేహం లభ్యం నల్లవాగు మత్తడి వరద నీటిలో గల్లంతైన జంగం కృష్ణ (48) మృత దేహం శుక్రవారం లభ్యమైందని ఎస్సై నాగగోని రాజు తెలిపారు. పిట్లంకు చెందిన జంగం కృష్ణ చేపల వేట కోసం నల్లవాగు మత్తడి దిగువన వాగు ఒడ్డుకు వచ్చాడు. వరద ఉధృతి పెరగడంతో కృష్ణ నీటిలో కొట్టుకుపోయాడు. కృష్ణ కోసం గాలింపు చేపట్టగా గల్లంతైన ప్రదేశం నుంచి కిలోమీటర్ దూరంలో చెట్టు కొమ్మకు తట్టుకొని మృతదేహం లభ్యమైంది. -
మత్స్యకారులను అభివృద్ధి చేసిన ఏకైక మహానేత వైఎస్సార్
-
చెరువుల వేలంపై ఆందోళన అనవసరం
సాక్షి, అమరావతి: మత్స్యకార సహకార సంఘాల అభ్యున్నతి కోసం జారీ చేసిన జీవో 217 విషయంలో మత్స్యకారులు ఎలాంటి ఆందోళన చెందాల్సిన పనిలేదని మత్స్యశాఖ కమిషనర్ కె.కన్నబాబు స్పష్టం చేశారు. వాస్తవానికి దీనివల్ల వారికి మేలు జరుగుతుందన్నారు. మంగళవారం సచివాలయంలో ఆయన మీడియాతో మాట్లాడారు. మత్స్యకార సొసైటీల్లో ప్రతి మత్స్యకారుడు కనీసం రూ.15 వేలకు తక్కువ కాకుండా ఆదాయం పొందేలా ప్రభుత్వం చర్యలు చేపట్టిందని తెలిపారు. వంద హెక్టార్లు పైబడిన చెరువులను బహిరంగ వేలం ద్వారా కేటాయించి ఆదాయంలో 30 శాతాన్ని సొసైటీ సభ్యులకు సమానంగా జమ చేయాలని, మరో 20 శాతం మత్స్య కారుల సహకార సంఘాల ఫెడరేషన్(ఆప్కాఫ్) ద్వారా వారి అభ్యున్నతి కోసం ఖర్చు చేయాలని నిర్ణయించామన్నారు. వేలం పాటల్లో మత్స్యకార సహకార సొసైటీలు కూడా పాల్గొనవచ్చన్నారు. సహజంగా అత్యధికంగా సముద్రంపైనే ఆధారపడి జీవించే మత్స్యకారులకు 217 జీవోతో ఎలాంటి నష్టం ఉండదన్నారు. మంచినీటి చెరువులకు సంబంధించిన ఈ జీవో వల్ల వారికి ఇబ్బంది ఉండదన్నారు. వంద హెక్టార్లకు పైబడిన, పైలెట్ ప్రాజెక్టుగా అమలు చేస్తున్న నెల్లూరు జిల్లాలోని 27 చెరువులకు ప్రస్తుతం ఈ జీవోను వర్తింపచేస్తామని, మిగిలిన చోట్ల పాత పద్ధతిలోనే కొనసాగిస్తామని చెప్పారు. సందేహాల నివృత్తికి సిద్ధం వంద హెక్టార్లు పైబడిన చెరువులు దళారీల చేతుల్లో ఉండడం వల్ల లీజు సొసైటీల్లో సభ్యులు ఏటా రూ.300 నుంచి రూ.10 వేలకు మించి ఆదాయాన్ని పొందడం లేదని కన్నబాబు తెలిపారు. 90 శాతం సొసైటీల్లో గరిష్టంగా ఏటా రూ.2500 మించి పొందలేకపోతున్నారని చెప్పారు. రాష్ట్రవ్యాప్తంగా వంద హెక్టార్ల విస్తీర్ణం పైబడినవి 582 చెరువులుండగా 337 చోట్ల మాత్రమే మత్స్యకార సçహకార సంఘాలకు లీజుకు ఇస్తున్నామన్నారు. జీవోపై సందేహాలుంటే నివృత్తి చేసేందుకు తమ శాఖ సిద్ధంగా ఉందన్నారు. వ్యాపారం చేయడం లేదు మత్స్య ఉత్పత్తుల స్థానిక వినియోగం పెంచడం, ఫిష్ ఆంధ్ర పేరిట నాణ్యమైన మత్స్య ఉత్పత్తులను ప్రజలకు అందుబాటులోకి తెచ్చే లక్ష్యంతో హబ్ అండ్ స్పోక్ మోడల్ ద్వారా దేశీయ మార్కెటింగ్ విధానాన్ని రాష్ట్ర ప్రభుత్వం ప్రోత్సహిస్తోందని కమిషనర్ కన్నబాబు చెప్పారు. 70 ఆక్వా హబ్‌లు, 14 వేలకు పైగా రిటైల్ అవుట్‌లెట్స్‌ను ఏర్పాటు చేస్తున్నామన్నారు. ఈ విషయంలో ప్రభుత్వం ఫెసిలిటర్గా వ్యవహరిస్తుందే కానీ వ్యాపారం చేయడం లేదన్నారు. సమావేశంలో సమాచార, పౌరసంబంధాల శాఖ కమిషనర్ విజయకుమార్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు. డీజిల్ సబ్సిడీ, పరిహారం, భరోసా గతంలో డీజిల్ సబ్సిడీ రూ.6.03 మాత్రమే ఇవ్వగా ఇప్పుడు రూ.9కి రాష్ట్ర ప్రభుత్వం పెంచిందని కన్నబాబు తెలిపారు. టీడీపీ హయాంలో ఐదేళ్లలో డీజిల్ సబ్సిడీ కింద రూ.59.42 కోట్లు ఇవ్వగా ఇప్పుడు 33 నెలల్లోనే ప్రభుత్వం రూ.89.17 కోట్లు చెల్లించింది. ప్రమాదవశాత్తూ మరణిస్తే పరిహారాన్ని రూ.ఐదు లక్షల నుంచి రూ.10 లక్షలకు ప్రభుత్వం పెంచింది. ఇప్పటివరకు 64 కుటుంబాలకు రూ.64.10 కోట్లు పరిహారంగా చెల్లించింది. వేట నిషేధ సమయంలో నాడు ఐదేళ్లలో రూ.104.67 కోట్లు ఇవ్వగా ఇప్పుడు వైఎస్సార్ మత్స్యకార భరోసా కింద మూడేళ్లలో రూ.309.33 కోట్లు చెల్లించింది. -
ఈ విషయం చెప్పడం మర్చిపోయా : సీఎం జగన్
సాక్షి, అమరావతి : వైఎస్సార్ మత్స్యకార భరోసా పథకంలో మిగిలిపోయామని ఎవరైనా భావిస్తే వారు బాధపడాల్సిన అవసరం లేదని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి స్పష్టం చేశారు. ఈ పథకంపై ముఖ్యమంత్రి శుక్రవారం తన కార్యాలయ అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా.. ఈ పథక లబ్దిదారుల జాబితాను గ్రామ సచివాలయాల్లో ఉంచామని, అర్హతలు ఏంటి? ఎవరికి దరఖాస్తు చేయాలి? ఎవరిని సంప్రదించాలి? అనే వివరాలను జాబితాలో పొందుపరిచామని తెలిపారు. అర్హత ఉందని భావించిన వారు జాబితాలో పొందుపరిచిన సమాచారం ఆధారంగా దరఖాస్తు చేసుకోవచ్చని వెల్లడించారు. గ్రామ సచివాలయాలు, వార్డు వాలంటీర్లు దరఖాస్తు చేయడంలో తోడ్పాటునందిస్తారని పేర్కొన్నారు. ఇది నిరంతరం కొనసాగుతందంటూ ప్రతి శుక్రవారం కొత్త లబ్దిదారులకు నగదు సహాయం అందజేస్తామని ప్రకటించారు. గురువారం ముమ్మిడివరం నియోజకవర్తం కొమానపల్లిలో ఈ పథకం ప్రారంభోత్సవం సందర్భంగా చేసిన ప్రసంగంలో ఈ అంశాలను చెప్పడం మర్చిపోయానని, ఈ విషయాలను ప్రజలకు తెలియజేయాలని అధికారులను ఆదేశించారు. మరోవైపు వెనుకబడిన వర్గాల అభివృద్ధికి కట్టుబడి ఉన్నామని పునరుద్ఘాటిస్తూ.. బీసీ అంటే బ్యాక్వర్డ్ క్లాస్ కాదు. సమాజానికి బ్యాక్ బోన్‌లంటూ అభివర్ణించారు. -
ఎంతమందినైనా ఎదుర్కొంటా: సీఎం జగన్
సాక్షి, తూర్పు గోదావరి: ప్రపంచ మత్స్యకార దినోత్సవాన్ని రాష్ట్రంలో వైఎస్సార్ మత్స్యకార భరోసాగా జరుపుకోవడం సంతోషంగా ఉందని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి అన్నారు. పాదయాత్ర సమయంలో మత్స్యకారులకు ఇచ్చిన మాటలు తనకు ఇంకా గుర్తున్నాయని.. ప్రభుత్వం ఏర్పడిన ఐదు నెలల్లోనే వారికి ఇచ్చిన హామీలను అమలు చేస్తున్నామని సీఎం తెలిపారు. ప్రపంచ మత్స్యకార దినోత్సవం సందర్భంగా గురువారం తూర్పుగోదావరి జిల్లా ముమ్మిడివరం నియోజకవర్గంలో వైఎస్సార్ మత్స్యకార భరోసా పథకాన్ని సీఎం జగన్ ప్రారంభించారు. ఈ సందర్భంగా అక్కడ ఏర్పాటు చేసిన బహిరంగ సభలో సీఎం ప్రసంగించారు. ఏటా ఏప్రిల్ 15 నుంచి జూన్ 14 వరకు సముద్రంలో వేట నిషేధ సమయంలో మత్స్యకార కుటుంబాలను ఆదుకునేందుకు గత ప్రభుత్వం ఒక్కో కుటుంబానికి రూ.4 వేలు చెల్లించిన విషయం తెలిసింది. అయితే మత్స్యకార కుటుంబాల్లో సంతోషం నింపడం కోసం తమ ప్రభుత్వం ఏకంగా రూ.10 వేలకు పెంచుతున్నట్లు సీఎం ప్రకటించారు. దీంతో రాష్ట్రంలోని 1.35 లక్షల మత్స్యకార కుటుంబాలకు లబ్ధి చేకూరనుందని, మౌలిక సదుపాయాలను ప్రాధాన్యతా క్రమంలో కల్పించడానికి బడ్జెట్లో మత్స్య శాఖకు రూ.551 కోట్లు కేటాయించినట్ల సీఎం వివరించారు. ఈ సందర్భంగా సీఎం జగన్ మాట్లాడుతూ.. ‘గంగపుత్రులకు ఇచ్చిన వాగ్ధానానికి కట్టుబడి ఉన్నాను. వేట నిషేధ సమయంలో ప్రతి ఒక్క మత్స్యకార కుటుంబానికి రూ. 10 సాయంగా అందిస్తున్నాం. అది నేటి నుంచే శ్రీకారం చుడుతున్నాం. మత్స్యకారులు వేటకు వెళ్లిన సమయంలో తిరిగి ఇంటికి వస్తారన్న భరోసా కూడా లేదు. సముద్రంలో చేపలు పడుతూ 18 నుంచి 60 ఏళ్లలోపు మత్స్యకారులు ప్రమాదవశాత్తు మరణిస్తే ఆ కుటుంబానికి వైఎస్సార్ మత్స్యకార భరోసా పథకం కింద రూ.10 లక్షల ఆర్థిక సాయం అందిస్తాం. (గత ప్రభుత్వంలో రూ.5 లక్షలు మాత్రమే). తొమ్మిది కోస్తా తీర జిల్లాల్లో దశల వారీగా ఫిష్ లాండింగ్ సదుపాయాలను కల్పిస్తాం. మూడు కొత్త ఫిషింగ్ హార్బర్లు (నెల్లూరు జిల్లా జువ్వలదిన్నె, తూర్పుగోదావరి జిల్లా ఉప్పాడ, ప్రకాశం జిల్లా ఓడరేవులో) ఏర్పాటు. మచిలీపట్నం, నిజాంపట్నం హార్బర్ల పటిష్టానికి చర్యలు కూడా తీసుకుంటాం. మర పడవల నిర్వాహకులకు గత ప్రభుత్వం లీటర్ డీజిల్‌కు ఇచ్చే రూ.6.03 రాయితీ ఇప్పుడు రూ.9కి పెంచుతున్నాం. మరపడవలకే కాకుండా ఇంజను కలిగిన తెప్పలకూ డీజిల్ రాయితీ వర్తింపు. ఒక్కో మర పడవకు నెలకు రూ.27 వేలు, ఇంజను కలిగిన తెప్పలకు రూ.2,700 రాయితీ ఇస్తున్నాం. ఏడాదిలో పది నెలలకు స్మార్డ్ కార్డుల ద్వారా రాయితీ అందుతుంది. ఎంతమందినైనా ఎదుర్కొంటా.. పాదయాత్ర సమయంలో మీకు ఇచ్చిన మాటటు నాకు ఇంకా గుర్తున్నాయి. మీ బాధలు విన్న సమయంలో నా గుండె తరక్కుపోయింది. నేను విన్నాను అని ఆరోజు మీకు మాటిచ్చాను. దానికి కట్టుబడే ఈ రోజు మీకు నేను ఉన్నానని భరోసా ఇస్తున్నాను. ప్రభుత్వ ఏర్పడిన ఐదు నెలలు తిరగకముందే ఆ నాడు నేను ఇచ్చిన హామీని ఇదే వేదికపై నుంచి నెరవేరుస్తున్నాను. ప్రభుత్వ ఏర్పడిన ఐదు నెలల్లోపే నాలుగు లక్షల ఉద్యోగాలు ఇవ్వగలిగాం. ఆ ఉద్యోగులంతా గ్రామీణ ప్రాంతంలో పేదలకు, రైతులకు, మత్స్యకారులకు అండగా ఉంటున్నారు. అగ్రిగోల్డ్ బాధితులకూ సహాయం చేశాం. వారందరినీ ఆదుకున్నాం. ఎస్సీ, బీసీ, ఎస్టీలకు నామినేటేడ్ పదవులు, పనుల్లో ప్రత్యేక రిజర్వేషన్లు కల్పించాం. అలాగే మహిళలకూ రిజర్వేషన్లు కల్పించాం. రాబోయే రోజుల్లో మరింత అభివృద్ధి పథంలో రాష్ట్రాన్ని ముందుకు నడిపిస్తాం. నాడు-నేడు పథకంతో ప్రభుత్వ పాఠశాలలను అభివృద్ధి చేస్తున్నాం. ప్రతి పాఠశాలలో ఇంగ్లీష్ మీడియంను ప్రవేశపెట్టబోతున్నాం. పిల్లలంతా ఉన్నత చదువులు చదవాలి. అలాగే పేదలకు మరింత మెరుగైన వైద్యాన్ని అందించడానికి ఆస్పత్రులను కూడా మెరుగుపరుస్తున్నాం. పేదల పక్షపాతిగా వ్యవహరిస్తున్న మన ప్రభుత్వంపై ప్రతిపక్ష నాయకులు అసత్య ఆరోపణలు చేస్తున్నారు. ఎంతమంది శత్రువులు నాపై కుట్ర పన్నినా.. వారందరినీ ఎదుర్కొనే శక్తి నాకుంది. ప్రభుత్వ సంక్షేమ పథకాలను చూసి ప్రతిపక్షం ఓర్వేట్లేదు. మీ అందరి ఆశీర్వాదాలతో మరింత ముందుకు సాగుతా’ అని అన్నారు. వైఎస్సార్ వారధి ప్రారంభం.. జిల్లా పర్యటనలో భాగంగా తొలుత వృద్ధ గౌతమి గోదావరిపై ఐ.పోలవరం మండలం పశువుల్లంక – సలాదివారిపాలెం మధ్య రూ.35 కోట్లతో నిర్మించిన వైఎస్సార్ వారధిని సీఎం జగన్ ప్రారంభించారు. (ఈ వంతెన నిర్మాణంతో గోదావరి అటు, ఇటు ఉన్న 11 గ్రామాల్లోని 10 వేల మందికి ప్రయోజనం. ఈ వంతెనకు 2009లో దివంగత వైఎస్సార్ శంకుస్థాపన చేశారు.) వారధి వద్ద ఏర్పాటు చేసిన వైఎస్సార్ నిలువెత్తు విగ్రహాన్ని ఆవిష్కరించారు. -
మత్స్యకారులకు బాబు.. మోసం..
చంద్రబాబు మోసానికి.. దగాకు బ్రాండ్ అంబాసిడర్. గత ఎన్నికలకు ముందు మత్స్యకారుల జీవన ప్రమాణాలు పెంచేందుకు ఎన్నెన్నో హామీలు ఇచ్చారు. అధికారంలోకి వచ్చాక మత్స్యకారులను ఐదేళ్లుగా వంచించారు. ఏటా వేట విరామ సమయంలో రూ.4 వేల జీవన భృతి ఇస్తామని చెప్పిన చంద్రబాబు విధివిధానాల ఖరారు పేరుతో తొలి ఏడాది కాలక్షేపం చేశారు. ఆ తర్వాత రెండేళ్లు లబ్ధిదారుల ఎంపికలో అనేక కొర్రీలు పెట్టి.. అరకొర మందినే ఎంపిక చేశారు. వారికి కూడా భృతి ఇవ్వలేదు. గత రెండేళ్లుగా అసలు ఎంపికలు, భృతి చెల్లింపులే లేవు. తాజాగా వైఎస్సార్సీపీ మేనిఫెస్టోలో మత్స్యకారులకు ప్రకటించిన ప్రణాళికనే కాపీ కొట్టి చంద్రబాబు మరో సారి మోసపూరిత హామీలతో మేనిఫెస్టో విడుదల చేశారు. ఈ ఐదేళ్లుగా చంద్రబాబు మోసానికి గురైన మత్స్యకారులు ‘నిన్ను నమ్మం బాబూ’ అంటున్నారు. వాకాడు: అలల సాగరంలో పోరాడి గాలించి చేపలు పట్టడమే మత్స్యకారుల యాంత్రిక జీవనం. వేటే జీవనాధారమైన మత్స్యకారులు ప్రకృతి విపత్తులు, ప్రభుత్వ తీరు కారణంగా పట్టెడు మెతుకులకు గంగపుత్రులు అలల్లాడుతున్నారు. ప్రాణాను పణంగా పెట్టి బతుకుదెరువు కోసం నిత్యం కడలిపై సమరం చేస్తున్నారు. ఒకప్పుడు గంగపుత్రులంటే.. లక్ష్మీపుత్రులుగా పేరుండేది. కొన్నేళ్లుగా వాతావరణంలో చోటు చేసుకుంటున్న మార్పుల నేపథ్యంతో పాటు, తీరప్రాంతంలో విస్తృతంగా ఏర్పాటవుతున్నాయి. పరిశ్రమల వ్యర్థాలు సముద్ర జలాల్లోకి విడుదల చేయడంతో తీరం వెంబడి జల కాలుష్యం పెరిగిపోయింది. వీటి ప్రభావంగా మత్స్య సంపద మనుగడకు ప్రమాదంగా మారింది. ఇది అంతిమంగా మత్స్యకారుల బతుకుదెరువుపై తీవ్ర ప్రభావం చూపిస్తోంది. సముద్రంలో ఆటుపోటులు, అల్పపీడనాలు, వాయిగుండాలు, తుఫాన్ల వంటి ప్రకృతి వైపరీత్యాలు, మత్స్య సంపద పునరుత్పత్తి వంటి కారణాలతో చేపల వేట రోజులు తగ్గిపోయాయి. అన్ని పరిస్థితులు బాగున్నా.. నానాటికి తగ్గిపోతున్న మత్స్య సంపద తగ్గిపోవడంతో రోజంతా గాలించినా.. చేపలు చేతికి చిక్కని పరిస్థితులు నెలకొంటున్నాయి. కష్టానికి తగ్గ ఫలితం లేక మత్స్యకారులు ప్రత్యామ్నాయంగా కూలి పనులు వెతుక్కుంటున్నారు. ఒకప్పుడు సముద్రంలో వేట తప్ప వేరే పని లేని మత్స్యకారులు ఇప్పుడు రైతు కూలీలుగా, బేల్దారీ పనులకు కూలీలుగా వెళ్తున్న పరిస్థితి నెలకొంది. ఏ పని చేతకాక సంప్రదాయ వృత్తినే నమ్ముకున్న మత్స్యకార కుటుంబాలు ఇప్పుడు ఆకలితో అలమటిస్తున్నారు. చంద్రబాబు మోసం ఇలా.. మత్స్య సంపద పునరుత్పత్తి కాలంగా ఏటా ఏప్రిల్ 15 నుంచి జూన్ 15వ తేదీ వరకు వేట విరామాన్ని అమలు పరుస్తున్నారు. గతంలో ఈ సమయంలో అదనంగా బియ్యం మాత్రమే ఇచ్చేవారు. దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి తన హయాంలో వేట విరామ సమయంలో రూ.2 వేల ఇచ్చేవారు. ఆ తర్వాత వచ్చిన పాలకులు అంతే మొత్తాన్ని ఇచ్చేవారు. 2014 ఎన్నికలకు ముందు వైఎస్ జగన్మోహన్రెడ్డి వేట విరామ సమయలో రూ.4 వేల జీవన భృతి ఇస్తామని ప్రకటించారు. దీన్నే కాపీ కొట్టిన చంద్రబాబు తాను కూడా అంతే మొత్తం ఇస్తామని మేనిఫెస్టోలో ప్రకటించారు. జిల్లాలో 13 సముద్ర ముఖద్వారాల నుంచి వేట సాగించే కుటుంబాలు 1.25 లక్షలు ఉన్నాయి. వీరందరికి రూ.4 వేల వంతున ఏటా జీవన భృతి ఇవ్వాల్సి ఉంది. అయితే చంద్రబాబు సీఎం అయిన తొలి ఏడాది విధివిధానాల పేరుతో కాలక్షేపం చేశారు. 2015, 2016 సంవత్సరాల్లో లబ్ధిదారుల ఎంపికలో కొర్రీలు పెట్టి ఆఖరికి 70 వేల మందిని ఎంపిక చేశారు. వీరికి కూడా అరకొర మందికే వారి ఖాతాల్లో డబ్బులు జమ అయ్యాయి. రాలేదని మత్స్యశాఖ అధికారుల చుట్టూ తిరుగుతుంటే.. ఇదిగో అదిగో అంటూ చెబుతున్నారు. చివరిగా 2017, 2018 సంవత్సరాల్లో అసలు లబ్ధిదారుల ఎంపిక చేసినా.. జీవన భృతి నిధులు కేటాయించనే లేదు. తాజాగా వైఎస్సార్సీపీ అధ్యక్షుడు ప్రకటించిన మేనిఫెస్టోను కాపీ కొట్టి వేట విరామ సమయంలో రూ.10 వేలు ఇస్తామని చంద్రబాబు చెప్పడంపై మత్స్యకారులు మండిపడుతున్నారు. ఎన్నికలప్పుడు హామీలిచ్చి ఆ తర్వాత మోసం చేసే నిన్ను నమ్మం బాబూ అంటున్నారు. వైఎస్ జగన్ మేనిఫెస్టో హామీతో మత్స్యకారులకు లబ్ధి కావలి నుంచి తడ వరకు 12 తీర ప్రాంత మండలాలు ఉన్నాయి. కావలి, అల్లూరు, విడవలూరు, కొడవలూరు, ఇందుకూరుపేట, తోటపల్లిగూడూరు, ముత్తుకూరు, చిల్లకూరు, వాకాడు, కోట, సూళ్లూరుపేట, తడ మండలాలు ఉన్నాయి. అందులో 113 మత్స్యకార గ్రామాలు ఉన్నాయి. 13 సముద్రపు ముఖ ద్వారాల నుంచి సముద్రంపై వేట చేసే మత్స్యకారులు 1.25 లక్షల కుటుంబాలు ఉన్నాయి. చంద్రబాబు ప్రభుత్వం వేట విరామం భృతిని మత్స్యకారులకు అందజేయడంలో వివిధ ఆంక్షలు, కొర్రీలు పెడుతుందని వైఎస్ జగన్మోహన్రెడ్డికి జిల్లాలో నిర్వహించిన ప్రజా సంకల్పయాత్రలో మత్స్యకారులు మొరపెట్టుకున్నారు. దీనిపై స్పందించిన జగన్మోహన్రెడ్డి మత్స్యకారుల జీవితాల్లో మంచి మార్పు తీసుకువస్తానని హామీ ఇచ్చారు. ఏటా వేట విరామ సమయంలో రూ.10 వేల జీవన భృతి కల్పిస్తానని మేనిఫెస్టోలో ప్రకటించారు. బోట్లు లేని వారికి కొత్త బోట్లు, ఫ్రీ రిజిస్ట్రేషన్, మత్స్యకార కార్పొరేషన్ వంటివి ఏర్పాటు చేస్తామని వెల్లడించారు. ముఖ్యంగా మత్స్యకారులు వేట సాగించే సమయంలో ప్రమాదవశాత్తు మరణిస్తే రూ.10 లక్షలు ఎక్స్‌గ్రేషియా ఇస్తామని చెప్పారు. -
ఏరుదాటాక.. నీళ్లొదిలారు
సాక్షి, పిఠాపురం : ‘అధికారంలోకి వస్తే మేం అడిగిందల్లా ఇస్తానన్నారు. నన్ను నమ్మండంటూ కన్నీరెట్టుకున్నారు. తీరా గెలిపిస్తే మేమెవరో కూడా తెలీదన్నట్టు చూస్తున్నారు. మా బతుకులకు ఆసరా ఇచ్చే హార్బర్ కట్టడం లేదు. మాకు జెట్టీలు కట్టండి. అంతకంటే రెట్టింపు ఆదాయాన్ని ప్రభుత్వానికి ఇస్తాం. వేటాడిన చేపల్ని ఎండబెట్టడానికి చోటులేదు. నిల్వ చేసుకుందామంటే గిడ్డంగులు లేవు. అమ్ముకుందామంటే కొనేవారు రారు. ఐస్ నుంచి రవాణా దాకా అన్నీ దోపిడీలే. ఇలా ఉంటే మేం బతికేదెట్టా. గత ఎన్నికల్లో చంద్రబాబు ఇచ్చిన హామీలను సముద్రంలో కలిపేశారు’ ఇదీ గంగపుత్రుల ఆవేదన. తూర్పు గోదావరి జిల్లా కొత్తపల్లి మండలం కోనపాపపేట సాగర తీరంలో మత్స్యకారులను పలకరించగా.. వారి ఈతి బాధల్ని ఏకరువు పెట్టారు. రాష్ట్రంలోని తూర్పుతీర జాలర్లు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు విదేశీ మారకద్రవ్యాన్ని ఆర్జించి పెట్టడంలో ప్రముఖ పాత్ర వహిస్తున్నారు. వారికి 2014 ఎన్నికల సందర్భంగా చంద్రబాబు ఇచ్చిన హామీలను గుర్తు చేసుకున్నారు. ‘వేట నిషేధ సమయంలో చెల్లించాల్సిన పరిహారం ఇవ్వటం లేదు. మత్స్యకారుడు చనిపోతే ఇన్సూరెన్స్ వస్తుందో.. రాదో తెలీదు. కొత్త బోట్లకు రిజిస్ట్రేషన్ చేయటం లేదు. అంటూ తమ మనోగతాన్ని వెల్లడించారు. వాళ్లేమన్నారంటే.. పరిహారమేదీ! వేట నిషేధ సమయంలో ఇవ్వాల్సిన పరిహారంపై ప్రభుత్వం నిర్లక్ష్యం వహిస్తోం ది. ఒక్కొక్కరికీ రూ.4 వేల చొప్పున నిధులు విడుదల కావాల్సి ఉంది. ఇప్పటివరకు కొంత మందికి మాత్రమే పరిహారం పంపిణీ చేశారు. లబ్ధి పొందిన వారిలో అధికార పార్టీ నేతల అనుచరులు, పలుకుబడి కలిగిన వారు మాత్రమే ఉన్నారు. నిజంగా వేట సాగించే వారికి మొండిచేయి చూపుతున్నారు. – దూడా తాతారావు, మత్స్యకారుడు మినీ హార్బర్ సంగతేంటి?! తీరప్రాంతాల్లో జెట్టీలు లేక మత్స్యకారులు తీవ్ర ఇబ్బంది పడుతున్నారు. ఉప్పాడ సమీపంలో మినీహార్బర్ నిర్మాణానికి దివంగత ముఖ్యమంత్రి వైఎస్సార్ రూ.50 కోట్లు విడుదల చేశారు. 50 ఎకరాల భూమిని కేటాయించారు. ఆయన మృతితో నిర్మాణం నిలిచిపోయింది. 2014 ఎన్నికల్లో చంద్రబాబు మినీహార్బర్ నిర్మాణానికి హామీ ఇచ్చారు తప్ప నిర్మాణం చేయలేదు. – సిద్ధా రమణ, మత్స్యకారుడు పెద్దాయన చొరవతో.. మెకనైజ్డ్ బోటుకు వెయ్యి లీటర్లు, ఫైబరు బోటుకు 100 లీటర్ల చొప్పున డీజిల్‌పై సబ్సిడీ ఇచ్చేందుకు 2002లో చర్యలు తీసుకున్నారు. సీఎంగా వైఎస్సార్ అధికారం చేపట్టాక.. 2004లో ఆ సబ్సిడీని మెకనైజ్డ్ బోటుకు 3 వేల లీటర్లు, ఫైబరు బోట్లకు 300 లీటర్లకు పెంచారు. లీటరు రూ.15 ఉన్నప్పుడు ప్రకటించిన సబ్సిడీనే కొనసాగిస్తున్నారు. డీజిల్ సబ్సిడీ పెంచుతామన్న చంద్రబాబు పెంచలేదు. – గంపల దేవుడు, మత్స్యకార నాయకుడు కష్టాల్లో ఆదుకోవడం లేదు సంప్రదాయ వేట సాగించి బతికే సామాన్య మత్స్య కారులకు ఏమీ ఒరగటం లేదు. కష్టాల్లో మమ్మల్ని ఆదుకునే వారే లేరు. అన్ని పథకాలు అనర్హులైన అధికార పార్టీ నేతల అనుచరులకే ఇస్తున్నారు. ఏ పూటకాపూట కడుపునింపుకునే మాకు రెండు నెలలు పూట గడవక పస్తులుంటున్నాం. కష్టాల్లో మమ్మల్ని ఆదుకునే వారే లేరు. – కొప్పిరి బుజ్జి, మత్స్యకారుడు గల్లంతైతే అంతే.. సముద్రంలో గల్లంతైన వారి ఆచూకీ కోసం వాళ్ల కుటుంబాలు ఏళ్ల తరబడి నిరీక్షిస్తుంటాయి. మాకు తెలిసి ఇప్పటివరకు 25 మంది మత్స్యకారులు గల్లంతై ఏళ్లు గడుస్తున్నా ఆచూకీ లేదు. సుబ్బంపేటకు చెందిన ఏడుగురు వేటకు వెళ్లి 11 ఏళ్ల క్రితం గల్లంతయ్యారు. వారి ఆచూకీ ఇప్పటికీ లభించలేదు. వాళ్ల కోసం కుటుంబ సభ్యులు ఇంకా వేచి చూస్తున్నారు. వారికి ఇన్సూరెన్స్ ఇవ్వలేదు. – మైలపల్లి దాసు, బోటు యజమాని వైఎస్ జగన్ భరోసా ఇచ్చారు నిత్యం ప్రమాదాల నడుమ జీవనం సాగించే మా కుటుంబాలకు వైఎస్ జగన్ భరోసా ఇచ్చారు. ఏదైనా ప్రమాదం సంభవించి కుటుంబ యజమాని మరణిస్తే.. ప్రస్తుతం రూ.2 లక్షల బీమా ఇస్తున్నారు. అదికూడా టీడీపీ నేతల సిఫార్సు ఉన్నవారికే ఇస్తున్నారు. అలాంటిది బీమాను రూ.10 లక్షలకు పెంచుతామని జగన్ ప్రకటించడం ఆనందదాయకం. – కోడ సుబ్బారావు, మత్స్యకారుడు -
పోరు గాలి.. వేట ఖాళీ
సాక్షి, వాకాడు: సముద్రంపై ప్రతికూల వాతావరణం కారణంగా 25 రోజులుగా పోరు గాలి వీస్తుండడంతో వేట సజావుగా సాగడం లేదు. సాధారణంగా మార్చిలో మత్స్యసంపద ఎక్కువగా దొరుకుతుందని గంగపుత్రులకు ఎంతో కాలం వస్తున్న నమ్మకం. అలాంటిది ఈ సారి మార్చి ప్రారంభమై వారం రోజులు గడుస్తున్నా పోరుగాలి తగ్గకపోవడంతో మత్స్యకారులు పెట్టుకున్న ఆశలు అడియాశలయ్యాయి. ఉదయం నుంచి సాయంత్రం వరకు సముద్రంలో వలేసి గాలించినా ఒక్క చేపైనా దొరకపోగా శ్రమతోపాటు, డీజిల్, కూలీలు ఖర్చులు పెరిగిపోతున్నాయి. దీంతో వేట తప్ప మరేపని తెలియని మత్స్యకారులు పూట గడవక ఆకలితో అలమటిస్తున్నారు. వేటే జీవనాధారంగా చేసుకుని తెల్లవారు జామునే వల బుజాన వేసుకుని సముద్రాన్ని గాలించి మంచి మత్స్యసంపదతో సంతోషంగా కనిపించే సాగర పుత్రులు తీరంలో దిగాలు చెందుతున్నారు. ఒడ్డుకు పరిమితమైన బోట్లు ఇటీవల పలు జిల్లాలో వచ్చిన వరుస తుపాన్లు, ప్రతికూల వాతావరణం వెరసి వేట నిలిచిపోయి బోట్లు ఒడ్డుకు పరిమితమయ్యాయి. ఇంతకు ముందు మాదిరిగా సముద్రంలో మత్స్య సంపద విరివిగా దొరకడంలేదు. ఎందుకంటే దాదాపు నెల రోజులుగా వాతావరణంలో మార్పులు చోటు చేసుకుని సముద్రంపై పోరు గాలి నెలకుని బోట్లు తిరగబడుతున్నాయి. దీంతో డీజిల్ ఖర్చులు వృథా చేసుకుని మత్స్యకారులు పోయిన దారినే వెనుతిరిగి వచ్చేస్తున్నారు. దానికితోడు తీరంలో నెలకొని ఉన్న పలు పరిశ్రమల నుంచి వెలువడే వ్యర్థ జలాలు కండలేరు క్రీక్‌లోకి వదిలి, క్రీక్ నుంచి సముద్రంలో కలవడంతో వాకాడు, కోట, చిల్లకూరు, మండలాల తీర ప్రాంతాల్లో మత్స్య సంపద పూర్తిగా నసించిపోయి మత్స్యకారులు జీవనం కోల్పోతున్నారు. రోజంతా సముద్రంపై గాలించినా మత్స్యకారులకు శ్రమ తప్ప ఫలితం దక్కడంలేదు. దీంతో వేట కొరకు తెచ్చిన పెట్టుబడుల రుణాలకు వడ్డీలు కట్టలేకున్నామని మత్స్యకారులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. 2,650 మంది వేటకెళ్లే మత్స్యకారులు నియోజకవర్గం పరిధిలోని వాకాడు, కోట, చిల్లకూరు మండలాల్లో 24 మత్స్యకార గ్రామాల్లో 2,650 మంది వేట చేసే మత్స్యకారులు, 1,920 బోట్లు ఉన్నాయి. ఒక్కో బోటుపై యజమానులతోపాటు కూలీలతో కలిపి దాదాపు మూడు నుంచి ఐదు కుటుంబాల వరకు మత్స్య సంపదపై ఆధారపడి జీవనం సాగిస్తున్నారు. వేట లేకపోవడంతో బోట్లు ఒడ్డుకు చేర్చి లంగరు వేసి ఉన్నాయి. ప్రస్తుతం మత్స్యకార కుటుంబాలు అప్పులు చేసి పూట గడుపుతున్నా, మరికొందరు పస్తులుంటున్నారు. ఈ పరిస్థితి అన్ని మండలాల మత్స్యకార గ్రామాల్లో నెలకొని ఉంది. వేటనే నమ్ముకుని కుటుంబాన్ని పోషించే కొందరు మత్స్యకారులు ఎంచేయాలో దిక్కుతోచక వివిధ పనుల్లో దినసరి కూలీలుగా మారుతున్నారు. ఇది ఇలా ఉంటే గత ఏడాది విధించిన వేట విరామం డబ్బులు ఇంతవరకు సక్రమంగా అందకపోవడం, వచ్చిన డబ్బుల్లో కూడా మధ్యవర్తులు దండుకోవడం కనిపిస్తోంది. కొందరు మత్స్యకారులు సముద్రంలో చేపలవేట లేక, చేతిలో పనిలేక కాలక్షేపం కోసం కొన్ని వ్యసనాలకు బానిసలవుతున్నారు. తమను అన్ని విధాలా ఆదుకుంటున్నామని పదే పదే చెబుతున్నా ప్రభుత్వం పట్టించుకోవడంలేదని మత్స్యకారులు వాపోతున్నారు. తమ బాధలు గుర్తించి వెంటనే సాయం అందించాలని మత్సకారులు కోరుతున్నారు. రోజంతా గాలించినా చేపలు దొరకడంలేదు నెల రోజులుగా సముద్రంపై పోరుగాలి కొడుతుండడంతో రోజంతా గాలించినా ఒక్క చేప కూడా దొరకడంలేదు. దీంతో పూట గడవక మా కుటుంబాలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నాయి. వారం నుంచి కూలికి వెళ్లి జీవనం సాగిస్తున్నాం. – సోమయ్య మత్స్యకారుడు, తూపిలిపాళెం -
పాకిస్తాన్ రక్షణ దళాలకు బందీగా మారిన అభాగ్యులు
రెక్కాడితేగానీ డొక్కాడని బతుకులు వారివి. కష్టాల సుడిగుండంలో కొట్టుమిట్టాడుతున్న జీవితాలు వారివి. దినదిన గండంగా సాగే వృత్తిపైనే జీవించే కుటుంబాలవి.సముద్రమే సర్వస్వంగా... మృత్యువుకు ఎదురీది... నిత్యం పోరాటమే వారి జీవనం. ఉన్న ఊళ్లో కూడు కరువై... కుటుంబ పరిస్థితులు భారమై... బతుకు తెరువుకోసం పొరుగు రాష్ట్రాలకు వలసపోతున్నారు. అక్కడ బోటులో కూలీలుగా మారి కొందరు ప్రకృతి వైపరీత్యాల వల్ల మృత్యువాత పడుతుండగా... మరి కొందరు అనుకోని కష్టంలో చిక్కుకుంటున్నారు. తాజాగా జిల్లాలోని పూసపాటిరేగ మండలం తిప్పలవలస, భోగాపురం మండలం ముక్కాంకు చెందిన మత్స్యకారులు గుజరాత్ రాష్ట్రంలోని హీరావల్లో బోటులో కూలీలుగా చేరి వేట చేస్తూ పాకిస్తాన్ జలాల్లోకి పొరపాటున వెళ్లి అక్కడి కోస్టుగార్డు దళాలకు బందీ అయ్యారు. తమవారిని విడిపిస్తారో లేదో... ఎన్నాళ్లు వారిని చెరలోఉంచుతారో తెలియక ఇక్కడి వారి కుటుంబ సభ్యులు కన్నీరు మున్నీరవుతున్నారు. ఊళ్లోనే ఉపాధి ఉంటే ఈ సమస్యలు తలెత్తేవా.. అని వారు గగ్గోలు పెడుతున్నారు. సాక్షిప్రతినిధి, విజయనగరం: జిల్లాలో తీరప్రాంత మండలాలైన పూసపాటిరేగ, భోగాపురానికి చెందినవారే గడచిన నాలుగేళ్లలో జరిగిన ప్రమాదాల్లో చిక్కుకున్నారు. ఈ రెండు మండలాల్లో సుమారు 22 వేల మంది మత్స్యకారులున్నారు. వారిలో వివిధ కారణాల రీత్యా, కుటుంబ పరిస్థితుల కారణంగా సుమారు 2 వేల మందికి పైగా మత్స్యకారులు ఇప్పటికే వలసపోగా సుమారు 3500 మంది వరకు సముద్రంలో వేటకు వెళుతున్నారు. 16,500 మంది పరోక్షంగా సముద్రంపై ఆధారపడి జీవిస్తున్నారు. ఏ పనీ చేయలేని వారు, వృద్ధాప్యం మీద పడిన వారు మాత్రమే తీరప్రాంత గ్రామాల్లో ఉన్నారు తప్ప పనిచేయగలిగే శక్తి ఉన్నవారందరూ చాలా వరకు వలస బాటపట్టారు. పూసపాటిరేగ మండలంలోని తిప్పలవలస, చింతపల్లి, పతివాడ బర్రిపేట, కోనాడ, భోగాపురం మండలంలో ముక్కాం, చేపల కంచేరు, కొండ్రాజుపాలెం తదితర గ్రామాల నుండి మత్స్యకారులు ఎక్కువగా వలసపోతున్నారు. వీరిలో అత్యధికంగా విశాఖపట్నం మంగమారిపేట, గుజరాత్లో సూరత్, వీరావలి వంటి ప్రాంతాలకు వలస పోతున్నారు. కాటేస్తున్న కాలుష్యభూతం తీరప్రాంత గ్రామాలను ఆనుకుని రసాయన పరిశ్రమల వ్యర్థాలు పైపులైన్లు వేసి సముద్రంలోకి విడిచిపెడుతుండటంతో ఇక్కడి మత్స్యసంపద కాస్తా కనుమరుగైపోతోంది. ఇక్కడ చేపలు దొరకక బతువు తెరువు కోసం వలసపోతున్నారు. మత్స్యకారుల జీవన పరిస్థితిలు మెరుగుపరచడానికి ప్రభుత్వం కూడా ఎలాంటి చర్యలు చేపట్టకపోవడం కూడా వలసలకు కారణంగా చెప్పవచ్చు. ప్రజాప్రతినిధులకు, అధికారులకు గంగపుత్రులు తమ సమస్యలపై ఎన్నిసార్లు మొరపెట్టుకున్నా ఎలాంటి ఫలితం లేకపోయింది. చేసేది లేక వలస వెళ్లాల్సి వచ్చింది. పూసపాటిరేగ మండలంలోని ఒక్క తిప్పలవలస నుండే సుమారు వెయ్యిమంది వలస పోయినట్లు అధికారిక లెక్కలు చెబుతున్నాయి. నిత్యం ప్రమాదంలోనే... ఉన్న ఊరిలో వేటసాగకపోవడంతో వివిధ రాష్ట్రాల్లో చేపల వేటకు కూలీలుగా మారుతున్నారు. ప్రకృతి ప్రకోపానికి బలై మరణశయ్యపైకి చేరుతున్నారు. కొన్ని ప్రమాదాల్లో మృతదేహాల ఆచూకీ కూడా దొరకట్లేదు. మూడు నెలల క్రితం చింతపల్లికి చెందిన మైలపల్లి శ్రీను పారదీప్‌లో వేట చేసుకొని వస్తుండగా శ్రీకాకుళం జిల్లా సంతబొమ్మాళి తీరంలో జరిగిన పడవ ప్రమాదానికి గురై మృత్యువాత పడ్డాడు. పూసపాటిరేగ మండలం పతివాడ బర్రిపేటకు చెందిన సూరాడ రాము, వాసుపల్లి లక్ష్మణరావు, తమ్మయ్యపాలేనికి చెందిన బడే సత్తియ్య ఒడిశాలోని గంజాం జిల్లా రామయ్యపట్నం రేవులో గల్లంతయ్యారు. తాజాగా పూసపాటిరేగ మండలం తిప్పలవలసకు చెందిన నక్క అప్పన్న, బర్రి బవిరీడు, నక్కా నరిసింగు, నక్క ధనరాజు, బోగాపురం మండలం ముక్కాంకు చెందిన మైలపల్లి గురువులు వీరావలినుంచి వేటకు బయలుదేరి పాక్జలాల్లో పొరపాటున ప్రవేశించి అక్కడి రక్షణ దళాలకు బందీలుగా చిక్కారు. పాక్ అదుపులో వున్న ఐదుగురి కుటుంబాలను జిల్లా అధికారులు కనీసం పట్టించుకోలేదు. కనీసం ఆరా తీయలేదు. బందీల పరిస్థితిపై ఇంతవరకూ కుటుంబ సభ్యులకు ఎటువంటి సమాచారం ఇవ్వలేదు. ఇదీ మత్స్యకారుల ప్రాణాలకు వారిచ్చే విలువ. పాకిస్థాన్ దళాలవద్ద బందీలుగా ఉన్న జిల్లా మత్స్యకారులను విడిపించేందుకు జిల్లా కలెక్టర్ ద్వారా ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశాం. జీవన పరిస్థితులపై అధ్యయనం చేసి, వారు వలస వెళ్లకుండా చేయాల్సిన ప్రత్యమ్నాయ ఏర్పాట్లపై ప్రభుత్వానికి నివేదిస్తాం. ఇప్పటికే స్వయం ఉపాధిపై మత్స్యకారులకు అవగాహన సదస్సులు ఏర్పాటు చేశాం. స్థానికంగా ఉండి చేపల వేట సాగించేందుకు కొత్తగా 120 బోట్లు మంజూరుచేశాం.– మాచర్ల దివాకర్, డిప్యూటీ డైరెక్టర్, మత్స్యశాఖ -
ఆమంచిపై తీవ్ర వ్యతిరేకత
చీరాల: చీరాల ఎమ్మెల్యే ఆమంచి కృష్ణమోహన్ నేనే రాజు.. నేనే మంత్రి అన్న చందాన వ్యవహరించడంపై చారిత్రాత్మక గ్రామమైన చీరాల వాడరేవులోని మత్స్యకారులు అడ్డం తిరిగారు. అభివృద్ధి పేరుతో ముందస్తుగానే సోమవారం తమ గుడిసెల తొలగించడంపై మత్స్యకార మహిళలు మండిపడుతున్నారు. ఆమంచి తీరుతో తమ జీవనోపాధితో పాటు తలదాచుకుంటున్న గుడిసెలు కోల్పోతుండటంతో చావుకైనా సిద్ధపడతామని, అంతేగానీ, తమ గుడిసెలు తొలగిస్తే చూస్తూ ఊరుకునేది లేదని బాధిత మత్స్యకారులు స్పష్టం చేస్తున్నారు. మత్స్యకార సంఘాల నాయకులు, ప్రజా సంఘాలు, వైఎస్సార్ సీపీ నేతలు మత్స్యకారులకు అండగా నిలిచారు. పోలీసులు, రెవెన్యూ అధికారుల అత్యుత్సాహాన్ని నిలువరించిన మత్స్యకారులు మంగళవారం ఒంగోలు చేరుకుని కలెక్టర్, ఎస్పీలను కలిసి తమకు న్యాయం చేయాలని వేడుకున్నారు. తమను ఆదుకోవాలని కోరుతూ కలెక్టర్ వినయ్‌చంద్‌ను ఆ గ్రామసర్పంచ్ ఎరిపిల్లి రమణ, నాయకులు గాలి, బాబీలు, సూరిబాబు, సీపీఎం నాయకులు వసంతరావు, జిల్లా మత్స్యకార సంఘాల నాయకులు వినతిపత్రం అందించారు. ప్రజాభీష్టం మేరకే పనులు చేయాలి : అభివృద్ధి అనేది ప్రజల అభీష్టం మేరకే చేస్తే బావుంటుంది. 150 కుటుంబాలు నివసించే ప్రాంతాన్ని కేవలం పర్యాటక అభివృద్ధి కోసం ఖాళీ చేయించాలని చూడటం గర్హనీయం. తామంతా వేట, చేపల అమ్మకంతోనే బతుకుతున్నాం. కానీ, పర్యాటక అభివృద్ధి పేరుతో ఉన్నపళంగా మత్స్యకారులు ఉంటున్న ప్రాంతాలను ఖాళీ చేయాలని చూస్తే ఊరుకునే స్థితిలో మా మత్స్యకారులు లేరు. మాకు ప్రత్యామ్నాయం చూపించి కొంత సమయం ఇచ్చి పనులు చేయాలేగానీ, పర్యాటకానికి సంబంధించి ఎలాంటి నిధులు, ప్రకటనలు చేయకుండా, పాలకవర్గ తీర్మానాలు లేకుండా మత్స్యకారుల గుడిసెలను కూల్చివేస్తే ఉద్యమాలు చేస్తాం. అధికార పార్టీ అయినా అందరి అభీష్టంతో పనిచేస్తాం. – ఎరిపిల్లి రమణ, సర్పంచ్, వాడరేవు ఒంగోలులో కలెక్టర్ వినయ్‌చంద్‌కు వినతిపత్రం ఇస్తున్న వాడరేవు సర్పంచ్, మత్స్యకార సంఘ నాయకులు, చిన్నబరప వద్ద చించివేసిన ఆమంచి ఫ్లెక్సీ ఆమంచి ఫ్లెక్సీలు ధ్వంసం... చీరాలటౌన్: చీరాల ఎమ్మెల్యే ఆమంచి ఫ్లెక్సీల చించివేత, ధ్వంసం కార్యక్రమాలు రోజురోజుకూ పెరిగిపోతున్నాయి. వారం రోజుల క్రితం ఈపూరుపాలెంలో గుర్తు తెలియని వ్యక్తులు ఆమంచి ఫ్లెక్సీలు చించివేసిన ఘటన తర్వాత మళ్లీ వాడరేవులో ఫ్లెక్సీల రగడ చోటు చేసుకుంది. దీంతో మండలంలోని వాడరేవులో ఇటీవల ఇంటింటికి టీడీపీ కార్యక్రమం సందర్భంగా ఏర్పాటు చేసిన 15 ఫ్లెక్సీలను గుర్తుతెలియని వ్యక్తులు మంగళవారం చించివేశారు. పాకలలో పూరి గుడిసెల తొలగింపు ప్రయత్నాల నేపథ్యంలో గ్రామంలో ఏర్పాటు చేసిన ఆమంచి ఫ్లెక్సీల ధ్వంసంతో గ్రామంలో మరో అలజడి ఏర్పడింది. చించివేసిన ఫ్లెక్సీలను హుటాహుటిన పంచాయతీ సిబ్బంది తొలగించారు. అభివృద్ధి పేరుతో అరాచకం చేస్తారా.?– మత్స్యకార కుటుంబాలకు అఖిలపక్షం భరోసా చీరాల అర్బన్: అభివృద్ధి పేరుతో అరాచకం సృష్టించి మత్స్యకారులను భయభ్రాంతులకు గురిచేయడం ఏమిటని ఎమ్మెల్యే ఆమంచిని అఖిలపక్షం నాయకులు ప్రశ్నించారు. మంగళవారం వాడరేవులో పర్యటించి బాధిత మత్స్యకారులతో వారు మాట్లాడారు. ఈ సందర్భంగా వైఎస్ఆర్ సీపీ బాపట్ల పార్లమెంటరీ ఇన్చార్జి డాక్టర్ వి.అమృతపాణి మాట్లాడుతూ సముద్రంపై వేటసాగిస్తూ జీవిస్తున్న సుమారు 200 మంది మత్స్యకార కుటుంబాలకు చెందిన గుడిసెలను బలవంతంగా తీసివేయడం దారుణమన్నారు. వాడరేవులో టూరిజం అభివృద్ధి చేసేందుకు ఎమ్మెల్యే ఆమంచి కృష్ణమోహన్ చేస్తున్న ప్రయత్నాలను వారు తీవ్రంగా ఖండించారు. రెవెన్యూ అధికారులు, పోలీసులను ఉపయోగించుకుని ఇష్టానుసారంగా వ్యవహరించడం హేయమైన చర్యని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో బలహీనవర్గాల సమాఖ్య కార్యదర్శి గోసాల ఆశీర్వాదం, దళిత గిరిజన ఫ్రంట్ కన్వీనర్ పులిపాటి బాబూరావు, ఎరుకుల హక్కుల పోరాట సమితి అధ్యక్షుడు ఎన్.మోహన్‌కుమార్ ధర్మా, వైఎస్ఆర్ సీపీ పట్టణ అధ్యక్షుడు బి.జైసన్‌బాబు, ఎస్సీసెల్ రాష్ట్ర సంయుక్త కార్యదర్శి పేర్లి నాని, పార్టీ అధికార ప్రతినిధి దేవరపల్లి బాబూరావు, బీఎస్పీ, మత్స్యకార సంఘ నాయకులు పాల్గొన్నారు. -
మత్స్యకారులు ‘మాయం’
దేశంలో, రాష్ట్రాల్లో ఏడాదికేడాది జనాభా పెరుగుతోంది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం మాత్రం రాష్ట్రంలోని మత్స్యకారుల సంఖ్యను ఏడాదికేడాది తగ్గించి చూపిస్తోంది. సముద్రంలో చేపలు గుడ్లు పెట్టే కాలంలో చేపల వేట వల్ల పునరుత్పత్తి తీవ్రంగా దెబ్బతింటుందని కేంద్ర ప్రభుత్వం ఆ సమ యంలో వేటను నిషేధించింది. తూర్పు తీరంలో ఏప్రిల్ 15 నుంచి జూన్ 14 వరకు, పశ్చిమ తీరంలో జూన్ 1 నుంచి జూలై 13 వరకు (61రోజులపాటు) మోటరైజ్డ్, మెకనైజ్డ్ బోట్లతో చేపల వేటను నిషేధించారు. చేపల వేటపై నిషేధం ఉన్న సమయంలో ఉపాధి కోల్పోయిన వారి సంఖ్య 86,948 అని జీవో ఇచ్చిన సర్కారు, ఈ ఏడాది వారి సంఖ్యను ఏకంగా 60 వేలకు కుదించేసింది. రాష్ట్రంలోని 9 జిల్లాలలో 2,16,639 మంది సముద్ర చేపలు, రొయ్యలు పట్టే పనిలో ఉన్నట్టు రాష్ట్ర ప్రభుత్వ 2014 గణాంక దర్శిని పేర్కొంది. ఇది వేటకు వెళ్లే వారి సంఖ్య మాత్రమే. రవాణా, శీతలీకరణ, మార్కెటింగ్ తదితర ఇతర అనుబంధ సేవలను అందించేవారిని, వారి కుటుంబ సభ్యులను కూడా లెక్కిస్తే నిషేధం మూలంగా రాష్ట్రంలో పది నుంచి పదిహేను లక్షల మంది జీవితాలు ప్రత్యక్షంగా, పరోక్షంగా ప్రభావితమౌతాయి. వారందరినీ ఆదుకోవడం ప్రభుత్వ బాధ్యత. పడవ లోపలే దాన్ని నడపడానికి, వలను లాగడానికి ఉపయోగపడే ఇంజిన్‌ను ఏర్పాటు చేసిన వాటిని మెకనైజ్డ్ బోట్లనీ, పడవను నడపడానికి తాత్కాలికంగా దాని బయట బిగించిన వాటిని మోటరైజ్డ్ బోట్లనీ అంటారు. సాధారణ పడవలతో తప్ప ఈ రెండు రకాల బోట్లతో సాగించే చేపల వేటను నిషేధిస్తూ రాష్ట్ర ప్రభుత్వం 28.3.2016న జీవో నం.72ను జారీ చేసింది. కానీ అందువల్ల ఉపాధి కోల్పోయిన వారిని ఆదుకోవడానికిచ్చే సహాయానికి సంబంధించిన జీవో ఇంకా రాలేదు. గత ఏడాది ఈ విషయానికి సంబంధించిన జీవో 156ను నిషేధం ముగిసిన మూడు రోజుల తరువాత (17.6.2015) తీరికగా విడుదల చేశారు. నిషేధం అమల్లోకివచ్చి పొరుగున ఉన్న తమిళనాడు ప్రభుత్వం సంబంధిత జీవోను (నం. 77) వేట నిషేధం అమలుకు రెండు రోజుల ముందే విడుదల చేసింది. కాగా, ‘పనిచేసే’ ప్రభుత్వమని గొప్పలు చెప్పుకునే తెలుగుదేశం ప్రభుత్వం మత్స్యకారుల సంక్షేమానికి ఇంత చురుగ్గా పనిచేస్తుందన్న మాట! వేట నిషేధం వల్ల 61 రోజులపాటు ఉపాధి కోల్పోతున్న మత్స్యకారులకు రాష్ట్ర ప్రభుత్వం ఈ ఏడాది ఇస్తామన్న సహాయం రూ. 4,000 మాత్రమే. పుదుచ్చేరి ప్రభుత్వం గత ఏడాది ప్రతి మత్స్యకారునికి రూ. 5,000 ఆర్థిక సహాయంతో పాటూ 45 కిలోల బియ్యం ఉచితంగా ఇచ్చింది. తూర్పు గోదావరి జిల్లాను ఆనుకుని ఉన్న యానాం మత్స్యకారులు ఆ సహాయం పొందుతుంటే, ఏపీ మత్స్యకారులు రూ.4,000తోనే సరిపెట్టుకోవాల్సిన దుస్థితి. వీరికి బియ్యం కూడా రావు. ఎన్నో విషయాలలో ఇతర రాష్ట్రాలతో పోలిక తెచ్చే ప్రభుత్వాధినేతలకు పుదుచ్చేరికి తగ్గకుండా సహాయం అందించాలనైనా ఎందుకు ఆలోచించడం లేదు? కేంద్ర ప్రభుత్వ మెరైన్ ఫిషరీస్ సెన్సస్ 2010 ప్రకారం రాష్ట్రంలో 3,167 మెకనైజ్డ్ బోట్లు, 10,737 మోటరైజ్డ్ బోట్లు ఉన్నాయి. గత ఐదేళ్ల కాలంలో అవి గణనీయంగా పెరిగే ఉంటాయి తప్ప, తరగవు. నాటి లెక్కనే పరిగణించినా (3,167 * 8 + 10,737 * 6) 2015లో కనీసం 89,758 మందికి సహా యం అందించాలి. కానీ 86,949 మందికే సహాయం అందజేస్తామని (జీవో 156) ప్రకటించారు. ఈ ఏడాది మరీ విచిత్రంగా సహాయం అందించే మత్స్యకారుల సంఖ్యను 60 వేలకు తగ్గించేశారు! ఈ బడ్జెట్లో పశుసంవర్థక, మత్స్య శాఖల పద్దులో 60 వేలమంది మత్స్యకారులకు రూ.24 కోట్లు సహాయం అందిస్తామని ప్రభుత్వం పేర్కొంది. అంటే గత ఏడాది ఉన్న వారిలో సుమారు 27 వేల మంది మత్స్యకారులు మాయమైపోయారా? చేపల వేటను వదిలేసి వేరే వృత్తులకు మళ్లిపోయారా? రాష్ట్ర ప్రభుత్వమే సహాయాన్ని తగ్గించడం కోసం మత్స్యకారుల సంఖ్యను కుదించేసిందా? జీవో 156కు అనుబంధంగా ఇచ్చిన మార్గదర్శకాలు మరీ అన్యాయంగా ఉన్నాయి. మత్స్యశాఖ వద్ద రిజిస్ట్రేషన్ చేయించుకున్న మోటరైజ్డ్ బోటుకు ఆరుగురు, మెకనైజ్డ్ బోటుకు ఎనిమిది మందికి మించకుండా సహాయం అందిస్తామన్నారు. వాస్తవానికి ఈ బోట్లపై పది నుండి 15 మంది వరకూ వేటకెళ్తారు. అందరికీ తెల్లకార్డు ఉండి తీరాలని చెబుతూనే, ఒక కార్డుపై ఒక్కరికి మాత్రమే సహాయం చెల్లిస్తామన్నారు. అంటే ఒక కుటుంబంలోని ఇద్దరు అన్నదమ్ములు చేపల వేటకు వెళ్ళినా వారిలో ఒకరికి మాత్రమే సహాయం చెల్లిస్తారు. ఈ సహాయం పొందడానికి ప్రతి మత్స్యకారునికి తప్పనిసరిగా బ్యాంకు అకౌంట్ వుండాల్సిందే. ఆధార్ సీడింగ్‌తో ఆ అకౌంట్‌కు నగదును బదిలీ చేస్తారట. మార్గదర్శకాల పేరిట విషమ షరతులు పెట్టి, వేటపై నిషేధం వల్ల జీవనోపాధి కోల్పోయే మత్స్యకారులకు ఇచ్చే సహాయానికి సర్కారు కత్తెర వేసింది. ఈ ఏడాది లబ్ధిదారుల సంఖ్యను మరీ కుదిస్తోంది కనుక ఇంకెన్ని దుర్మార్గపు షరతులు విధిస్తుందో! రాష్ట్రంలో రెండంకెల అభివృద్ధిని సాధిస్తామని ముఖ్యమంత్రి పదే పదే చెబుతున్నారు. కరువు, అతివృష్టి కారణంగా వ్యవసాయం దెబ్బతిన్నప్పటికీ మత్స్యరంగంలో అభివృద్ధి కారణంగానే జీడీపీ వృద్ధి రేటులో పెరుగుదల సాధ్యమైందని ఆయనే అన్నారు. కానీ ప్రాణాలకు తెగించి మత్స్య సంపదను సముద్ర గర్భం నుంచి వెలికితీసే ఆ మత్స్యకారుల పట్లనే ఆయన శీతకన్ను వేస్తున్నారని అంటే అది అపనింద కాదు కదా! (వ్యాసకర్త: బి.తులసీదాస్ ప్రాజెక్టు నిర్వాసితుల సంఘం రాష్ట్ర పూర్వ కార్యదర్శి)